చాన్నాళ్ల తర్వాత మళ్లీ హిందీ చీనీ భాయీ భాయీ

భారత్ చైనాల మధ్య మళ్ళీ చిగురిస్తున్న సయోధ్య

Update: 2024-10-26 06:28 GMT


ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) ల మధ్య ఐదేళ్ల తర్వాత 23-10 -2024 న అధికారిక ద్వైపాక్షిక సమావేశం జరిగింది. రష్యా ఆతిథ్యంలో కజాన్ పట్టణంలో జరుగుతున్న 16 వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నాయకులు విడిగా కలుసుకున్నారు. గత ఐదేళ్లలో మోదీ-జిన్‌పింగ్ లు అధికార పూర్వకంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. దాదాపు 45 నిమిషాలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి 2000 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వద్ద కొద్దిరోజుల ముందు ఇరుదేశాల మధ్య ఒక కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందాన్ని స్వాగతించిన వారు ‘‘ప్రపంచ శాంతికి భారత, చైనాల మధ్య సయోధ్య చాలా కీలకం’’ అని పేర్కొన్నారు.

2019 అక్టోబర్ లో మోడీ, జిన్పింగ్ ల మధ్య మహాబలిపురం [చెన్నై] లో ఒక అనధికార శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇద్దరు నాయకులు చాలా సుహృద్భావ వైఖరితో ఇరు దేశాల సంబంధాలపైన చర్చించారు. అప్పుడు కూడా మీడియా మాత్రం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వివాదాస్పద కశ్మీర్ లో భారత్ తీసుకున్న చర్యల అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్ కు బీజింగ్ మద్దతు పలికిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి. 2022లో ఇండోనేషియాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు, 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ, జిన్ పింగ్ కలుసుకున్నారు, కొద్దిసేపు సంభాషించుకున్నారు. అప్పుడు సంయుక్త ప్రకటనలు లేవు. అవి కేవలం మర్యాద పూర్వకమైన, కుశల ప్రశ్నల స్వల్పకాలిక సమావేశాలని ప్రభుత్వమూ, మీడియా నివేదించాయి. ఆ సమావేశాల ప్రాధాన్యతను చాలా తగ్గించి చూపెట్టారు.

ఈసారి మాత్రం అధికారిక సమావేశం. "మా రెండు దేశాల ప్రజలూ, అంతర్జాతీయ సమాజమూ మా సమావేశం పై చాలా శ్రద్ధ కనబరుస్తున్నాయి" అని జిన్ పింగ్ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. భారతదేశం- చైనా రెండూ "పురాతన నాగరికతలు, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. గ్లోబల్ సౌత్ యొక్క ముఖ్యమైన సభ్యులు" అని ఆయన గుర్తు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను “చారిత్రికంగా సరైన దిశలో" తీసుకు వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇరువురు నాయకులు ఈమధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సైనిక ప్రతిష్టంభన పరిష్కారానికి కుదిరిన ఒప్పందాన్ని స్వాగతించారు. సరిహద్దులో శాంతి, సుస్థిరతలను కాపాడటం ఇరు పక్షాలకు ప్రాధాన్యాంశంగా ఉండాలని వారు అన్నారు.మీడియా మాత్రం 2020 ఏప్రిల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎల్ఏసీ వెంబడి బలగాలను సమీకరించి సరిహద్దును అతిక్రమించడంతో ప్రతిష్టంభన మొదలైందనే వివరాల జోలికి వెళ్లలేదని తప్పు పడుతున్నది. వాస్తవానికి మోదీ బుధవారం (23-అక్టోబర్ ) తన ప్రారంభ ప్రసంగంలో చైనా బలగాలు సరిహద్దులను అతిక్రమించడం వల్లనే భారత సైన్యం ఎదురుదాడికి దిగిందని జిన్పింగ్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. భారత్ -చైనా ల మధ్య సామరస్యం కల్పించే ఏ చిన్న ప్రయత్నం జరిగినా దానికి వ్యతిరేకంగా ప్రజల మనస్సుల్లో ఏవో సంకోచాలు నాటడం, చైనా పట్ల వైషమ్యం తగ్గకుండా చూడటం మన దేశంలో కొందరికి పరిపాటిగా మారిపోయింది.

భారత్-చైనా బంధం మన ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి కూడా చాలా ముఖ్యమైనదని తాము విశ్వసిస్తున్నామని మోడీ కూడా అన్నారు. 'సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతను కాపాడటం మా ప్రాధాన్యాంశంగా ఉండాలి. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం మన సంబంధాలకు పునాదిగా ఉండాలని ఆయన అన్నారు. సరిహద్దు పరిస్థితులతో పాటు చాలా అంశాలపై-- నిలిపివేసిన ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి , పునర్నిర్మించడానికి విదేశాంగ మంత్రులు ఇతర అధికారుల మధ్య చర్చల యంత్రాంగాలను తిరిగి ప్రారంభించాలని నాయకులు నిర్ణయించారని ఈ సమావేశం తర్వాత మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ పొలిట్బ్యూరో సభ్యుడు వాంగ్ యీలు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే పెద్ద సమస్యను ముందుకు తీసుకెళ్లడానికి "త్వరగా" సమావేశం కానున్నారు. రెండు దేశాలు ఒకరినొకరు అభివృద్ధికి అవకాశంగా భావించడం చాలా ముఖ్యమని, ఒకరికొకరు ముప్పు కలిగించవద్దని, పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్ పింగ్ చెప్పినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

సరిహద్దుల వద్ద సైన్యం పహారా, గస్తీ ఏర్పాట్లు, ఇతర పెండింగ్ సమస్యల పై చైనాతో ఒక ఒప్పండం కుదిరినట్లు 21-10-24 న మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు.2022 లో బలగాల ఉపసంహరణ ప్రక్రియపై ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత, డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భారత, చైనా అధికారులు నిరంతరం నిమగ్నమయ్యే వున్నారని కూడా మిస్రీ చెప్పారు. 2020 గల్వాన్ సంఘటనకు ముందు ఉన్నట్లుగా భారత్, చైనాలు గస్తీ నిర్వహణ పునరుద్దరించ బడింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 2020 పూర్వపు స్థితికి చైనా దళాలను తరలించాలన్న డిమాండ్ ను విరమించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే దళాల కదలికలు పరిశీలించేందుకు ఈ ప్రాంతంలో భారతీయులు గస్తీ నిర్వహించడానికి చైనా అనుకూలంగా స్పందించింది. ఇలా ఇరువురికీ ఉపయోగకరమైన ఒక ఒప్పందానికి వచ్చారు. “ఇకపై తీసుకునే చర్యలలో, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక యంత్రాంగాలను క్రియాశీలం చేస్తామని” మిస్రీ, చెప్పారు. ఈ ఒప్పందం "ఖచ్చితంగా ఎల్ఎసి వెంబడి పరిస్థితిని సడలించడానికి దారి తీస్తుంది" అని పేర్కొన్నారు.

భారత్ - చైనా సైనికులు ఇప్పుడు సరిహద్దు వద్ద మరొక "గడ్డకట్టే" శీతాకాలాన్ని గడపాల్సిన అవసరం ఉండదా అనే ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తూ "నేను ఈ ప్రశ్నను సైనిక నాయకత్వానికి వదిలి వేస్తాను ఎందుకంటే ఇది కార్యాచరణ విషయాలకు సంబంధించినది. ఈ నిర్దిష్ట సమస్యపై మన సైనిక నాయకులె నిర్ణయించడానికి అనుమతించడం మంచిదని నేను భావిస్తున్నాను" అని మన విదేశాంగ కార్యదర్శి అన్నారు. “ఇది సైన్యం ఉపసంహరణకు దారితీస్తుంది, చివరికి 2020 లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది' అని మాత్రం ఆయన చెప్పారు.

చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించ డం తో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద సమస్య పరిష్కారం లో కొంత పురోగతి వచ్చిందనటం సబబు కానీ అధికార పక్షం తాము ఓపికగా ప్రయత్నించడం వల్ల చైనా వెనుకకు పోయిందనే రీతిలో ప్రచారం చేస్తున్నది. దీన్నిమోడీ అనుసరిస్తున్న విదేశీ విధానానికి విజయంగా వర్ణిస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష నాయకులు “ సరిహద్దు పై సయోధ్య సాధ్యమేనా అని ప్రశ్నిస్తు న్నారు. ఈ ఒప్పందానికి ఆచరణలో చైనా కట్టుబడి వుండదని, కనుక మన ప్రభుత్వం ఈ ఒప్పందం పై అత్యంత జాగురూకత తో వుండాలని రక్షణరంగ నిపుణులు చెబుతున్నట్లుగా కాంగ్రెస్ ఉదహరిస్తున్నది. “ఉభయ దేశాల మధ్య తీవ్రస్థాయిలో వున్న వివాదాస్పద అంశాలకు పరిష్కారం లభించిందని లేక లభించగలదని విశ్వసించడం చాలా కష్టం అని పెదవి విరుస్తున్నది. రెండు దేశాల మధ్య సంబంధాలలో పరస్పర అపనమ్మకం ఒక అంతర్వాహినిగా వుందని చెబుతూ చైనా పట్ల వ్యతిరేకత తగ్గకుండా పాట్లు పడుతున్నది. ఈ ఒప్పందం పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, దశాబ్దాల్లో భారత్ విదేశాంగ విధానానికి కు ఎదురైన అత్యంత దారుణమైన ఎదురుదెబ్బను ఇది గౌరవప్రదంగా పరిష్కరిస్తున్నదా? బలగాల ఉపసంహరణ 2020 మార్చిలో ఉన్న యథాతథ స్థితిని పునరుద్ధరిస్తున్నదా” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ ప్రశ్నించారు.

ఇన్ని రోజులు సమస్య పరిష్కారానికి అడ్డంకిగా వున్న భారత్ ప్రభుత్వ  వైఖరిని నిరసించకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ  వైఖరినే ప్రదర్శిస్తూ ఈ ఒప్పందంతో భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగిందనే న్యూనతా భావాన్ని ధ్వనింప జేస్తున్నారు. ఇది ప్రజల దృష్టిలో అధికార పక్షాన్ని పలుచన చేయ్యలనే రాజకీయ యుక్తి తప్ప పరిష్కారానికి తోడ్పడే వైఖరి కాదు. 1993 నాటి బోర్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్, 2013 బోర్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ వంటి ఒప్పందాలను గత కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుకుందని మరిచిపోయి వారు మాట్లాడుతున్నారు.

బిజెపి ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లుగా, చైనా పట్ల పిరికితనం తో వ్యవహరిస్తున్నట్లుగా మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇవి చైనా పట్ల గుడ్డి వ్యతిరేకతతో, సరిహద్దుల వద్ద వైషమ్యాలు కొనసాగాలని కోరుకునే వారు మాత్రమే చేయగల వ్యాఖ్యానాలు. తన అంతర్జాతీయ ప్రతిష్ఠ కోసం మోడీ చైనాకు లొంగిపోతూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న చైనా వ్యతిరేక వైఖరివల్ల మన దేశమే నష్ట పోతున్నది. జి-20, గ్లోబల్ సౌత్ వంటి చోట్ల ఒంటరిగా మిగిలిపోతున్నది. ఆసియా ప సిఫిక్ ప్రాంతంలో, మన పొరుగు దేశాల మధ్య తన ప్రభావం రోజు రోజుకు సన్నగిల్లుతోంది. ఈ స్థితిలో చైనాతో స్నేహ సంబంధాలు కలిగి వుండటం శ్రేయోదాయకం.

చైనా, భారతదేశాల మధ్య సమస్యల పరిష్కారం ఈ రెండు పొరుగు దేశాల మధ్య ఆర్థిక , వాణిజ్య సహకారాన్ని పెంచే అవకాశం గురించి వివిధ భారతీయ మీడియా సంస్థలలో నేడుచర్చ జరుగుతోంది. "మెరుగైన రాజకీయ, వాణిజ్య సంబంధాలకు" మార్గం సుగమం చేసే అవకాశం ఉందని పెక్కుమంది భావిస్తున్నారు.చైనాకు ప్రత్యక్ష ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించడానికి, టెలికాం, హార్డ్వేర్, ఫార్మాస్యూటికల్స్ కోసం ముడి పదార్థాలతో కూడిన వాణిజ్యం పెరగడానికి దారి తీస్తుందని ఇండియా టుడే పత్రిక ఒక నివేదికలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వున్నదని భారత వార్తా సంస్థ పిటిఐ మేలో నివేదించింది. ద్వైపాక్షిక వాణిజ్యం 118.4 బిలియన్ డాలర్లుగా ఉంది .చైనాకు భారతదేశ ఎగుమతులు సంవత్సరానికి 8.7% పెరిగాయి. అమెరికా 'డీకప్లింగ్' వ్యూహం నేపథ్యంలో చైనా, భారత్ ల మధ్య బలమైన సహకారం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమెరికా "డీకప్లింగ్" వ్యూహం, సాంకేతిక ఆంక్షల నుండి వచ్చిన ఒత్తిళ్లు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి. ఈ ప్రాంతంలోని ప్రధాన శక్తులుగా, చైనా, భారతదేశం ఈ సవాళ్ల నుండి తీరం చేరటానికి, మరింత మెరుగైన సహకారం యొక్క పరస్పర అవసరాన్ని గుర్తించి తమ విధానాలను మలుచుకోవాలి.

సరిహద్దుపై విభేదాలను పరిష్కరించడానికి, శాంతి సామరస్యాలు నెలకొనడానికి అనుసరించే విధానాలను అందరూ బలపరచాలి. ఇరు దేశాల నడుమ ఏడు దశాబ్దాలుగా ఘర్షణల కు, వైషమ్యాలకు కారణమవుతున్న వైఖరులను విడనాడి నేటి ప్రపంచ పరిస్థితుల కనుగుణంగా కొత్త ఆలోచనలతో ఇరువురికీ అంగీకారమైన పద్దతిలో చిక్కుముడిగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకోవాలి. తద్వారా ప్రాంతీయ ఆర్థిక విషయాలలోనూ, అంతర్జాతీయ వ్యవహారాలలోను తమ ప్రభావాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం వారి ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే ప్రాంతీయ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలదు. అందుకు ఇరు దేశాలు అన్ని రంగాలలో సయోధ్య సహకారాలను పెంపొందించుకోవాలి. దానికి మోడీ- జీన్ పింగ్ ల సమావేశం మార్గదర్శకం అవుతుందని ఆశిద్దాము.



Tags:    

Similar News