చర్చించలేక అసహనం: స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు!

కామెంట్స్ లో స్త్రీ లను కించపరిచే పద ప్రయోగం ఏమిటి? స్త్రీల శరీర అవయవాల గురించి ఎగతాళి చేయడం ద్వారా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం కాదా, ఇదేమి సంస్కారం!;

Update: 2025-03-08 09:13 GMT

‘రాజ్య సభలో అంబేడ్కర్, సుందరయ్య మధ్య ‘కుల’ గొడవ’ అన్న శీర్షికన గురువారం ‘తెలంగాణా ద ఫెడరల్’ లో వచ్చిన కథనంలో సామాజిక మాధ్యమాల్లో కొంత చర్చ జరిగింది. చాలా మంది తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చర్చించడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామికం. దీనికి భిన్నంగా ఓ వ్యక్తి అసహనంతో, అసభ్య పదజాలంతో పోస్టింగ్ లు పెట్టారు. ఒక కులంపై మరొక కులాన్ని రెచ్చగొట్టేవిధంగా, స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ధోరణి మంచిది కాదని చెప్పడానికే ఈ కథనం.

అంబేడ్కర్, సుందరయ్య లిద్దరూ ఇప్పుడు లేరు. వారిద్దరూ ఉద్దండులు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, కులం గురించి, నిజాం రాజ్యంలోని ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా ప్రజల సాయుధపోరాటం గురించి ఇద్దరి మధ్య భాన్నాభిప్రాయాలున్నాయి. రాజ్యసభ వేదికగా వీటి గురించి వారిరువురి మధ్య భిన్న వాదనలు జరిగాయి. ఇదొక చరిత్రాత్మకమైన డాక్యుమెంట్.

అసలు ఆ డాక్యుమెంటు బయట పెట్టడమే నేరం అన్నట్టు ఓ వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఒకటొకటిగా పరిశీలిద్దాం.

1) ‘బ్రాహ్మణ వాదుల్లారా ! కుల నిర్మూలన గురించి స్వ....పర... మర్దనాలు చేసుకుని తృప్తి పడకండి!! దళిత బహుజనుల జోలికి రాకండి’.

అసలు ఈ ‘స్వ....పర... మర్దనాలు’ పద ప్రయోగం ఏమిటి? ఇది స్త్రీలను కించపరిచేలా లేదా! స్త్రీల శరీర అవయవాల గురించి ఎగతాళి చేయడం ద్వారా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం ఇదేమి సంస్కారం ! ఈ పద ప్రయోగాలు వీరికి కొత్త కాదు. జెండర్ ను బట్టి కించపరిచేలా ఉన్న వీరి భాషను సభ్య సమాజం అంగీకిరిస్తుందా!?

గతంలో వీరు ‘కసాయి’ వృత్తిని చేపట్టే వారిని కూడా ఇలాగే కించపరిచేలా రాసినప్పుడు ఎత్తి చూపిస్తే, ‘కసాయిబు’ అని శ్రీ శ్రీ చేసిన తప్పుడు పదప్రయోగంతో సమర్థించుకోచూశారు. పత్రికల్లో రాసినా, శ్రీ శ్రీ ఉపయోగించినా, మరెవరు వాడినా ఒక కులాన్ని కానీ, వృత్తిని కానీ కించపరడం సరికాదు. అప్పుడూ ఇలాగే ఎగతాళిగా వ్యాఖ్యలు చేశారు.

‘మన అభిప్రాయాలు, ఆలోచనలు ఆధునికమైనప్పుడు మనం వాడే భాష కూడా ఆధునికం కావాలి.’ అంటారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జి.ఎన్. రెడ్డి. భాష ఆధునికం అంటే ఏమిటి? భాష ఆధునికంలో తొలి మెట్టు సామాజిక అవగాహన. మనం భాషను ఉపయోగించేటప్పడు కులం, మతం, ప్రాంతం, జెండర్ ను బట్టి ఎవరినీ కించపరచకుండా ఉండడమే ఆధునిభాషలో తొలిమెట్టు.

‘ఒక కుక్కను చంపాలనుకుంటే ముందుగా అది పిచ్చికుక్కని ప్రచారం చేయండి. ఆ తరువాత దాన్ని చంపితే ఎవరూ అభ్యంతరం చెప్పరు.’ అన్నది ఒక నానుడి. ఎవరినైనా మనం వ్యతిరేకించాలంటే ముందు బ్రాహ్మణ వాదులని ముద్రవేయాలి. ఆ తరువాత మనం ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుంది అన్నది వీరి ధోరణి. అందుకునే ‘బ్రాహ్మణ వాదుల్లారా’ అంటూ హెచ్చరిస్తున్నారు. తాను కులాతీత వ్యక్తి అయినట్టు కుల కవచం కప్పుకుని, కులం పేరుతో దాడిచేస్తున్నారు.

2) ‘బ్రాహ్మణ వాదాన్ని, పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చెయ్యమన్నాడు బాబా సాహెబ్! అందుకునే బ్రాహ్మణ వాదులు కమ్యూనిజం ముసుగులో దాడికి యత్నిస్తున్నారు! !’ అన్నది మరొక వ్యాఖ్య.

కులమతవాదులు, కమ్యూనిస్టులు భిన్న ధృవాలు. కమ్యూనిస్టుల పైన వీరు దాడి చేయడం కొత్త కాదు. ఆ దాడులు వివిధరూపాల్లో ఉంటాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తి కూడా కులం ముసుగులో అసభ్య పదజాలంతో దాడి చేస్తున్నారు. ఏనాడు ఏ కమ్యూనిస్టు పార్టీలో కానీ, ఏ మార్క్సిస్ట్ లెనినిస్టు గ్రూపులోకానీ, అవి చేపట్టిన ఏ ఉద్యమంలో కానీ పాల్గొన్న చరిత్ర లేని , అరెస్టయిన చరిత్ర లేని వీరు చాలా భద్ర జీవి. అంబేడ్కర్ ఆశయాలను ఎక్కడా ఆచరించకుండా, ఆయనపైన ప్రేమ ఒలక బోస్తూ, కమ్యూనిస్టులపైన దాడికి దిగారు.

పెట్టుబడిదారీ విధానంపైన అంబేడ్కర్ దాడి చేయమన్నారని ఉటంకిస్తూ చెప్పిన వీరు, అదే పెట్టుబడి దారీ విధానానికి పెట్టుబడులు సేకరించే వృత్తిలో జీవితం పునీతం చేసుకుని, శేషజీవితాన్ని ఇలా పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన కమ్యూనిస్టులపైన దాడికి దిగుతున్నారు.

3). ‘తిరుమల భక్తి బురదలో పొర్లాడే గురివిందా ! గాంధేయ సుందరయ్య భుజమ్మీద పెట్టి పేల్చిన తూటా తుస్సుమన్నదే! చరిత్ర చదువుకో’ ఇది మరో వ్యాఖ్య.

తిరుమల ‘భక్తి బురద’లో పొర్లాడింది ఎవరు? తిరుమలకు వెళ్ళడమే ‘భక్తి      బురద   పొర్లాడడమా? తిరుమలకు వెళ్ళడమే నేరమా? తిరుమలకు తమరు ఎన్ని సార్లు వెళ్ళ లేదు! ‘భక్తి బురద ’లో పొర్లాడడానికేనా? ఎన్ని సార్లు దర్శనం చేసుకోలేదు? ‘భక్తి బురద’లో పొర్లాడడానికేనా? తమరు చదువుకుంది, చాలా ఏళ్ళు ఉద్యోగం చేసింది మీ మాటల్లోనే ఈ ‘బురద’లో కదా! త్రిపురనేని మధుసూదన రావు లాంటి మార్క్సిస్టు భాష్యకారులు సైతం ఈ తిరుపతిలోనే కదా ఉద్యోగం చేసి, ఇక్కడే తనువు చాలించింది! వారు తిరుమల వెళ్ళలేదా ! అది భక్తి బురద అవుతుందా!?

బాగా సంపాదించాక, మహానగరంలో బంగళా కట్టుకుని స్థిరపడ్డాక, కన్న తల్లి లాంటి సొంత ఊరు, సొంత గ్రామాన్ని వదిలేశాక, మిమ్మల్ని పెంచి పెద్ద చేసినవి మీకు బురదలానే కనిపిస్తాయి ఏం చేద్దాం మరి! క్షేత్రస్థాయిని ఒదిలేయడమేనా జీవన సంధ్యలో మీ తాత్విక చింతన!? అద్దాల మేడలోకూర్చుని రాళ్ళు విసరడమంటే ఇదే!

శేషాచలం కొండల్లో ఉన్న జలపాతాల గురించి, లోయల గురించి రాస్తే మీకు ‘బురద’ లా అనిపించిందా, అయ్యోపాపం! శేషాచలం కొండల్లోకి మీరు వెళ్ళ లేదా ! ఆ ‘బురద’లో మీరు ఎన్ని సార్లు మునిగి తేల లేదు! పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుం కొంటుంది ఇలానే!

‘గాంధేయ సుందరయ్య’ అని వ్యంగ్యోక్తి విసిరారు. గాంధీజీ రాజకీయాలువేరు, సుందరయ్య రాజకీయాలు వేరు. గాంధీజీవి పునరుద్ధరణ వాద రాజకీయాలైతే, సుందరయ్యవి సామ్యవాద రాజకీయాలు. ఆ సామ్యవాద రాజకీయాల్లో భాగంగానే ప్రాణాన్ని పణంగా పెట్టి నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సుందరయ్య. గాంధీజీ లాగానే సుందరయ్య నిరాడంబరంగా జీవించాడు. అదొక ఆదర్శం అంతే. అంత మాత్రాన గాంధీజీ తాత్విక చింతనతో ముడిపెట్టడం సరికాదు.

‘చరిత్ర చదువుకో’ అని సలహా ఇచ్చారు. చరిత్రను చదువుకోబట్టే ఈ చరిత్రను వెలికి తీయగలిగాను. ఆంధ్ర రాష్ట్ర అవతరణ బిల్లుపై పార్లమెంటులో డాక్టర్ అంబేడ్కర్ కు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యకు మధ్య 1953లో జరిగిన వాదనలు చరిత్ర కాబట్టే, ఎలాంటి వ్యాఖ్యానాలూ లేకుండా 1953 అక్టోబర్ 4వ తేదీన విశాలాంధ్ర పత్రికలో వచ్చిన వార్తను ఉన్నది ఉన్నట్టు ‘తెలంగాణా ద ఫెడరల్’ లో గురువారం రాశాను. దానిపై అసహనం వ్యక్తం చేయడం చూస్తే చరిత్రపైన వారికున్న అవగాహన అర్థం అవుతుంది.

‘గాంధేయ సుందరయ్య’ భుజాలపైన తూటాపెట్టి పేల్చాల్సిన అవసరం ఎవరికీ లేదు. అదొక చారిత్రక డాక్యుమెంట్. దాన్ని బయట పెట్టడం మీ దృష్టిలో నేరం అయితే, అలాంటి నేరాన్ని నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను.

వీరితో పాటు మరికొందరు కూడా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవి ఎలా ఉన్నాయో ఒక్క సారి పరిశీలించండి.

1. The original communism as concepulized by Marx and Engels talked only 'class' war and not 'caste'. indian communist Found caste as parallel to class to suit to local conditions. It is true that all people in a caste are neither rich or poor as Sundaraiah said. Social backwardness along with economical backwardness might have been considered by constitution writers.Any way caste is an exclusive feature to India and not considered by any world 'isms' - కె.ఎల్. నరసింహం(రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, టెక్నికల్ ఎడ్చుకేషన్ బోర్డ్) అమెరికా నుంచి.

2.కమ్యూనిస్టులు కులాన్ని విస్మరించి చేసిన ఈ వాదనల వలనే నేడు కనుమరుగయ్యారు. డాక్టర్ అంబేద్కర్ సమాజంలో కులం యొక్క వాస్తవికతను గ్రహించారు. కనుకనే నేటికీ జైభీమ్ రూపంలో బతికే ఉన్నారు. -బొల్లొజు బాబా, హైదరాబాద్

3. ఎంత తపన పడినా అంబేద్కరిజం కులాలను నిర్మూలించలేదు కదా. కనీసం కుల వివక్షతనైనా తొలగించలేదు. కమ్యూనిజం మాత్రమే ఆ పని చేయగలదు. -కర్లపాలెం భాస్కర్ రావు.

4.ఈ విశాలాంధ్ర వార్త సుందరయ్య గారి ‘ఏరిన రచనలు’ పుస్తకంలో ఉన్నది. ఇందులో కొన్ని ఉప శీర్షికలు పరుషంగా ఉన్నాయి. అలా ఉన్నట్టు నేను చూడలేదు. వాదన అయితే కరెక్టే. -రామ కృష్ణ ఉదత,

5. కమ్యూనిస్టులు నిజంగా కమ్యూనిస్టుల్లాగానే బతికిన రోజుల్లో నాటి మాజీ కేంద్రమంత్రి అంబేడ్కర్‌కి, నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎంపీ సుందరయ్యకీ మధ్యజరిగిన జెన్యూన్ చర్చ ఇది. ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీల 'ఖర్మ' గాలి కమ్మనిస్టులు, రెడ్డినిస్టులు పుట్టుకొచ్చి నాలుగైదు సీట్ల కోసం పాలక పక్షాలను అడుక్కు తింటూ అసెంబ్లీలు, పార్లమెంటు గేటు వద్ద అంటుకు తిరగడంలోనే బతుకీడుస్తున్నారు కాబట్టి కమ్యూనిజం బతుకు ఇలా తెల్లారిపోయింది. కుల నిర్మూలన చాలా చాలా పెద్దమాటై కూర్చుంది కానీ, 2025లోనూ దేశంలో కులాంతర వివాహాలు అనేక కారణాల వల్ల ఎఫ్‌సీలు, బీసీల మధ్య జరుగుతున్నాయి కానీ, ఆ రెండు కులాల మధ్య ఒక్క కులాంతర వివాహం కూడా జరిగినట్లు నాకయితే తెలీదు. ముందుగా ఆ రెండు కులాల మధ్య పరస్పర సంబంధాలు నెలకొనేందుకు ఎవరైనా నడుం కట్టండి. బాడుగ నేతల్లా, దళిత దళారుల్లా తయారై అంబేడ్కర్ చెక్క భజన చేస్తున్న వారికి ఇలాంటి మార్పులకోసం కనీసం ప్రయత్నం చేసే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. కులం, మతం తేడాలు లేకుండా సహజీవన సంబంధాలు నెలకొల్పుకుంటూ ఉద్యమ జీవితంలో ప్రాణాలొడ్డుతున్నది ఈ దేశంలో విప్లవోద్యమం మాత్రమే. 20 సంవత్సరాల వరకు ఉద్యమ జీవితంలో గడిపిన నాకు ఆ ఉద్యమంలో కులం అస్సలు కనిపించలేదు. ఎందుకంటే సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారికి కులం లేదు, సొంతఆస్తి లేదు. విదేశాలకు పారిపోయే దొంగ బతుకు లేదు. ప్రాణం ఉన్నంతవరకు చేయీ చేయి కలిపి పోరాడటమే జీవితమైన చోట కులం, దాని చుట్టూ ఉన్న సమస్త స్వార్థ సంబంధాలు నిజంగానే చచ్చిపోయాయి. దేశం మొత్తం మీద కుల రహిత, వివక్షా రహిత జీవితం అక్కడే ఉంది. సంవత్సరాలు, దశాబ్దాల పాటు శత్రువు మీదే కాకుండా తమమీద తాము యుద్ధం చేసుకుంటూ బతుకుతున్న ఉద్యమ జీవితాచరణలోనే కులం, కుల సంబంధాలు పూర్తిగా చచ్చిపోయాయి. ఇక్కడ తప్ప మొత్తం సమాజంలో ఇప్పుడు కులనిర్మూలన అంటే పెద్ద బూతుమాటగానే మిగిలిపోయింది. కులాలతో, కుల సంబంధాలతో, ఆస్తి సంబంధాలతో అంటకాగుతున్న వారు కూడా కులనిర్మూలన గురించి మాట్లాడటం చూస్తుంటే దేంతో నవ్వాలో కూడా ఆర్థం కావడంలేదు. ఒకటి మాత్రం నిజం.. కమ్మనిస్టులు, రెడ్డినిస్టులు మాత్రమే కాదు.. బాడుగ నేతలు, దళిత దళారులూ, రిజర్వేషన్లను తమ కులంలోనే, తమ కుటుంబంలోనే పంచుకుని కులద్రోహం, వర్గ ద్రోహం చేస్తూ ఊరేగుతున్న వాళ్లు కూడా ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారులే.. వీళ్లెవరికీ కులనిర్మూలన గురించి మాట్లాడే అర్హతే లేదు. -రాజశేఖర రాజు, జర్నలిస్ట్, హైదరాబాద్

Tags:    

Similar News