రాజ్యంగసభలో బిసి ప్రతినిధులెవరూ లేరా?
చర్చ: డాక్టర్ బి కేశవులు రాసిన ‘తెలంగాణలో బిసిలకు పార్టీ అవసరమా’ అనే వ్యాసానికి డాక్టర్ కొండలరావు స్పందన;
By : The Federal
Update: 2025-05-20 06:03 GMT
1. స్వాతంత్య్రానంతరం అనేక కీలక సందర్భాల్లో ఈ దేశ బీసీల విషయంలో, తెలంగాణతో సహా ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఆధిపత్య శక్తులు కుట్ర పూరితం గానే వ్యవహరిస్తూ వచ్చారు. దానికి మూల కారణం, అల్పసంఖ్యాక ఆధిపత్య శక్తుల "ఆధిపత్యం" కొనసాగాలంటే, అధిక సంఖ్యాకులైన బీసీల దామాషా అవకాశాలకు ఏదోవిధంగా గండి కొడితేనే, అది వీలు అవుతుంది కాబట్టి.
2. భారత దేశ పాలనకు సంబంధించి నంత వరకు, "మన రాజ్యాంగం" కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ లో బీసీలకు ఎటువంటి పాత్ర లేకుండా చేసారు. ఇది కుట్ర పూరితంగా జరిగిందే నని ఖచ్చితంగా నమ్మ వలసి వస్తుంది.
3. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ లకు ప్రతినిధులు ఉన్నారు కానీ, రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములు గా, అధిక సంఖ్యాకులైన బీసీలు మాత్రమే లేరు. ఆ విధంగా లేకుండా పోవడానికి, ఆనాటికి OBC లు ఎవ్వరో అనేది జాతీయ స్థాయిలో నిర్ధారణ కాలేదు. ఆ విధంగా దేశ జనాభాలో సగం పైనున్న బీసీలకు ఏమాత్రం పాత్ర లేకుండానే, కీలకమైన రాజ్యాంగ నిర్మాణం జరిగి పోయింది. అది కూడా, బీసీలను గుర్తించడానికి, జాబితీ కరించడానికి, అవసరమైన స్పష్టమైన సూచికలను, ప్రమాణాలను, (working definition) రాజ్యాంగం లో నిర్దేశించ కుండానే, రాజ్యాంగ నిర్మాణం జరిగి పోయింది. దరిమిలా ఇది న్యాయ వ్యవస్థ లో అనేక అవరోధాలకు దారితీసింది. ఉదాహరణకు, 1982 నాటి మురళీధరరావు కమిషన్ఋ నివేదిక ఆధారంగా నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లు 44% కు పెంచి నపుడు, బీసీల జనాభా నిర్దేశించ డానికి, బీసీలను గుర్తించడానికి అవసరమైన అధికారిక సమాచారం, గణాంకాలు లేక పోవడం కారణాలు గా ముందుకు వచ్చాయి.
4. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ 1946-1950 వరకు, 2 సంవత్సరాల, 11 నెలల 16 రోజులు నడిచింది. పాలకులకు బీసీల దామాషా అవకాశాల విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే, బీసీలకు కూడా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగ స్వామ్యం ఉండాలి అనే విషయంలో చిత్తశుద్ధి ఉండి ఉంటే, దాదాపు ఆ మూడు సంవత్సరాల లోపే బీసీలు ఎవరు అనేది తేల్చి, బీసీలకు కూడా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ లో భాగస్వామ్యం కల్పించి ఉండే వారు. అధిక సంఖ్యాకులైన బీసీల భాగస్వామ్యం లేకుండానే, రాజకీయ నిర్మాణం జరిగి పోయింది.
5. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ లో భాగస్వామ్యం కలిగిన వారు ఎవరికీ, దామాషా అవకాశాల విషయంలో అన్యాయం జరగ లేదు. అటువంటి ప్రాతానిధ్యం లేని బీసీలకు మాత్రమే, దామాషా అవకాశాల విషయంలో హామీ లేకుండా రాజ్యాంగ నిర్మాణం జరిగి పోయింది. ఇది కుట్ర కాకపోతే మరేమిటి అనేదే నా ప్రశ్న.
-కె కొండలరావు
డాక్టర్ బి కేశవులు రాసిన వ్యాసం ‘తెలంగాణలో బీసీలకు ప్రత్యేక పార్టీ అవసరమా ?’ ఇక్కడ చదవ వచ్చు.