చైనా-భారత్ మధ్య మైత్రి సాధ్యమేనా ?
చైనా, భారత్ లు ప్రత్యర్థులు కాదు భాగస్వాములు;
భారత దేశంలోని చైనా రాయబారి జు ఫీహోంగ్(Xu Feihong) 10 మే 2024 లో ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాకకు పూర్వం దాదాపు 18 నెలలు ఆ పదవి ఖాళీగా వున్నదంటే భారత- చైనా దౌత్య సంబంధాలు ఎంత తక్కువ స్థాయిలో వున్నాయో అర్థమవుతుంది. ఆయన మార్చి 19, 2025 న, ఒక ఇంగ్లీష్ పత్రికలో "భారతదేశం-చైనాలు డ్రాగన్-ఏనుగుల బలమైన నృత్య బంధాన్ని సాధించగలవు " అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. అలాగే 19 ఏప్రిల్ 2025న ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
చైనా భారతదేశాల సంబంధాల గురించి, అమెరికా విధిస్తున్నపరస్పర సుంకాల గురించి , మానవ వనరులు వస్తువుల ఎగుమతి పై చైనా అనుసరించే నియంత్రణలు, బ్రహ్మపుత్ర జలాల మళ్లింపు ముప్పు, భారత్ చైనా దేశాల మధ్య అవగాహన పెంపొందించడంలో మీడియా పాత్ర, ప్రజల మధ్య సంబంధాల పాత్ర వంటి అనేక విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. చైనా గురించి పాశ్చాత్య మీడియా అందించే వార్తలు కథనాలపై తమ వ్యాఖ్యానాలు ప్రచురించే భారత మీడియాకు, భారత ప్రజలకు ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి నేరుగా చెప్పిన అభిప్రాయాలు మిక్కిలి ఆసక్తికరంగా ఉంటాయి. చైనాను వాస్తవ దృక్పథం తో అవగతం చేసుకోవడానికి అవి తోడ్పడతాయి.
అమెరికా ఆర్ధిక దౌర్జన్యాన్ని తిప్పి కొట్టాలి :
ట్రంప్ ప్రపంచదేశాలపై విధించిన దిగుమతి సుంకాలు సృష్టించి న ఆర్ధిక కల్లోలం మధ్య, యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య నేడు భారత చైనా సంబంధాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా చర్యల వల్ల ఆకాశం ఊడిపడదు కానీ దాని ఏకపక్ష వాదాన్ని, ఆర్ధిక దౌర్జన్యాన్ని తిప్పికొట్టాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీకలిసి రావాలని చైనా అధ్యక్షుడు పిలుపు నిచ్చారు. శ్రీ జిన్ పింగ్ (Xi Jinping)భారత రాష్ట్రపతి తో కూడా ఈ విషయం ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చైనా రాయబారి ఇంటర్వ్యూ లోని ముఖ్య భాగాలను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం.
చైనా, భారత్ లు ప్రత్యర్థులు కాదు భాగస్వాములు:
2020 సరిహద్దు ప్రతిష్టంభనను భారత్, చైనా కొంతమేరకు పరిష్కరించినట్లు కనిపిస్తోంది, ఇది సంబంధాల మెరుగుదలకు సంకేతాలు ఇస్తోంది. కానీ రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పునర్నిర్మించడం అనే పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. మరింత ఉద్రిక్తతను తగ్గించడానికి , దీర్ఘకాలిక సరిహద్దు శాంతిని నిర్ధారించడానికి చైనా తన వంతుగా ఏమి చేయగలదు అనేది ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్న. 2024 అక్టోబర్ లో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కజాన్ లో ఫలవంతమైన సమావేశం జరిగింది. ఇది చైనా-భారతదేశ సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించింది. ఇరు దేశాల నాయకు లు కలిసి ప్రకటించిన ఏకాభిప్రాయాన్ని ఇరు పక్షాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి, అన్ని స్థాయిలలో పరస్పర మార్పిడి ,ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తున్నాయి. సానుకూల పురోగతిని సాధించాయి.
"చైనా, భారత్ లు ప్రత్యర్థులు కాదు భాగస్వాములు, ఒకరికొకరు ముప్పు కాదు. వారు ఒకరికొకరు అభివృద్ధి అవకాశాలు" అనే ఎరుక మరింత బలపడాలి. ఇద్దరు నాయకులు చేసిన వ్యూహాత్మక నిర్ణయానికి కట్టుబడి ఉండటం, ఒకరి అభివృద్ధినీ, వ్యూహాత్మక ఉద్దేశాలను మరొకరు సరిగ్గా అర్ధం చేసుకోవడం, చైనా-భారతదేశ సంబంధాలలో సుస్థిర, ఆరోగ్యకరమైన అభివృద్ధికి కీలకం. రెండవది, ఇరు దేశాలు పరస్పరం ప్రధాన ప్రయోజనాలను ప్రధానమైన ఆరాటాలను గుర్తించాలి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను దానికి తగ్గ స్థానంలోనే ఉంచాలి. మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు సమస్య ఒక్కటే నిర్ణయించడాన్నిఅనుమతించకూడదు. నిర్దిష్ట విభేదాలు ద్వైపాక్షిక సహకారాన్ని ప్రభావితం చేయకూడదు. మూడవది, వివిధ స్థాయిలలో, రంగాలలో స్నేహపూర్వక మార్పిడి, సహకారాలను స్థిరంగా ప్రోత్సహించాలి. ఆచరణాత్మక సహకారాన్ని విస్తృతం చేయాలి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి నుండి రెండు దేశాలలో ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు కనుక చైనా-భారత్ లు స్నేహం కోసం మరింత చురుకుగా కృషిచేయాలి. అని వారి అభిప్రాయాన్ని విశదంగా చెప్పారు.
భారత్ కి స్నేహ హస్తం అందిస్తున్న చైనా :
ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ(Narendra Modi) మాట్లాడుతూ, శతాబ్దాలుగా, భారతదేశం మరియు చైనా ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నాయని, అవి కలిసి ఏదో ఒక విధంగా ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేశాయని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధాన పొరుగు దేశాలుగా ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వుండటం సహజం. ఈ విభేదాలు వివాదాలుగా మారకుండా చూడటమే మా లక్ష్యం అని రాయబారి స్పష్టం చేశారు. చర్చల ద్వారానే ఇరు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే సుస్థిర సహకార సంబంధాలను నిర్మించగలం.
అదేవిధంగా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ లో, “2020-24 మధ్య ఏర్పడిన పరిస్థితి రెండు దేశాలలో ఎవరికీ ఉపయోగపడ లేదు. మన సంబంధాల కు ఎలాంటి ప్రయోజనమూ చేకూర లేదు” అని చెప్పిన అభిప్రాయా న్ని ఉదహరిస్తూ; “పురాతన నాగరికతలుగా, సవాళ్లను నిర్మాణాత్మకంగా ఛేదించే జ్ఞానం, అనుభవం మన రెండు దేశాలకు ఉన్నాయి. అందువల్ల మన సంబంధాలు మెరుగు పడతాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా” అని అన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కి చైనా సాదర స్వాగతం పలుకుతున్నది. స్నేహపూర్వక, ఐక్యమైన,ఫలప్రదమైన శిఖరాగ్ర సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించడానికి- భారతదేశం తోను, ఇతర సభ్య దేశాలతోను కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఎస్సిఓను అధిక-నాణ్యత గల అభివృద్ధి యొక్క కొత్త దశలోకి నడిపించడానికి చైనా సిద్ధంగా ఉంది అన్నారు.
భారత్ చైనాల మధ్యగల వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించడానికి చైనా భారతదేశానికి ఎలా సహాయ పడుతుంది అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “చైనా ఉద్దేశపూర్వకంగా వాణిజ్య మిగులును ఎన్నడూ అనుసరించలేదు. వాణిజ్య మిగులు, మార్కెట్ ఆధారిత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎగుమతులు దిగుమతులు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతాయి. గత నెలలో అంతర్జాతీయ వ్యాపార సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు జిన్ పింగ్(Xi Jinping) మాట్లాడుతూ, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్, అతిపెద్ద మధ్య ఆదాయ జనసమూహంతో పెట్టుబడులకు, వినియోగానికి చైనా గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని సూచించారు. చైనా సూపర్ సైజ్ మార్కెట్ ను అంచనా వేసి అనుసరిస్తే భారతీయ కంపెనీలకు మరిన్ని వాణిజ్య అవకాశాలు లభిస్తాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో, మిరపకాయలు, ఇనుప ఖనిజం , పత్తి నూలు వంటి భారతీయ ఉత్పత్తులు చైనాకు గణనీయంగా ఎగుమతి అయ్యాయి. ఇవి వరుసగా 17%, 160%, 240% వృద్ధిని సాధించాయి. చైనాకు మరింత ప్రీమియం భారతీయ వస్తువుల ఎగుమతిని మేము స్వాగతిస్తున్నాము. చైనా మార్కెట్ డిమాండ్ ను అందిపుచ్చుకోవడంలో భారతీయ వ్యాపారవేత్తలకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాము. మా ఆర్థిక మరియు వాణిజ్య సహకారం యొక్క విస్తృత సామర్థ్యాన్ని మరింతగా అన్వేషిస్తాము. అదే సమయంలో,చైనా ఆందోళనలను కూడా భారతదేశం తీవ్రంగా పరిగణి స్తుందని, చైనా సంస్థలకు న్యాయమైన, పారదర్శకమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తుందని చైనా-భారత్ ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని కొత్త శిఖరాలకు పెంచుతుందని, రెండు దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము అని చెప్పారు.
భారత్ ను ఆందోళనకి గురి చేస్తున్న చైనా నియంత్రణలు :
భారత్ లో దేశీయ తయారీని పెంచడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు చైనా అనుసరిస్తున్న అడ్డంకిగా పరికరాలు, మానవ వనరులపై చైనా ఎగుమతి నియంత్రణలు అడ్డంకిగా వున్నాయని భారతదేశం ఆందోళన చెందుతోంది, బీజింగ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా,“ పరికరాల ఎగుమతి లేదా సంబంధిత సిబ్బంది భారత్ కు ప్రయాణించడంపై చైనా ఎప్పుడూ పూర్తి ఆంక్షలు విధించలేదు. దీనికి విరుద్ధంగా, తన అనుభవాన్ని పంచుకోవడానికి, పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని బలోపేతం చేయడానికి చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. చైనా పౌరులు భారతీయ వీసాలను పొందడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, భారతదేశంలో ఉన్న చైనీస్ సంస్థలు వివక్షపూరిత, అన్యాయమైన ప్రవర్తనను ఎదుర్కొంటున్నాయి. చైనా పెట్టుబడులను వ్యతిరేకించే స్వరాలు తరచుగా మీడియాలో వినబడ తాయి. ఈ అంశాలు చైనా సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి. అందువల్ల, ఇరు పక్షాలు ఒకరినొకరు త్వరగా కలుసుకుని పరిస్థితిని మెరుగుపరచడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది “ అని చెప్పారు.
చైనాలో బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతాల్లో నిర్మిస్తున్న మెగా చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు వల్ల దిగువ దేశాలపై పడే ప్రభావం గురించి వివరిస్తూ ఆయన చైనా అంతర్జాతీయ నదుల అభివృద్ధి పట్ల బాధ్యతాయుతమైన వైఖరికి కట్టుబడి ఉంటుంది. వినియోగం రక్షణను సమతుల్యం చేసే విధానాన్ని అనుసరిస్తుంది. ఎగువ, దిగువ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుంది. చైనా జలవిద్యుత్ అభివృద్ధి స్వచ్ఛమైన శక్తిని అభివృద్ధి చేయడం, వేగవంతం చేయడం; వాతావరణ మార్పులు, తీవ్రమైన హైడ్రోలాజికల్ విపత్తులకు ప్రతిస్పందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కఠినమైన శాస్త్రీయ మూల్యాంకనం తర్వాత యార్లంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రాజెక్టు ను నిర్మించాలని చైనా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నీటిని వినియోగించదు, కానీ నీటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీని మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది. చైనా ఎన్నడూ "నీటి ఆధిపత్యా న్ని" కోరుకోదు. దిగువ దేశాలను "బలవంతం" చేయడానికి నీటి వనరుల సాధారణ అభివృద్ధిని ఉపయోగించదు. ఈ ప్రాజెక్టు పర్యావరణం, భౌగోళిక పరిస్థితులు, దిగువ దేశాల నీటి వనరులకు సంబంధించిన హక్కులు, ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపదు. దీనికి విరుద్ధంగా, ఇది దిగువ ప్రాంతంలో ప్రమాద నివారణ, ఉపశమనంతో పాటు వాతావరణ మార్పుల ప్రతిస్పందనకు కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అంశంపై భారత్, చైనా మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతోందని, సరిహద్దు నదులపై చైనా-ఇండియా సమావేశం త్వరలో ఢిల్లీలో జరగనుందని తెలిపారు.
“ఇటీవలి సంవత్సరాలలో, చైనా మరియు భారతదేశం వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ చైనా-ఇండియా బోర్డర్ అఫైర్స్ (డబ్ల్యుఎంసిసి)(WMCC ) మరియు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం వంటి సంభాషణా యంత్రాంగాల ద్వారా సన్నిహిత సంభాషణలు కొనసాగించాయి, సరిహద్దు ప్రాంతాలలో సంబంధిత సమస్యలపై పరిష్కారానికి చేరుకున్నాయి. సరిహద్దు పరిస్థితిని తిరిగి ప్రశాంతతకు తీసుకువచ్చాయి. గత ఏడాది చివర్లో చైనా-భారత్ సరిహద్దు సమస్యపై జరిగిన 23వ ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో, ఈ యంత్రాంగం పాత్రకు పూర్తి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు నొక్కిచెప్పాయి, సరిహద్దు పరిస్థితి యొక్క సాధారణ నిర్వహణ నియంత్రణను బలోపేతం చేయాలి, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సామరస్యాలను ఉమ్మడిగా కాపాడాలి. భవిష్యత్తులో, ఇరు పక్షాలు ప్రస్తుతం ఉన్న దౌత్య , సైనిక కమ్యూనికేషన్ మార్గాలను పూర్తిగా ఉపయోగించుకోవడం కొనసాగించాలి, సంప్రదింపులు, పరస్పర భద్రత సూత్రాలకు సమానంగా కట్టుబడి ఉండాలి, ఎల్ఏసి (LAC )వెంబడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరిహద్దు ప్రాంత నిర్వహణ, నియంత్రణ నిబంధనలను మరింత మెరుగుపరచాలి. సరిహద్దు ప్రాంతా లలో స్థిరమైన శాంతి సామరస్యాలను సాధించడానికి విశ్వాసాన్ని పెంపొందించే చర్యలను బలోపేతం చేయాలి.
చైనా-భారత్ సంబంధాలలో విశ్వాస లోటు ఒక ప్రధాన సమస్య, ఇది ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాల మధ్య మార్పిడి లేకపోవడం వల్ల ఉద్భవించింది, సమాచార లోపం, అవగాహన లోటుకు దారితీస్తుంది. ఇరు దేశాల మధ్య స్థాపించబడిన మార్పిడి మరియు సంభాషణ యంత్రాంగాలు ప్రస్తుతం చాలావరకు నిలిచిపోయున్నాయి. ప్రజల మధ్య మార్పిడి స్థాయి చాలా తక్కువగా ఉంది. ద్వైపాక్షిక మార్పిడిని మెరుగుపరచడానికి చైనా చురుకుగా పనిచేస్తున్నది. భారతదేశంలోని చైనా దౌత్య కార్యాలయాలు గత సంవత్సరం 2,80,000 వీసాలను, ఈ సంవత్సరం ఇప్పటివరకు 85,000 వీసాలను జారీ చేసాయి. కానీ చైనా పౌరులు భారతీయ వీసాలను పొందడం చాలా కష్టంగా వుంది. దీనికి తోడు ఇరు దేశాలు ఇంకా నివాస జర్నలిస్టుల మార్పిడిని పునఃప్రారంభించకపోవడంతో ఒకరి గురించి మరొకరికి ప్రత్యక్ష సమాచారం లేకుండా పోయింది.
చైనా యొక్క అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అని పిలువబడే కథనాలు, చైనా ప్రపంచానికే ఒక పెనుముప్పు అనే కథనాలు చైనా పట్ల సాధారణ భారతీయుల అవగాహనలను గణనీయంగా ప్రభావితం చేశాయి.
చైనా-భారత్ అవగాహనను పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతికూల వార్తలకు చైనా భయపడదని, చైనా అభివృద్ధి, చైనా-భారత్ సంబంధాలపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడానికి భారత మీడియాను ఆహ్వానిస్తున్నా మని రాయబారి చెప్పారు. చైనీయుల సామెత "రెండు వైపులా వినండి- మీరు జ్ఞానోదయం పొందుతారు; ఒక వైపు మాత్రమే వినండి-మీరు గందరగోళానికి గురవుతారు"అని చెబుతుంది. అలాగే మీడియా మిత్రులు బహుళ వనరుల నుండి సమాచారం మరియు అభిప్రాయాలను పొందవచ్చని, చైనా యొక్క మొత్తం చిత్రాన్ని మీ స్వంత దృక్పథం నుండి ప్రదర్శించగలరని ఆశిస్తున్నాము.” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఒక దేశం మాత్రమే ,ప్రపంచం కాదు :
ఇక అతి కొత్తగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన టారిఫ్ యుద్దం గురించి ప్రస్తావిస్తూ తన టారిఫ్ బెదిరింపులు, ఒత్తిళ్ల ద్వారా అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అది విధించే పరస్పర సుంకాలు పరస్పరం కాదు. అవి ఏకపక్ష రక్షణ వాదం తప్ప మరేమీ కాదు. ఇటువంటి చర్యలు ఇతర దేశాల చట్టబద్ధమైన హక్కులను ప్రయోజనాలను తీవ్రంగా ఉల్లంఘిస్తాయి, నియమాల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను తీవ్రంగా బలహీన పరుస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. స్వావలంబన, కఠోర శ్రమ ఫలితమే చైనా అభివృద్ధి. టారిఫ్ వార్ లేదా ట్రేడ్ వార్ ను చైనా కోరుకోవడం లేదు. ఏదేమైనా, అటువంటి యుద్ధాన్నిమాపై రుద్దితే, మేము దృఢంగా పోరాడతాము, మా స్వంత ప్రయోజనాలను గట్టిగా కాపాడుకుంటాము. బహుళపక్ష వాదాన్ని, ప్రపంచీకరణను స్థిరంగా సమర్థిస్తాము. అమెరికా సుంకాల దుర్వినియోగాన్ని ఎదుర్కొంటూ కూడా కొన్ని దేశాలు రాయితీలు ఇచ్చి బెదిరింపులకు లొంగి పోయి అంగుళం అవకాశం ఇవ్వడం చూశాం. అమెరికా దాన్ని ఉపయోగించుకుని ఒక మైలు దూరం వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అమెరికా బెదిరింపులు, ఆధిపత్యాల నేపథ్యంలో రాజీ, రాయితీలు ఎక్కడా ముందుకు సాగవని ఇది స్పష్టం చేస్తోంది.
అమెరికా ఒక దేశం మాత్రమే, మొత్తం ప్రపంచం కాదు. దాని విదేశీ వాణిజ్యం ప్రపంచ వాణిజ్య పరిమాణంలో 13% మాత్రమే ఉంది, మిగిలిన 87% వాణిజ్యం 190 కంటే ఎక్కువ దేశాల మధ్య నిర్వహించబడుతొంది. ఈ దేశాలు సహకారానికి విస్తారమైన అవకాశాలను కలిగి ఉన్నాయి. అవీ స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించగలవు
చైనా భారతదేశాలు అత్యధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తులు. అభివృద్ధిలో అనివార్య మైన కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సహకారానికి విస్తారమైన సామర్థ్యాన్ని పంచుకుంటున్నాయి. ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలుగా, గ్లోబల్ సౌత్ యొక్క కీలక సభ్యులుగా, చైనా- భారతదేశాలకు అన్ని రకాల ఏకపక్షత ,రక్షణవాదాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. మనమందరం కలిసి బహుళపక్ష వాదాన్ని నిలబెట్టాలి. నేటి కల్లోల ప్రపంచంలో చాలా అవసరమైన స్థిరత్వాన్ని నెలకొల్పాలి.”
భారత చైనా మైత్రి కేవలం రెండు దేశాల మధ్య మైత్రి మాత్రమే కాదు. ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేయగల రెండు మహా శక్తుల మైత్రి. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలే కాదు, ఆసియా ఖండం లోను , ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక పేద మధ్యతరగతి దేశాల ప్రజల ప్రయోజనాలకు మద్దతుగా నిలబడ వలసిన మైత్రి. చారిత్రికంగా కాలం చెల్లిపోయిన పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి చరమ గీతం పాడి “వసుధైక కుటుంబ“ మనే భావనను నిలబెట్టి, శాంతియుత అభివృద్ది పంథాను అనుసరించే సామ్య వాద స్నేహ సౌరభ ప్రాంగణమా మైత్రీ సౌధం. భారత పాలకవర్గాలు ఈ మహత్తర మానవ కళ్యాణ గీతం లో తమ గొంతు కలుపు తాయా? లేక సామ్రాజ్యవాద కూలిన గోడల కింద తల వొగ్గి కూర్చుని కాలగర్భంలో కలిసి పోతాయా అన్నది నిర్ణయించుకోవాల్సిన చారిత్రక సందర్భం ఆసన్నమయ్యింది. చైనా రాయబారి ఇంటర్వ్యూ ఆ అవసరాన్ని పట్టి చూపిస్తోంది.