మాదిగ దండోరా ‘ఎ.బి.సి.డి’ లు దాటి ముందుకు వెళ్లగలదా?

ఎస్సీ వర్గీకరణపై మూడవ చూపు మాట ఏమిటి? రాబోయే తరాల చేతుల్లో ‘మాదిగ దండోరా’ కార్యాచరణ భవిష్యత్తు ఎలా ఉంటుంది. జాన్సన్ చోరగుడి విశ్లేషణ (1)

Update: 2024-08-25 01:27 GMT


-జాన్ సన్ చోరగుడి

ఆగస్టు ఒకటి 2024న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం ఒక- ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ (‘ఎస్.పి.వి.’) మాదిరిగా ఏర్పడిన- ‘మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి’ (‘ఎం.ఆర్.పి.ఎస్.’) పని, ఒక ముగిపుకు చేరినట్టుగా అయింది. ఇప్పుడిక మిగిలిన పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కనుక, వారెటూ కోర్టు తీర్పును అమలు చేస్తారు. అయితే, ఈ ముప్పై ఏళ్ల కాలంలో మనవద్ద జరిగిన పరిణామాలు ఎటువంటివి? కోర్టు తీర్పు అమలు తర్వాత మున్ముందు మాదిగలకు ఏర్పడే రాజకీయ సవాళ్లు ఎటువంటివి? అనే సమీక్ష కనుక జరగకపోతే, ఈ చారిత్రిక తీర్పు తిప్పబోతున్న మలుపులు ఎటువంటివి? అనే ప్రశ్నకు మనకు సరైన సమాధానం దొరకదు.

అటువంటిది జరిగినప్పుడే, రాబోయే తరాల చేతుల్లో- ‘మాదిగ దండోరా’ కార్యాచరణ భవిష్యత్తు ఎలా ఉండాల్సి ఉంటుంది, అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. అయితే, అప్పుడు మరికొన్ని అంశాలు మన ముందుకు వస్తాయి. తెలుగునాట మాదిగలు ఎటువంటి స్వల్ప ప్రయోజనం ఆశించి ముప్పై ఏళ్ళుగా రోడ్డున పడ్డారు? సరే, మరి మరి ఇప్పుడు- ‘ఎబిసిడి’ వస్తే వాళ్లకు చాలా? నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇప్పటికే పైకి ఎక్కిన మాలలు మున్ముందు తాము ఖాళీ చేయబోయే జాగాలోకి- మాదిగ, మాదిగ ఉపకులాల ప్రవేశాన్ని ఇంకా ఇలాగే ఆపితే, తెలుగు రాష్ట్రాలకు రేపు తామే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మాల నాయకులకు అప్పుడు మాదిగల మద్దత్తు ఉంటుందా? ఒకవేళ లేకపోతె అప్పుడు వాళ్లకు ఉండే ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఇటువంటి విషయాలు ఈ వ్యాసాల పరంపరలో చూద్దాం.

సామాజిక పరివర్తన ఎక్కడా శూన్యంలో మొదలవదు, ‘ఎం.ఆర్.పి.ఎస్.’ (1994) ఆవిర్భావం కూడా అందుకు మినహాయింపు కాదు. కేంద్త్ర ప్రభుత్వం ఎప్పుడో 1979 లో ఏర్పాటు చేసిన ‘మండల్ కమీషన్’ నివేదిక 1990లో అమలులోకి వస్తే, పి.వి. సారధ్యంలో ఆర్ధిక సంస్కరణల అమలు 1991లో మొదలయ్యాయి. ఈ కాలంలోనే మనవద్ద- ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల ప్రభావం మొదలయింది. వీటిలో మొదటి రెండింటిలో సంపన్న, ఆధిపత్యవర్గాలు స్థిరపడితే; సరళీకరణ (‘లిబరలైజేషన్’) నుంచి ఈ కాలంలో ఏర్పడినవి, నిర్లక్ష్య్తిత వర్గాల ‘అస్తిత్వ’ ఉద్యమాలు. దాన్ని మన సాహిత్య, కళా రూపాలలోనూ చూస్తాము. తొలి దళిత కవిత్వ సంకలనం ‘చిక్కనవుతున్న పాట’ కూడా 1994లోనే వెలువడింది. అందులో మాల-మాదిగ రెండు కులాల కవుల కవిత్వం ఉంది.

ఆ ‘కాలం’ ప్రభావం దేశమంతా అదొక వెల్లువ కావడంతో, దాని ప్రభావాన్ని 1992- 93 మధ్య కాలంలో జరిగిన 73, 74 రాజ్యంగ సవరణలో మనం చూస్తాము. అప్పుడు జరిగింది ఏమిటి? జిల్లా స్థాయిలో సర్పంచ్ మొదలు, జిల్లా పరిషత్ చైర్మన్ వరకూ అన్ని స్థాయిల్లోనూ- జనరల్, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు మొదటి సారిగా ‘రిజర్వ్’ చేయడం మొదలయింది. ఇలా ఒక ‘కాలం’లో మన సమాజంలో వచ్చిన మార్పు ఎటువంటిది అనేది ముందుగా మనకు అర్ధమైతే, ‘మాదిగ దండోరా’ ఉద్యమం అదే కాలంలో 1994లో ఎందుకు మొదలయింది మనకు స్పష్టం అవుతుంది. ఇటువంటి లోచూపు లేకుండా, ఇప్పటికీ కొందరు దీని వెనుక ‘టి.డి.పి.’ ఉందని, చంద్రబాబు ఉన్నాడని అంటారు. చాలా వాటిని తన ఖాతాలో కలుపుకునే నైజం ఆయనకు ఉండడంతో, కలిసొస్తే, దీన్ని కూడా ఆయన ‘వద్దు’ అనడు.

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960-62 మధ్య దామోదరం సంజీవయ్య (మాల) పనిచేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ తర్వాత, ఇరవై ఏళ్లకు టిడిపి ఏర్పడితే, మాలలు కాంగ్రెస్ వైపు, మాదిగలు టిడిపి వైపు అన్నారు బయటవారు. అప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్న మాదిగలకు ‘టిడిపి’ రూపంలో ఒక కొత్త ప్రత్యామ్నాయం దొరకడం నిజం కావొచ్చు. అంతమాత్రాన అదేమీ ఏ ఒకరికో గుంపగుత్తగా ఎప్పుడూ లేదు. ప్రస్తుతానికొస్తే ఇప్పటి ఈ సంవాదంలో వాద ప్రతివాదులైన ‘మాదిగ – మాల’ కులాల వారి అవసరాలు కూడా, ఈ ముప్పై ఏళ్లలో బాగా పెరిగాయి. చాలా కొత్తవి కూడా చాలా ఇరువైపులా పాతవాటికి జత కలిసాయి. నిజానికి 1994లో ‘మాదిగ దండోరా’ మొదలయ్యేనాటికి మాదిగల ఫిర్యాదు- ‘మాలలు తమ వాటా కూడా వాళ్ళే తీసుకుంటున్నారు, కనుక మా రొట్టె కూడా వాళ్ళే ‘తిన’కుండా ముందు దాన్ని ఆపండి’, అని మాదిగలు అడిగారు. అందుకు మాలలు- ‘నిన్నెవరు తినొద్దు అన్నారు? కలబడగలిగితే నువ్వు కూడా తిను’ అని వాళ్ళు అన్నారు.

పరిస్థితి ఈ స్థాయికి వచ్చినప్పుడు, అప్పుడది ఇద్దరి మధ్య విషయం లేదా రెండు కులాల మధ్య సంవాదం ఎందుకు అవుతుంది? విషయం ఏదైనా గానీ అందులోని మంచి చెడులు ఎంచడానికి విస్తృతమైన సమాజం ఉంటుంది కదా. సుప్రీంకోర్టు తీర్పుతో అదే జరిగింది. తమవైన రంగాల్లో నిష్ణాతులు ఎందరో ఇప్పుడు బయటకు వచ్చి దీని గురించి తమ వాణిని వినిపిస్తున్నారు. వాళ్ళు- ‘మాదిగ దండోరా’ ప్రయాణం ‘ఏ.బి.సి.డి.’ల లక్ష్యం సాధన కంటే ఎంతో విస్తృతమైంది కావాలి అంటున్నారు. వాటిలో- యుజిసి మాజీ చైర్మన్, జే.ఎన్.యు. ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ ఏమంటున్నారో ముందుగా చూద్దాం.   


ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ 


‘‘కొన్ని ఉపకులాలు తమకున్న ‘రిజర్వేషన్లు’ వాడుకోవడం లేదు అంటే, దానర్ధం మరెవరో వాటిని లాక్కుంటున్నారు అని కాదు. కొన్ని కులాలు ప్రభుత్వ ఉద్యోగాలలో తక్కువమంది కనిపించడానికి కారణం, వారికి తగిన విద్య లేకపోవడం. అందుకు తగిన ఆర్ధిక స్థోమత వారికి లేకపోవడం. దాన్ని కనుక ప్రభుత్వం పెంచకపోతే వాళ్ళు చదువుకోలేరు. అటువంటప్పుడు, ఉపకులాల రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ, మళ్ళీ ఇక్కడా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళే దాన్ని పట్టుకుపోతున్నారు’ అని ఆయన అంటున్నారు.

ఈ కోర్టు తీర్పు రావడానికి రెండు వారాల ముందే జులై రెండవ వారంలో తోరట్ ఈ అంశంపై ఎంతో లోతైన పరిశీలనతో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాసారు. అందులో ఆయన అభిప్రాయం ఇలా ఉంది. ‘ఈ విషయంలో మూడు అంశాలను మాత్రమే మన ప్రభుత్వాలు ‘అడ్రెస్’ చేస్తున్నాయి, అందులో మొదటిది- కుల వివక్ష నుంచి న్యాయపరమైన రక్షణ, రెండు- చట్టసభలలో ‘రిజర్వేషన్’, మూడు- ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యాసంస్థల్లో సీట్లు, ‘కేపిటల్ ఎసెట్స్’ వంటి భూమి, వ్యాపారాలు, విద్యాస్థాయి పెంపు వరకు మాత్రమే పరిమితం అవుతున్నాము. కానీ ‘అకడమిక్’ విషయంగా ప్రభుత్వం వీరికి చేస్తున్నది ఎంత మాత్రం చాలదు. కొన్ని కులాల నుంచి వచ్చే పిల్లలకు సరైన సత్తా లేక పరీక్షల్లో వాళ్ళు పోటీపడలేకపోతే, ముందుగా వాళ్ళను గుర్తించి వారిపై మనం వ్యక్తిగత శ్రద్ద (Individual focus) పెట్టాలి’ అంటున్నారు. (సశేషం)     

Tags:    

Similar News