యూట్యూబ్ ఛానళ్ల హోరు... జర్నలిజం విలువల బేజారు..

జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి ఎవడ్నిబడితే వాడ్ని బండబూతులు తిట్టి, నోటికొచ్చిన అవినీతి ఆరోపణలు చేసి యుట్యూబర్లు ప్రజాదరణ పొందుతున్నారు.

Update: 2024-10-26 16:35 GMT

ఏదైనా వృత్తి (ప్రొఫెషన్) అంటే అందులో చేరి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, దాన్నుంచి భుక్తి పొందటానికి కొన్ని విద్యార్హతలు, శిక్షణ అవసరం. మెడిసిన్, ఇంజినీరింగ్, టీచింగ్ వంటి వృత్తులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేదా కార్పొరేట్ రంగాల్లో నిర్దిష్ట క్వాలిఫికేషన్స్ ఉంటాయి. లేకపోతే ఆ వృత్తుల్లోకి రానివ్వరు. సామాన్య జన వాడకంలో వృత్తి హోదా పొందిన భిక్షాటన (బెగ్గింగ్) లాంటి వాటికి మాత్రం విద్యార్హతలు అవసరం లేదు. బెగ్గింగ్ లాగానే కనీస విద్యార్హత అవసరం లేని వృత్తి-- జర్నలిజం.

జర్నలిజం కోర్సు చేయకపోయినా, అస్సలు చదువు రాకపోయినా ఏదో పత్రికలోనో, టీవీ ఛానెల్ లోనో చేరితే జర్నలిస్టు అయిపోవచ్చు. అలాంటి వారికి యాజమాన్యం సిఫార్సు చేస్తే సమాచార, పౌర సంబంధాల శాఖ నోరు మూసుకుని 'జర్నలిస్టు' అనే గుర్తింపు కార్డు జారీ చేసి కొన్ని సౌకర్యాలు సమకూరుస్తుంది.

ఆ పేపర్ లేదా ఛానెల్ ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి కొన్ని చట్టాలకు లోబడి ఉండేలా ఏర్పాటు ఉంటుంది కాబట్టి అక్రిడిటేషన్ కార్డు ప్రభుత్వం తరఫున ఇస్తారు. ఆ రాజముద్ర ఉంటే అయన లేదా ఆమె ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం (Fourth Estate) ప్రతినిధి అన్నట్లు, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అందరు పౌరులకన్నా కొద్దిగా ఎక్కువగా ఎలుగెత్తే హక్కుదారులు అన్నట్లు. ఇదంతా ఇంటర్నెట్ విప్లవం రాకముందు వ్యవహారం. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా మారింది.

ఈ-మెయిల్ ఉన్న ఎవ్వరైనా దాని ఆధారంగా ఒక యూట్యూబ్ (Youtube) ఛానెల్ పెట్టి ఏ అంశం మీదనయినా సరే లెక్చర్ కొట్టొచ్చు. వివిధ రంగాల నుంచి బైటికి వచ్చి ఇట్లా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ప్రజాదరణ పొందుతున్నవారు కోకొల్లలు. వారికి గుర్తింపునకు గుర్తింపు, డబ్బుకు డబ్బు. యూట్యూబ్ వాడు సమాచార ప్రసరణకు ఇచ్చిన మంచి అవకాశం మూలంగా లక్షలాది వార్తాహరులు, వార్తా విశ్లేషకులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. లోగో ఉన్న ఒక గొట్టం (మైక్) పట్టుకుని ఎవర్నైనా వారు ఏదైనా అడగవచ్చు. అభిప్రాయం చెప్పకపోతే ఇబ్బంది పెట్టవచ్చు. 'నువ్వు జర్నలిస్టువు కాదు గదా?' అని గొట్టం అవతలి వ్యక్తి అన్నా, ''పోపోవయ్యా... ఎంతమందికి చెప్పాలి?' అని నెట్టేసినా... జర్నలిజం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడిగా దాన్ని చిత్రీకరించవచ్చు. జర్నలిస్టులు చేసే పనే తామూ చేస్తున్నాం కాబట్టి తమను జర్నలిస్టులు అనడంలో వచ్చిన నొప్పి ఏమిటని యూట్యూబర్లు వాదిస్తున్నారు. పేపర్లు, టీవీ ఛానెల్స్ లో పనిచేసిన మాజీ జర్నలిస్టులు కూడా యూ ట్యూబర్ల అవతారం ఎత్తిన నేపథ్యంలో వారిని కూడా జర్నలిస్టులు అనాలా? లేక వేరే ఏదైనా హోదా కనిపెట్టాలా? వార్త పత్రికలకన్నా మిన్నగా వార్తలు ప్రసారం చేస్తున్న వెబ్ సైట్స్, బ్లాగ్స్ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వీటికి సమాధానం కనిపెట్టలేక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. అధికారంలోకి రావడానికి కారణమైన ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ప్రజాస్వామ్య పరిరక్షణ సాధనాలుగా మొదట్లో కనిపించి అధికారం వచ్చాక పెద్ద తలనొప్పిగా అనిపించడం విచిత్రం.

కెమెరాలు, మైకులతో ఇద్దరు తన సొంతూరుకు పోయి ప్రజల దగ్గర అభిప్రాయాలు సేకరిస్తుంటే ఒళ్ళు మండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ‘అయ్యా... జర్నలిస్టు అంటే ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోవాలి,’ అని బహిరంగంగా అభ్యర్ధించారు. తమ వల్ల మాత్రమే ముందుగా తెలంగాణ వచ్చిందని, ఆ తరువాత తమ కథనాల వల్లనే కేసీఆర్ గారు ఇంటికి పోయారని త్రికరణ శుద్ధిగా నమ్మే 'జర్నలిస్టులు' దీనికి నొచ్చుకున్నారు. కొందరైతే ముఖ్యమంత్రిని నోటికొచ్చింది తిడుతూ ప్రసారం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో ఈ ప్రభుత్వానికి పాలుపోవడంలేదు. ఈ విషమ పరిస్థితిని డీల్ చేసే నిపుణులు సర్కార్ బృందంలో ఉన్నట్లు కనిపించడం లేదు. రియల్ యూట్యూబర్లో, హైర్డ్ (hired) యూట్యూబర్లో తిట్టిపోస్తుంటే మనమూ కొందర్ని ఎంగేజ్ చేసి అదే పని చేస్తే చాలనుకునే బండ విధానం సర్కారులో నడుస్తోంది. ఈ క్రమంలో గందరగోళం పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా (Mainstream) కలుషితం అయిన ఈ పరిస్థితుల్లో స్వచ్ఛమైన సమాచారాన్ని ప్రజలకు పంచడానికి టెక్నాలజీ ఇచ్చిన వరం యూట్యూబ్ ఛానెల్స్ అని అనుకుని పనిచేసే మంచోళ్ళు దాదాపు లేరు. ఒక్కరూ ఇద్దరూ ఉన్నా వాళ్ళను ఆదరించే వారు లేక వ్యూవర్షిప్ సరిగా లేక ఉసూరుమంటున్నారు. చూసే వాళ్ళ సంఖ్యను, అంటే ప్రజాదరణను బట్టి రేటింగ్ ఉండీ, దాన్ని బట్టి డబ్బులు వచ్చే మెకానిజం అమలవుతూ ఉండటంతో యూట్యూబ్ వాళ్ళను మరీ తీసిపారేయడానికి వీల్లేని పరిస్థితి. అయితే, జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి ఎవడ్నిబడితే వాడ్ని బండబూతులు తిట్టి, నోటికొచ్చిన అవినీతి ఆరోపణలు చేసి యుట్యూబర్లు ప్రజాదరణ పొందుతున్నారు. మన జనాలకు కావలసిఉంది మసాలా సరుకు, బూతు వినోదం కాబట్టి అదే సప్లై చేసి వాళ్లు పేరు, డబ్బు గడిస్తున్నారు. సంసారపక్షంగా పద్ధతి ప్రకారం అంటే జర్నలిజం విలువల ప్రాతిపదికన ప్రోగ్రాం చేస్తే మన జనం చూడరు గాక చూడరు. అదొక దౌర్భాగ్యం.

రాజకీయేతర యూట్యూబర్లు (వంటలు, వ్యవసాయం వగైరా) పర్వాలేదు. వాళ్లతో మనకు పేచీ లేదు. కానీ రాజకీయ వార్తలు ఇస్తూ, డిబేట్లు చేస్తూ, విశ్లేషణలు ఇచ్చే యూట్యూబర్లు నానా బీభత్సం సృష్టిస్తున్నారు. రాజకీయ యూట్యూబర్లు ఐదు రకాలుగా కనిపిస్తున్నారు. 1) మోదీ గారిని, హిందువులను బాగా తిట్టి లౌకికవాదులని భుజాలు ఎగిరేసే బ్యాచ్, 2) కాషాయం మాత్రమే జండా, ఎజెండా గా, తాము మాత్రమే హిందూ సమాజానికి పరిరక్షకులమని అనుకుని వండివార్చే బృందం 3) పరమత ద్వేషంతో మెలిగే ముస్లింల బేకార్ పనులను సైతం కేవలం మతం ప్రాతిపదికన వెనకేసుకొస్తూ కుల రాజకీయాల మీద మాత్రమే మాట్లాడే బ్యాచ్, 4) బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ గళం గట్టిగా వినిపించే బాపతు, 5) నిష్పాక్షికత అనే పదాన్ని నిఘంటువు నుంచి విసిరిపడేసి ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేక వార్తల మీదనే బతికేసే టైపు.

ప్రజాస్వామ్యానికి పనికి వచ్చే మాటలు కాకుండా పనికిరాని చెత్త విషయాల మీద యూట్యూబ్ ప్రోగ్రాంలు బాగా పెరిగాయన్న విమర్శ బలంగా వినపడుతూ ఉంది. జనాలకు ఆసక్తి కలిగించే అక్రమ సంబంధాలు, సెక్స్, హింస, మతం మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రసారాలు చేస్తున్నారు. ఈ మధ్య అఘోరాల మీద యూట్యూబర్స్ ఆసక్తి పెరిగింది. పుర్రెల్లో తింటామని చెప్పుకునే లేడీ అఘోరాస్ మీద తెగ కుమ్మేస్తున్నారు. జర్నలిజం కోర్సు చేసినవారు, మీడియాలో పనిచేసి బైటికి వచ్చి పేరెన్నికగన్న యూట్యూబ్ ఛానెల్స్ లో పనిచేస్తున్న యాంకర్లు, యాంకరమ్మలు కూడా వ్యూవర్షిప్ యావలో పడి చెత్త ప్రోగ్రామ్స్ రేయింబగులు దున్నేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు గా పేరున్న వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే సినీ గలీజ్ గాళ్లను (ముఖ్యంగా డైరెక్టర్స్ ను) స్టూడియో లో కూర్చోబెట్టుకుని రోజూ ఇంటర్వ్యూస్ చేసి గబ్బు లేపుతున్నారు.

యూట్యూబర్లు ఏకిపారేస్తారన్నా బెరుకుతో ఎవరూ మాట్లాడడం లేదు కానీ, పబ్లిక్ లైఫ్ లో ఉన్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిచ్చి థంబ్ నెయిల్స్ విషయంతో సంబంధం లేకుండా పెట్టి పరువు తీస్తారన్న భయంతో వారు మిన్నకుంటున్నారు. "ఎన్నికలప్పుడు అభ్యర్థులను పీల్చిపిప్పిచేయడంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా తో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పోటీ పడ్డాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే భయంగా ఉంది. యూట్యూబర్లను రమ్మనలేము, పొమ్మనలేము," అని ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు.


వార్తలు వేగంగా, పదునుగా ఇవ్వడంలో యూట్యూబర్లు ప్రధాన మీడియాతో పోటీ పడుతున్నా వారిని జర్నలిస్టులు అనడాన్ని ఇప్పుడు మీడియాలో ఉన్న జర్నలిస్టులు, జర్నలిజం విద్యావంతులు అస్సలు అంగీకరించరు. "జర్నలిజం వృత్తిగా స్వీకరించే వారికి ఒక విద్యార్హత ఉండాల్సిన అవసరం లేదన్నది ఒక దౌర్భాగ్యకరమైన విషయం. ఈ-మెయిల్ ఉంటే చాలు. యూ ట్యూబ్స్ పెట్టి జర్నలిస్టులమని వాదిస్తే ఒప్పుకోవడం కష్టం," అని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం మీద అనేక పుస్తకాలు రాసిన, ప్రచురించిన గోవిందరాజు చక్రధర్ అన్నారు.

యూట్యూబ్ వాళ్ళు కాపీ రైట్ వంటి వాటిని నివారించడానికి ఇంటర్నల్ మెకానిజం ఏర్పాటు చేసినా, కంటెంట్ ను కనిపెట్టి చూడడం కష్టమని అయన చెప్పారు. డీసెన్సీ, డెకోరం లేకుండా ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం అనేక మంది యూట్యూబర్లకు అలవాటు అయ్యిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

ఈ యూట్యూబర్స్ తో ఇంకో సమస్య ఉంది. వాళ్లకు వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం బాగా ఎక్కువవుతోంది. తమకు నచ్చని భావజాలం ఉన్నవాళ్లను రాయలేని పదజాలంతో దుమ్మెత్తి పోస్తారు. తమ పద్ధతి బాగోలేదని చెప్పే వారికి కులమో, మతమో, రాజకీయ సిద్ధాంతమో అంటగట్టి బద్నామ్ చేస్తారు చిటికెలో. నిష్పాక్షికంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వీడియో చేస్తే... 'మోదీ భక్త్' అని కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుకూల ఛానెల్స్ వాళ్ళూ, వారి వ్యూవర్స్ ముద్ర వేస్తారు. రాహుల్ మంచి మాట చెప్పాడని ఒక క్లిప్ చేస్తే... 'దేశ ద్రోహి' అంటారు కాషాయ బ్యాచ్. ఒక కులానికి వ్యతిరేకంగా చెత్త మాట్లాడే వాళ్ళను..తప్పురా నాయనా అంటే...'మనువాది' అంటారు. రాజ్య హింసకు బలైన ప్రొఫెసర్ సాయిబాబా గారికి నివాళిగా రాస్తే...ఏదేదో అంటారు.

యూట్యూబర్స్ సృష్టిస్తున్న ధ్వనిలో నిత్యం సత్యం చాలావరకు సమాధి అవుతోంది. సైడ్స్ తీసుకోకుండా టాపిక్ ను టాపిక్ గా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా నికార్సైన జర్నలిస్ట్ గా చూద్దామంటే బతకనివ్వడం లేదు. భలే ఇబ్బందిగా ఉంది ఈ చటుక్కున లేబులింగ్ చేసే బుర్ర తక్కువ మూర్ఖపు దండుతో. నేను ప్రత్యక్షంగా ఇబ్బంది పడుతున్నా ఈ విషయంలో. కేసీఆర్ గురించి ఏదైనా విశ్లేషిస్తే తెలంగాణ వ్యతిరేకి అంటున్నారు. రేవంత్ చేసిన తప్పిదని చెబితే గులాబీ తొత్తు అంటున్నారు. అందుకే ట్రోలింగ్ బాధ పడలేక పిరికిగొడ్లు ఏదో ఒక సైడ్ తీసుకుని స్టోరీలు చేస్తున్నారు.

మీడియా ఫ్రీడమ్, భావప్రకటన హక్కూ అనుకుంటూ గొట్టాలు పట్టుకుని వసూలు చేసే వాళ్ళు ఎక్కువై, తాము చేసేది మాత్రమే జర్నలిజం అని వారు ప్రచారం చేస్తుంటే జర్నలిస్టిక్ ఎథిక్స్ (Media Ethics) అనే సత్తెకాలపు ఎడిటర్లు, జర్నలిస్టులు ఏడుస్తున్నారు.

ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో కదా!

Similar News