రాముడి తర్వాత భరతుడా, లక్ష్మణుడా?
రామాయణంలో నిరుత్తరకాండ-38 : ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణంలో చెప్పని విశేషాలు
దశరథుడు పుత్రకామేష్టి చేయడం దగ్గర ఆగిన రామాయణకథను తిరిగి అందుకుని ముందుకు వెడదాం...
రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్నులు జన్మించడంతో మొదలుపెట్టి, విశ్వామిత్రుడనే ముని దశరథుని దగ్గరికి వచ్చినట్టు చెప్పడంతో బాలకాండలోని 18వ సర్గ ముగుస్తుంది.
ముందుగా ఈ నలుగురు సోదరుల జననక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పైన చెప్పిన క్రమానికి భిన్నంగా ‘రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్ను’ లనే వరసలో వారిని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. కానీ వారి జననసందర్భంలో రామాయణం చెప్పిన వరస మాత్రం రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్నులనే.
18వ సర్గలోని 10, 12,13 శ్లోకాలు ఇలా ఉంటాయి:
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణసంయుతం
విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనం
సర్వలక్షణాలతో ఉన్నవాడు, విష్ణువులో అర్ధభాగము, గొప్ప అదృష్టవంతుడు, ఇక్ష్వాకువంశవర్ధనుడు అయిన రాముని కౌసల్య కన్నది.
భరతోనామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః
సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వైః సముదితో గుణైః
సత్యపరాక్రముడు, సాక్షాత్తు విష్ణువులో నాలుగవ భాగమూ, అన్ని గుణాలూ ఉన్నవాడు అయిన భరతుడు కైకేయికి పుట్టాడు.
అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ
వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ
ఆ తర్వాత సకల అస్త్రాలలో నేర్పు ఉన్నవారు, విష్ణువులో అర్ధభాగము, వీరులు అయిన లక్ష్మణశత్రుఘ్నులను సుమిత్ర కన్నది.
పై శ్లోకాల ప్రకారం- రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు...! ఇదీ జననక్రమం.
రామాయణం ఇంత స్పష్టంగా చెబుతున్న ఈ జననక్రమానికి బదులు, రాముని తర్వాత లక్ష్మణుని చేర్చి చెప్పే క్రమం ఎందుకు, ఎలా వ్యవహారంలోకి వచ్చిందన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనినే మరో విధంగా చెబితే, రెండో స్థానంలో ఉన్న భరతుడు మూడో స్థానానికి వెళ్ళి, లక్ష్మణుడు రెండో స్థానంలోకి ఎలా వచ్చాడు; వారిద్దరి ప్రాధాన్యాలు ఎందుకు తలకిందులయ్యాయి? వ్యవహారసౌలభ్యం కోసం ఈ చిన్నపాటి మార్పు జరిగి ఉండచ్చనీ, ఇదేమంత పెద్ద విషయం కాదనీ అనుకుంటే పొరపాటు; కథానిర్మాణంలో భాగంగానే, ఉద్దేశపూర్వకంగానే భరత, లక్ష్మణుల వరస మారింది; అందుకు అవసరమైన వివరణను, సాక్ష్యాలను, సమర్థనను రామాయణమే స్వయంగా అందిస్తోంది. రామలక్ష్మణులను ఒక జంటగానూ, భరతశత్రుఘ్నులను ఇంకొక జంటగానూ అదే కూర్చి చెబుతోంది.
భరత, లక్ష్మణుల స్థానాలు తలకిందులు కావడం వారి వివాహాన్ని కూడా ప్రభావితం చేసింది. అదెలాగో ముందుముందు చెప్పుకుందాం.
అదలా ఉంచితే, బాలకాండ, 18వ సర్గలో 27నుంచి 30వరకూ ఉన్న నాలుగు శ్లోకాలు రామలక్ష్మణుల అన్యోన్యతను చెబితే; 31 వ శ్లోకం భరతశత్రుఘ్నుల అన్యోన్యతను చెబుతుంది:
బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః
రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః
సంపదను వృద్ధి చేసే లక్ష్మణుడు చిన్నప్పటినుంచీ లోకాలకు మనోహరుడు, అన్నగారు అయిన రామునిపట్ల ఎప్పుడూ అత్యధికస్నేహభావంతో ఉండేవాడు.
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిఃప్రాణ ఇవాపరః
రాముడికి సమస్తమైన ప్రియాలూ చేకూర్చడానికి శరీరాన్ని సైతం అర్పించే లక్ష్మీసంపన్నుడైన లక్ష్మణుడు, అతనికి బహిఃప్రాణమయ్యాడు.
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః
మృష్టమన్న ముపానీతమశ్నాతి న చ తం వినా
లక్ష్మణుడు పక్కన లేకుండా రాముడు నిద్రకూడా పోయేవాడు కాదు; అతను లేకుండా రుచికరమైన భోజనం కూడా తృప్తిగా చేసేవాడు కాదు.
యదాహి హయమారూఢో మృగయాం యాతి రాఘవః
తదైనం పృష్ఠతోzన్యేతి స ధనుః పరిపాలయన్
రాముడు గుర్రమెక్కి వేటకు వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు విల్లు పుచ్చుకుని అతని వెంటే వెళ్ళేవాడు.
ఇక భరత, శత్రుఘ్నుల అన్యోన్యతను రామాయణం ఇలా చెబుతుంది:
భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః
ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః
అలాగే, లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునికి ప్రాణాల కంటె ఎక్కువ ప్రియుడయ్యాడు, శత్రుఘ్నునికి భరతుడు కూడా అలాగే ప్రియుడయ్యాడు.
రామాయణం ఒక పక్క రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్నులనే జననక్రమాన్ని ఉన్నదున్నట్టు చెబుతూనే, మరో పక్క రామలక్ష్మణులను ఒక జంటగానూ, భరతశత్రుఘ్నులను మరో జంటగానూ విడదీసి భిన్నమైన వరసక్రమానికి ఎందుకు అవకాశమిచ్చిందన్నది ప్రశ్న. తనకు లక్ష్మణుడు బహిఃప్రాణమైనంత మాత్రాన రాముడు భరతుని వేరుగా చూశాడని కానీ, ప్రేమించలేదని కానీ రామాయణం ఎక్కడా చెప్పని మాట నిజం. కాకపోతే, రాజ్యాధికారానికి భరతుడు తనకు పోటీ కనుక రాముడు అతణ్ణి అనుమానించిన సందర్భాలు మాత్రం ముందు ముందు కనిపిస్తాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఈ నలుగురు సోదరుల మధ్యా పరస్పరప్రేమానురాగాలు కలిగిన అన్నదమ్ముల సంబంధానికి అదనంగా రాజకీయసంబంధం కూడా ఉంది. రామలక్ష్మణులను ఒక జంటగానూ, భరతశత్రుఘ్నులను మరో జంటగానూ విడదీయడంలో వ్యక్తమవుతున్నది రాజకీయసంబంధమే. భవిష్యత్తులో రాజ్యాధికారం విషయంలో రాముడికీ, భరతుడికీ మధ్య పోటీ తలెత్తబోతోందనీ, ఆ పోటీలో రాముడి వెంట లక్ష్మణుడు, భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండబోతున్నారనీ- కథకుడు వారి బాల్యదశను చెబుతున్నప్పుడే సూచించాడన్నమాట.
ఈ విధంగా చూసినప్పుడు అన్నదమ్ముల సంబంధంలో అంతర్లీనంగా ఉన్న రాజకీయం కూడా వెల్లడై రామాయణానికి గల రాజకీయస్వభావాన్ని పట్టిచూపుతుంది. ఇంకొకటేమిటంటే, పైన చెప్పిన జననక్రమం దశరథుని ముగ్గురు భార్యల ప్రాధాన్యక్రమాన్ని కూడా నిర్దేశిస్తోంది. ఉదాహరణకు, కౌసల్యకు రాముడు జన్మించినట్టు చెప్పిన వెంటనే కైకకు భరతుడు పుట్టాడని చెప్పి, ఆ తర్వాత మాత్రమే సుమిత్రకు లక్ష్మణశత్రుఘ్నులు పుట్టారని చెబుతోంది. అంటే, రాముడి తర్వాతి స్థానం భరతుడికి ఇచ్చినట్టే, కౌసల్య తర్వాతి స్థానం కైకకు ఇచ్చిందన్నమాట. ఇక్కడ కూడా కౌసల్య-సుమిత్ర-కైక అన్న వరస మారి సుమిత్ర మూడో స్థానానికి వచ్చింది. ఇది కూడా రామాయణకథకు గల రాజకీయస్వభావానికి సూచన.
అలాగే, రామలక్ష్మణులను ఒక జంటగానూ, భరతశత్రుఘ్నులను మరో జంటగానూ చూపడం ద్వారా అన్నదమ్ములుగా ఆ జంటల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని చెబుతూనే కథకుడు మరో సూచన కూడా చేస్తున్నాడు; అది, వాళ్ళ మధ్య ఉన్న స్వామి-సేవక సంబంధం. రాముడికి సమస్తమైన ప్రియాలూ చేకూర్చడానికి లక్ష్మణుడు తన శరీరాన్ని సైతం అర్పించడానికి సందేహించడనీ, రాముడు గుర్రమెక్కి వేటకు వెడుతుంటే అతను విల్లు పుచ్చుకుని అతని వెంటే వెడతాడని చెప్పడంలో స్వామి-సేవక సంబంధం స్పష్టంగా వ్యక్తమవుతూనే ఉంది. భరత-శత్రుఘ్నుల జంటకూ ఇదే వర్తిస్తుంది.
ఇది అన్నదమ్ముల సంబంధంలోనే స్వామి-సేవక సంబంధాన్ని కూడా కలిపి చెప్పడం. పితృస్వామ్యంలానే ఇది కూడా ‘భ్రాతృస్వామ్యం’ పేరిట గుర్తించిన ఒక సామాజికరూపం కిందికి వస్తుంది. పితృస్వామ్యంలో తండ్రి యజమాని అయితే, భార్య, కొడుకులు, పరిచారకులతో సహా అందరూ ఆయనకు దాసులు, లేదా సేవకులే అవుతారు. తండ్రి తర్వాత పెద్దకొడుకు యజమాని అయినప్పుడు అదే ఏర్పాటు పునరావృత్తమవుతుంది; అందులో అతని భార్యా, కొడుకులు, పరిచారకులతోపాటు తమ్ముళ్ళు కూడా దాసులూ, లేదా సేవకులే అవుతారు.
రామాయణం చెప్పిన నలుగురు సోదరుల జననక్రమానికి భిన్నమైన జననక్రమం వ్యవహారంలోకి రావడం గురించి కానీ, వారిని రెండు జంటలుగా విడదీయడం గురించి కానీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తన బాలానందినీ వ్యాఖ్యలో ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు; ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
***
కాకపోతే, పుల్లెలవారితో సహా రామాయణవ్యాఖ్యాతలు పలువురు ఎక్కువగా పట్టించుకుని చర్చించిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పుత్రకామేష్టి దరిమిలా అందిన పాయసంలో దశరథుని భార్యలలో ఎవరికెంత వాటా లభించిందన్నది ఒకటి; రామభరతలక్ష్మణశత్రుఘ్నులకు విష్ణువు అంశ ఎంతెంత లభించిందన్నది రెండవది. పాయసవిభాగం గురించిన చర్చను పక్కన పెట్టి ప్రస్తుతాంశమైన విష్ణువు అంశ ఎవరిలో ఎంత ఉందన్న చర్చకు పరిమితమవుదాం.
పైన పేర్కొన్న వాల్మీకిరామాయణశ్లోకాలను పుల్లెలవారు ఉదహరించి, ‘రాముడు విష్ణువు యొక్క అర్ధభాగమూ, భరతుడు చతుర్థాంశమూ, లక్ష్మణ, శత్రుఘ్నులు అర్ధరూపులూ అవుతా’రని అవి చెబుతున్నాయంటూ, మహేశ్వరతీర్థ, గోవిందరాజులు వాటికి చెప్పిన అర్థాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం, విష్ణువులో చతుర్థభాగమని చెప్పిన భరతుడు ఎనిమిదవ భాగమవుతాడు; విష్ణువు యొక్క అర్ధసమన్వితులని చెప్పిన లక్ష్మణశత్రుఘ్నులు ‘విష్ణువు యొక్క అంశతో కూడినవారు’ అవుతారు. ఇంతకీ వీరు చతుర్థభాగమన్న మాటకు ఎనిమిదవభాగమనే అర్థం ఎలా చెప్పారో తెలియదని పుల్లెలవారు అంటారు. ‘అర్ధ’ అనే శబ్దానికి ‘సగ’మని కాకుండా, వీరు చెప్పిన ‘భాగము’, ‘అంశ’ అనే అర్థాలను తీసుకుని ఈ చిక్కుముడిని విప్పడానికి ఆయన ప్రయత్నించారు.
ఆ ప్రయత్నంలో ఆయన ఏం చేశారంటే, ‘అర్ధ’ శబ్దానికి రామలక్ష్మణశత్రుఘ్నుల సందర్భంలో ‘అంశ’ అనే అర్థాన్నీ; భరతుని సందర్భంలో ‘భాగ’మనే అర్థాన్నీ చెప్పారు. దాని ప్రకారం, మూలంలో విష్ణువు యొక్క అర్ధభాగమని చెప్పిన రాముడు, ‘విష్ణువు యొక్క అంశ’ అవుతాడు; మూలంలో ‘విష్ణువు యొక్క అర్ధసమన్వితు’లని చెప్పిన లక్ష్మణశత్రుఘ్నులు ‘విష్ణువు యొక్క అంశతో కూడినవారు’ అవుతారు; భరతుడు మాత్రం మూలంలో చెప్పినట్టే ‘విష్ణువు యొక్క నాలుగవ భాగ’మే అవుతాడు. అంటే ఏమిటన్నమాట...’అర్ధ’ అనే శబ్దానికి ‘సగ’మనే అర్థం గల్లంతై ‘అంశ’, ‘భాగము’ అనే అర్థాలు మాత్రమే వర్తించాయి. నిఘంటువు కూడా ‘అర్ధ’ శబ్దానికి ఆ రెండు అర్థాలూ చూపుతున్న మాట నిజమే కానీ, ‘సగ’మనే అర్థం గల్లంతు కావడమే ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఇంతకీ ఈ కసరత్తు అంతా ఎందుకు చేయవలసివచ్చిందంటే, రాముని విష్ణువులో అర్ధభాగమని మూలశ్లోకం చెప్పడం- మిగతా వ్యాఖ్యాతల సంగతేమో కానీ- పుల్లెలవారికి మాత్రం నచ్చలేదు; ఆ మేరకు ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. దాని ప్రకారం, విష్ణువుకు అంశను కల్పించడమే వ్యవహారంలో ఉంది; విష్ణువులోని అర్ధ అంశతో పుట్టినవాడు సకలజగన్నాథుడు కాలేడు; సకలజగన్నాథుడైనప్పుడు అర్ధాంశతో చెప్పడం సరికాదు; శ్రీరాముడు మహావిష్ణువు యొక్క పూర్ణావతారం!
నిఘంటువు ‘అర్ధ’శబ్దానికి ‘అంశ’ అనే అర్థాన్ని కూడా చూపుతున్నప్పుడు, ‘అర్ధాంశ’ అనే మాట ఏమవుతుంది? అగ్గినిప్పులా పునరుక్తి అవదా?!
ఏతావతా ఏం తేలుతోంది? సకలజగన్నాథుడైన రాముడు విష్ణువులో అర్ధభాగం కాదనీ, విష్ణువు యొక్క పూర్ణావతారమనీ చెప్పడానికి మూలంలోని ‘అర్ధ’ శబ్దాన్ని సగమనే అర్థంనుంచి తప్పించి ‘అంశ, భాగము’ అనే అర్థాలకు పరిమితం చేశారన్నమాట!
వ్యాఖ్యాతలలో మూల విధేయతకన్నా రామునిపై భక్తి, విధేయతలదే పై చేయి అయిందని దీనినిబట్టి అనుకోవాలా?!
మిగతా విషయాలు తర్వాత...