మనసారా నవ్వకండి, వాళ్లు భయపడిపోతున్నారు

నయా ఫాసిజం అంటే నవ్వులాట కాదు;

Update: 2025-03-29 03:30 GMT

-కొండూరి వీరయ్య

తాజాగా వివాదాస్పదమైన కునాల్‌ కామ్ర విడుదల చేసిన వీడియోను పూర్తిగా చూడటం నాకు ఇప్పుడే కుదిరింది. చూడటం పూర్తి కాగానే ఈ వ్యాసం రాస్తున్నాను.

ముప్పావుగంట నిడివిలో ఉన్న వీడియో పూర్తి అయ్యేటప్పుడు కునాల్‌ కామ్ర భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ ఇప్పటి వరకూ నేను ఇంత స్వేఛ్చగా కామేడీ షో చేయటానికి నాకు అవకాశం ఇచ్చింది రాజ్యాంగం అంటూ రాజ్యాంగ ప్రతిని ప్రదర్శిస్తారు. ప్రత్యేకించి ఆడియన్స్‌ గా వచ్చిన ఐటితరం యువతను ఉద్దేశించి ఈ రాజ్యాంగాన్ని అనుసరించండన్నది కునాల్‌ కామ్ర ఇచ్చిన మౌలిక సందేశం. గెర్నికా చిత్రాన్ని గీసిన ప్లాబో పికాసో చిత్రంలో ఓ దీపం పట్టుకున్న మహిళను చిత్రీకరించినపట్లు కునాల్‌ కామ్ర రాజ్యాంగాన్ని ఈ దేశానికి దారిదీపంగా చూపించదల్చుకున్నారా అన్న సందేహం కలుగుతంది. దాంతో పాటు భయం ఆగిపోయిన తర్వాతనే జీవితం మొదలవుతుందన్నది మరో ముగింపు వాక్యం.

మొత్తం 45 నిమిషాల నిడివి కలిగిన వీడియలో దాదాపు 20 నిమిషాలు వర్తమాన దేశీయ పరిణామాలపై వ్యాఖ్యానం ఉంటే మిగిలిన 20 నిమిషాలు అదే వర్తమానం గురించిన ప్యారడీ పాటలున్నాయి. ఈ షో చేసినందుకు ఆయన్ను రాజద్రోహం కింద అరెస్టు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కారాలు మిరియాలు నూరుతోంది. 45 నిమిషాలు వీడియో చేసిన కునాల్‌ కామ్ర మీద కేసు పెట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఏడు నిమిషాలు ధారాళంగా ప్రసంగించారు. మహారాష్ట్రలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం గురించికానీ, రైతుల ఆత్మహత్యల గురించికానీ, పెరుగుతున్న విద్వేషపు ఉపన్యాసాల గురించికానీ నోరెత్తని ముఖ్యమంత్రి కునాల్‌ చేసిన వీడియో గురించి మాత్రం నింగి నేల ఏకమైపోయినట్లు మాట్లాడుతున్నారు.

350 సీట్లు అన్న బిజెపి లక్ష్యం గురించి ఎంతో చర్చించాము కానీ 240 సీట్లు వచ్చిన తర్వాత ఏమి మాట్లాడాలో అర్థం కాకుండా ఉందన్న వాక్యంతో మొదలువుతుంది ఈ వీడియో. తర్వాత అంబానీ కొడుకు పెళ్లి చుట్టూ ఐదు నిమిషాలు చర్చ ఉంటుంది. ఆ పెళ్లికి వెళ్లటానికి ఉబలాటపడిన బాలీవుడ్‌ ప్రముఖుల గురించి కూడా జోకులున్నాయి. భారతదేశంలో జ్యోతిష్యం గురించి తప్ప శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాల గురించిన చర్చ లేకపోవడాన్ని, చైనా సాంకేతిక రంగంలో ముందంజలో ఉండి డీప్‌ సీక్‌ క్రృతిమేధ సాధనాన్ని రూపొందించిన వైనాన్ని, దాని ఫలితంగా అంతర్జాతీయ టెక్‌ మొఘల్స్‌ కంపెనీలు వేల కోట్ల రూపాయల విలువైన స్టాక్‌మార్కెట్‌ సంపద కోల్పోయిన వైనాన్నీ కామ్ర చర్చకు పెడతారు. దేశం సాంకేతిక అభివృద్ధిలో పురోగమించకపోవడానికి ప్రతిపక్షాలు కారణమన్న వాదనలలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతారు. ప్రజలు స్పందించకపోవటం వల్ల నేడు పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తారు కునాల్‌ కామ్ర. దేశంలో ఇంత మంది ఇంజనీర్లు ఉన్నారు కానీ ఆవిష్కరణలేమీ చేయలేకపోయారన్న విమర్శ భారత విద్యావ్యవస్థ వైఫల్యాలను ఎత్తిచూపుతుంది.

దేశంలో 1970 దశకమే బాగుందని, ఎక్కడకు పోవాలన్నా టోల్‌ టాక్స్‌ ఉండేది కాదనీ, ఏ రైల్వే స్టేషన్‌లో దిగినా టీ అమ్ముకుని బతికేవాళ్లు కనపడేవారనీ, ఆ టీ తాగలేక వాళ్ల భార్యలు కూడా వదిలేశారన్న వాక్యం చెప్పిన తర్వాత ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు కోపం రాదు, కోపం తెచ్చుకున్న వాళ్లు కేసు వేయలేంటారు కామ్ర. పరోక్షంగా అర్థం చేసుకోలేని వాళ్లకే కోపం వస్తుందన్నది ఆయన సారాంశం. వేల కోట్ల రూపాయల యజమాని అయి ఉండి కూడా సాధారన జీవితం గడుపుతున్నానని పుస్తకాలు రాస్తున్న సుధామూర్తి గురించి వ్యాఖ్యానిస్తూ సుధామూర్తి వల్లనే ఇన్ఫొసిస్‌ నారాయణమేర్తి వారానికి డెబ్బై గంటలు పని చేయాలన్న సూత్రాన్ని ఎందుకు ముందుకు తెచ్చారో అర్థమవుతుందంటారు కామ్ర.

ఏ విషయాన్నైనా ముస్లిం వ్యతిరేక కోణం నుండి చూసే మానసికత దేశాన్ని పట్టిపీడిస్తుందంటారు కామ్ర. ప్రపంచమంతా కోవిడ్‌ మహమ్మారి తో కునారిల్లుతుంటే దేశంలో పళ్లాలు మోగించి కోవిడ్‌ ను పారదోలాలన్న ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావిస్తారు. ఈ పిచ్చిపనికి పక్షులు కూడా బెదిరిపోయిన వైనాన్ని లౌక్యంతో ప్రస్తావిస్తారు. దేశంలో అత్యున్నత నికార్సయిన హిందువు మోడీయే అంటారు. ప్రభుత్వ నిర్ణయాల్లో హేతురాహిత్యాన్ని ఎత్తిచూపించే జోకులు కొన్ని చెప్తారు. మతం పేరుతో సాగుతున్న మోసాల గురించి కూడా ప్రస్తావిస్తారు. నా మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తారు.

చివరి 15 నిమిషాల్లో ఒక పారడీ పాట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐలు పార్టీలు ఫిరాయించేందుకు రాజకీయనాయకులను ప్రోత్సహిస్తున్న తీరు గురించి ఉంటుంది. ప్రత్యేకించి మహారాష్ట్రలో శివసేన శివసేన నుండి బయటికి రావటం, ఎన్సీపీ ఎన్సీపీ నుండి బయటకు రావటం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ వీటన్నిటి వెనక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పాత్ర గురించి చర్చ పెడ్తారు. రాజకీయ నాయకుల హృదయపరివర్తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రోత్సాహం గురించి చర్చిస్తారు. రెండో పాట దేశంలో జరుగుతున్న దోపిడీ గురించి ప్రస్తావిస్తారు. మధ్యతరతి వేతన జీవుల ఆదాయపు పన్ను ఇక్కట్లు గురించి మరో పారడీ పాట ప్రేక్షకుల ముందుంచుతారు. వికసిత్‌ భారత్‌ నినాదంతో జరుగుతున్న మోసాలను ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులు నిరంతరం పాడే హం హోంగే కాం యాబ్‌ కు పారడీ పాట వినిపిస్తారు. ప్రజాస్వామ్యం పై సాగుతున్న అకృత్యాలను ప్రస్తావిస్తూ గుజరాత్‌ నరమేధం మొదలు నల్లధనం, హిందూత్వ రాజకీయాల గురించి ప్యారడీ పాట వినిపిస్తారు. జర్మనీ ప్రధాని మెలోని తో సన్నిహితంగా మెలుగుతున్న మోడీ గురించి తానాషా పాట పాడతారు.

ఈ కారణంగానే కామ్రపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలన్న డిమాండ్‌తో పాటు ఆయన కామెడీషోలు రద్దు చేయాలని, అనుమతివ్వరాదన్న డిమాండ్లు ముందుకు వస్తున్నాయి.

ఇక్కడ ఓవిషయాన్ని గుర్తు చేసుకోవాలి. రెండు వారాల క్రితం లెక్స్‌ ఫ్రీడ్‌మన్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విమర్శ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు వంటిదని నమ్ముతున్నట్లు తెలిపారు. విమర్శకుల పట్ల తాను కఠినంగా వ్యవహరించబోనన్నది దాని సారాంశం. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా బిజెపి అగ్రనేతల జాబితలో చేరిన ఫడ్నవిస్‌కు మాత్రం విమర్శలను ఎలా స్వీకరించాలన్న ప్రధాని హితబోధ చేరినట్లు లేదు. 2016లో కూడా నెట్‌వర్క్‌ 18కు ఇచ్చిన ముఖా ముఖి ఇంటర్వ్యూలో కఠిన విమర్శకులు ఉంటేనే పాలకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటారని చెప్పారు. కానీ గుజరాత్‌లో 2002లో ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు గురించి వచ్చిన విమర్శలకు మాత్రం సమాధానమివ్వకుండా దాటవేస్తారు. ఆచరణలో మాత్రం మీడియా గొంతు నొక్కడానికి మోడీ ప్రభుత్వం చేయని పని లేదు. ఉపయోగించని ప్రభుత్వ విభాగం లేదు.

ఇక్కడే నయా ఫాసిస్టు ధోరణులకు సంబంధించిన చర్చ ముందుకొస్తుంది. దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నయా ఫాసిస్టు లక్షణాలున్న ప్రభుత్వమా, లేక ఫాసిస్టు లక్షణాలున్న ప్రభుత్వమా అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వానికి ఉన్న లక్షణాలు ఫాసిజానికి సాంప్రదాయక నిర్వచనం పరిధిలో ఇముడుతాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే సృజనాత్మకతను చంపేయటంలో ఫాసిస్టు శక్తులు, నయా ఫాసిస్టు శక్తులూ ఒక రకంగా వ్యవహరిస్తాయన్నది చరిత్ర పదేపదే రుజువు చేసిన అంశం. ప్రభుత్వ వైఫల్యాల గురించి చట్టసభల్లో చర్చలుండవు. మీడియాలో చర్చలుండవు. ఎవరైనా ఈ చర్చలు చేయటానికి ప్రయత్నం చేస్తే వారిపై దేశద్రోహం ముద్ర వేసి నోరు మూయించే పని చేయటం కన్నా కొట్టొచచ్చినట్లు కనిపించే నయా ఫాసిస్టు లక్షణం ఏముంటుంది?

సైద్ధాంతిక బిరుసుతనం, ప్రచారం, తీవ్రమైన అణచివేతల సమాహారమే ఫాసిస్టు శక్తుల వ్యవహార శైలి. ఫాసిస్టు శక్తులు తమపై వచ్చే సైద్ధాంతిక విమర్శలను ఎదుర్కోలేనప్పుడు విమర్శకులు దేశద్రోహులన్న చర్చ ముందుకు తేవడం ద్వారా వారు చేసే విమర్శల గురించి ప్రజలు ఆలోచించే వారి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తాయి. గత పదేళ్లల్లో ప్రతిపక్షనేతలు, మీడియా, స్టాండప్‌ కమేడియన్లు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల విషయంలో దేశద్రోహం గురించిన చర్చ ఎన్నిసార్లు వచ్చింది, ఎంతమందిపై కేసులు బనాయించబడ్డాయో ఈ కోణంలో అర్థం చేసుకోవాలి. సెన్సార్‌షిప్‌ విమర్శకుల నోళ్లు మూయించటానికి ఫాసిస్టు శక్తులు వాడే చట్టబద్ధమైన ఆయుధం. దాంతో పాటు విమర్శకులపై తప్పుడు కేసులు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నదే.

గత పదేళ్లల్లో ఎంతమంది మీద ఇలాంటి తప్పుడు కేసులు నమోదయ్యాయి, ప్రత్యేకించి మీడియాలో క్రియాశీలకంగా ఉండేవారిపై నమోదైన కేసులు ఈకోవలోకి వస్తాయి. మోడీ ప్రభుత్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నయానో భయానో లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలం అయితే హింసాత్మక చర్యల ద్వారా లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఫాసిస్టు నియంత్రణ లక్షణాలు, పద్ధతుల్లో ఒకటి. పుస్తకాలషాపుల మీద దాడులు మొదలు పుస్తకాల అమ్మకం నిషేధం, సమావేశ మందిరాల విధ్వంసం వరకూ మనం రోజు వింటున్న వార్తలే. ఈ నేపథ్యంలో కునాల్‌ కామ్రపై జరుగుతున్న దాడులు, వెల్లువెత్తుతున్న విమర్శలు, బెదిరింపులు వంటివాటిని అర్థం చేసుకోవాలి. నయాఫాసిజంలో మనసు విప్పి నవ్వుకోవటం కూడా నేరమే అవుతుంది.

Tags:    

Similar News