అమ్మ శాసనాన్ని కూలదోసి అయ్య శాసనం ఎలా వచ్చింది?

రామాయణంలో నిరుత్తరకాండ-34 : గరుడ పురాణమూలాలు రాతియుగాలలో ఉన్నాయా? ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న విశేషాలు

Update: 2024-11-15 05:33 GMT

Matriarchy, patriarchy, Ramayanamlo Niruttara Kanda, Kalluri Bhaskaram, Garuda, Mother Goddessగరుడుడు, లేదా గరుత్మంతుడు అనే పక్షి మన పురాణ, ఇతిహాసాలలో ఒక ప్రసిద్ధపాత్ర. దేవదానవుల్లానే ఈయన కూడా కశ్యపుని సంతానం; వినతకు పుట్టినవాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో ఇతని కథ కనిపిస్తుంది. కశ్యపుని మరో భార్యా, నాగుల తల్లీ అయిన కద్రువ విధించిన దాస్యం నుంచి తల్లికి విముక్తి కలిగించడం కోసం గరుడుడు దేవలోకంలోని అమృతాన్ని అపహరించడానికి ప్రయత్నించడం, ఇంద్రుడు అడ్డుకొని అతనితో యుద్ధం చేయడం, అతని శక్తిని గుర్తించి రాజీపడడం, గరుడుడు పక్షులకు ఇంద్రుడు కావడం గురించి ఆ కథ చెబుతుంది. ఆ క్రమంలో గరుడుడు విష్ణువుకు వాహనం కూడా అవుతాడు.

విష్ణుసంబంధమైన ఆలయాలతో గరుడుని పేరు ముడిపడి ఉండడం కనిపిస్తుంది. తిరుమలలో గరుడాద్రి ఉంది; గరుడవాహనం, గరుడధ్వజం వగైరాలు ఆలయాలతో అతని సంబంధాన్ని చాటుతాయి. ప్రత్యేకించి, మనకిక్కడ కావలసిన ఒక ముఖ్యవివరం ఏమిటంటే, ఇతని పేరిట ఒక పురాణం ఉంది; అది ‘గరుడపురాణం’. ఇది ఆచారకాండ, ప్రేతకాండ, బ్రహ్మకాండ అనే మూడు భాగాలుగా ఉంటుంది. చాలావరకూ ఇతర పురాణాల్లో కనిపించే విషయాలే ఇందులోనూ ఉంటాయి కానీ; అదనంగా ‘ప్రేతకాండ’ ఉండడం దీని ప్రత్యేకత. చనిపోయిన తర్వాత జీవుడు లేదా ఆత్మ ఏమవుతుందో, ఎలాంటి ప్రయాణం సాగిస్తుందో, చేసిన పాపాలకు ఎలాంటి నరకశిక్షలు అనుభవిస్తుందో అది ఒకింత భయోత్పాతంగా వర్ణిస్తుంది. ప్రేతసంబంధమైన విషయాలను అమంగళంగా భావిస్తారు కనుక, గరుడపురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదనే భావన ఏర్పడింది; దానిని అపోహగా కొట్టిపారేసేవారూ ఉన్నారు. మరణదినాలలో మాత్రం గరుడపురాణాన్ని చదివే ఆనవాయితీ ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంది.

ఇంతకీ సంగతేమిటంటే, చాటల్ హ్యుయక్ అనే కొత్తరాతియుగానికి చెందిన జనావాసాన్ని బయటపెట్టిన జేమ్స్ మెలార్ట్ కు కానీ, దాని గురించి తన పుస్తకంలో విస్తృతంగా చర్చించిన విలియం ఇర్విన్ థామ్సన్ కు గానీ ‘గరుడపురాణం’ గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, మృత్యువు- ప్రేతము- అంత్యక్రియలతో గరుడపక్షిని పోలిన రాబందుకు గల సంబంధాన్ని చెప్పే ఎగువరాతి, కొత్తరాతియుగాలకు చెందిన శిలామూర్తుల గురించి వారికి తెలుసు!

ఆ వివరాల్లోకి వెళ్లినప్పుడు గరుడపురాణమూలాలు మన దేశానికి బయట, వేల సంవత్సరాల వెనకటి ఎగువపాతరాతి, కొత్తరాతియుగాలలో ఉన్నట్టు అనిపించి ఆశ్చర్యం కలుగుతుంది.

చాటల్ హ్యుయక్ లోని అమ్మదేవతకు మూడు విభిన్నరూపాలున్నాయని థామ్సన్ అంటాడు. మొదటిది, విశాలమైన తుంటితో, పెద్ద కడుపుతో, వేలాడే స్తనాలతో ఉన్న అమ్మదేవత స్థూలకాయం. 21 వేల నుంచి 17వేల సంవత్సరాల వెనకటి ఎగువపాతరాతియుగానికి చెందిన సొలుట్రియన్(Solutrean) సంస్కృతికి చెందిన చిత్రాలలో ఈ రూపం కనిపిస్తుంది. అప్పుడది కేవలం శిశుజననాన్ని సంకేతించేది మాత్రమే. స్వల్పకాలంపాటు కొనసాగిన ఒక తరహా శిలాపరికరాల తయారీకి అద్దంపట్టే ఈ సంస్కృతి నైరుతి ఫ్రాన్స్ లోనూ, దాని చుట్టుపక్కలా వర్ధిల్లింది. కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్ కు వచ్చేసరికి ఈ స్థూలకాయం కలిగిన అమ్మదేవత ఒక చిరుతపులిని అధిరోహించి కనిపిస్తుంది. ఆమె తొడల మధ్యనుంచి ఒక దివ్యశిశువు ఉద్భవిస్తూ ఉంటుంది. మరికొన్ని ఇతర రూపాలలో అమ్మదేవత కడుపునుంచి ఎద్దు కొమ్ములు పుట్టుకొస్తూ కనిపిస్తాయి. ఈ అవతారంలో అమ్మదేవత దివ్యశిశువుకు తల్లిగా కన్నా, ఎగువపాతరాతియుగానికి చెందిన పశుపాలకురాలిగా కనిపిస్తుందని థామ్సన్ అంటాడు. అంటే, మన దగ్గర పశుపతిగా చెప్పే శివుడిలా అన్నమాట. చిరుతపులిని అధిరోహించిన అమ్మదేవత అనగానే మన దగ్గర సింహవాహిని అయిన అమ్మవారు గుర్తుకొస్తుంది.

అమ్మదేవతకు చెందిన రెండవ రూపం, ఇంతకుముందు చెప్పుకున్న ‘జంటదేవత’. తల్లీ-కూతురూ, లేదా కన్యా కలసి ఉన్న రూపమిది. ఈ జంటదేవతే కొత్తరాతియుగంలో గ్రీకు దేవత డిమీటర్, ఆమె కూతురు కొరే, లేదా పెర్సాఫని అయింది. ఇక మూడవది, మృత్యువును సంకేతించే ఒక వృద్ధురాలి రూపంలో ఉంటుంది. మధ్య యూరప్ లోని చెక్ రిపబ్లిక్ లో, 27 నుంచి 20వేల సంవత్సరాల వెనకటి ఎగువరాతియుగానికి చెందిన డోనీ వెస్టెనీస్(Dolni Vestonice) అనే ఒక పురావస్తుప్రదేశంలో ఈ రూపం బయటపడింది.

అక్కడినుంచి చాటల్ హ్యుయక్ కు వస్తే, అక్కడి ఒక మందిరంలో తల లేని రెండు మానవరూపాలు, వాటిపై ఎగురుతున్న రాబందు కనిపిస్తాయి. దానిని రాబందుల మందిరం(vulture shrine) అన్నారు. అక్కడ మానవకపాలాలను నివేదించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. అంత్యక్రియలలో రాబందులను ఉపయోగించేవారని దీనినిబట్టి అనిపిస్తుందనీ, అవి మృతశరీరాన్ని భక్షించిన తర్వాత మిగిలిన ఎముకలను ఆ మందిరంలో పూడ్చిపెట్టేవారనీ థామ్సన్ అంటాడు. ఈ చిత్రం ఆధారంగా అంత్యక్రియలకు చెందిన తంతును వివరించడానికి జేమ్స్ మెలార్ట్ ప్రయత్నిస్తాడు.

రాబందు చిత్రానికి ఎదురుగా ఉన్న గోడ మీద ఎద్దు తలా, ఆ మందిరం లోపల ఒక యువకుడి బొమ్మతోపాటు మృత్యువును సంకేతించే వృద్ధురాలి రూపమూ ఉన్నాయి. థామ్సన్ ప్రకారం, పురుషదేవుడి మృతి గురించి చెప్పే పురాణకథలనూ; వాటికన్నా ముందు పురుషుని జననాంగం ప్రతీకగా జనన, మరణాల గురించి చెప్పే పాఠాన్నీ ఇవి సూచిస్తాయి. మన పురాణకథల్లో మన్మథుడు భస్మమై మళ్ళీ పుట్టడం గురించి ఇంతకుముందు ఉదహరించుకున్నాం. అలాగే గ్రీకుపురాణాల్లోని ఆదోనిస్, మన్మథుడిలానే అందానికి, ప్రేమకు, కామానికి ప్రాతినిధ్యం వహించే దేవుడు. మన్మథుడికి రతీదేవిలానే, అదోనిస్ కు అఫ్రొడైటీ ప్రేయసి; పాతాళదేవత అయిన పెర్సాఫనిని కూడా అతని ప్రేయసిగా చెబుతారు. అతను వేటకు వెళ్లినప్పుడు ఒక అడవిపంది అతణ్ణి వధిస్తుంది. మన్మథుడు భస్మమైనప్పుడు రతీదేవి శోకించినట్టే అదోనిస్ మరణానికి అఫ్రొడైటీ శోకిస్తుంది. ఈ అదోనిస్- అఫ్రొడైటీల కథకు ప్రకృతి సంబంధమైన అన్వయం ఉంది. అదోనిస్ మరణం శీతరుతువులో ప్రకృతి నిర్జీవతనూ; అతని తిరిగి పుట్టడం వసంతంలో ప్రకృతి పునరుజ్జీవనాన్నీ సంకేతిస్తాయి. అదోనిస్ పునరుత్థానానికి గుర్తుగా స్త్రీలు వసంతోత్సవం జరుపుతారు. ఈ ప్రకృతి సంబంధమైన అన్వయం మన్మథుడికీ వర్తిస్తుంది; వసంతుని మన్మథుడి సహచరుడిగా మన కావ్యాలు చెబుతాయి.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ పురాణకథల మూలాలు చాటల్ హ్యుయక్ లోని రాబందు మందిరంలో ఉన్న వృద్ధమృత్యుదేవతా, యువకుడి చిత్రాలలో ఉన్నాయి! ఇక్కడి అమ్మదేవతకు చెందిన -కన్య, బిడ్డల తల్లి, మృత్యువును సంకేతించే వృద్ధస్త్రీ -అనే మూడు రూపాలూ స్త్రీ, పురుష సంబంధాన్ని తెలిపే మౌలిక ఆకృతులంటాడు థామ్సన్. పురుషుని పుట్టుకా-పునరుత్పత్తీ-మరణమూ అనే మూడు దశలకూ అమ్మదేవతకు చెందిన ఈ మూడు రూపాలూ ప్రాతినిధ్యం వహిస్తాయి. మాతృగర్భంనుంచి భూమాతృగర్భంలోకి(womb to tomb)చేరడంగా దీనిని థామ్సన్ సంక్షేపిస్తాడు; అంత్యక్రియల తంతు మొత్తం దీనికే అద్దం పడుతుందంటాడు.

ఈ సందర్భంలో థామ్సన్ మరో విశేషాన్ని మన దృష్టికి తెస్తాడు. చాటల్ హ్యుయక్ లో మృతులైన తల్లిదండ్రులను, ఇతర కుటుంబసభ్యులను ఇళ్ళల్లోనే సమాధి చేసేవారు. అంటే, జీవించి ఉన్నవారు అక్షరాలా ఆ సమాధులపైనే సృష్టికార్యం చేసేవారన్నమాట. కొత్తరాతియుగానికి చెందిన ఈ వారసత్వం ఒక నమ్మకం రూపంలో ఇప్పటికీ మన దగ్గర కొనసాగుతున్నదనిపిస్తుంది. ఉదాహరణకు, తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు జరిపే దశదినకర్మలలోనూ, ఆ తర్వాత ఏటా వారికి పెట్టే ఆబ్దీకమప్పుడూ ప్రత్యేకంగా మడిగా వండిన శ్రాద్ధవంటకాన్ని వారి వారసులు మాత్రమే భుజించాలి; ఇతర బంధుమిత్రులకు విడిగా వంటకాలను తయారుచేయాలి. మృతులైన తల్లిదండ్రులు, ఇతర పూర్వీకులు తిరిగి ఆ ఇంట్లోనే, తమ వారసులకే పుడతారన్న నమ్మకం, లేదా పుట్టాలన్న ఆకాంక్ష ఈ ఏర్పాటుకు కారణం. ఇదీ, పూర్వీకుల సమాధిపైనే సృష్టికార్యం జరపడమూ...రెండూ జనన, మరణాల చక్రభ్రమణాన్నే కాక; వాటికి గల దగ్గరితనాన్ని, అన్యోన్యాన్ని చెబుతాయి.

***

ఇక్కడినుంచి థామ్సన్ మాతృపారంపర్యమూ(matrilineal), మాతృస్వామ్యం(matriarchy) గురించిన చర్చలోకీ; అంతిమంగా స్త్రీ-పురుషప్రాధాన్యాలు తలకిందులైన వైనంలోకీ, వాటికి మూలమైన భౌతికపరిణామాలలోకీ వెడతాడు. చాటల్ హ్యుయక్ లో మృతులను సమాధి చేయడంలో స్త్రీ-పురుషుల మధ్య తేడా కనిపిస్తుంది. స్త్రీలను నగలు, లావా అద్దాలవంటి విలాసవస్తువులతో, సమాధిమందిరం మధ్యభాగంలో, విశాలమైన చోట సమాధి చేస్తే; పురుషులను ఒక మూల, చిన్నపాటి ప్రదేశంలో, రాతియుగపు వేట సాధనాలతో సమాధి చేయడం కనిపిస్తుంది. ఆనాడు స్త్రీకి పురుషుడికన్నా ఎక్కువ ప్రాధాన్యమున్న సంగతిని ఇది సూచిస్తుందని థామ్సన్ అంటాడు. దీనితోపాటు, చాటల్ హ్యుయక్ లోని గోడచిత్రాలు, ప్రతిమలు, ఇళ్ల నిర్మాణంలోనూ, ఇతరత్రా దగ్గరితనాన్ని చాటే పట్టణవాస్తు తల్లిపారంపర్యానికి చెందిన సమాజాన్ని రూపుకడతాయని ఆయన అంటాడు.

చాటల్ హ్యుయక్ కు దగ్గరలోనే ఉన్న హజిలర్(Hacilar) అనే, క్రీ.పూ.5400కు చెందిన గ్రామానికి వస్తే, అక్కడ అమ్మదేవతారూపాలే తప్ప చాటల్ హ్యుయక్ లో ఉన్నట్టుగా పురుషుల ప్రతిమలు కనిపించవు. దీనినిబట్టి కొత్తరాతియుగం చివరినాటికి స్త్రీ తన ఆధిపత్యాన్ని, అంటే మాతృస్వామ్యాన్ని సంపూర్ణంగా స్థాపించుకుందన్న జేమ్స్ మెలార్ట్ అభిప్రాయాన్ని థామ్సన్ వ్యతిరేకిస్తాడు. హజిలర్ ఒక వ్యవసాయగ్రామమైతే, చాటల్ హ్యుయక్ అంతకన్నా సంపన్నమైన సంకీర్ణసంస్కృతిని ప్రతిబింబించే ఒక పట్టణం కావడం ఈ తేడాకు కారణమనీ; పురుషప్రతిమలు లేవు కనుక హజిలర్ మాతృస్వామికమనీ, పురుషప్రతిమలు ఉన్నాయి కనుక చాటల్ హ్యుయక్ మాతృస్వామికం కాదనీ అనడం సరికాదని థామ్సన్ అంటాడు.

మనకు సంబంధించి ఇక్కడ గమనించాల్సిన పోలిక ఏమిటంటే, ఇప్పటికీ మన దగ్గర స్త్రీ, పురుషదేవతల విషయంలో గ్రామానికీ, పట్టణానికీ మధ్య ఇలాంటి తేడాయే కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో అమ్మదేవత ఒక్కతే ప్రధానంగా ఉంటుంది. ‘గ్రామదేవత’ అనే మాటే దానికి స్పష్టమైన సూచన.

ఆపైన మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య తేడాను థామ్సన్ వివరించిన తీరు కూడా ఆలోచనాత్మకంగా ఉంటుంది. మాతృస్వామ్యం అనేది ఆచారాలనూ, ఆనవాయితీలను, జనం ఒక సమూహంగా వాటికి బద్ధులై వ్యవహరించడాన్ని, మతపరమైన ఆధిపత్యాన్ని స్థాపించేదైతే; పితృస్వామ్యం చట్టాన్ని, లేదా ధర్మశాస్త్రాన్ని, సైనికశక్తినీ, శౌర్యసాహసాలు కలిగిన ఒక వ్యక్తి అధికారాన్ని స్థాపిస్తుందని ఆయన అంటాడు.

ఆయన ప్రకారం, చాటల్ హ్యుయక్ మాతృస్వామికవ్యవస్థకు చెందినది. అది మాతృపారంపర్యా(matrilineal)నికి చెందిన ఒక సాంస్కృతికకేంద్రం. ఎగువరాతియుగంనుంచీ వేట, ఆహారసేకరణజనాలు పెంపొందించుకుంటూవచ్చిన ఆధ్యాత్మికతనుంచి, ఆచారాలనుంచి, తంతులనుంచి రూపొందిన అమ్మమతం, చాటల్ హ్యుయక్ లో వ్యవస్థీకృతమై కనిపిస్తుంది. ఆ వ్యవస్థలో పూజారిణులు, పూజారులు కూడా భాగంగా ఉంటారు. ఒక విశ్వాసం మతంగా వ్యవస్థీకృతం కావడం, పూజారివ్యవస్థ ఏర్పడడం ఇక్కడే మొదలైందని థామ్సన్ అంటాడు.

కాకపోతే, ఈ పట్టణానికి చెందిన పాలనావ్యవస్థ పురుషుల చట్టాలపైనా, లేదా వాళ్ళు రూపొందించిన ధర్మశాస్త్రాలపైనా, వాళ్ళ రాజకీయాధికారంపైనా ఆధారపడినది కాదు; మాతృస్వామిక ఆచారాలపైనా, ఆనవాయితీలపైనా, కట్టుబాట్లపైనా ఆధారపడినది. అంటే, అప్పటికి 20వేల సంవత్సరాల వెనకటినుంచీ కొనసాగుతూవస్తున్న అమ్మమతం తాలూకు సంప్రదాయాల బలమే అక్కడి జనాలను శాంతియుతంగానూ, సంఘటితంగానూ ఉంచగలిగిందన్నమాట. ఈవిధంగా పురుషుల అనుశాసనానికీ, స్త్రీ అనుశాసనికీ మధ్య తేడాను థామ్సన్ అద్భుతంగా ఎత్తిచూపుతాడు. ఇప్పటికీ అనేక సమాజాల్లో చట్టాలూ, న్యాయస్థానాలు, పోలీస్ వ్యవస్థతో సంబంధంలేకుండా పరంపరగా వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాలే జనాన్ని నియంత్రించడం చూస్తూనే ఉంటాం.

స్త్రీ శాసనం స్థానంలో పురుషుడి శాసనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మొదలైందో ఆయన వివరిస్తాడు. క్రీ.పూ.9000-6500 సంవత్సరాల మధ్యకాలంలో స్త్రీలు ఆహారపు మొక్కల సేకరణనుంచి పెరటిసాగువైపు, అక్కడినుంచి వ్యవసాయంవైపు అడుగువేశారు. ఆ క్రమంలో తిండిగింజల నిల్వలు భారీగా పెరిగి మిగులుకు దారితీసాయి. దాంతో పురుషులకు వేటాడవలసిన అవసరం తగ్గి, వేట స్థానాన్ని వర్తకం ఆక్రమించుకుంది. వేట పాతజ్ఞాపకాలను రేపే ఒక వినోదంగా, ఒక మతపరమైన తంతుగా మారి, వర్తకం ప్రధాన ఆర్థికవ్యాపకం అయింది. చాటల్ హ్యుయక్ లో అమ్మమతం తాలూకు ఆచారాలు, సంప్రదాయాలు విధించిన శాంతియుత, సహజీవనవాతావరణం వర్తకం అభివృద్ధికి సాయపడింది. వర్తకం నగరాలు పెరగడానికి ఊతమిచ్చింది.

వేట వినోదంగా, లేదా మతపరమైన తంతుగా మారడం దగ్గర ఒకసారి ఆగుదాం. అందుకు సాక్ష్యమిచ్చే చాటల్ హ్యుయక్ లోని ఒక గోడచిత్రాన్ని థామ్సన్ ఉదహరిస్తాడు. కొంతమంది విలువైన చిరుతపులి చర్మాన్ని ధరించి, సంగీతవాద్యకారులను వెంటబెట్టుకుని వేటకు వెడుతున్నట్టు ఆ చిత్రం చూపుతుంది. ఏదైనా సంస్కృతి అంతరించే స్థితికి చేరినప్పుడు దానికి సంబంధించిన అలవాట్లను మతపరమైన తంతులుగా మార్చుకుని పునరుత్తేజం పొందడానికి మనిషి ప్రయత్నిస్తాడన్న మానవశాస్త్రవేత్త ఎ. ఎఫ్. సి. వాలెస్ (Anthony Francis Clarke Wallace)అభిప్రాయాన్ని ఈ సందర్భంలో థామ్సన్ ఉటంకిస్తాడు. విశేషమేమిటంటే, వేట ఆచారంగానూ, తంతుగానూ, వినోదంగానూ మారిన ఛాయలు మన పురాణ, ఇతిహాసకథల్లోనూ, జానపదవాఙ్మయంలోనూ కూడా కనిపిస్తాయి.

వేట ఒక్కటే కాదు, రాజులు దండయాత్రకు వెళ్ళడం కూడా తంతుగా మారడం కనిపిస్తుంది. ఒకానొక చారిత్రకఘటన, లేదా జ్ఞాపకం అనంతరకాలంలో మంత్ర, క్రియ, లేదా అభినయరూపమైన తంతుగా ఎలా పరిణమిస్తుందో డి. డి. కోశాంబి ‘ది కల్చర్ & సివిలిజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ ఔట్ లైన్’(The Culture & civilization of Ancient India in Historical Outline) అనే తన పుస్తకంలో వివరిస్తాడు.

ఎలాగంటే, పూర్వం ఆశ్వయుజమాసంలో శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి వస్తుంది. విజయదశమి అన్న పేరులోనే యుద్ధసూచన ఉంది. యుద్ధాలు వెనుకబెట్టిన తర్వాత ఆ అలవాటు కాస్తా ‘సీమోల్లంఘన’, ‘ఆయుధపూజ’ పేరిట తంతుగా మారిపోయింది. సీమోల్లంఘన అంటే రాజ్యం సరిహద్దులను దాటి యుద్ధానికి వెళ్ళినట్టు అభినయించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల దసరా పండుగ సందర్భంలో ఇప్పటికీ ఆయుధపూజ జరపడం, ‘సీమోల్లంఘన’ను అభినయించడం కనిపిస్తుందని కోశాంబీ అంటాడు.

తిరిగి చాటల్ హ్యుయక్ గురించిన థామ్సన్ వివరణకు వెడితే, పురుషులు వేట నుంచి వర్తకానికి మళ్లడం, వర్తకం నగరాల అభివృద్ధికి ఊతమివ్వడంతోనే స్త్రీ ప్రాధాన్యమూ, శాసనమూ క్షీణించి పురుషుడి ప్రాధాన్యమూ, శాసనమూ పుంజుకోవడం మొదలైంది. అంటే, అంతవరకూ ముందుండి సమాజాన్ని ఉత్తరోత్తర అభివృద్ధి దిశగా నడిపించిన స్త్రీ చివరికి ఆ అభివృద్ధికి తనే బలైంది; తను నిర్మించి శాసించిన రాజ్యంలో తనే బందీ అయింది. చరిత్రలో ఇదొక చిత్రమైన వైరుధ్యం.

మిగతా విశేషాలు తర్వాత...




Tags:    

Similar News