ధర్మశాస్త్రాలు ఎందుకు పుట్టాయి, ఏం చెప్పాయి?

రామాయణంలో నిరుత్తరకాండ-23ః గ్రీకు, లాటిన్, ఇటాలియన్, హిట్టైట్ పురాణ, ఇతిహాసకథలకు మన పురాణ, ఇతిహాసకథలతో సామ్యం ఎందుకు కనిపిస్తుందో తెలుసా?

Update: 2024-09-02 07:00 GMT



మనుస్మృతితో సహా మన ధర్మశాస్త్రాలన్నీ పుట్టుక నుంచి మరణం వరకూ ఎప్పుడెప్పుడు ఎలాంటి కర్మలు చేయాలో, ఎలాంటి విధినిషేధాల పరిధిలో జీవించాలో; ఎలాంటి తప్పులకు, ఎలాంటి తారతమ్యాలను అనుసరించి శిక్షలు విధించాలో పూసగుచ్చినట్టు చెబుతాయి. వాటి నిర్దేశాలు ప్రాంత, వర్ణ, లింగభేదాలపై ఆధారపడి ఉంటాయి. జీవనానికి సంబంధించిన అన్ని రంగాలనూ, అన్ని విషయాలనూ, అన్ని కోణాలనుంచీ అవి సూక్ష్మంగా పరిశీలిస్తూ ఎక్కడికక్కడ కట్టడులు చేస్తాయి. అలా ఎందుకు చేశాయంటే, ఒక దశలో అలా చేయవలసిన అవసరం తలెత్తి ఉండాలి; సామాజికగమనం ఒక కీలకమైన మలుపు తిరగాల్సిన ప్రత్యేకపరిస్థితి అలాంటి అవసరాన్ని కల్పించి ఉండాలి...

అది ఎలాంటిదై ఉంటుంది, దానిని ఎలా గుర్తించగలం?!

సమస్య ఏమిటంటే, మన దేశం నాలుగు గోడలకూ, మన సాంప్రదాయిక అవగాహనకు మాత్రమే పరిమితమైనప్పుడు దానిని మనం గుర్తించలేం. ఇప్పుడున్న వ్యవస్థ సృష్ట్యాదినుంచీ ఇలాగే ఉందనీ, ఇది ఇంకో విధంగా ఉండే అవకాశమేలేదనే నిర్ధారణాంధత్వాన్ని ఆ పరిమితులు మనకు విధిస్తాయి. ఉదాహరణకు, ఒకప్పుడు ప్రపంచమంతటా గణవ్యవస్థే ఉండేదనీ, అది మొదట్లో మాతృస్వామికంగా ఉండేదనీ, కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడేవనీ, ఆ వ్రాతాలే జనాలుగా, మహాజనాలుగా పరిణమించాయనీ- ఇలా వీటి వెనుక ఒక పరిణామక్రమం ఉందనే సంగతిని మన దేశీయ సాంప్రదాయిక జ్ఞాన, విజ్ఞానాల పరిధిలో మనం పోల్చుకోలేం. ఎందుకంటే, అలాంటి సామాజికస్థితిని దాటుకుని భిన్నమైన కట్టుబాట్లతో వ్యవస్థను తిరిగి కొత్తగా స్థిరీకరించుకున్న దరిమిలా అది సంప్రదాయంగా ఘనీభవించింది కనుకా, అందులోనే ఇప్పుడు మనం ఉన్నాం కనుకా, వెనక్కి దృష్టి సారించవలసిన అవసరం ఇప్పుడు లేదు కనుకా!

విచిత్రం ఏమిటంటే, గణవ్యవస్థ మొదలుకొని పైన చెప్పిన సామాజికపరిణామక్రమం గురించిన అవగాహన ఇప్పుడు లోపించినా, దానిని తెలుసుకోవలసిన అవసరం ఇప్పుడు లేకపోయినా, మనకు తెలియకుండానే మన విశ్వాసాలు, ఆచారాలు, ఆనవాయితీలు, తంతులు వగైరాలతో సహా మన జీవనవిధానంలో వాటి అవశేషాలు దొర్లుతూనే ఉంటాయి. దీని గురించిన అనేక సాక్ష్యాలను ఇంతకుముందు వివిధసందర్భాలలో చెప్పుకుంటూనే వచ్చాం. వ్యవస్థ ప్రస్తుతరూపంలో స్థిరపడి సంప్రదాయంగా గడ్డకట్టడం మొదలైన దశకు ఇప్పటి మనకన్నా దగ్గరగా ఉన్న కాలంలో వెలువడిన వేద, పురాణ, ఇతిహాసాలలో పైన చెప్పిన సామాజికపరిణామక్రమం మరింత అవగాహనతో వ్యక్తమవడం సహజమే. ఉదాహరణకు భారత, రామాయణాలనే తీసుకుంటే; వ్యవస్థ స్థిరపడి సంప్రదాయంగా ఘనీభవించే క్రమం తాలూకు ఆనవాళ్ళు వాటిలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందులోనూ వాటి అనువాదాల్లో కన్నా సంస్కృతమూలాల్లో ఎక్కువ కనిపిస్తాయి. వాటి మధ్య కాలికంగా ఉన్న అంతరం అందుకు కారణం…

ఉదాహరణకు, ఒకనాటి సామాజికవ్యవస్థను తెలిపే నిర్దిష్టార్థంలో వాడిన ‘గణం’ మొదలైన మాటలు కాలక్రమంలో నిర్దిష్టార్థాన్ని కోల్పోయి ‘గుంపు’ వగైరా సామాన్యార్థాలను తెచ్చుకున్నాయి. జార్జి థామ్సన్ తన ‘స్టడీస్ ఇన్ ఏన్షియెంట్ గ్రీక్ సొసైటీ- ది ప్రీ హిస్టారిక్ ఎజియన్(Studies in Ancient Greek Society-The Prehistoric Agean)’ అనే పుస్తకంలో ఇలాంటి మార్పును ఎత్తిచూపాడు. ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే గ్రంథంలో కూడా ఈ పరిణామం గురించిన పరిశీలన కనిపిస్తుంది. అలాగే, సాంప్రదాయిక పరిష్కరణకు బయట ఉండే జానపదవాఙ్మయంలో కూడా వెనకటి సామాజికదశల గురించిన ఆనవాళ్ళు మరింత ఎక్కువగానూ, మరింత స్పష్టంగానూ కనిపిస్తాయి...

ఇక్కడినుంచి ఇంకో అడుగు ముందుకు వేసి చెప్పుకుంటే, వెనకటి సామాజికస్థితి నుంచి భిన్నమైన కట్టుబాట్లతో కూడిన కొత్త వ్యవస్థీకరణకు జరిగే ప్రయత్నాన్నీ, అలా వ్యవస్థీకరించిన రూపాన్నీ చిత్రించే క్రమంలోనే పురాణ, ఇతిహాసాలు రూపొందాయి! దీనిని ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే, ఆ వ్యవస్థీకరణకు సంబంధించిన మొత్తం వివరాలను క్రోడీకరించి దానికి ఒక శీర్షిక ఇస్తే అది, ‘మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి పరివర్తన’ అవుతుంది...

మనలో చాలామంది గమనించనిది మరొకటేమిటంటే, గణం నుంచి మహాజనానికి జరిగిన సామాజికపరిణామక్రమానికీ; దరిమిలా కొత్త కట్టుబాట్లతో జరిగిన సామాజిక పునర్వ్యవస్థీకరణకూ మన ప్రాంతమే కాక, నాగరికదశకు చేరుకున్న ప్రపంచంలోని ప్రతి ప్రాంతమూ రంగస్థలమే. ఇప్పటి భాషలో చెప్పాలంటే, సమాజపరంగా జరిగిన ‘ప్రపంచీకరణ’లలో అది ఒకటి. కొత్త వ్యవస్థీకరణకు ముందునాటి దశా, కొత్త వ్యవస్థీకరణ దిశగా జరిగిన పెనుగులాటా, ఆ వ్యవస్థీకరణ రూపురేఖలతో సహా ఆ మొత్తం అనుభవం నాగరికతాదశకు చేరిన ప్రపంచంలోని ప్రతిచోటా దాదాపు ఒకలాంటివే; ఒకలానే పురాణ, ఇతిహాస రూపాలలోని వారి వారి వాఙ్మయాలలో ప్రతిఫలించాయి…

అందుకే మెసపొటేమియా, ఈజిప్టు, గ్రీకు, భారత్ లకు చెందిన పురాణ, ఇతిహాస, జానపదవాఙ్మయాలను పక్కపక్కన పెట్టుకుని పరిశీలిస్తే ఆ ఉమ్మడి అనుభవమూ, రకరకాల ఇతరేతర సామ్యాలూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, హోమర్ ఇలియడ్, ఒడిసీలు; బాబిలోనియాకు చెందిన గిల్గమేశ్ ఇతిహాసం మొదలైన వాటిలో మాతృస్వామ్య, పితృస్వామ్యాలతో సహా సామాజికవ్యవస్థా సంబంధమైన అనేక మౌలికాంశాలు ఒకదాని కొకటి నకలుగా కనిపిస్తాయి. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టు, మోర్గన్, జార్జి థామ్సన్, జోసెఫ్ కాంబెల్, బెడ్రిక్ హ్రోజ్నీ తదితరులు గ్రీకు, లాటిన్, ఇటాలియన్, హిట్టైట్ సంబంధమైన పురాణ, ఇతిహాసకథల వెలుగులో పురాచరిత్ర, చరిత్ర, సామాజికపరిణామక్రమాలను విశ్లేషించినా అది మన పురాణ, ఇతిహాసకథలకు కూడా చాలావరకు అన్వయిస్తుంది...

ఇంకొకటి ఏమిటంటే, భారత్ తో సహా భిన్నభిన్నప్రాంతాలకు చెందిన పురాణ, ఇతిహాస, జానపదవాఙ్మయాల మధ్య కనిపించే సామ్యాలకు, ఆదానప్రదానాలకు పురాతనకాలంలో ఏదో ఒక ఉమ్మడి భాష దోహదం చేసినట్టే; ఆధునికకాలంలో ఇంగ్లీష్ ఎక్కువ దోహదకారిగా పరిణమించింది. దానికితోడు, పురాచరిత్ర, చరిత్ర, మానవశాస్త్రం, పురాతత్వశాస్త్రం, భాషాశాస్త్రం ఆధునికకాలంలో సార్వత్రికవ్యాప్తిని సంతరించుకున్న, నిర్దిష్ట శిక్షణ కలిగిన అధ్యయనాలుగా భారత్ వెలుపలే అభివృద్ధి చెందాయి. అందుకే మన పురాణ, ఇతిహాసాలను ఈ అధ్యయనాల వెలుగులో అర్థం చేసుకోవాలంటే వెలుపలి వనరులపై ఆధారపడవలసిరావడం తప్పనిసరి. వేద, పురాణ, ఇతిహాసాదులపై ఆధునికపూర్వ, ఆధునికతల నడిమికాలానికి చెందిన సాంప్రదాయికభాష్యాలపైన మాత్రమే ఆధారపడితే వాటి చారిత్రక, సామాజికనేపథ్యం మనకు పూర్తిగా బోధపడదు. ఇంకొంచెం నిర్దిష్టంగా చెప్పాలంటే క్రీస్తుపూర్వసమాజాలు జ్ఞాన, విజ్ఞానాలను ఇచ్చిపుచ్చుకోవడంలో భౌగోళికమైన ఎల్లలను ఏనాడూ పాటించలేదు; జాతీయభావన, దానితోపాటే జాతీయరాజ్యాల అవతరణతోనే జ్ఞాన, విజ్ఞానాలకు కూడా భౌగోళికమైన హద్దులు గీసుకోవడం వంటి సంకుచితధోరణులు పొటమరించాయి...

అన్ని ధర్మ శాస్త్రాల సారాంశం దాదాపు ఒక్కటే, ఎందుకు?

సంగతేమిటంటే; పైన చెప్పుకున్నట్టు, వెనకటి సామాజికస్థితి నుంచి భిన్నమైన కట్టుబాట్లతో కూడిన కొత్త వ్యవస్థీకరణకు జరిగే ప్రయత్నాన్నీ, అలా వ్యవస్థీకరించిన రూపాన్నీ చిత్రించే క్రమంలో పురాణ, ఇతిహాసాలు రూపొందినట్టే ధర్మశాస్త్రాలు కూడా రూపొందాయి. అది మన దగ్గరే కాక అనేకచోట్ల జరిగింది. మాతృస్వామ్యంనుంచి పితృస్వామ్యానికి పరివర్తనతో సహా సామాజికపరిణామక్రమం ప్రపంచమంతటా దాదాపు ఒకలాంటిదే కనుక మన ధర్మశాస్త్రాలలోనే కాక ఇతర ప్రాంతాలకు చెందిన ధర్మశాస్త్రాలలో కూడా కొద్దిపాటి తేడాలతో అదే ప్రతిఫలించింది. అలాంటి రెండు ధర్మశాస్త్రాల గురించి క్లుప్తంగా చెప్పుకుని మనుస్మృతి దగ్గరికి వెడదాం...

క్రీ.పూ.1792 నుంచి 1750 వరకు బాబిలోనియాను ఏలిన హమ్మురాబి ఒక పెద్ద చేతివేలి ఆకారంలోని శిలపై ఒక శిక్షాస్మృతిని, లేదా ధర్మశాస్త్రాన్ని చెక్కించి బాబిలన్ లోని అతి పెద్దదైన మర్దుక్ ఆలయంలో ఉంచాడు. బెడ్రిక్ హ్రోజ్నీ తన ‘ఏన్షియెంట్ హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఆసియా ఇండియా అండ్ క్రీట్(Ancient History of Western Asia, India and Crete)’ అనే పుస్తకంలో దాని గురించి రాస్తూ, తొట్టతొలి ధర్మశాస్త్రాలలో ఒకటిగానూ, ఎంతో విలువైనదిగానూ దానిని అభివర్ణిస్తాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలిక ఏమిటంటే, మనుధర్మశాస్త్రం రూపొందించాడని చెబుతున్న మనువు సూర్యుని కుమారుడైనట్టే, హమ్మురాబి తను జారీచేసిన ధర్మశాస్త్రాన్ని సూర్యదేవుడైన షామాష్ నుంచి స్వీకరిస్తాడు...

హమ్మురాబి ధర్మశాస్త్రం నాటి మానవసమాజాన్ని మూడు తరగతులుగా విభజిస్తుంది: మొదటిది, ‘అవేలుమ్(Awelum)’ అనే స్వతంత్రపౌరులతో కూడినది; రెండవది, ‘ముష్కెనుమ్(Mushkenum)’ అనే సాధారణపౌరులతో కూడినది; మూడవది, ‘వర్దుమ్(Wardum)’ అనే బానిసలతో కూడినది. రెండవదైన ‘ముష్కెనుమ్’ కు గల అర్థంలో కొంత సందిగ్ధత ఉందనీ, సెమిటిక్ భాషల్లో కూడా ఉన్న ఆ పదానికి పేదలు, లేదా యాచకులనే అర్థముందనీ హ్రోజ్నీ అంటాడు. బహుశా ఈ తరగతివారు అటు స్వతంత్రులూ కాకుండా ఇటు బానిసలూ కాకుండా మధ్యస్థానికి చెంది ఉంటారని అంటాడు. వీరిపై విధించే జరిమానా, లేదా వీరినుంచి వసూలు చేసే రుసుము స్వతంత్రపౌరులపై కన్నా తక్కువగానూ, బానిసలపై కన్నా ఎక్కువగానూ ఉంటుంది. ఉదాహరణకు, కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు స్వతంత్రపౌరులనుంచి 10 షెకెళ్ళ(Shekels)వెండిని, బానిసల నుంచి 2 షెకెళ్ల వెండిని వసూలు చేస్తే మధ్యతరగతినుంచి 5 షెకెళ్ళ వెండిని వసూలు చేయాలని ఈ ధర్మశాస్త్రం చెబుతుంది…

ఈ ధర్మశాస్త్రం నిర్దేశించిన శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఉదాహరణకు, సైన్యంలో చేరడానికి ఎవరైనా నిరాకరించినా, తన బదులు ఇంకెవరినైనా పంపినా అతనికి మరణశిక్ష అమలు చేసి; అతని ఇంటిని, అతను తనకు బదులు పంపించిన కిరాయి మనిషికి ఇవ్వాల్సి ఉంటుంది. హత్య చేశాడనో, లేదా చేతబడి చేశాడనో ఎవరిమీదైనా తప్పుడు ఆరోపణ చేసినా; దేవాలయం లేదా రాజప్రాసాదం తాలూకు ఆస్తులను దొంగిలించినా; సాక్షులూ, లిఖితపూర్వకమైన ఒప్పందమూ లేకుండా కొనుగోలు కానీ అమ్మకం కానీ చేసినా; దొంగిలించిన వస్తువుకు పరిహారం చెల్లించకపోయినా మరణశిక్ష విధించమని ఈ ధర్మశాస్త్రం చెబుతుంది. ఇళ్ళు తగలబడుతుంటే ఆ ఇళ్ళలో ఎవరైనా దొంగతనానికి పాల్పడినప్పుడు ఆ వ్యక్తిని ఆ మంటల్లోకి తోయమని కూడా చెబుతుంది...

ధర్మశాస్త్రాలు మనుషుల్ని విభజించాయా?

ఇది ప్రధానంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే సూత్రం మీద ఆధారపడిన ధర్మశాస్త్రం. మళ్ళీ ఇందులో స్వతంత్రపౌరులు, సాధారణపౌరులు, బానిసల మధ్య తేడా పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పై సూత్రం స్వతంత్రపౌరుల విషయంలో కచ్చితంగా అనుసరిస్తే, మిగతావారి విషయంలో జరిమానాతో సరిపెట్టడం జరుగుతుంది. ఇల్లు కూలిపోయి ఆ ఇంటి యజమాని మరణిస్తే, ఆ ఇల్లు కట్టినవాడికి మరణశిక్ష విధించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటి యజమాని కొడుకు మరణిస్తే, ఇల్లు కట్టినవాడి కొడుకు ప్రాణాన్ని దానికి ప్రతిగా చెల్లించమని చెప్పడం మరీ విపరీతంగా అనిపిస్తుంది...

హమ్మురాబి ధర్మశాస్త్రం పెళ్లిళ్లను క్రమబద్ధం చేసిన తీరు; ఇటీవలివరకూ మనకు ఎదురైన, బహుశా ఇప్పటికీ ఎదురవుతున్న అనుభవాలతో పోల్చి చూసినప్పుడు ఆశ్చర్యం గొలిపేంత మెరుగ్గానూ, పకడ్బందీగానూ కనిపిస్తుంది. వ్రాతపూర్వకమైన ఒప్పందం చేసుకోని ఏ వివాహమూ చెల్లదని అది చెబుతోంది. కాకపోతే, వధువు తండ్రికి వరుడు ‘తెర్హతుమ్ (terhatum)’ అనే పెళ్లికానుక పేరిట కన్యాశుల్కం చెల్లించాల్సి ఉంటుంది. వివాహసమయంలో వధువుకు పుట్టింటివారు నగానట్రా పెట్టాలి. భర్తనుంచి విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల పెంపకానికి ఆమె వాటి మీదా, పుట్టింటివారు సమకూర్చే ఇతర వనరుల మీదా ఆధారపడుతుంది. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న ఆమెకు సంతానం కలగనప్పుడు భర్త మరొక స్త్రీతో సంపర్కం పెట్టుకోవచ్చునని కూడా ఈ వివాహచట్టం చెబుతోంది. ఒక స్వతంత్రపౌరుని భార్య తన ప్రియుడి కోసం భర్తను హత్య చేసినప్పుడు ఆమెను కొరతవేసి చంపమని కూడా చెబుతోంది. కొడుకు తన తండ్రి మీద చేయి చేసుకుంటే ఆ చేతిని ఖండించమంటుంది...

ఇలాంటి శిక్షలను నాగరికతా చిహ్నాలుగా ఇప్పుడు మనం భావించలేం కానీ, మానవప్రస్థానం నాగరికతాదిశగా సాగి రాజ్యాలను అవతరింపజేసిన క్రమంలోనే ఇలాంటి ధర్మశాస్త్రాలు రూపొందిన సంగతి గమనార్హం. మన రామాయణ, మహాభారతాలు; ఇతర చోట్లకు చెందిన పురాణ, ఇతిహాసాలు కూడా ఈ దశకు చేరిన, లేదా చేరుతున్న క్రమానికి, హెచ్చుతగ్గుల తేడాతో అద్దంపడుతున్నవే. ఇందులో దండలో దారంలా మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగే పరివర్తనా కనబడుతుంది...

వచ్చేసారి హిట్టైట్లు కూర్చుకున్న ధర్మశాస్త్రం గురించి, మన మనుధర్మశాస్త్రం గురించి చూద్దాం...


Tags:    

Similar News