తెలంగాణ మంత్రివర్గ విస్త’రణమే’నా …అధిష్టానానికి తలనొప్పిగా నేతలు
అదిగో, ఇదిగో మంత్రివర్గ విస్తరణ, ముహూర్తం ఖరారు, లిస్ట్ రెడీ.. అంటూ ఢిల్లీకి పరుగులు పెట్టిన నేతలు మళ్లీ కామ్ అయిపోయారు.;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఇతర సీనియర్లు కుస్తీపట్టి మరీ తయారు చేసిన జాబితాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆమోదం పొందలేదని తిప్పి పంపారని వార్తలు కోడైకూశాయి. అధిష్టానానికి నచ్చని ఆ పేర్లు జాబితాలో ఎవరివి వున్నాయి. ఆ పేర్లను తొలగించే పని అంత త్వరగా ఎందుకు కావడం లేదు. ఎన్నో ప్రశ్నలు, సీనియర్ల అలకల మధ్య మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఇక లేనట్లేనా అన్న అనుమానం కల్గుతోంది. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతుండటంతో ఈ నెలాఖరు వరకూ విస్తరణకు బ్రేక్ పడినట్లే... ఆ తరువాత ఇంకెన్నేళ్ళు సాగుతుందో చెప్పలేని పరిస్థితి..
మంత్రివర్గ విస్తరణ మాటేమోగాని జిల్లాల వారీగా కాంగ్రెస్ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ప్రతిచోటా రెండు వర్గాలుగా సీనియర్లు విడిపోయి, ఎవరికి వారు వ్యవహరించడం టీపీసీసీ కీ , అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో వీరికి చోటు అన్న పేర్లు బైటకు రావడంతోనే ,నల్గొండ, మంచిర్యాల జిల్లాలలో కాంగ్రెస్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. అంతర్గత మీడియా ముందుకొచ్చాయి. నాకు మంత్రిపదవి ఇస్తానంటే , నీకెందుకు అసూయ అంటూ నేతలు బజారున పడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన జిల్లాకే చెందిన సీనియర్ నేత జానారెడ్డి ని టార్గెట్ చేసుకొని తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి.తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని... జానారెడ్డివంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమంలోనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలు షాకయ్యారు.
తన విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారని, ధర్మరాజులాగా ఉండాల్సిన జానా రెడ్డి కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తుండటం తనకెంతో బాధ అనిపిస్తోందన్నారు.
తాను వెయ్యి మందిని కాపాడే వ్యక్తినని, తన లాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే అడ్డం తగులుతున్నారంటే ఏం చెప్పాలో అర్థం అయితలేదు, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పాలనుకుంది చెప్పాను అంటూ జానా గీనా జాన్తా నై అనేరీతిలో ఘాటుగా స్పందించారు.
తనను చూసి భయపడుతున్నారని, అధిష్టానం పదవి ఇస్తామని అనుకుంటోందని, 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
పార్లమెంటు ఎన్నికల్లో మంత్రులు ఇంఛార్జులుగా వున్న సీట్లను కాంగ్రెస్ కోల్పోయిందని, ఎమ్మెల్యే గా తాను ఇంఛార్జ్ గా వున్న భువనగిరి లో గెలిచి చూపించామన్నారు.
కెపాసిటీ, మంచిపేరు లేకుంటే భువనగిరి స్థానానికి ఇంఛార్జ్‌గా ఎందుకు పెడతారు?. నన్ను ఇంఛార్జ్‌గా పెట్టినందుకు ఇక్కడి నుంచి గెలిపించామా? లేదా? అంటూ చెప్పుకొచ్చారు.నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే నిజాయితీగా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకే పదవులు ఇవ్వాలన్నారు. పైరవీకారులను పక్కనపెట్టాలని సూచించారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాకుండా బాధ్యతగా భావిస్తానని తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోంది.రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండడు అంటూ పార్టీకి ఝలక్ ఇచ్చారు.
అటు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో విభేధాలు రచ్చకెక్కాయి.సొంత పార్టీ ఎమ్మెల్యే వివేక్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.వివేక్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, ప్రతిపక్ష పార్టీకి వ్యవహరిస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభలో డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి పదవి విషయంలోనూ మాట్లాడుతూ అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు నేడు మంత్రి కావాలని చూస్తున్నారని వివేక్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరోక్షంగా కామెంట్ చేశారు.ప్రేమ్ సాగర్ రావు పరోక్ష వ్యాఖ్యలకు వివేక్ కౌంటర్ ఇచ్చారు.గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరానని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే గెలిచి సత్తా చాటామని గుర్తు చేశారు. మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడు ఎవర్ని ఆడగలేదని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు.
అసలు జానా లేఖ ఏంటి?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని, విస్తరణలో ఆ జిల్లాలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం కాక రేపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి రాకూడదనే ఉద్దేశ్యంతోనే జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నేరుగా జానా రెడ్డి ని టార్గెట్ చేయడంతో రాజకీయం మరింత ముదిరింది..ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి తనకు ప్రాతినిధ్యం కోరుతున్న మల్ రెడ్డి రంగారెడ్డి తొలినుంచీ అధిష్టానం పై వత్తిడి తెస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు.
మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కకుంటే రాజీనామా కు సిద్దమని మల్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం కొన్ని రోజలుగా రాష్ట్రంలో చర్చలకు దారితీస్తోంది. సామాజిక వర్గాల పరంగా మంత్రిపదవుల భర్తీ జరగాలన్న డిమాండ్ అన్ని సామాజిక వర్గాల నుంచి పెరుగుతోంది. ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినా అది ఆచరణకు నోచుకోలేదు.తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏమి జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్లేనా అన్న అనుమానం పెరుగుతోంది.
పెండింగ్ లో పెట్టిన రాహుల్?
రేవంత్ మంత్రివర్గంలో 12 మంది వున్నారు. ఇంకో ఆరుగురు మంత్రులకు అవకాశం వుంది. దానితోపాటు డిప్యూటీ స్పీకర్ , చీఫ్ విప్ పదవులు భర్తీ చేయాల్సి వుంది. అయితే మంత్రిపదవులు ఆశించే వారి సంఖ్య మాత్రం చాంతాడంత వుంది. సామాజిక వర్గాల వారీగా sc,st,bc ,మైనారిటీ లకు ఖచ్చితంగా చోటు దక్కేలా వుండాలని అధిష్టానం ఆలోచిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పేర్లు ఖాయమంటూ జాబితా లీకైంది.
వీరితో పాటు సుదర్శన్ రెడ్డి,వాకిలి శ్రీహరి, ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ అమెర్ అలీఖాన్ ఇలా కొన్ని పేర్లతో రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన జాబితా రిజెక్ట్ అయ్యింది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు ఇప్పటికే మంత్రిగా వున్నారు కదా.. మళ్లీ తమ్ముడికా అంటూ రాహుల్ ప్రధానంగా అడిగారన్నది సమాచారం. మరికొన్ని పేర్ల పైనా రాహుల్ అసంతృప్తి, దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పార్టీలోకి వారిని ఆహ్వానించినప్పుడు మంత్రిపదవి హామీ ఇచ్చామని, ముఖ్యమంత్రి రేవంత్ కొందరి విషయంలో పట్టుదలగా వుండటం కూడా మంత్రివర్గ విస్తరణ వాయిదా కు కారణమవుతోంది.మరోవైపు మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. బీసీ సంఘాల నుంచి తమ వాటా పెరగాలన్న డిమాండ్ వస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం తో ఆశావహులంతా తీవ్ర నిరాశతో వున్నారు. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరు ఎదురుతిరుగుతారో అని ఇప్పటికే ఆలోచనలో వున్న కాంగ్రెస్ అధిష్టానానికి తాజా పరిణామాలు మరింత గందరగోళానికి దారితీసింది.
లేవనెత్తుతుందో అంటూ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారు.