కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ ఫెయిలయ్యాయి...

బెంగాల్‌ వామపక్ష సంఘటన, సాంస్కృతిక రంగం : కొన్ని ఆలోచనలు

Update: 2024-10-23 07:28 GMT

దేశంలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వ స్థానంలో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీల వైఫల్యమే నేడు సాంస్కృతికోద్యమం రూపంలో భారత తరహా నయా ఫాసిజానికి రెక్కలు రావడానికి కారణం.


కార్మికవర్గం నాయకత్వంలో విప్లవం సాధించాలనుకునే ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సాంస్కృతిక రంగంలో దాని కర్తవ్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా కర్తవ్యాలనుగుణమైన కార్యాచరణను రూపొందించుకోవాలి. సాంస్కృతిక రంగంలో అంటే కేవలం మహాసభలు, బహిరంగ సభల్లో జనం పోగవటానికి ముందు సమయాన్ని సద్వినియోగం చేయటం కోసం పని చేయటం కాదు. కార్మికోద్యమ చైతన్యాన్ని, కమ్యూనిస్టు చైతన్యాన్ని, అవగాహనను ప్రజలకందించటంలో సాంస్కృతిక రంగం కీలక సాధనం. మావో సేటుంగ్‌ మాటల్లో ‘‘కళలు, సాంస్కృతిక రంగం ప్రాధాన్యతను అతిగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని తీసేయాల్సినదీ కాదు.


కళలు, సంస్కృతిక రాజకీయాలకు లోబడే ఉంటాయి. కానీ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. విప్లవ సాహిత్యం, కళా రూపాలు విప్లవ సాధన కోసం జరిగే ప్రయత్నాల్లో ఓ కీలకమైన భాగంగా ఉంటాయి. విప్లవ ప్రచారంలో కళలు, సంస్కృతి ఇరుసులాంటివి. విప్లవోద్యమంలో అనేక ఇతర అంశాలతో పోల్చినప్పుడు ఈ రంగం అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించకపోవచ్చు. తక్షణమే సాగించాల్సిన కృషిగా కూడా అనిపించకపోవచ్చు. ముందుకొస్తున్న వేర్వేరు పనుల్లో ఈ రంగంలో కృషి వెనకపట్టు పట్టొచ్చు. కానీ విప్లవోద్యమం అన్న యంత్రం సాఫీగా నడవాలంటే ఈ ఇరుసు శక్తివంతంగా ఉండాలి. అందేకే సాంస్కృతిక రంగం యావత్‌ విప్లవోద్యమంలో కీలకమైన, విడదీయలేని భాగం.’’. పౌర సమాజాన్ని ప్రభావితం చేయటమే కాక కార్యోన్ముఖులను చేయటంలో సాంస్కృతిక రంగం కృషిని తిరస్కరించిన ఏ వామపక్ష ఉద్యమమూ ప్రజలను ఆకట్టుకున్న దాఖలాలు లేవు.

ఈ నేపథ్యంలో స్వాతంత్య్రానంతర భారతానికే మన పరిశీలన పరిమితం చేసుకున్నా దేశంలో ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమ గమనం గురించి పరిశీలించినప్పుడు కొన్ని నిర్దారణలకు మనం రావచ్చు. స్వాతంత్య్రోద్యమ కాలంలో వలసవాదానికి వ్యతిరేకంగా సాగించిన సాంస్కృతిక పోరాటంతో పోల్చినప్పుడు స్వాతంత్య్రానంతర భారతంలో బూర్జువా`భూస్వామ్య ఆధిపత్య సంస్కృతికి స్థానంలో ప్రజాతంత్ర సంస్కృతి, కళలు, అవగాహన పెంపొందించేందుకు దీర్ఘకాల ప్రణాళికలను రూపొందించుకోవటంలో అన్ని స్రవంతులకు చెందిన వామపక్ష శక్తులు విఫలమయ్యాయి. ఈ ఆధిపత్య బూర్జువా భూస్వామ్య సంస్కృతే ప్రజలను ఏమార్చటంలో మత్తుమందులాగా పని చేస్తోంది. మతం, మత విశ్వాసాలు, మతోన్మాదం కూడా ఇందులో భాగమే.

ప్రత్యేకించి గత శతాబ్ద కాలంలో మతోన్మాత శక్తులు, సంఘపరివారం సాంస్కృతిక రంగంలో సాగిస్తున్న దాడిని గుర్తించటంలోనూ, నిలువరించే ప్రయత్నం చేయటంలోనూ వామపక్ష ఉద్యమాలు, దేశంలో వామపక్ష ఉద్యమాలకు నాయకత్వ స్థానంలో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)ల వైఫల్యమే నేడు సాంస్కృతికోద్యమం రూపంలో విరుచుకుపడుతున్న భారతీయ తరహా నయా ఫాసిజానికి రెక్కలు తెచ్చింది. ప్రజాసంఘాల స్వతంత్ర పనివిధానానికి తావులేని సాంప్రదాయక నిర్మాణం కూడా ఈ ప్రమాదం మరింత పెచ్చరిల్లటానికి దారితీసింది.


ఇప్పటికైనా ఈ లోపాలను అధిగమించనిదే ప్రజల భాషలో ప్రజా కళా సాంస్కృతిక రంగాన్ని నిర్మించనిదే ఆచరణలో ప్రజలకు సాంస్కృతిక ప్రత్యామ్నాయాన్ని అందించలేము. ఈ వైఫల్యం విప్లవ చైతన్యం, అవగాహన పెంపొందించుకునే అవకాశాలను ప్రజలకు మరికొంతకాలం దూరం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వామపక్ష సంఘటన బెంగాల్‌లో అధికారానికి రావటంలో సాంస్కృతిక రంగం పోషించిన పాత్రను కూడా మదింపు వేసుకోవటం అవసరం.

ఫాసిజం 1930 దశకంలో యావత్‌ ప్రపంచాన్ని సవాలు చేసింది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటంలో సోషలిస్టులే కాక మానవతావాదులు, ప్రజాతంత్రవాదులంతా చేతులు కలిపాలని 1935లో జార్జి డిమిట్రోవ్‌ పిలుపునిచ్చారు. వలస పాలన నాటి భారతదేశంలో సైతం ఈ పిలుపు స్పూర్తినందుకుని భిన్న స్రవంతులకుచెందిన పౌర మేధావులు ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా గళం విప్పారు. కలం పట్టారు. ఈ పిలుపులో భాగంగానే 1938లో నాటి అవిభక్త బెంగాల్‌లో విద్యార్ధి సమాఖ్య ప్రారంభించిన ఉద్యమం 1940 నాటికి యువ సాంస్కృతిక వేదిక రూపం తీసుకుంది.


ఈ వేదిక ద్వారా రాష్ట్రమంతటా ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతిక రూపాల నిర్మాణం, ప్రదర్శనలు జరిగాయి. అప్పటికే వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా సాగిన అనేక మహోద్యమాలకు బెంగాల్‌ క్షేత్రంగా ఉన్నది. ఆయా ఉద్యమాలు అందించిన ఆధునిక సామాజిక విలువలు, మానవతా విలువలను పుణికి పుచ్చుకున్న తరం నవ బెంగాల్‌ నిర్మాణానికి అంకితమైంది. ఈ తరుణంలోనే నాజీ జర్మనీ సోవియట్‌ యూనియన్‌పై దాడి చేయటం, మరోవైపున ముంచుకొస్తున్న జపాన్‌ ఆక్రమణ ప్రమాదం కళ్లముందు కనిపించటంతో నిద్రాణంగా ఉన్న దేశభక్తి భావన కట్టలు తెంచుకుంది.


అనేక విన్నూత్న సాంస్కృతిక రూపాల ఆవిష్కరణకు అవకాశం, అవసరం కల్పించింది. దేశమంతా విదేశాల నుండి తలెత్తే ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే ఆ కాలంలోనే హిందూమహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు రూపంలో దేశవాళీ ఫాసిజానికి పునాదులు పడ్డాయి. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉన్న పౌరమేధావులపై ఈ సంస్థలు దాడులకు పురిగొల్పాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల ఫాసిజాలకు వ్యతిరేకంగా మేధావులు ఏకమైన ఫాసిస్టు వ్యతిరేక రచయితల సంఘాన్ని 1941లో ప్రారంభించారు. ఈ కర్తవ్యాన్ని ప్రజలకు మరింత సన్నిహితం చేసే ప్రయత్నంలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్స్‌ సంఘం ఆవిర్భవించింది.


బెంగాల్‌ రాజకీయాల్లో 1940 దశకం అత్యంత కీలకమైనది. ఓ వైపున సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా సాగే పోరాటాలు ఊపందుకుంటుంటే మరోవైపు బెంగాల్‌ను 1943లో కరువు కబళించింది. ఇటువంటి విషమ పరిస్థితుల్లోనే ప్రజాకళలు సాంప్రదాయక సాంస్కృతిక స్వభావాన్ని విడనాడి సరికొత్త రూపాన్ని, సారాన్ని అందిపుచ్చుకున్నాయి. చిత్తప్రసాద్‌ చిత్రలేఖనం మొదలు భిభూతిభూషన్‌ బంధోపాధ్యాయ నవలలు వరకూ భారతదేశాన్ని కుదిపిన అనేక సాంస్కృతిక సృజనలకు ఈ దశాబ్దం పునాదులు వేసింది. తొలిసారిగా సమాజంపై పెత్తనం చేస్తున్న వర్గం జీవన శైలి చిత్రణను పక్కకు నెట్టి రైతు, కౌలు రైతు, సాధారణ ప్రజా జీవనమే వస్తువుగా సాహితీ సృజన జరిగింది.


సుకాంత, మాణిక్‌ బంధోపాధ్యాయ, సుభాష్‌ ముఖోపాధ్యాయ, సమరేష్‌ బసు, నారాయణ్‌ గంగూలి వంటి వందలమంది రచయితలు ఆవిర్భవించారు. సలిల్‌ చౌదరి, బినోయ్‌ రాయ్‌, హేమాంగ బిశ్వాస్‌ వంటి పలువురు సంగీత విద్య్వాంసులు ప్రజా కళలకు కృతులు సమకూర్చారు. ఈ పరిణామాలకు తలమానికం ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ కృషి. నాబన్న వంటి కళారూపాలతో ప్రజా సాంస్కృతికోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించింది. సాంస్కృతిక రంగంలో కమ్యూనిస్టు ఉద్యమం సాగించిన కృషి ప్రభావం ఎంత స్థాయికి చేరిందంటే చివరకు అప్పుడే మొగ్గతొడుగుతున్న ఆధునిక భారత చలన చిత్ర పరిశ్రమ సైతం సాధారణ ప్రజల జీవితాన్ని కథా వస్తువుగా స్వీకరించాల్సి వచ్చింది.


భారతీయ ఆధునికతకు, వాస్తవికతవాదానికి అంకురార్పరణ జరిగింది ఈ కాలంలోనే. బిమల్‌ రాయ్‌ దో భిగా జమీన్‌ సినిమాను ఈ చారిత్రక నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో బెంగాల్‌ సినీ రంగాన్ని శాసించిన రిట్విక్‌ ఘటక్‌, మృణాల్‌ సేన్‌ వంటి వారు ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ ఉద్యమం సమాజానికి అందించిన ఆణిముత్యాలే. దక్షిణ భారత దేశంలో సైతం ప్రత్యేకించి మద్రాసు కేంద్రంగా ఉన్న తెలుగు సినీ రంగంలో కూడా ఇటువంటి కొన్ని ఆణిముత్యాలను మనం గమనించవచ్చు.

స్వాతంత్య్ర సాధన తర్వాత ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్స్‌ సంఘంలో రెండు స్వరాలు ప్రధానంగా వినిపించాయి. ఓ స్వరం సాంస్కృతిక రంగం సృజనాత్మకమైనది కనుక పార్టీ ప్రమాణాలు, నిర్దేశాల ప్రకారం నడవటం సాధ్యం కాదని వాదించింది. రెండో స్రవంతి ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ సంస్థ ప్రజా కళల రంగాన్ని విస్తరించాలని, కళలు, సాహిత్యం ద్వారా ప్రజా విముక్తి పోరాటాలను బలోపేతం చేయాలని వాదించింది. ఈ రెండు స్వరాలు, స్రవంతుల మధ్య సాంస్కృతిక సిద్ధాంతాలు, సమకాలీన సమాజంలో సాంస్కృతిక రంగం పాత్ర విషయంలో తలెత్తిన విబేధాలు 1960 దశకం వచ్చే నాటికి కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న నినాదంతో ముగింపుకు వచ్చాయి.


దురదృష్టవశాత్తూ 1960 దశకం నాటికి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పరాకాష్టకు చేరిన సైద్ధాంతిక విబేధాలు ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ సంస్థను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సమాకాలీన సమాజంలో విప్లవ దశ జనతా ప్రజాతంత్ర విప్లవ దశగా నిర్ధారించటంతో ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ ఉద్యమం చరిత్రలో మూడో దశ మొదలైంది.


ఈ దశలో బెంగాల్‌లో సాగిన ప్రజా ఉద్యమాలతో ప్రజా సాంస్కృతికోద్యమం గొంతు కలిపింది. కదం తొక్కింది. గ్రామ గ్రామాన సాంస్కృతిక దళాలు తయారయ్యాయి. మొత్తం విజయదశమి ఉత్సవాలు ప్రత్యామ్నాయ సాంస్కృతికోత్సవాల రూపం తీసుకున్నాయి. బెంగాల్‌లో వామపక్ష భావాల వ్యాప్తికి దోహదం చేసిన మరో సాంస్కృతికోద్యమం అభ్యుదయ రచయితల సంఘం. దీనికి కూడా పునాదులు స్వాతంత్య్రోద్యమం చివరి దశాబ్దంలోనే పడ్డాయి. అభ్యుదయ రచయితల సంఘం విడుదల చేసిన ప్రణాళికలో ‘‘భారతదేశపు నవ్య సాహిత్యం వర్తమాన సమస్యలైన ఆకలి, పేదరికం, సామాజిక వెనకబాటుతనం, రాజకీయ పరాధీనత వంటివాటిపై దృష్టి సారించాలి. నిస్తేజం, నిష్క్రియాపరత్వం, నిర్హేతుకత, ప్రతీఘాతవైఖరి మనలను అడుగు ముందుకేయనీయటం లేదు.


మనకు స్పూర్తినిచ్చేది విమర్శనాత్మక దృక్ఫధం. ఆచారాలు, వ్యవహరాలు, అలవాట్లు అన్నింటినీ హేతుబద్దత ప్రమాణంగా పరిశీలిస్తుంది. మనలను మనం సంఘటితం చేసుకోవాల్సిన అవసరాన్ని మనముందుంచుతుంది. దీన్నే మనం ప్రగతిశీలతగా గుర్తిస్తాము’’ అని స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలను వలసవాదం నుండి విముక్తి చేయటం, సామాజిక మార్పు సాధించటం, భూస్వామ్య పీడనను అంతమొందించటం మితవాద అవగాహన స్థానంలో చైతన్యవంతమైన అవగాహనను పెంపొందించటం అభివృద్ధి. అంటే అభివృద్ధి భావన నిర్దిష్ట స్థల కాల పరిమితులకు లోబడి ఉండే భావన అన్న వాస్తవాన్ని అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక స్పష్టం చేస్తుంది.


ఈ రెండు ఉద్యమాలు, స్రవంతులూ 1980 దశకం నాటికి వామపక్ష ఉద్యమ అనుబంధ సంస్థలుగా మిగిలిపోవటంతో సృజనాత్మకత కలిగిన అనేకమంది సాంస్కృతిక కార్యకర్తలు, సృజనకారులు ఉద్యమానికి దూరమయ్యారు. ఫలితంగా 1940 దశకం తరహాలో సార్వత్రిక ప్రజా సమస్యలపై ప్రజాకర్షక కళారూలు, రచనలు ఈ కాలంలో మందగించాయి. అప్పటి వరకూ సమగ్ర ప్రత్యామ్నాయ సాంస్కృతిక రూపాలు అందించగలిగిన ఈ ఉద్యమాలు మారుతున్న ఆర్థిక వ్యవస్థ దశ, దిశలకు అనుగుణంగా తెరమీదకు వస్తున్న నూతన సాంస్కృతిక ధోరణులను మదింపు వేయటంలోనూ, విశ్లేషించి వాటికి తగిన ప్రత్యామ్నాయాన్ని సృష్టించటంలోనూ వెనకపట్టు పట్టాయి.


నూతన తరం మేధావులను ఇముడ్చుకున్న కేరళ, బెంగాల్‌లలో మాత్రమే 1980 దశకంలో ఈ ప్రజా సాంస్కృతిక రంగం మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన రీతిలో ప్రజాదరణ పొందింది. ఈ సాంస్కృతికోద్యమాలన్నీ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంతోనూ, తర్వాతి కాలంలో బెంగాల్‌లో విజృంభించిన ప్రజా ఉద్యమాలతోనూ పునరుజ్జీవం పొందాయి. ఈ విధంగా పునరుజ్జీవం పొందిన ప్రజా సాంస్కృతికోద్యమం తిరిగి ప్రజా ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లటానికి శక్తివంతమైన సాధనంగా ఉపకరించింది.


కాలక్రమంలో ఈ ప్రజా సాంస్కృతికోద్యమం, ప్రజా ఉద్యమాల మధ్య ఉన్న గతితార్కిక సంబంధం బలహీనపడిరది. ఇదే తరుణంలో దోపిడీని ఉధృతం చేసే ప్రపంచీకరణ విధానాలతో విజృంభించిన వినిమయ సంస్కృతి, వ్యక్తి ఆధిపత్య సంస్కృతి ప్రజా సాంస్కృతిక రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. అందువల్లనే ఈ కాలంలో దేశంలో కీలకమైన సామాజిక రాజకీయ సమస్యలుగా ఆవిర్భవించిన దళితులపై దౌర్జన్యాలు, కుల పీడన, మహిళ వివక్ష, గిరిజన సమస్యలు గురించి ప్రజా సాంస్కృతికోద్యమం తనదైన వ్యాఖ్యానాన్ని అందించలేకపోయింది. ఆయా వర్గాలు, తరగుతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సరికొత్త సాంస్కృతిక రూపాలు సృష్టించలేకపోయింది.


ఈ పరిస్థితిని అధిగమించటానికి కావల్సిన రీతిలో మేధో సమృద్ధతను సమకూర్చుకోవటంలో వామపక్ష శక్తులు విఫలం కావటం, ఉదారవాద ప్రజాతంత్ర శక్తులను కూడా కలుపుకుపోగలిగేలా ప్రత్యామ్నాయ సాంస్కృతికరంగ నిర్మాణాన్ని మల్చుకోవటంలో విఫలవం కావటమే సాంస్కృతిక, భావజాల రంగంలో వామపక్షాల జోక్యాన్ని, పాత్రను మరింత కుదించేశాయని ప్రముఖ చరిత్రకారుడు కెఎన్‌ ఫణిక్కర్‌ నిర్ధారించారు.

వామపక్ష సాంస్కృతిక సంస్థలు స్వాతంత్య్రోద్యమంలోనూ, అనంతర కాలంలోనూ సాగించిన కృషి, సాధించిన విజయాలు గురించి పదేపదే ప్రస్తావించుకోవటం ద్వారా వర్తమాన తరానికి స్పూర్తినిచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే నాటి పరిస్తితులు, నేటి పరిస్తితుల మధ్య ఉన్న గుణాత్మకమైన మార్పు కారణంగా ఆ స్పూర్తిదాయకమైన చరిత్ర నేటి తరాన్ని నిర్లిప్తత నుండి బయటకు తీసుకురాలేకపోయింది. వాస్తవిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన పెనుమార్పులకు ఆయా చారిత్రక ఉపమానాలు పొసగని పరిస్థితులు వచ్చాయి.


ప్రజా సాంస్కృతికోద్యమం 1960`70 దశకాల్లో చర్చకు పెట్టిన అంశాలు, ఎంచుకున్న కర్తవ్యాల కంటే 1990 దశకంలో తెరమీదకు వచ్చిన అంశాలు, ఎంచుకోవాల్సిన కర్తవ్యాలు ఎంతో భిన్నమైనవిగా ఉన్నాయి. అప్పటి గుణాత్మకమైన మార్పు మాత్రమే అభివృద్ధి అన్న అవగాహన పరిధి దాటి ప్రజల కళ్లముందు ఆవిష్కృతమవుతున్న పరిణామాత్మక మార్పులను ఎలా అర్థం చేసుకోవాలి, దానికున్న పరిమితుల గురించి ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అన్న విషయంలో అటు వామపక్ష ఉద్యమం, ఇటు ప్రజా సాంస్కృతికోద్యమం మార్గాంతరాన్ని చూపించలేకపోయిందని చెప్పటం సందర్భరాహిత్యం కాబోదు.

ఈ కోణంలోనే బెంగాల్‌లో సైతం నయా ఉదారవాద ఆర్థిక జీవితం సామాజిక జీవితాన్ని, విలువలను ప్రభావితం చేయనారంభించింది. అప్పటికే వామపక్ష సంఘటన అమలు చేసిన భూసంస్కరణల ద్వారా అంది వచ్చిన చిన్న చిన్న కమతాలతో మెరుగైన జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న ఓ కొత్త తరం ముందుకొచ్చింది. ఈ తరానికి సమాజం అందించిన సాంస్కృతిక విలువలు, దృక్కోణం 1940 దశకంలో ఎదిగిన తరానికి అందించిన సాంస్కృతిక విలువలు, దృక్కోణం కంటే పూర్తి భిన్నమైనవి. 1940 దశకంలో ఉమ్మడితనం, సంఫీుభావం గ్రామీణ జీవితంలో మౌలిక లక్షణాలుగా ఉంటే 1980`90 దశకాల్లో వ్యక్తిగతత్వం, ఒంటరిగా అభివృద్ధి కాగలమన్న నమ్మకం మౌలిక లక్షణాలుగా మారాయి.


ఈ భావనలకున్న పరిమితులను సమాజం దృష్టికి తీసుకురావటానికి జరగాల్సిన కృషి నవ్యతలోనూ స్పష్టతలోనూ, నాణ్యతలోనూ మందగించింది. దీంతో అప్పటి వరకూ మూడు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమ ఉమ్మడి సంస్కృతితో మమేకమైన బెంగాల్‌ పల్లె పట్లు ఈ ఉమ్మడి సంస్కృతి నుండి విడగొట్టుకోవటం ప్రారంభించింది. ఈ పరిణామాన్ని వేగవంతం చేసిన మరో కీలకమైన సందర్భం దేశంలో టెలివిజన్‌ వినియోగం అందుబాటులోకి రావటం. టెలివిజన్‌ రాకమునుపు సాంస్కృతిక జీవితం అది సినిమా అయినా నాటకం అయినా, వీధి నాటకం అయినా, జాతర అయినా సామూహికమే. ఉమ్మడితనం, సంఫీుభావం, సమిష్టితత్వం కొట్టొచ్చినట్లు కనిపించే వేదికగా సాంస్కృతిక జీవితం ఉండేది. కానీ టెలివిజన్‌ అందుబాటులోకి రావటంతో ఈ లక్షణాలు క్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. ఉమ్మడి వినోద సాధనంగా ఉన్న సంస్కృతి రానురాను స్వీయ, వయుక్తిక వినోద సాధనంగా మారింది. ప్రజా సాంస్కృతికోద్యమానికి ఎదురైన భారీ ప్రతిఘటనగా దీన్ని చెప్పవచ్చు.

ఈ విధంగా మనిషిని సంఘం నుండి విడదీసిన తర్వాత ప్రభావితం చేయటం మితవాద శక్తులకు మరింత తేలిక. బూర్జువా మితవాదమైనా, మతతత్వంతో కూడిన మితవాదమైనా ఇలాంటి ఒంటరి మనిషి, సమాజ అభివృద్ధి క్రమం నుండి పరాయీకరించబడిన మనిషి కోసం చూస్తుంది. మార్కెట్‌ మితవాదానికి, మతతత్వ మితవాదానికి మధ్య బాదరాయణ సంబంధాన్ని , ప్రగతిశీల సంఫీుభావ జీవనానికి వీటికి మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటానికి ఓ చిన్న ఉదాహరణను మనం ప్రస్తావించుకోవచ్చు.


మార్కెట్‌ మితవాదం మనిషిని వినిమయదారుడిగా మారుస్తుంది. తనకు ఏమి కావాలో, తాను ఏమి కొనాలో చూపిస్తుంది. అదేవిధంగా గుడిలో వందమందిలో కూర్చుని భజన చేసినా భజన చేసేవాళ్లు అక్కడున్న అందరికీ మంచి జరగాలని లేదా అందరి కోరికలు తీర్చమని దేవుడి విగ్రహానికి పూజ చేయరు. తన అవసరాలు తీర్చమని మాత్రమే పూజ చేస్తారు. సరళీకరణ తెరమీదకు వచ్చిన తర్వాత ఈ పరాయీకరణ మరింత ఉధృతమైంది. దాంతో కుటుంబంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి కూడా తన అవసరం వరకే ఆలోచించే దుస్తితికి మార్కెట్‌ మితవాదం మనలను నెట్టేసింది.


ఇలా మార్కెట్‌ మితవాదానికి బలై పరాయీకరించబడిన ఒంటరి మనుషులను మతతత్వం తనదైన మితవాదంతో శాశ్వతంగా కట్టి పడేస్తుంది. ఇదంతా సాంస్కృతిక రంగంలో వివిధ రూపాల్లో జరుగుతుంది. దీనికి భిన్నంగా ఉద్యమ సంస్కృతి, ఉమ్మడి సంస్కృతి, సంఫీుభావం ఏ ఉద్యమంలోనైనా పాల్గొనే అందరికీ ప్రయోజనం కలిగించాలని ఆశిస్తుంది.

అభ్యుదయ సంస్కృతికి 1936లో ప్రముఖ హిందీ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం తొలితరం నాయకుడు ప్రేమ్ చంద్‌ ఇచ్చిన నిర్వచనాన్ని ఓ సారి మననం చేసుకోవాల్సిన అసటవరం ఉంది. ‘‘ ఆలోచనలు రేకెత్తించేది, స్వేఛ్చా భావనలకు రెక్కలు తెచ్చేది, సౌందర్యానికి భాషను కూర్చేది, సృజనాత్మకమైనదీ, జీవన వాస్తవికతతో మేళవించినదీ, మనలను కదిలించేదీ, మేధో తృష్ణను రగిలించేదీ అభ్యుదయకరమైనదే’’ అని నిర్వచించారు. వర్తమాన వామపక్ష సాంస్కృతికోద్యమం ఈ నిర్వచనం వెలుగులో కార్యోన్ముఖులు కావల్సిన అవసరం ఉంది. ఈ పని చేపట్టాలంటే సృజనాత్మక రంగంపై సాంప్రదాయవాదం, మితవాదం ఆధిపత్యాన్ని, దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. అంచనా వేయాలి.


అయితే ఇటువంటి వర్తమానాన్ని అర్థం చేసుకోవటంలో మితవాదం, సాంప్రదాయం మధ్య ఉన్న సన్నని విభజన రేఖను గుర్తించటంలో విఫలమైతే ఈ రెండిరటినీ ఒకే గాటన కట్టేస్తాము. ఉదాహరణకు మితవాదం ఆధిపత్య వర్గాలు భావజాల రంగంలో దాడి చేయటానికి ఉపయోగించే ప్రధానమైన సాధనంగా ఉంటుంది. కానీ సాంప్రదాయవాదం దీనికి భిన్నమైనది. సాంప్రదాయం కాలంతో ముడిపడి ఉంటుంది. కాలంతో పాటు సాంప్రదాయం కొత్త రూపాలు తీసుకుంటుంది. సాంప్రదాయాన్ని పాటించే వారిని సైతం మితవాదులుగా ముద్ర వేసి దూరం చేయటం బెంగాల్‌లో తో సహా దేశమంతటా ప్రజా సాంస్కృతికోద్యమాలు బలహీనం కావటానికి దోహదం చేసిన కారణాల్లో ఓ కీలకమైనది. అలా దూరమైన వారిని ఆకట్టుకోవటానికి, అదుపు చేయటానికి పాలకవర్గ సాంస్కృతిక వ్యవస్థలు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు.

బెంగాల్‌లో వామపక్ష సంఘటనను అధికారానికి తేవటంలో సాంస్కృతిక రంగం పోషించిన పాత్రకు మరో కారణం సంస్కృతి, రాజకీయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న తీరు. ప్రజా సాంస్కృతికోద్యమం సంస్కృతి రాజకీయాల్లో అంతర్భాగమని గుర్తించింది. ప్రజాతంత్ర రాజకీయాలు విజయం సాధించనిదే ప్రజాతంత్ర సంస్కృతి, ప్రజా సాంస్కృతిక రూపాలు మనుగడ సాగించటం సాధ్యం కాదన్న అవగాహనను ప్రజలకు చేరవేయగలిగింది. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఫాసిస్టు రాజకీయాలను ప్రతిఘటించే రాజకీయాల్లో భాగంగానే ప్రజా సాంస్కృతిక ఉద్యమం తెరమీదకు వచ్చింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ దశ, దిశలు సృష్టించిన ఒత్తిడికి గురైన ప్రజా సాంస్కృతికోద్యమం సంస్కృతి రాజకీయాలకు భిన్నమైనదన్న పాలకవర్గ భావన వ్యాప్తిని అడ్డుకోవటంలో విఫలమైంది.


ఈ పరిస్థితిని అధిగమించటానికి కె ఎన్‌ ఫణిక్కర్‌ రెండు మార్గాలు ప్రతిపాదించారు. మొదటిది పీడితుల జీవితంలోకి ప్రవేశించటం, రెండోది విచక్షణాత్మక ప్రజా చైతన్యాన్ని పెంపొందించటానికి అవసరమైన రీతిలో నిరంతరం సాంస్కృతిక రంగంలో జోక్యం చేసుకోవటం. ఈ రెండు కర్తవ్యాలను చేపట్టంలో ప్రజా సాంస్కృతికోద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్న వామపక్ష ఉద్యమం వైఫల్యం నేడు దేశవ్యాప్తంగా వామపక్ష శ్రేణుల్లో గూడుకట్టుకుంటున్న నిరాశ నిస్పృహల్లో ప్రతిఫలిస్తోంది.

ఈ నిరాశ నిస్పృహలు మరోవైపున వామపక్ష రాజకీయాల్లో సాంస్కృతిక కోణాన్ని మరింత బలహీన స్థితికి నెట్టేస్తున్నాయి. సాంస్కృతిక రంగంలో కృషి అంటే భావజాల రంగంలో సాగే సైద్ధాంతిక పోరాటంలో భాగమే తప్ప పార్టీ అనుబంధ సాంస్కృతిక సంస్థల కృషికి దీన్ని కుదించటం కాదు. దురదృష్టవశాత్తూ ఇది అన్ని కమ్యూనిస్టు, వామపక్ష స్రవంతులకు వర్తించే దురవస్థ. నిర్మాణాల సూత్రాల పేరుతో సాంస్కృతిక రంగంలో ఉన్న శ్రేణులపై పెత్తనం చేయటానికి చూపించే ఆసక్తి వామపక్ష స్రవంతుల నాయకత్వం విశాలమైన సాంస్కృతిక రంగంలో నికరమైన సైద్ధాంతిక కృషి చేయటానికి కావల్సిన నిర్మాణాలను నమూనాలను రూపొందించుకోవటంలో చూపించటం లేదు.


ఇటువంటి గాడితప్పిన అవగాహనలు దేశమంతటా వామపక్ష ఉద్యమంలో కనిపిస్తూ ఉన్నాయి. సమకాలీన ఆచరణ, ఆలోచలనతో సంపూర్ణంగా ఈ ఉద్యమాలు తమను తాము విడగొట్టుకోకపోతే పైన ప్రస్తావించిన జమిలి కర్తవ్యాలను నెరవేర్చటం సాధ్యం కాదు. ఈ కర్తవ్యాలను చేపట్టాలంటే గత ఏడున్నర దశాబ్దాలుగా భారత ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవనంలో వస్తున్న మార్పులను, వాటి గుణాత్మక స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మదింపు చేయాలి. బెంగాల్‌లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న దేశవాళీ ఫాసిజాన్ని ఎదుర్కోవాలన్నా మితవాదానికి, సాంప్రదాయానికీ మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని గుర్తించాలి. రెండిరటిపై సాగించే పోరాటం ఒకే రీతిలో ఉండదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. పాలకవర్గం అనుసరించే విలక్షణ అభివృద్ధి పంథా కారణంగా సాంప్రదాయం క్రమంగా మారుతున్న సామాజిక వాస్తవికతలకు అనుగుణంగా తనను తాను తాజా పర్చుకుంటుంది.


పాలకవర్గం అనుసరిస్తున్న అభివృద్ధి పంథా ఆర్థిక అంతరాలను తీవ్రతరం చేస్తుందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తాము. ఈ విధంగా సృష్టించే బడే ఆర్థిక అంతరాలే సమిష్టి సామాజిక జీవితంలో వేర్వేరు అస్తిత్వాల ఆవిర్భావానికి దారి తీస్తాయి. ఈ అస్తిత్వాలు తమకు జన్మనిచ్చింది పాలకవర్గ విధానమే అన్న విషయాన్ని మర్చిపోయి ఒకదానితో ఒకటి పోటీపడుతూ కొన్ని సందర్భాల్లో తమ మధ్య ఉండాల్సిన సంబంధాలను శతృపూరిత సంబంధాలుగా పరిగణించుకుంటూ ఉంటాయి. అటువంటి తరుణంలో రంగప్రవేశం చేసే అన్ని అస్తిత్వాలను తనతో ఇముడ్చుకునేది మితవాదం. ఈ రాజకీయ ఆర్థిక మితవాదానికి మతోన్మాదం తోడైతే అది విశృంఖల విధ్వంసానికి దారితీస్తుంది. విధ్వంసమే సామాజిక విలువగా మారుతుంది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఈ పరిణామం విస్తరించుకోవటం, వేళ్లూనుకోవటం గమనిస్తూనే ఉన్నాము.


ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సంస్కృతి, సాంస్కృతికోద్యమం ముందు పెను సవాళ్లున్నాయి. పాలకవర్గం అనుసరించే అభివృద్ధిపంథా స్థిరమైన వర్గాలను చంచలైమనవిగా మారుస్తుంది. (స్టేట్‌ ఆఫ్‌ ఫ్లక్స్‌) మతోన్మాదం కొత్త క్తొత సామాజిక వ్యక్తీకరణలను ముందుకు తెస్తోంది. ప్రత్యేకించి బెంగాల్‌ నేపథ్యంలో పరిశీలిస్తే మార్కెట్‌ మితవాదం, మతోన్మాదం భావజాల రంగంలో సాగిస్తున్న ప్రచారం, సృష్టిస్తున్న కొత్తకొత్త తరగతులు, రాజకీయ సమీకరణల్లో అవి పోషించేపాత్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అందువల్ల వాడుకలో కనిపించే ప్రతి కొత్త తరగతిని, కేటగిరీనీ, భావనను లోతుగా పరీక్షించి పరిశీలించి ఆయా నూతన పదజాలాల మాటున ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో వెలికి తీయగలగాలి.

అటువంటి ప్రయత్నం చేయటంలో జరిగిన వైఫల్యమే బెంగాల్‌లో భారీ నష్టానికి దారితీసింది. వామపక్ష ఉద్యమంలోనూ, ప్రగతిశీల శక్తుల్లోనూ నేడు నెలకొన్న స్తబ్దతను అధిగమించాలంటే మితవాదాన్ని ఆధిపత్య భావజాలంగా మారుతున్న సంస్థలు, వాటి నిర్మాణాలు, ఆచరణను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మరో కీలకమైన విషయాన్ని కూడా గుర్తెరగాలి. ప్రజా సాంస్కృతికోద్యమం విశాలమైన సంకీర్ణ కూటమి అన్నదే ఆ వాస్తవం. ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ మాటల్లో ‘‘మనమంతా ఐక్యం కావాలి. వర్గ, జాతి, హోదాల్లో ఉన్న తేడాలు, మౌలిక సమస్యల పట్ల మనకున్న భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి ఏకం కావాలి.’’


అటువంటి అవగాహనతోనే స్వాతంత్య్రోద్యమం చివరి దశాబ్దంలో ఆవిర్భవించిన ప్రజా సాంస్కృతికోద్యమం 1970 దశకం వరకూ ప్రత్యామ్నాయ సాంస్కృతిక విలువలు, ప్రజాతంత్ర ఉద్యమాల విస్తరణలో శక్తివంతమైన పాత్ర పోషించింది. అటువంటి ఉమ్మడి కార్యాచరణ, సంకీర్ణ కూటమి కృషి, ఒంటెత్తు పోకడలకు, ఒంటెత్తువాదానికి తావివ్వని ఆచరణలు తమతమ వంతు పాత్రలు పోషించినందునే 80 దశకంలో బెంగాల్‌లో వామపక్ష సంఘట అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.


తర్వాతి కాలంలో అవగాహన, ఆచరణలో వచ్చిన అనేక మార్పులు, అవి తెచ్చిన సమస్యలతో పాటు మౌలికంగా దేశీయ పాలకవర్గం అనుసరించిన అభివృద్ధి పంథా సృష్టించిన సమస్యలను సరిగ్గా అంచనా వేయటం, పౌర సమాజంలో ప్రత్యాధిపత్య నిర్మాణానికి ఉన్న అవకాశాలు, వెసులుబాట్ల పట్ల ఏమరుపాటు ప్రదర్శించటంతో పౌరసమాజం మితవాదం ఆధిపత్యంలోకి జారిపోయింది. అటువంటి పొరపాటు మళ్లీ జరక్కుండా ఉండాలంటే ప్రత్యాధిపత్య నిర్మాణానికి శక్తివంతమైన సాధనంగా ఉన్న ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం, నిర్వహణలో బెంగాల్‌లో జరిగిన పొరపాట్లు జరక్కుండా చూసుకోవటమొక్కటే మార్గం. బెంగాల్‌లో వాపమక్ష కూటమి ఓటమి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర ప్రగతిశీల అభ్యుదయ వామపక్ష శక్తులకు నేర్పుతున్న పాఠం ఇదే.

(బెంగాల్‌లో బిజెపి ఎదుగుదల గురించి అర్థం చేసుకోవాలంటే సాంస్కృతిక రంగ సమస్యల గురించిన అవగాహన ఉపయోగపడుతుందన్న అంచనాతో ఈ అంశాన్ని చర్చకు పెట్టాను.)


Tags:    

Similar News