దేశాన్ని పాలించేందుకు లీడర్లు రావలసి ఉంది...

ఆగస్టు 15, 1947న ప్రముఖ తెలుగు జర్నలిస్టు పండితారాధ్యుల నాగేశర్వరావు నాటి పరిస్థితుల మీద చేసిన విశ్లేషణ

Update: 2024-08-14 15:20 GMT

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? రాలేదు, తెచ్చుకున్నాం. యుద్ధాలు జరిగాయి. దారుణమైన హింస సాగింది, సత్యం, అహింస అనే నినాదాలతో ఉద్యమమైంది. అన్యాయంగా ఎందరినో చంపేసారు. చారిత్రిక రచయితలు, ఆ సందర్భాలకు అనేక పుస్తకాలు రాసుకున్నారు. చదువుకున్నారు. ఇంకా చదువుతారు. నిజానికి బ్రిటిషర్లు చేసిందేమిటి? మనల్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషర్లు పరిపాలించలేదు. ఇష్టం వచ్చినట్టు ఏలుకున్నారు. క్రూరంగా బానిసలని చేసారు. దోచుకున్నారు. బ్రిటిష్ వాళ్లే రాసుకున్న ఐ పి సి కింద దొరకని దొంగలు వారు. న్యాయం, చట్టం అనేవేమీ లేకుండా పోయింది.

నాటి  చరిత్ర పరిణామాలను విశ్లేషిస్తూ ప్రముఖ పాత్రికేయుడు,  పండితారాధ్యుల నాగేశ్వరరావు 15.8.1947నాడు ఒక వివరమైన వ్యాసం రాసారు. అది కేవలం వ్యాసం కాదు, ఒక చరిత్ర. నవల. విశ్లేషణ. ‘‘వర్తకం చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వ్యాపారస్థులకు రాజ్యాధికారం సంక్రమించింది. అందుచేత వారు భారతదేశ పరిపాలనకు ఆ వర్తకదృష్టితోనే శాసనాలను తయారుచేస్తూ వచ్చారు’’ అని చెప్పాడు పండితారాధ్యుల వారు. 




 తొలితరం ఖ్యాతి గాంచిన పాత్రికేయులలో, సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగిన వారు. గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. పిఠాపురం మహారాజా వారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్య రంగా నెలకొల్పిన వాహిని పత్రికలో 1932లో చేరారు. 

పండితారాధ్యుల నాగేశ్వరరావు


1943 నుంచి 1959 వరకూ ఆంధ్రపత్రికలో పని చేశారు. 1960లో ఆంధ్రభూమి సంపాదకునిగా విశేషమైన సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో వెలువడిన ఆంధ్ర జనతకు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించారు. 1966 నుంచి చివరిదాకా (1976) వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్‌ ఎడిటర్‌గా పని చేశారు. గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, పత్రికలలో కూడా సంపాదకునిగా పని చేశారు.



తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, భారతదేశంతో వర్తకం కోసం 1600 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ వచ్చింది. 1600 డిసెంబర్‌ 31న రాయల్‌ చార్టర్‌ ద్వారా ఈ కంపినీ ఏర్పాటైంది. మొగల్‌ సామ్రాజ్య వైభవం క్షీణిస్తున్న దశలో వ్యాపారం మీద గుత్తాధిపత్యం కోసం ఈస్టిండియా కంపెనీ దేశ రాజకీయాల్లోనూ తలదూర్చడింది. భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్‌ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది. 19వ శతాబ్ది సగంనాటికి భారతదేశం ఈస్టిండియా కంపెనీ హస్తగతమైపోయింది. 



ఓ మామూలు కంపెనీ. ఈస్టు ఇండియా కంపెనీ అంటే అది ఇండియాది కాదు. అక్కడ వ్యాపారం చేస్తున్నాడు కనుక అదే పేరు పెట్టుకున్నాడు ఈ కంపినీ వాడు. దానికి ఆయన పదాల్లో ‘‘విదేశాలతో వ్యాపారం సాగించడానికి సరిగ్గా 350 సంవత్సరాల క్రితం ఎలిజబెత్ రాణి గారు హక్కులను ఈస్టిండియా కంపెనీకి ప్రసాదించింది. ఈ కంపెనీ పై అధికారం 24 కమిటీలకూ, ఒక గవర్నరుకూ ఉండేది’’. జ్ఞాపకంచేసుకోండి. 77 ఏండ్ల కిందట  అదే హక్కుల సంక్రమణ జరిగింది.  ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడున్న వారు లీడర్లా లేక వీరు డీలర్లా అని అనుమానం వస్తున్నది. 2024లో ‘కంపనీ’ అనకుండా ‘కార్పొరేట్’ అని అందంగా అంటున్నాం. ఇది కార్పొరేట్ రోగం, కరోనా వంటి విపరీత సంపదలను దోచుకునే రోగం.

'రెగ్యులేటింగ్ ఆక్టు'

శాసన చరిత్ర తెలుసుకోవలసిన అంశం ఇది:

‘‘1773వ సంవత్సరంలో పార్లమెంటు చేసిన 'రెగ్యులేటింగ్ ఆక్టు' మొదలు 1935వ సంవత్సరపు భారత ప్రభుత్వ శాసనం వరకూ తయారవుతూ వచ్చిన చట్టాలను పరిశీలిస్తే తమకు దైవికంగా సంప్రాప్తించిన ఆర్థిక ప్రయోజనాలను స్థిరపరుచుకొనడానికీ, వాటిని సంరక్షించుకొనడానికీ బ్రిటిష్ వారు ఈ శాసనాలను తయారుచేశారని స్పష్టమౌతుంది. 1935 లో తయారుచేసిన ఆఖరు శాసనంలో పరిపాలనావిధానానికి సంబంధించిన వాణిజ్యరక్షణలకు సంబంధించిన క్లాజులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది’’

ఈస్ట్ ఇండియా కంపినీని మన భారతీయులు దాన్ని ‘‘కంపినీ’’ అని పిలిచేవారు. కంపిని అంటే ఏమిటో భారతీయులకు తెలియదు. దాన్ని ‘కుంపిణీ’ ప్రభుత్వం అనేవారని, ఈ జర్నలిస్టు పండితారాధ్యుల వారు చెప్పారు. అంటే ఈనాడు మన వారు డీలర్లే గానీ ఇంకా లీడర్లు కావలసి ఉంది. బహిరంగ అతి రహస్యం ఏమంటే,

‘‘1661వ సంవత్సరంలో రెండవ ఛార్లెస్ ఈ కంపెనీని జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పాటుచేసి, ఆ కంపెనీ స్థాపించుకొన్న స్థావరాలపై అన్ని అధికారాలనూ చెలాయించడానికి హక్కులు ప్రసాదించాడు. కంపెనీ స్థావరాలంటే ఆ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్న ప్రదేశాలే. ఆ ప్రదేశంలో నివసిస్తున్న వారందరిపైనా “సివిల్, మిలిటరీ, క్రిమినల్, రెవిన్యూ’’ అధికారాలను చెలాయించడానికి అక్కడి గవర్నరుకూ, ఆయన సలహా సంఘానికీ సంపూర్ణమైన హక్కు ఇచ్చాడు. ఈ హక్కును పురస్కరించుకొని వారు క్రైస్తవులుకాని వారందరితో యుద్ధం చేయవచ్చు, ఒడంబడికలు కుదుర్చుకోవచ్చు’’. కేవలం క్రైస్తవులుకాని వ్యక్తులతో యుద్దం చేసే అధికారం. ఇది మనవాళ్లంతా అర్థం చేసుకోవాలి. సిగ్గు, ఎగ్గు వంటి పదార్థమూ ఏదీ లేదన్నమాట.

1683 లో రెండవ ఛార్లెస్ ప్రసాదించిన హక్కులను పురస్కరించుకొని ఏషియా, ఆఫ్రికా, అమెరికాల్లోని ఏ జాతితోనైనా సరే ఈ వర్తక కంపెనీలు యుద్ధం చేయడానికి అధికారం ఏర్పడింది. ఈ ఛార్టరు ప్రకారమే భారతదేశంలోని 'కుంపిణీ' ప్రాంతాలపై న్యాయవిచారణాధికారము దృఢతరమైంది అని నాగేశ్వరరావు వివరించారు. చెన్నపట్నంలో సైనిక దళం మొదలైంది.

ఈ కుంపినీ వాళ్ళకు 1744న ఫ్రాన్స్ -ఇంగ్లండ్ యుద్దం మొదలైంది. మన భారతదేశానికి కూడా యుద్ధం 1746న వ్యాపించింది. 1748న చెన్నపట్నం (ఇపుడు చెన్నై)లో ఓ చిన్న సైనిక దళం మొదలైంది.

‘‘1672వ సంవత్సరంలో చెన్నపట్నంపైనా, సరికి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల పైనా ఈస్ట్ఇండియా కంపెనీకి సంపూర్ణాధికారం లభించింది. కంపెనీ వ్యవహారాల్లో బ్రిటిష్ పార్లమెంటు ప్రత్యక్షంగా జోక్యం కల్గించుకోవడానికి ఇదే కారణం’’.

ఇక్కడనుంచి పార్లమెంట్ పరిపాలన ప్రారంభమైంది. అది 1766 నుంచి. అయినా కుంపినీ గాళ్ల లాభాలు డివిడెండు దొరలు దొరలు ఊళ్లు ఊళ్లు పంచుకున్నట్టు (అంటే దొంగలు దొంగలు ఊళ్లు ఊళ్లు పంచుకున్నట్టు అనకూడదుకదా) దేశాన్ని పంచుకుదోచుకున్నారు. ‘‘తమ వాటాదార్ల కు నూటికి ఆరురూపాయల వంతున డివిడెండు పంచుకువచ్చారు. 1766లో ఒక్కసారి నాల్గు రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం ఇంకో రెండున్నరరూపాయలు పెంచారు. కంపెనీ ఆర్థిక స్థితి బ్రిటిష్ ప్రభుత్వానికి కన్నెర్ర అయింది. 1766 లోనే "కుంపిణీవ్యవహారాల" పై విచారణ జరిపించడానికి పార్లమెంటు తీర్మానించింది’’. ఇదీ అసలైన మన భారతీయ చరిత్ర.

నాలుగు లక్షల పౌన్లూ చెల్లింపలేక...

అది సరే. కాని బ్రిటిష్ పరిపాలనలో కూడా తీవ్రమైన అవినీతి ప్రభావం బాగానే ఉండింది.

‘‘కుంపిణీవారి భూభాగాలపై బ్రిటీష్ రాజుకు సంపూర్ణాధికారం ఉందనే విషయం అప్పట్లో నిర్ధారణ కాకపోయినా 'కుంపిణీ' వారు మాత్రం తమ డివిడెండ్లను నూటికి పదిరూపాయలకు పరిమితం చేసుకోవడానికీ, బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటా నాలుగు లక్షల పౌన్లు చెల్లించడానికీ ఒప్పుకున్నారు’’. ఇంత డబ్బు ఎవ్వడైనా ఇవ్వగలడా? అందుకే దివాలా తీసారు.

చట్టబద్ధమైన వ్యాపారీకరణ!

అప్పుడు రెగ్యులేటింగ్ ఆక్ట్ పేరుతో పార్లమెంట్ చట్టాల ద్వారా కుంపిణీ కంపినీ వ్యవహారాలను చట్టబద్ధం చేస్తారనుకున్నారు. ఆ విధంగా కంపినీ దుకాణం పూర్తిగా పోయింది, బ్రిటిష్ పరిపాలన పూర్తిగా మొదలైంది. అప్పడినుంచి 1773 రెగ్యులేటింగ్ ఆక్ట్ ద్వారా పార్లమెంటు పేరుతో ప్రైమ్ మినిస్టర్, వారి కాబినెట్ పరిపాలన చేస్తున్నారు. దీన్నే వారు సంస్కరణ అనేవారు.

ఆనాటి ఎడిటర్ నాగేశ్వరరావుగారు మరో రెండవ లోపాన్ని విశ్లేషించారు.

‘‘ఈ శాసనం గవర్నరు జనరలుకూ ఆయన సలహా సంఘానికీ గల అధికారాలను స్పష్టంగా ప్రకటించలేదు. అలాగే సుప్రీంకోర్టు అధికారం ఎంతవరకు, ఏవిధంగా, ఏయే ప్రాంతాలపై ఉండేదీ స్పష్టం కాలేదు. ఈ కోర్టుకూ, బెంగాల్ ప్రభుత్వానికీ ఉండే సంబంధాలు కూడా సందిగ్ధంగానే ఉండిపోయినవి. ఈ సందిగ్ధావస్థను కొంతవరకు తొలగిస్తూ పార్లమెంటు 1781 లో వేరొక శాసనం చేసింది. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ రాష్ట్రాలకు న్యాయ స్థానాలనూ, గవర్నరు సలహాసంఘాలనూ ఏర్పాటు చేయ వీలైంది. భారతదేశంలో శాసననిర్మాణ కార్యక్రమంలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన అని చెప్పవచ్చు. 1781 లో పార్లమెంటు తిరిగి రెండు విచారణ సంఘాలను స్థాపించింది’’.

మూడు సముద్ర తీరాలకు చేరి దేశాన్నే ఆక్రమించిన వారు

పండితారాధ్యుల వారు తమ వ్యాసంలో ఈ విధంగా రాసారు:

‘‘భారతదేశ ప్రజల బాధలు తమకు తెలియకపోలేదనీ, ఆ బాధలకు కారణం రాజకీయ స్వాతంత్య్రం లేకపోవడం గాదనీ ఆయన అభిప్రాయపడ్డాడు. దేశంలో యూరపియను ప్రభుత్వం లేకపోవడమే ఇందుకు కారణం అని విశ్వసించి ఒక సుప్రీంకోర్టును స్థాపించాడు. ఈ చట్టం ప్రకారమే బెంగాలుకు ఒక గవర్నరు జనరలూ, ఆయనకు నలుగురు సలహాదారులూ ఏర్పడ్డారు. వీరికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై సంపూర్ణాధికారం ఉంటూ బొంబాయి, చెన్నపట్నం రాజధానుల పర్యవేక్షణాధికారమూ ఉంటూ వచ్చింది’’.

అంటే మొత్తం పాలన బెంగాల్, బొంబాయి చెన్నపట్నం కీలకమైపోయాయి. సముద్రతీరాల ద్వారా మొత్తం దేశాన్ని వీరే పరిపాలించారు. అందుకే ఇప్పడికీ వారే తెలివైన వారనీ, మిగతావాళ్లంతా దద్దమ్మలనుకుంటారు, అంతే కాదు. బెంగాల్ వారిని మించిన వారు పరిపాలకులంటే వాళ్లే అనుకుంటారు. పొగరు రకరకాలు గా ఉంటుంది మరి.

వారన్ హేస్టింగ్స్ వైఫల్యం  



1947 నాటి ఈ జర్నలిస్టు (పండితారాధ్యులవారు) వారు విశ్లేషించారు.

‘‘వారన్ హేస్టింగ్స్ గవర్నరు జనరలుగా ఉండగా ఆయన తన సలహాదారుల సంఘంతో కలిసి వ్యవహారం చేయలేకపోయినాడు, ఈ సంఘంలోని అధికసంఖ్యాకుల నిర్ణయాలను బట్టి గవర్నర్ జనరల్ వ్యవహరించాలనేదే ఈ శాసనంలోని పెద్ద లోపం. పిట్ తయారుచేసిన 'ఇండియా చట్టం'లో అయినా ఈ లోపం సర్దుబాటు కాలేదు’’

ఎక్కడైనా అధికారాలు అస్పష్టంగా ఉంటాయో అక్కడ నియంతలు తయారవుతూ ఉంటారు. ఈనాటి 2013 కొత్త చట్టాల ప్రమాదాలు కూడా అవే. బ్రిటిష్ పాత కాలపు చట్టాలని మనం అంటూ ఉంటాం కదా, అది అస్పష్ఠ అధికారాలను ఈ చట్టాల ద్వారా నిర్దేశిస్తుంటే, మంత్రులు, వారికి సలహాలు ఇచ్చే అధికారాలు, ఐ ఎ ఎస్ వంటి అధికారులు నిజమైన నియంతలుగా అవుతూ ఉంటారు. ఒక హోం మంత్రి, వారి నెత్తిన పిఎం, సరదాగా ఒక రాణిగారో రాజుగారో స్వతంత్ర దేశం ఏదైనా ఉంటే ప్రెసిడింటె సంతకాలు చేస్తూ, ధర్మ ప్రసంగాలు చెబుతూ ఉంటాడు. మన  ఎడిటర్లు ఎడిటోరియర్లు రాస్తూ ఉంటారు. మనవాళ్లో ఆహో ఓహో అంటూ ఉంటారు. పాఠకులు లెటర్ టు ఎడిటర్లకు కూడా రాస్తూ ఉంటారు.

నియంతలను జయించడానికి సమరానికి సిద్ధంగా ఉండేలా జాతిని, నిద్రిస్తున్న పౌరసమాజాన్ని మేలుకొలుపుచేయాల్సిందే. అందుకే నిద్రిస్తున్న దేశానికి మరో ప్రపంచం కావాలన్నారు శ్రీశ్రీ. స్వాతంత్య్రానికి ముందు, ఆ సమయంలో, నిజానికి ప్రస్తుతం కూడా అవసరం ‘‘మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు’’ అని శ్రీశ్రీ పిలుపు ఇస్తున్నారు. ( ఇంకా ఉంది)

Tags:    

Similar News