తెలంగాణలో మితిమీరిన వరి సాగు తెస్తున్న ముప్పు ఏమిటో తెలుసా?

తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండించడం మంచి హెడ్ లైనే కాని శుభ పరిణామం కాదు. దీని వల్ల ఇతర పంటలకు భూమి కరువు. నీటిపారుదల ఖర్చు మోపెడు. పర్యావరణానికి ముప్పు

Update: 2024-10-14 10:02 GMT

ఈ ఏడాది (2024) వానాకాలం సీజన్ లో పంటల సాగు ముఖచిత్రం చూస్తే ఈ పంటల పొందికతో రాష్ట్రానికి ఆహార భద్రత చేకూరుతుందా అనే అనుమానం కలుగుతున్నది. నిజానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఆహార పంటలు కూడా క్రమంగా లిక్కర్, ఇథనాల్ తయారీ లాంటి పారిశ్రామిక అవసరాలకు తరలి పోతున్న దుస్థితిని చూస్తే, ఈ అనుమానం మరింత బలపడుతున్నది.

రాష్ట్ర ఖరీఫ్ సాగు విస్తీర్ణం సగటున 1,29,32,310 ఎకరాలు . గత సంవత్సర ఖరేఫ్ సాగు విస్తీర్ణం 1,30,43,505 ఎకరాలు కాగా , ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గి 1,29,89,397 ఎకరాలు ( 25-09-2024 వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్ట్ ) గా నమోదైంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిఫారసుల ప్రకారం ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే, రోజుకు 400 గ్రాముల తృణ ధాన్యాలు (బియ్యం,గోధుమలు, జొన్న, మొక్కజొన్న, చిరు ధాన్యాలు ), 60 గ్రాముల పప్పు ధాన్యాలు ( కంది ,పెసర,మినుము,శనగ ),60 గ్రాముల నూనె (వేరు శనగ , నువ్వులు, కుసుమ), 25 గ్రాముల సుగంధ ద్రవ్యాలు ( మిరప, పసుపు,ఆవాలు,జీలకర్ర ), 350 గ్రాముల కూరగాయలు (ఆలు, ఉల్లి గడ్డలు సహా ), 100 గ్రాముల పండ్లు (సీజనల్ పండ్లు) తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, బెల్లం వినియోగంకూడా మన నిత్య జీవితంలో భాగమే. వాటి ఉత్పత్తికి అవసరమైన చెరకు కూడా పండించుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర జనాభా 2024 నాటికి 4 కోట్ల మందిగా అంచనా వేసుకుంటే, వీరందరికీ పౌష్టికాహారం అందాలంటే, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పంటలు పండించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కోటి పశువులు, సన్న జీవాలు, కోట్లాది కోళ్ళ పెంపకానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి.

ఖరీఫ్ సీజన్ లో సగటు సాగు భూమి విస్తీర్ణాన్ని బట్టి మన పంటల ప్రణాళికా ఉండాలి. యాసంగి లో కొన్ని పంటలు పండినప్పటికే, ఈ సీజన్ లో సాగు నీటికి ఉండే పరిమితుల దృష్ట్యా, నికర సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది. మన రాష్ట్రంలో వేసవి పంటలు అతి తక్కువ. పైగా కోతులు,అడవి పందులు, నెమళ్లు లాంటి అడవి జంతువుల వల్ల, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వీటివల్ల కొన్ని పంటలను రైతులు సాగు చేయడం మానేశారు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ఖరీఫ్ పంటల సాగు పొందికను పరిశీలిస్తే, ఆందోళన కలిగించే విషయాలు బయట పడుతున్నాయి.

రాష్ట్రంలో 2023 ఖరీఫ్ లో వరి సాగు విస్తీర్ణం 64,61,842 ఎకరాలు కాగా, 2024 ఖరీఫ్ లో అది 65,49,230 ఎకరాలకు పెరిగింది. నిజానికి మన రాష్ట్ర ప్రజలకు వరి బియ్యం అవసరాలు తీరడానికి ఖరీఫ్ సీజన్ లో 40,00,000 ఎకరాలలో వరిసాగు చేస్తే సరిపోతుంది. ఈ సీజన్ లో పండే వరి బియ్యం నుండీ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి అవసరమైన సన్న ధాన్యాన్ని పండించి , ప్రాసెస్ చేసి, బియ్యం నిలవ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తి లో నుండే దేశ ఆహార బధ్రత కోసం భారత ఆహార సంస్థకు కొంత బియ్యం సరఫరా చేయవచ్చు. యాసంగి లో మరో 30 లక్షల ఎకరాలలో ఎలాగూ వరి సాగు చేస్తారు. దానిని పూర్తిగా దేశ ఆహార బద్రతకు అందించవచ్చు.

కానీ ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే సుమారు 65 లక్షల ఎకరాలలో వరి సాగు చేయడం వల్ల, ఇతర పంటల సాగుకు సాగు భూమి అందుబాటులో లేకుండా పోతున్నది. పైగా గ్రావిటీ ద్వారా పారే నీళ్ళతో వరి సాగు చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది. కానీ ఎత్తి పోతల సాగు నీటి పథకాల క్రింద వరిసాగు చేస్తే విద్యుత్ ఖర్చు భారీగా అవుతుంది. వరి ధాన్యం సగటు ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది. సాగు నీటి ఖర్చును సరిగా లెక్క వేసు కోకుండా, వరి ధాన్యం సాగును పెంచుకుంటూ పోవడం రాష్ట్రానికి అంత మంచిది కాదు. వరి సాగులో రసాయన ఎరువులు,పురుగు విషాలు, కలుపు విషాల వినియోగం పెరగడం, అవి సృష్టించే విధ్వంసం, పెరిగిన వరి సాగు విస్తీర్ణం రాష్ట్రంలో మొత్తం గ్రీన్ హౌజ్ వాయువుల పెరుగుదలకు కారణమవ్వడం – ఇవన్నీ దుష్ఫలితాలే.

ప్రజలకు పౌష్టికాహారం అందాలంటే రాష్ట్రంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగాలి. కానీ 2024 ఖరీఫ్ లో రాష్ట్రంలో ప్రధాన పప్పు ధాన్య పంట కంది సాగు విస్తీర్ణం 4,99,080 ఎకరాలు మాత్రమే. పెసర సాగు విస్తీర్ణం కేవలం 68,556 ఎకరాలు, మినుము సాగు విస్తీర్ణం కేవలం 22,489 ఎకరాలు మాత్రమే. ఈ విస్తీర్ణం నుండీ ఎకరానికి సగటున మూడు క్వింటాళ్ల పప్పు ధాన్యాల ఉత్పత్తి అనుకున్నామొత్తం 1,75,000 టన్నులు మాత్రమే వస్తుంది. శనగ, పెసర, మినుము సహా యాసంగి లో మరో లక్షన్నర ఎకరాల పప్పు ధాన్యాల సాగులో మరో 45,000 టన్నుల ఉత్పత్తి వస్తుంది. మన రాష్ట్ర పప్పు ధాన్యాల అవసరాలు కనీస ఐదు లక్షల టన్నులు ఉంటుంది. అంటే సగం పప్పు ధాన్యాలు కూడా మనం ఉత్పత్తి చేసుకోవడం లేదని అర్థం. మనకు అవసరమైన మిగిలిన పప్పు ధాన్యాలు ఇతర రాష్ట్రాల నుండీ, ఇతర దేశాల నుండీ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే రాష్ట్రంలో పప్పు ధాన్యాల సగటు వినియోగ దారీ ధరలు తగ్గడం లేదు.

మనిషి పౌష్టికాహారానికి కూరగాయల వినియోగం తగిన స్థాయిలో ఉండాలి. మన రాష్ట్ర ప్రజల కూరగాయల అవసరాలు తీరాలంటే, రాష్ట్రంలో ఉల్లిపాయలు సహా కూరగాయల ఉత్పత్తి 51,10,000 టన్నులు అవసరం. కానీ 2022 -2023 సంవత్సరంలో తెలంగాణ లో ఖరీఫ్ లో 63,129 ఎకరాలలో, రబీ లో 69,026 ఎకరాలలో కూరగాయలు సాగయి, ఉత్పత్తి అయిన కూరగాయలు కేవలం 14,26,694 టన్నులు మాత్రమే. అంటే మన అవసరంలో 25 శాతం మాత్రమే మనం పండించు కుంటున్నాం అన్నమాట . కూరగాయల ధరలు తగ్గకపోవడానికి ఇదొక కారణం.

చిరు ధాన్యాల విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. చిరు ధాన్యాలలో జొన్న విస్తీర్ణం 2024 ఖరీఫ్ సీజన్ లో 41,782 ఎకరాలు,రాగి విస్తీర్ణం 325 ఎకరాలు , సజ్జ విస్తీర్ణం 625 ఎకరాలు, కొర్రా, సామ, ఆరిక లాంటి ఇతర చిరు ధాన్యాల విస్తీర్ణం 612 ఎకరాలు మాత్రమే. నిజానికి ప్రతి కుటుంబానికి కనీసం నెలకు ఒక కిలో చిరు ధాన్యాలు ఇవ్వాలన్నా, రాష్ట్రంలో చిరు ధాన్యాల విస్తీర్ణం గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద చిరు ధాన్యాలు సేకరించడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద పంపిణీ చేయడానికి కేంద్రం సహాయం చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో అది అమలు కావడం లేదు. అందుకే మనకు అవసరమైన చిరు ధాన్యాలన్నీ ఇతర రాష్ట్రాల నుండే వస్తున్నాయి.

రాష్ట్రంలో మొక్క జొన్న విస్తీర్ణం 5,46,865 ఎకరాలు, ఈ మొక్క జొన్న ప్రధానంగా కోళ్ళ ధనాకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇటీవలి కాలంలో మొక్క జొన్నను ఇథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నందువల్ల, కోళ్ళ దాణాకు అవసరమైన మొక్క జొన్న అందుబాటులో ఉండడం లేదు. రాష్ట్రంలో 29 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. వీటన్నిటికీ మొక్కజొన్న వాడాలంటే, విస్తీర్ణం మరింత పెరగాల్సి ఉంటుంది. అంటే, ఇతర పప్పు ధాన్యాల , నూనె గింజల విస్తీర్ణం మరింత తగ్గిపోతుంది.

ఒకవైపు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరుగుతూ, ఇప్పటికే సాగు భూములు తగ్గిపోతున్న దశలో, పారిశ్రామిక ఉత్పత్తుల వైపు సాగు భూములు మళ్లిపోతే , ప్రజలకు, పశువులకు తీవ్రమైన పౌష్టికాహార కొరత తప్పకుండా ఏర్పడుతుంది. అందుకే బియ్యం, జొన్న, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును మనం గట్టిగా వ్యతిరేకించాలి.

రాష్ట్రంలో రైతులకు కేవలం వరి ధాన్యం ఉత్పత్తిలో మాత్రమే కొంత నికర మిగులు ఉంటున్నది. యాంత్రీకరణ, సాగు నీరు అందుబాటు, ప్రభుత్వం ధాన్యం సేకరణ, కనీస మద్ధతు ధరలపై బోనస్ లాంటివి రైతులను వరి ధాన్యం సాగు వైపు నెడుతున్నాయి. ఇథనాల్ పరిశ్రమ విస్తరణ రైతులను మొక్కజొన్న వైపు నెట్టే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి మారాలంటే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పప్పు ధాన్యాలు , నూనె గింజలు, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలి. కూరగాయల సాగును గణనీయంగా పెంచాలి. రైతులకు న్యాయమైన ధరలు ఇచ్చి , వీటిని ప్రభుత్వం సేకరించడానికి పూనుకోవాలి. ప్రాసెసింగ్ చేయించి , వినియోగ దారులకు చవక ధరలకు అందించాలి.

రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఇందుకు సన్నద్దమ్ చేయాలి. అడవి జంతువుల వల్ల నష్టపోయే పంటలను కూడా పంటల బీమా పరిధిలోకి తీసుకు రావాలి. రేషన్ షాపుల కేంద్రంగా ఏర్పాటవుతున్న జన్ పోషణ కేంద్రాలలో కూడా రైతు, మహిళా సహకార సంఘాల నుండీ సేకరించిన, ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న కొన్ని భూములను పశువుల మేత కోసం కేటాయించడం, ఆయా భూములకు కూడా రైతు భరోసా సహాయం అందించడం మంచిదే. మరీ ముఖ్యంగా ఎకరం లోపు సాగు భూములు కలిగిన రైతులను వరి,పత్తి కాకుండా, కూరగాయల సాగు వైపు ప్రోత్సహించడం చాలా అవసరం.

Tags:    

Similar News