రాజ్యాంగం పీఠిక ఎందుకు ఇపుడు చర్చనీయాంశమయింది?

రాజ్యాంగం ఒక పాట కాదు, ఒక పాఠం, పీఠిక ఒక ప్రతిజ్ఞ

Update: 2024-08-05 04:01 GMT

మన రాజ్యాంగానికి ఒక గొప్పి పీఠిక ఉంది. అది చదవడం మంచిదని మనకు తెలుసు. కాని  ఆ పీఠిక చదివితే నేరమని కేసు పెట్టారంటే నమ్ముతారా?  పీఠిక చదివితే నేరమా అని ఆ కేసులో డిల్లీ కోర్టు తీవ్రంగా విమర్శ చేసిన తరువాత ప్రభుత్వం అధికారికంగా పీఠిక చదివితీరాల్సిందే అని ప్రకటించారు. ఇంకా నయం కేసులు పెట్టి జైలుకు పంపిస్తామనలేదు.

2020లోపీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని  రాష్ట్రపతి స్వయంగా అధికారికంగా ఆరంభించారు . 2015లో ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పీఠిక చదివారు. న్యాయ పర్యావరణశాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా చదవాలని ఆదేశం జారీ చేసింది.

భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణమన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం, సందేహం లేదు. ఒక గౌరవ వందనగీతం. అయితే, రాజ్యంగం  పీఠిక ఒక పాట కాదు ఒక పాఠం, ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం. ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నిమంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కాని ఈ విషయాన్ని రక్షిస్తామన్నవారు, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారు, అర్థం చేసుకోవలసిన వారు అందరూ మరిచిపోయారు.

"అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ, నిర్మించిన కృత్రిమచట్టాల్‌," అని శ్రీ శ్రీ అన్నట్టు

ఈ చట్టపు పీఠిక చదవడం ప్రభువుల చుట్టపుకు కోపకారణం అయింది.

2020 డిసెంబర్ లో భీమ్ సేన్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీ దర్యాగంజ్  పోలీసులు అరెస్టు చేశారు. సిటిజన్స్ చట్టం (Citizenship Amendment Act 2019.)కు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొని  ఆయన చేసిన ప్రసంగం రెచ్చగొట్టేదిగా ఉందని పోలీసులు 2020 డిసెంబర్ 21న ఆయన ఆరెస్టు చేసి చాలా సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అదనపు సెషన్స్ జడ్జి  కామిని లావ్ చేసి వ్యాఖ్య చాలా ఆసక్తికరమయింది. ఇది రాజ్యాంగ పీఠక ప్రాముఖ్యాన్ని గుర్తించేలా చేసింది.ఆజాద్ చేసిన ప్రసంగం ఏమిటో కాదు, రాజ్యాంగ పీఠికను చదివారు. అంతే.

పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించిన చంద్రశేఖర్ ఆజాద్ పై, పీఠిక చదివాడని రాజ్యాంగాన్ని జనానికి చూపాడని క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యుఎపిఎ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది.

చివరికు డిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకు న్యాయాధికారులకు, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకు అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడు ఆ రాజ్యాంగం సరైనదైనపుడు, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గాని బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనులమధ్య.

I may observe that for the Judges, legal persons and the Offices under the Constitution, the Constitution of India is a sacred document and if this is correct, then reading this document cannot prima-facie be taken as incitement. : ADJ Kamini Lau, Additional Sessions Judge, Delhi.

ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పని సరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాలయాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది.

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం

వైకింగులు, శ్వేత హుణులూ సిధియన్లు, పారశీకులూ,

పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన

స్థాపించిన సామ్యాజ్యాలూ, నిర్మించిన కృత్రిమచట్టాల్‌

ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై

పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను.

ఇవి కవోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాలిప్పడు! దాచేస్తే దాగని సత్యం

శ్రీశ్రీ అడిగినట్టు, సత్యం ఎవరు పిటిషన్ చేసుకుంటారు. జవాబు ఎవరు వినేవాళ్లు. అందుకే శ్రీశ్రీ నిలదీస్తున్నాడు.

బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ

ఇంకానా! ఇకపై చెల్లవు ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,

ఒక జాతిని వేరొక జాతీ, పీడించే సాంఘిక ధర్మం

ఇంకానా ? ఇకపై సాగదే. 


Tags:    

Similar News