భారీగా నిధులు అవసరం లేని పనులు కూడా చేయడం లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇది...;
By : కన్నెగంటి రవి
Update: 2025-02-16 08:25 GMT
ప్రభుత్వం ప్రకటించే కొన్ని పథకాలకు భారీగా నిధుల అవసరముంటుంది. నిధులు అందుబాటులో లేకపోతే, ఆయా పథకాలను ప్రారంభించడం, కొనసాగించడం కష్టమవుతుంది. కాబట్టే ప్రభుత్వాలు ఎక్కువ నిధులు అవసరమైన పథకాన్ని ప్రారంభించడానికి వెనకాడతాయి.
కానీ కొన్ని పనులు, అసలు బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రారంభించవచ్చు. కొన్ని జీవోలు, కొన్ని మార్గదర్శకాలు ఇందుకు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టి పెడితే, ఆయా రంగాల ప్రభుత్వ కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్స్ తో కలసి చాలా పనులను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ శాఖలను నోడల్ ఏజెన్సీ లుగా ప్రకటించి, పనుల అమలు , పర్యవేక్షణ చేయవచ్చు.
కానీ పాలన పేరుతో ఇప్పటి వరకూ నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ఏ అంశాలకు ప్రాధాన్యత ఉందో, అవే ప్రభుత్వ పాలనా అజెండాగా మారతాయి. చర్చలకు వస్తుంటాయి. మహా అంటే, ప్రభుత్వంపై రాజకీయ పట్టు కలిగిన కొందరు క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు, ప్రభుత్వ అజెండాలో ప్రవేశించవచ్చు. అంతే తప్ప, పేద ప్రజల తక్షణ అవసరాలు, ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రజల ముందు పెట్టిన మానిఫెస్టో అంశాలు , ఎక్కువ మందికి మేలు చేసే ప్రభుత్వ శాఖల పని తీరు మెరుగులాంటివి సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వ అజెండాలోకి రావు. కొందరు నిజాయితీ కలిగిన అధికారులు వాటిని ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేసినా, ప్రభుత్వ చర్చలలో వాటికి ప్రాధాన్యత దక్కదు. లక్షల, కోట్ల మంది పేదల సంక్షేమాన్ని చూడాల్సిన కొన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వంలో అసలు ప్రాధాన్యతే దక్కదు. సాధారణంగా క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పని చేసే పౌర సమాజం ఇలాంటివి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా ముందుకు పోవు. క్రమంగా, సాధారణ ప్రజలలో, పౌర సమాజంలో ప్రభుత్వ పని తీరు పట్ల విముఖత, వ్యతిరేకత రావడానికి ఇదే ప్రధాన కారణం.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ పార్టీ , అభయ హస్తం పేరుతో ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటి అమలుకు పెద్దగా బడ్జెట్ కేటాయింపులు అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటిపోయినా అవి ఇప్పటి వరకూ చర్చకు కూడా రాలేదు. పౌర సమాజ ప్రతినిధులు కొన్ని అంశాలను చర్చకు పెట్టినా, అవి ఇంకా ఆచరణకు నోచుకోలేదు.
ముఖ్యంగా మానిఫెస్టో మొదటి అధ్యాయంలో ఇచ్చిన హామీ ఒకటి: “పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్ ను ఏర్పాటు చేసి, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం. ప్రజా ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకువస్తాం”. ఈ హామీ ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు.
రాష్ట్ర రాజధానిలో ప్రజావాణి పేరుతో ఒక ప్రక్రియ నడుస్తున్నా, ఇంకా అది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా రూపొందలేదు. గ్రామ, మండల స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారం అంశంలో ఇప్పుడే పైలట్ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో మొదలైంది. పబ్లిక్ హియరింగ్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. అనేక మంది పౌర సమాజ కార్యకర్తలు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో వచ్చిన అనుభవాల నుండీ రాష్ట్ర స్థాయిలో ప్రజా వాణి వ్యవస్థను మెరుగు పరచాలని ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రక్రియ ఎంత సజావుగా ముందుకు వెళుతుందో ఇప్పుడే చెప్పలేం. మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా ప్రజలకు ఒక టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడం వల్ల , ప్రజలు తమ బాధలు, సమస్యలు చెప్పుకునేందుకు ఒక వెసులుబాటు వస్తుంది. ప్రభుత్వం ఈ వైపు వేగంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. దీనికి బడ్జెట్ లో నిధుల ఖర్చు కూడా ఎక్కువ ఉండదు.
6 గ్యారంటీలలో ఒక అంశం బడ్జెట్ లో నిధుల కేటాయింపుతో సంబంధం లేకుండా అమలు చేయవచ్చు. వివిధ జిల్లాలలో, హైదరాబాద్ మహా నగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వేలాది పేద కుటుంబాలు కనీస ఇంటి స్థలం లేక ఇబ్బంది పడుతున్నాయి. ఆయా జిల్లాలలో పేదలు ఇంటి స్థలాల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇంటి స్థలం ఉంటే కానీ, ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద ఇల్లు మంజూరు చేయదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పూనుకుని, ఆయా జిల్లాలలో ఉన్న ప్రభుత్వ భూముల నుండీ కొంత భాగాన్ని, ముందుగా స్థానికంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలంగా కేటాయించాలి. మహబూబ్ నగర్ లో TFTU, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ అంశం పై గత సంవత్సర కాలంగా పెద్ద ఉద్యమం నడుస్తున్నది.
రెవెన్యూ, గ్రామ పంచాయితీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో ఈ పని పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం దీనికి బడ్జెట్ నుండీ నిధుల కేటాయింపు చేయనక్కర లేదు. స్థలాల కేటాయింపు పూర్తయ్యాక, అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించవచ్చు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో, రైతుల నుండీ భూమి లాక్కుని పారిశ్రామిక వేత్తలకు వందల ఎకరాల భూమి కట్ట బెట్టడానికి పరుగులు పెడుతున్న ప్రభుత్వం , పేద కుటుంబాలకు ఇళ్ల స్థలం ఇవ్వడానికి కూడా అదే వేగంతో పని చేయాలి.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చినట్లుగా ( 9 వ అంశం) లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా, నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక వెంటనే తయారు చేయవచ్చు. వ్యవసాయ, ఉద్యాన , పశు సంవర్ధక , మత్స్య, మార్కెటింగ్ శాఖలకు , రాష్ట్రంలో వ్యవసాయ,అనుబంధ రంగాల యూనివర్సిటీ లకు ఉమ్మడిగా ఈ బాధ్యత అప్పగించవచ్చు. అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇందుకు నోడల్ ఏజెన్సీగా పెట్టవచ్చు. ఈ సంస్థలు, రైతు సంఘాలు, రైతు సహకార సంఘాల భాగస్వామ్యంతో రూపొందించే నివేదికలను వచ్చే ఖరీఫ్ నుండీ అమలు చేయవచ్చు. దీనికి బడ్జెట్ లో తక్షణమే నిధుల కేటాయింపు అవసరంలేదు.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగ నిర్మూలన అంశం క్రింద “ ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపనీలలో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన “ అనే హామీ కూడా ఉంది. నిజానికి ఇది చాలా మంచి హామీ. కానీ ఆచరణలో అమలులోకి రాలేదు. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలోకి తరలి వస్తున్న పరిశ్రమల గురించి, రోజూ ముఖ్యమంత్రి, మంత్రులు అట్టహాసంగా పకటిస్తున్నారు కానీ, వస్తున్న ప్రైవేట్ పెట్టుబడిదారులు, స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా చూడడం లేదు.
అలాంటి డాటా కూడా ప్రజల ముందు పారదర్శకంగా లేదు. కాబట్టి ఆయా సంస్థలు తప్పకుండా, యువతకు ఉపాధి కల్పించాలంటే, ముందుగా దానిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తాత్కాలికంగా దీనిని రాష్ట్ర కార్మిక శాఖకు అప్పగించవచ్చు. ఈ విధాన నిర్ణయాన్ని అసెంబ్లీ లో కూడా ఆమోదించి, జిల్లా కలెక్టర్స్ ద్వారా ఆయా జిల్లాలలో అమలయ్యేలా చూడవచ్చు. దీనికి బడ్జెట్ లో పెద్దగా నిధులు కేటాయించాల్సిన పని లేదు.
చేవెళ్ళ ఎస్. సి. ఎస్. టి డిక్లరేషన్ లో 5 వ అంశంగా ఈ క్రింది హామీ ఉంది : “ BRS ప్రభుత్వం గుంజుకున్న ఎస్. సి, ఎస్. టి ల అసైన్డ్ భూములను తిరిగి అసైనీ లకే అన్ని హక్కులతో పునరుద్దరిస్తాం. ప్రజా ప్రయోజనార్ధం భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం అందిస్తాం”. నిజానికి ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విప్లవాత్మక హామీలు.
గత సంవత్సర కాలంగా వీటిని అమలు చేసి ఉంటే , గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించేది. ముఖ్యంగా BRS ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను ఆయా కుటుంబాలకు వెనక్కు ఇవ్వడం అద్భుతమైన ప్రతిపాదన. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. మల్లన్న సాగర్, ఫార్మా సిటీ, NIMZ, ఆహార శుద్ధి పార్కులు సహా, వివిధ జిల్లాలలో, వివిధ ప్రాజెక్టుల పేరుతో KCR ప్రభుత్వం వేలాది ఎకరాలను గుంజుకున్నది. వాటిని ఆయా కుటుంబాలకు ఈ ప్రభుత్వం వెనక్కు ఇవ్వాలి.
ప్రజలకు ఇచ్చిన రెండవ హామీ కూడా ముఖ్యమైనదే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని మర్చిపోయి, 2013 చట్టం ప్రకారం కాకుండా, KCR తెచ్చిన అన్యాయమైన 2017 భూసేకరణ చట్టం ప్రకారం ఆయా జిల్లాలలో భూములను సేకరించడానికి నోటిఫికేషన్లు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకుని, భూ సేకరణ పేరుతో ఇప్పటి వరకూ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ లను రద్ధు చేయాలి. భవిష్యత్తులో అవసరమైన, అనివార్య స్థితిలో మాత్రమే, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ లు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. భూ సేకరణ అవసరంపై ప్రభుత్వం ఇచ్చిన పూర్తి సమాచారంతో నిజంగా ప్రజా ప్రయోజనం కోసమే భూమి సేకరిస్తున్నారని నమ్మి, ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపితేనే, ఇతర చట్ట పరమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, భూసేకరణకు ముందుకు వెళ్ళాలి. నిజానికి ఈ హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులు కూడా పెద్దగా అవసరముండవు.
వివిధ రంగాలకు ఇచ్చిన ప్రత్యేక హామీలలో భాగంగా 8 వ అంశంగా భూ పరిపాలన( రెవెన్యూ ) క్రింద “ నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో తొలగిస్తాం “ అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఫార్మా సిటీ ప్రాంతంలో రైతులు ఇదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం అక్రమంగా నిషేధిత జాబితాలో పెట్టిన తమ భూములను బయటకు తేవాలని, ఆ భూములకు కూడా రైతు భరోసా సహాయం ఇవ్వాలని, ఈ భూములలో సాగు చేసే పంటలకు పంట రుణాలు తీసుకునే సౌకర్యం కల్పించాలని, ఆయా భూముల యాజమానులను కూడా రైతు బీమా పరిధి లోకి తీసుకు రావాలని కోరుతున్నారు. నిజానికి తాను ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేయడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా అవసరం లేదు.
కానీ ఈ ప్రభుత్వం కూడా తాను ఇచ్చిన హామీని మర్చిపోయి , రైతుల గోడు పట్టించుకోకుండా మౌనంగా ఉంటున్నది. లేదా ఆయా భూములకే భూ సేకరణ కింద తాజాగా నోటిఫికేషన్ లు ఇస్తున్నది. ఫార్మా సిటీ భూముల విషయంలో ఇచ్చిన హామీకి భిన్నంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది.
అభయ హస్తం మానిఫెస్టో లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలలో అనేక హామీలు ఉన్నప్పటికీ వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అవన్నీ బడ్జెట్ తో ముడిపడినవి అనుకున్నా, బడ్జెట్ తో సంబంధం లేని “ ఆర్టీసీ లో యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం “ అనే హామీని కూడా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. అంటే గత ప్రభుత్వం లాగే, ఆర్టీసీలో యూనియన్ లను పునరుద్ధరించడం ఈ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదని అనుకోవాలి.
మానిఫెస్టో లో మద్యపాన విధానం అంశం క్రింద “ బెల్టు షాపులను రద్ధు చేస్తాం. మత్తు బానిసలకు పునరావాస కేంద్రాలు ప్రతి జిల్లా ఆసుపత్రి లోనూ ఏర్పాటు చేస్తాం” అని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం మర్చిపోయి, దానికి భిన్నమైన పద్ధతులను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ హామీలను అమలు చేస్తే బెల్టు షాపు లు నాశనమై మద్యం అమ్మకాలు తగ్గి ప్రభుత్వానికి కొంత ఎక్సైజ్ పన్ను ఆదాయం తగ్గవచ్చు. కానీ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఆర్ధికంగా కోలుకుంటాయి. మహిళలపై, పిల్లలపై, మొత్తంగా సమాజంలో హింస కొంతైనా తగ్గుతుంది. మగవాళ్ళ అకాల మరణాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. నిజానికి ఈ హామీలను అమలు చేయడానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం లేదు.
రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటి అమలుకు ప్రభుత్వ బడ్జెట్ నుండీ పెద్దగా కేటాయింపులు అవసరం లేదు. కాకపోతే, ఈ హామీల అమలుకు బాధ్యత పడాల్సిన కార్మిక శాఖను బలోపేతం చేయాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో ఈ శాఖ పూర్తిగా నిస్సత్తువగా మారింది. పారిశ్రామిక, సేవా రంగాలపై ఆ శాఖకు ఉండే పర్యవేక్షణ అధికారాలన్నీ తొలగించారు. కార్మిక శాఖలో పోస్టుల భర్తీ ఆపేశారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపు తగ్గించేశారు. రెండు కోట్లకు పైగా కార్మికులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖ సిబ్బంది వందల్లో కూడా లేరు. గత పదేళ్ళలో BRS ప్రభుత్వం కార్మిక శాఖను మరింత చావు దెబ్బ కొట్టింది. విద్యా వ్యాపారి మల్లా రెడ్డి లాంటి వ్యక్తిని ఆ శాఖకు మంత్రిగా నియమించింది.
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కార్మిక శాఖకు అసలు మంత్రే లేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్య మంత్రి గారే ఈ శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఈ శాఖపై ముఖ్యమంత్రి గారు సమీక్ష జరపలేదు . కార్మిక సంఘాలతో చర్చించలేదు. మానిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ధిష్ట చర్యలు తీసుకోలేదు. బీడీ, హమాలీ, గృహ కార్మికులు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటారు. బీడీ కార్మికులందరినీ జీవిత బీమా, ESI పరిధిలోకి తెస్తామనీ, హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనీ, ముఖ్యంగా అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల హక్కుల కోసం రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టాన్ని చేస్తామనీ, హామీ ఇచ్చారు.
నిజానికి ఈ హామీల అమలుకు బడ్జెట్ లో నిధులు కాదు, ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి అవసరం. కార్మిక శాఖ కార్యదర్శి, కమిషనర్ లకు ప్రత్యేక బాధ్యత ఇచ్చి, నిర్ధిష్ట గడువు లోపల ఈ హామీల అమలును ముందుకు తీసుకు వెళ్ళేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి నెలా తన ఆదేశాల అమలు పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజావాణి లో భాగంగా కార్మిక సంఘాలతో జరిగిన సమావేశాలలో, ఇప్పటికే మూడుసార్లు ఈ విషయాన్ని పౌర సమాజ ప్రతినిధులు నొక్కి చెప్పినా, అడుగు ముందుకు పడలేదు.
రాష్ట్రంలో పారిశ్రామిక,సేవా రంగాల అభివృద్ధి అంటే, పెట్టుబడి దారులు మాత్రమే సంతోషంగా ఉండడం కాదు. ఆయా రంగాలలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఉద్యోగ బధ్రత, కార్మిక హక్కుల తో మనుషులుగా జీవించడం కూడా అని ఈ ప్రభుత్వానికి ఎప్పుడర్థమవుతుందో ?