ఆంధ్రాని కొరుక్కు తింటున్న రాజకీయ ముక్కోణం

ఇది మూడు పోర్టుల కథ. ఒక్కొక్క పోర్టుది ఒక్కొక్క కథ. ఆ కథల వెనక దాగిన ఉన్న రాజకీయ పార్టీల రహస్య అనుబంధం మరొక కథ.

Update: 2024-12-11 05:51 GMT


-డా.బి గంగారావు


కాకినాడ సీ పోర్టు (Kakinada Seaport) , కాకినాడ సెజ్ (Kakinada SEZ) లోని వాటాలను వైసిపి పాలనలో జగన్ మోహన్ రెడ్డి అండతో బలవంతంగా లాక్కోటం, రేషన్ బియ్యం (PDS Rice) అక్రమ రవాణా, అదానీ సోలార్ విద్యుత్ ముడుపుల వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాలక పార్టీలు వివిధ పేర్లు, ఒప్పందాలు, బదిలీలు, సంక్షేమం పేర సంపదను, ప్రజల ఆస్తులను ఎలా కొల్లగొడుతున్నాయో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీల నేతలు తమ బినామీలకు, ఆప్తులకు, క్రోనీలకు ఆస్తులను ఎలా కట్ట బెడుతున్నారో, పేదల రేషన్ బియ్యాన్ని సైతం ఎలా బొక్కేస్తున్నారో ప్రజలకు తేటతెల్లం చేస్తున్నాయి.

కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ లలో ఏమి జరిగింది.డిసెంబర్ మొదటివారంలో కర్నాటి వేంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఒక ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో తనని బెదిరించి పార్టీనేతలు కొందరు అతితక్కువ ధరలకి కాకినాడ సీపోర్ట్స్ లిమిట్ (KSPL) వాటాలను లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అండతో బెదిరించి వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాం త్ రెడ్డి, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి భయపెట్టి బలవంతంగా బదలాయింపు చేసుకున్నారని వాటి యజమాని కర్నాటీ వెంకటేశ్వరావు చేసారు. కాకినాడ సీ పోర్టు లోని రూ. 2500 కోట్లు విలువ గల వాటాల కు రూ. 494 కోట్లు, కాకినాడ సెజ్ లో వున్న రూ. 1109 కోట్లు విలువ చేసే వాటాల కు కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. భయపెట్టి సంతకాలు చేపించుకొని ఆస్తులను బదలాయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ చేపట్టింది.

అదే పద్ధతిలోనే గంగవరం (Gangavaram Port), కృష్ణపట్నం (Krishnapatnam) పోర్టులను దౌర్జన్యంగా అదానీ (Adani Group) తమ వశం చేసుకున్నారు. గంగవరం పోర్టులోని ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ గ్రూపుకు విక్రయించింది. దీనిని అపుడు ప్రతిపక్ష పార్టీలు,మేధావులు వ్యతిరేకించారు. ఇదే విధంగా కృష్ణ పట్నం పోర్టు 2020 లో అదానీ పరమయింది. అపుడు అధికారంలో ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డియే. ఇలా జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా ప్రభుత్వ ప్రయివేటు ఆస్తులు , ప్రభుత్వ పెద్దల సహకారంతో అదానీ పరమయ్యాయి.

అయితే, అదానీ కొనుగోళ్ల భారీ అక్రమాల పై రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతామని కనీసం మాటకూడా మాట్లాడటం లేదు. ప్రపంచాన్ని కుదిపేసిన అదానీ సోలార్ విద్యుత్ ముడుపులపై కూడా నోరు విప్పటం లేదు. ఎందుకని?

రాష్ట్రంలో ఎలినవారు, ఏలుతున్న వారు పార్టీలుగా వేరయినా ప్రజల ఆస్తులను లూటీ చేయడంలోనూ, కార్పొరేషన్లకు, క్రోనీలకు కట్ట బెట్టటం లో వీరిమధ్య ఎలాంటి తేడా లేదు. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ ఘటనలతో పాటు గంగవరం, కృష్ణపట్నం పోర్టుల బదలాయింపు పర్వంలో పాలక పార్టీల బండారాన్ని పరిశీలిద్దాం.

అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం పరిశీలిస్తే నే ఈ అడ్డగోలు దోపిడీ కి మూలం, బలవంతపు బదలాయింపులు, ఏ పార్టీ ఏమేమి చేసింది, ప్రజల సంపదను యదేచ్ఛగా అభివృద్ధి పేర ఎలా కొల్లగొడుతున్నా రో అర్థమౌతుంది.

ముందు కాకినాడ సీ పోర్టు పరిణామాన్ని పరిశీలిద్దాం.

1997 లో రూ 350 కోట్ల తో ఈ పోర్టు ను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించింది. ఆతరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం స్థూల రాబడిలో వాటా కి పరిమిత మై ఒప్పందం చేసుకొని కారుచౌకగా 1999 లో ఈ పోర్టును కర్నాటీ వెంకటేశ్వరావు (Karnati Venkateswara Rao) కి ధారాదత్తం చేసారు. అప్పుడు ఆయన టీడీపీ కి చెందిన వ్యక్తిగా ప్రచారం జరిగింది. వాస్తవంగా అవినీతికి, ప్రజల ఆస్తుల లూటికి ఇక్కడే బీజం పడింది. ఈ పోర్టును ప్రైవేట్ చేయటాన్ని అప్పటికే ఉన్న బ్రిటీష్ కాలం నాటి యాంకరేజ్ పోర్టు కార్మికులు తీవ్ర ఉద్యమం చేపట్టారు. ప్రైవేటీకరణ చర్యలవల్ల ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో యాంక రేజ్ పోర్టు నిర్వహిస్తున్న కార్గో హ్యాండ్లింగ్ సరుకులను ప్రైవేట్ పరం చేసిన కాకినాడ సీ పోర్టు లో చేయరని ఒప్పందం చేసారు. ఆ సరుకులు మినహా కొత్త కార్గోకి మాత్రమే పరిమిత మౌతుందని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఈ హామిని అధికారంలో ఉన్న పార్టీల అండతో ఉల్లంఘించి చివరికి కేవలం బియ్యం ఎగుమతికే యాంకారేజ్ పోర్టును పరిమితం చేసి వేలాదిమంది ఉపాధిని దెబ్బతీసారు.

వైసిపి అధికారంలోకి వచ్చినతరువాత కాకినాడ సీ పోర్టును కర్నాటి వెంకటేశ్వరావు నుండి బలవంతంగా వైసిపి రాజకీయ, పెట్టుబడిదారీ ముఠా గుంచుకుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అభివృద్ది, పారిశ్రామికీ కరణ, ఉపాధి పేర కాకినాడ సెజ్ ను మరియు దీనికి అనుబంధంగా మరో ఎస్ ఇ జెడ్ పోర్టు నిర్మాణం ను తెరమీదకు తీసుకొచ్చారు. ఇందుకు 10500 ఎకరాల భూములను రైతుల నుండి బలవంత సేకరణకు తెరలేపారు. ప్రజలు ఈ భూదోపిడిని తీవ్రంగా ప్రతిఘటించారు. 2014 ఎన్నికల్లో సెజ్ కి భూములు తీసుకోమని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతపు భూసేకరణను పాల్పడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు వలె మాట ఇచ్చి రైతులను మోసం చేశారు. చివరకు జరిగిందేమిటి? కాకినాడ సెజ్ భూమి మొత్తం 10500ఎకరాలు కర్నాటీ వెంకటేశ్వరావు, జి ఎం ఆర్ కి కట్టబెట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రైతుల భూములను అప్పనంగా పంచేసుకున్నారు. ఆతరువాత వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిఎంఆర్ 51.26శాతం వాటాను అరబిందో యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో కాకినాడ ఎస్ ఇ జెడ్ పోర్టు కూడా అరబిందో పరమయింది. దీని వెనుక గూడా పెద్ద కథ నడిచినట్లు తెలుస్తున్నది.

భోగాపురం ఎయిర్ పోర్టు

విశాఖ ఎయిర్ పోర్టును మూసేసి భోగాపురం లో కొత్తగా అంతర్జాతీయ ఎయిర్ పోర్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించాలని చంద్రబాబు నాయుడు 2014 లో ముందుకు తీసుకొచ్చారు. 5040 ఎకరాల భూసేకరణకు పాల్పడ్డారు. ఆ తరువాత 2700 ఎకరాలకు పరిమితం చేసారు. రాష్ట్రప్రభుత్వానికి ఈ పోర్టు నిర్మాణం అప్పగిస్తే అత్యధిక ఆదాయ షేర్ ఇచ్చేలా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ముందుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 2017 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోర్టు టెండర్లు లో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఎఎఐ టెండర్ ను అంగీకరించకుండా చంద్రబాబు తిరస్కరించి టెండర్లు ను రద్దు చేసి ఆతరువాత 2019 లో జి ఎం ఆర్ కి కట్టబెట్టారు. దీనిని ఆనాడు వైఎస్ జగన్ మోహనరెడ్డి వ్యతిరేకించి రద్దు చేస్తామని 2019 ఎన్నికల్లో వాగ్దానం చేసారు. గెలిచిన తరువాత చేసిందేంటి?

జి ఎం ఆర్ సంస్థ కే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను కట్ట బెడుతూ 2020 జూన్ ఒప్పందం చేసారు. ఆతరువాత జి ఎం ఆర్ సంస్థ కాకినాడ సెజ్ లో ఉన్న 51 శాతం వాటాను రూ 2610 కోట్లకు అరబిందో సంస్థ కి అమ్మేసింది. ఈ సొమ్మును 2021 లో రూ 1600కోట్లు, ఆతరువాత రెండు లేదా మూడేళ్లలో మిగిలిన సొమ్ము అరబిందో సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. ఇదంతా పెద్ద గూడు పుఠాణి. భోగాపురం ఎయిర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటా క్విడ్ ప్రో కో డీల్ లా వుంది. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు కి తెలుసు. కానీ నోరు ఇప్పటంలేదు. ఎందుకంటే జి ఎం ఆర్ సంస్థ బీజేపీ కి, చంద్రబాబుకి అత్యంత సన్నిహితమైనది కాబట్టి.

ఆంధ్రా పోర్టుల్లో అదానీ పాగా

ఇక దేశంలోని ప్రైవేట్ పోర్టు ల్లో అదానీ ముంద్రా పోర్టు తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద పోర్టులు గంగవరం, కృష్ణపట్నం పోర్టులు. ఈ రెండు పోర్టులను కూడా కాకినాడ సీ పోర్టు కంటే ధారుణంగా 2021 లో కేంద్ర బీజేపీ అండతో అదానీ దౌర్జన్యంగా కబ్జా చేసారు. ఈ అడ్డగోలు దోపిడీ పై టిడిపి కూటమి ప్రభుత్వం నోరు మెదపటం లేదు. ఎందుకని? అదానీ నరేంద్ర మోడీ సన్నిహిత క్రోనీ. చంద్రబాబుకు కూడా మంచి మిత్రుడు. అందుకే అదానీ సోలార్ విద్యుత్ ముడుపుల పై కూడా స్పందించడంలేదు.

గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పీపీ పీ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం 2003 లో ముందుకు తీసుకొచ్చిన పోర్టు. వాస్తవంగా ఈ పోర్టును విశాఖ స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా సమీకృత పోర్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో నే ఒక భాగం. విశాఖ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చి నా ఆనాడు చంద్రబాబు తిరస్కరించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ కూడా గంగవరం లో శాటిలైట్ పోర్టును నిర్మిస్తానని ప్రతిపాదించి నా అంగీకరించలేదు. చివరికి దివిఎస్ రాజు కి పీపీపీ క్రింద 30 ఏళ్ల ప్రాతిపదికన గంగవరం పోర్టు ని అప్పగించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాల భూమి కేటాయించింది. ఆతరువాత టీడీపీ, బీజేపీ ఏకమై స్టీల్ ప్లాంట్ పై వత్తిడి తెచ్చి మరో 2000 ఎకరాలు 2003 లో డివిఎస్ రాజుకి కట్టబెట్టారు. అసందర్భంగా కూడా గంగవరం పోర్టు లో మాభూమికి ప్రతిఫలంగా మా భూమి లో సొంత బెర్త్ ను నిర్మించుకుంటామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రతి పాదించినా చంద్ర బాబు నాయుడు ససేమిరా అంగీకరించలేదు. పోర్టు కి భూమి ఇచ్చినందుకు పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాగా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆతరువాత దివి ఎస్ రాజు తన 89.6 శాతం వాటాలోని 31.5 శాతాన్ని అమెరికా యొక్క వార్ బర్గ్ పింకస్ అనే ఈక్విటీ ఫైనాన్స్ సంస్థకి అమ్మేశారు.

2021 లో అదానీ మొదట అమెరికా ఈక్విటీ సంస్థ యొక్క వాటాను కొనేసింది. ఆతరువాత డివిస్ రాజు ను కాకినాడ సీ పోర్ట్ యజమాని కార్నాడ వెంకటేశ్వరావు ను భయ పెట్టినట్లే అదానీ కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని రంగంలోకి దింపి ఆఘమేఘాలమీద మెడమీద కత్తి పెట్టీ 58.1 శాతాన్ని దౌర్జన్యంగా బదలాయింపు చేసుకున్నారు. 2015 నాటికే గంగవరం పోర్టు విలువ రు 13వేల కోట్లుగా లెక్కగట్టారు. కానీ 2021 లో కేవలం షేర్ ధరను ఏక పక్షంగా రూ. 120 లు గా లెక్క గట్టి రూ. 6200 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ఆ సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వ కుండా అదానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో 4.8 కోట్ల షేర్( షేర్ ధర రూ. 754 చొప్పున) లను అంటగట్టారు. ఆతరువాత జగన్మోహన్ రెడ్డిని లొంగదీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క 10.4 శాతం వాటాను ఏటువంటి బహిరంగ టెండర్లు లేకుండానే అక్రమ పద్ధతిలో రూ. 645 కోట్లకు కొనుగోలు చేసారు. దీంతో మొత్తం గంగవరం పోర్టు అదానీ పరమయింది. కనీసం ఈ దుర్మార్గ ఆక్రమణ పై ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడటం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అక్రమ బదలాయింపు పై విచారణ జరిపిస్తామని చెప్పటంలేదు.

మరో పోర్టు కృష్ణపట్నం.

ఈ పోర్టు కూడా 2003లో బిల్ట్ -ఆపరేట్ - షేర్ - ట్రాన్స్ఫర్ ( బిఓ ఎస్ టి) ప్రాతిపదికన 30 ఏళ్లు పాటు నిర్వహించుకునేలా నవయుగ గ్రూప్ సంస్థకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. గంగవరం పోర్టు లాగే ఈ పోర్టును కూడా నరేంద్ర మోడీ - అదానీ ద్వయం స్కెచ్ గీసి భయపెట్టి బలవంతంగా 2020 లో అదానీ తన పరం చేసుకున్నారు. మొదట 75 శాతం వాటాను రూ. 13000 కోట్లకు ఒప్పందం చేసుకొని ఆతరువాత 13 శాతం తగ్గించి రూ. 12000కోట్లకు పరిమితం చేసారు. 2021 లో విశ్వ సముద్ర పేర ఉన్న 25 శాతాన్ని కూడా రూ. 2800 కోట్లు చెల్లించి కృష్ణపట్నం పోర్టును పూర్తిగా అదానీ తన వశం చేసుకున్నారు.ఇప్పుడు దేశంలో పోర్టుల ద్వారా జరిగే ఎగుమతులు, దిగుమతు ల్లో 35 శాతానికి అదానీ ఎదిగాడు. ప్రభుత్వ మేజర్ పోర్టులను కూడా కబలించటానికి నేడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ దోపిడీ అంతా కేంద్ర బిజెపి అండ తో విచ్చల విడిగా అదానీ సాగిస్తున్నారు.

ఈ అడ్డగోలు దోపిడీకి మూలం గత మూడు దశాబ్దాల నుండి అమలు జరుగుచున్న ఉదారవాద విధానాలే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏపార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఈ అరాచకపు దోపిడీ పద్ధతులకు పాల్పడుతున్నది. బీజేపీ 2014 లో అధికారం లోకి వచ్చిన తరవాత ఈ దోపిడీ తీవ్రతరం అయ్యింది. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ దందా సాగిస్తున్నారు. ఈ దందా లో బీజేపీ, వైసిపి, టిడిపి ల మధ్య ఎలాంటి తేడా లేదు. వీటిది చిక్కటి ముక్కోణపు అనుబంధం. బయటికి రాజకీయ విమర్శలు ఎన్ని గుప్పించుకున్నా సంపదను కొల్ల గొట్టటంలో వీళ్లది ఒకే విధానం. భవిష్యత్తులో ఈ దోపిడీ రాష్ట్రం లో ఇంకా తీవ్రతరం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.


Tags:    

Similar News