రాహుల్ గాంధీకి దళిత స్పృహ ఎలా వచ్చింది?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో ఈ మధ్య దళిత స్పృహ కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఏమైందో ఏమోగానీ.. ఈ మధ్య అన్ని రంగాల్లో దళితులకు స్థానం దక్కట్లేదంటున్నారు.(2)
(జాన్ సన్ చోరగుడి)
కులగణన జరగాలి అనే డిమాండ్ తో ప్రయాగరాజ్‌లో ఆగస్టు 25న కాంగ్రెస్ ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ నిర్వహించింది. అందులో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘‘నేను ‘మిస్ ఇండియా’ జాబితా అంతా వెతికాను, ఒక దళిత్, ఒక ఆదివాసి, లేదా ఓబిసి కులాల నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ ఎంపిక కాలేదు. సరే కొందరు మన క్రికెట్ బాలీవుడ్ గురించి చెబుతారు. కానీ ఒక చెప్పులు కుట్టేవాణ్ని, ఒక ‘ప్లంబర్’ను అక్కడ మీరు నాకు చూపించండి. న్యూస్ ఛానల్లో ఒక సీనియర్ యాంకర్‌ను చూపించండి’ అన్నారు. ఇది ఆయన తన సామాజిక అవగాహనను వెల్లడిస్తుంది.
‘ఒక చెప్పులు కుట్టేవాణ్ని నాకు చూపించండి...’ అంటూ ఈ ఉత్తరప్రదేశ్ లోని రాయబెరేలీ ఎంపి రాహుల్ గాంధీ- ‘చమర్’ కులస్థుల ప్రస్తావన చేయడంతో కాంగ్రెస్ వైఖరిలో మాదిగల విషయంలో ఏమైనా మార్పు మొదలయిందా? అనే మీమాంస కలుగుతున్నది. ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాన ‘మీడియా’ ‘సోషల్ మీడియా’లో కూడా పలు రంగాల్లో నిష్ణాతులు దీనిపై స్పందిస్తున్నారు. దాంతో ఇది, ఈ 25 రోజుల్లో ఆయనలో వచ్చిన మార్పా? అనే అనుమానం కూడా కలుగుతున్నది. మాదిగలు తాము కోర్టు ద్వారా గెలిచాము, అంటున్న ఈ తీర్పు ‘విన్నర్స్ షీల్డ్’ ప్రధానం ‘ఫోటో ఫ్రేం’లోకి బిజెపి ఇప్పటికే చేరింది. అయితే, ఇందులో దాని పాత్ర విషయంలో నిజం ఏమిటో తెలియదు.
అదలా ఉంచి, అస్సలు రాహుల్ గాంధీ తన 34 ఏళ్ల వయస్సులో అమేథీ నుంచి లోక్ సభకు ఎన్నిక అయ్యాక, ఆయనకు ‘దళిత స్పృహ’ వంటి కొత్త విషయాలు ఎవరు నేర్పారో తెలుసుకోవడం అవసరం. కేంద్రంలోనూ రాష్ట్రంలోను 2004నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, తెలుగు దళిత స్పృహ కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించింది. నిజానికి వర్ధమాన సమాజాలు (Emerging communities) ఆధిపత్య కులాల వెనక, వారిని అనుసరిస్తూ ఎదగడానికి, అవి ఎటువంటి రాజకీయ వ్యూహాలు పాటిస్తాయో తెలుసుకోవడం అవసరం. నిజానికివి ఆకళింపు చేసుకోవలసిన పాఠాలు, వీటిని అనుసరించాలా వద్దా? అనేది మళ్ళీ ఆయా కులాలవారి అభీష్టం.
సరే, అదెలా మొదలయిందో చూద్దాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఏర్పడింది. ఆ తర్వాత, ఈశాన్య రాష్ట్రాల కేడర్ కు చెందిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి తన స్వంత రాష్ట్రంలో ఐదేళ్లపాటు పనిచేయడానికి ఉన్న వెసులుబాటు వినియోగించుకుంటూ, అప్పటికి కృష్ణాజిల్లాలో జాయింట్ కలక్టర్ గా పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆ ఎస్సీ అధికారిని 2014లో అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్దికి- ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (ఒఎస్‌డి.)గా పోస్ట్ చేసారు. ఆయన తూగో జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి అల్లుడు కూడా.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయిలోని ఎంపికలు, ఆ రాష్ట్ర ‘సిఎంవో’ డిల్లీలోని ఏఐసిసి కార్యాలయంతో చేసే సమన్వయంతో జరిగే నిర్ణయాలుగా ఉంటాయి. ఇందులో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ పాత్ర కేవలం సాంకేతికమే. ఆ అధికారికి అర్హత ఉంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. అప్పట్లో డిల్లీలో పార్టీ ప్రసిడెంట్ సోనియా గాంధీ. అమెథీలో ఆమె కొడుకు రాహుల్ ఇద్దరూ మొదటిసారి ఎంపిలు. ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ఆఫీస్ ‘ఒఎస్‌డి’ ఏపి నుంచి పంపబడిన ఎస్సీ ఐఏఎస్ అధికారి.
అక్కడ పరిస్థితి అలా ఉంటె, ఇక్కడ రాష్ట్రంలో కె. రాజు ఐ.ఏ.ఎస్. గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి. ఈ శాఖ పరిధిలోనే- ‘డ్వాక్రా’ గ్రూపుల వ్యవహారాలు చూసే సంస్థ ‘సెర్ఫ్’ పనిచేస్తుంది. నెల్లూరు, కర్నూలు జిల్లాల కలక్టర్ గా రాజు ఈ గ్రూపుల ఏర్పాటు వ్యవహారాలు చురుగ్గా చేసారు అంటారు. అయితే, కొందరు ‘దండోరా’ నాయకులు మాత్రం ఆయన అప్పటి నుంచే ఉపకులాల స్పృహతో పనిచేసారు అంటారు. ఈ మధ్యలో గుంటూరు వాసి సర్వీసుకు రాజీనామా చేసిన కర్నాటక ఐఏఎస్ అధికారి జేడి శీలం 2004-16 మధ్య రాజ్యసభ సభ్యుడు అయ్యారు, ఆర్థిక శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసారు.
వీరు కాకుండా అప్పటికే, రిటైరైన ఎస్సీ ఐ.ఏ.ఎస్. అధికారులు కొందరు రాజకీయాల్లోకి, మరి కొందరు ‘ఎన్జీవో’లు పేరుతోనూ ప్రజా జీవితంలోకి చురుగ్గా ప్రవేశించారు. ఇవన్నీ ‘మాదిగ దండోరా’ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో జరిగిన పరిణామాలు. ఇలా కోస్తా జిల్లాలకు చెందిన ఒకే ఉపకులం నుంచి ఒకే కాలంలో ముగ్గురు ‘ఎస్సీ’ ఐఏఎస్ అధికారులు- ‘ఏఐసిసి’కి దగ్గరయ్యారు. ఇంటాబయటా ఇటువంటి ‘సెట్టింగ్’తో కాంగ్రెస్ పార్టీ మరోసారి 2009లో ‘యూపీఏ’ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఏపికి ఆ పార్టీ ప్రసిడెంట్ సోనియా గాంధీతో పాటు వచ్చిన ప్రతిసారీ ప్రధాని బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. తరుచూ ‘ఏపి మోడల్’ అంటుండేవారు. నిజానికి అప్పటికి పరిస్థితి కూడా అలాగే ఉండేది. దానికి ముందు 2004 వరకూ చంద్రబాబు పరిపాలనలో ‘సంక్షేమం’ చిన్నచూపు చూడబడింది. దాంతో వైఎస్ సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి దక్షణాదిలో బరువైన ఎంపిల బుట్టను అందించే పండ్లతోటగా మారింది!
అప్పట్లో అలా జరుగుతున్న సభల్లో ఎంపికచేయబడిన కొద్దిమంది ‘డ్వాక్రా’ గ్రూపు మహిళలతో సోనియాగాంధీ ‘ముచ్చట్లు’ అనే కార్యక్రమం ఒకటి ఉండేది. ‘సెక్యూరిటి’ కారణాలతో దీన్ని- ‘ఇండోర్’లో నిర్వహిస్తూ సమీపాన జరిగే బహిరంగ సభ వేదికమీది ‘స్క్రీన్స్’పై దాన్ని జనానికి చూపించేవారు. ఈ ముచ్చట్లు కార్యక్రమం సమయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. పక్కన ఆయనకు సహకరిస్తూ... సోనియా గాంధీతో మాటలు కలుపుతూ ఆమె దృష్టిలో ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడే పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసాక, 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడ గెలిచినా కనీసం ఒక ‘ఎస్సీ’ ముఖ్యమంత్రి కావాలి అనేది ఇక్కడి మాలల ఆశ. అయితే, ఆశించిన ఫలితాలు మారడంతో, ప్రతిపక్షంగా మారిన కాంగ్రెస్ కు ‘ఓదార్పు’ అవసరమయింది. దాంతో సర్వీస్ చివరలో ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి, కె. రాజు డిల్లీలో నేరుగా ఏఐసిసిలోకి వెళ్లారు. గత సీనియారిటీ దృష్ట్యా ఇప్పుడాయన ఆ పార్టీ సిడబ్ల్యూసి. మెంబర్. నెల్లూరు ఎంపి స్థానానికి పోటీచేసిన రాజు ‘జనరల్’ అభ్యర్థి అయ్యారు.
మన భారతీయ మూలాలు ఉన్నవారు విదేశాలలో దేశాధినేతల పదవుల్లో పోటీ పడుతుంటే, ఒకప్పుడు గాంధీజీ ‘హరిజన్’ అని సంబోధించిన కులాలు నుంచి వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గే వంటివారు డిల్లీలో ఎఐసిసి అధ్యక్ష స్థానంలో ఉంటున్నారు. ఇదొక గమనం. ఇందులో ముందు నడిచేవాళ్ళు ముళ్ళకంపలు తొలగించుకుంటూ వెళుతూ... వారికి పోటీకి వచ్చేవాళ్ళను తొక్కుకుంటూ ముందుకు వెళితేనే లక్ష్యం దగ్గరవుతుంది, అదొక పద్ధతి. అయితే, ఆ మార్గంలో వెనకపడ్డ వాళ్ళ కోసం ‘రాజ్యం’ దాని వ్యవస్థలు కలగచేసుకోవడం అనేది- ప్రాకృతిక న్యాయం. (సశేషం)