డ్రగ్స్ మాఫియాపై దాడులు బాగుంది, బెల్టు షాపులూ రద్దు కావాలి

కన్నెగంటి రవి: డ్రగ్స్ మాఫియాపై దాడులు అభినందనీయం –బెల్టు షాపులనూ రద్దు చేయాలి. మద్యం నియంత్రణ నుంచి ప్రారంభమై నిషేధం దిశగా అడుగులు వేయాలి.

Update: 2024-06-19 04:04 GMT

మనిషి ఆరోగ్యంగా ఎదగడానికి విషపూరితం గాని పౌష్టిక, వైవిధ్యమైన ఆహారం, కలుషితం కాని మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, శాస్త్రీయ దృక్పథంతో ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం , సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకునే పరస్పర సహకార వ్యవస్థ, వీటిని బలోపేతం చేసే విధంగా ఉండే ప్రభుత్వ విధానాలు అవసరం. ఇవన్నీ ఉంటే మాత్రమే మనుషులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

ఇది జరగాలంటే రసాయన ఎరువులు, పురుగు విషాలు లేని సుస్థిర, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం రాష్ట్రమంతా జరగాల్సి ఉంటుంది . మద్యం, సిగరెట్లు, బీడీ, తంబాకు, గుట్కా, కల్తీ కల్లు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ప్రజలకు అందుబాటులో ఉండకూడదు. ప్రజలు స్వచ్చందంగా వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, ప్రజలు ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఇది ఒక కలగా కనపడుతున్నది. దానికి కారణాలు అనేకం. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ప్రజల సాంస్కృతిక జీవనం, బలహీనంగా ఉన్న స్థానిక పరిపాలనా వ్యవస్థలు, మద్యం ఆదాయంపై ఆధార పడుతున్న రాష్ట్ర బడ్జెట్ లు, దీర్ఘ కాలంగా ప్రజల్లో ఉన్న మద్యం అలవాట్లు, లాభాలకు అలవాటుపడిన మద్యం కంపెనీలు , కల్తీ కల్లు ఉత్పత్తి, మార్కెటింగ్‌పై ఆధారపడిన మాఫియా సహా కొన్ని కుటుంబాలు, అన్నిటినీ మించి మద్య నిషేధం సాధించి, అమలు చేయించుకోవడం సాధ్యం కాదని ముందే చేతులెత్తేసిన సామాజిక ,రాజకీయ శ్రేణుల వైఖరులు.

అత్యంత నిరాశ పూరిత ఈ వాతావరణంలో కూడా మద్యంపై ఈ చర్చను మళ్ళీ లేవనెత్తడానికి ఒక కారణముంది. 2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం పై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ విషయంలో చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న కార్యాచరణ సంతోషాన్ని, విశ్వాసాన్ని కల్గిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాను, అమ్మకాలను అరికట్టడానికి, రాష్ట్రం నుండి పారదోలడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తున్నది. అధికారులు ప్రతి రోజూ ఎక్కడో చోట దాడులు చేసి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేయడం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం జరుగుతున్నది. డ్రగ్స్ అమ్మకాలు హైదరాబాద్ నగరానికే పరిమితమై లేవు. అందుకే ప్రభుత్వ దాడులు కూడా జిల్లాలకు విస్తరిస్తున్నాయి. ఇది స్వాగతించాల్సిన విషయం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం. పౌర సమాజం కూడా మద్దతు ఇవ్వాల్సిన అంశం.

తెలంగాణ వ్యవసాయ రంగంలో పురుగు, కలుపు విషాలు , రసాయన ఎరువులు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో, సామాజిక, రాజకీయ రంగాలలో మద్యం అంతే విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. ఎన్నికలు, పండుగలు వచ్చినప్పుడు రాష్ట్రమంతా పెరుగుతున్న మద్యం అమ్మకాలను చూస్తుంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మద్యం కుటుంబాలను ఆర్ధికంగా దివాళా తీయించడమే కాదు, ఆయా కుటుంబాలలో హింసను పెంచుతున్నది. తాగుడుకు బానిసలైన వ్యక్తులను మృత్యు ముఖం వైపు నడిపిస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు , స్త్రీలపై హింసకు కారణమవుతున్నది. అంతెందుకు, ఏ రోజు ఏ పేపర్ తిరగేసినా నేర ఘటనల వార్తలలో , మద్యం పాత్ర స్పష్టంగా కనపడుతున్నది.

వీటిని మించి, మనిషి, ఆలోచనా శక్తిని , విచక్షణ జ్ఞానాన్ని మద్యం చంపేస్తున్నది. సమిష్టి తత్వాన్ని, ప్రజాస్వామిక విలువలను దెబ్బ తీస్తున్నది . ఇవాళ ఏ గ్రామం లోనూ , పట్టణం లోని ఏ బస్తీ లోనూ ప్రజలతో రాత్రి పూట సమావేశాలు జరపలేని పరిస్థితి ఉందని సామాజిక కార్యకర్తలు అంటున్నారంటే దానికి ప్రధాన కారణం మద్యమే. అంటే ప్రస్తుతం కొనసాగుతున్నది మద్యం ఆధారిత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మాత్రమే. అమలులో ఉన్నది అనాగరిక విలువలు మాత్రమే.

విషాదం ఏమిటంటే, మొత్తం దేశంలోనే ఈ మద్యం విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-2015 ఆర్థిక సంవత్సరంలో మద్యంపై తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఎక్సైజ్ పన్ను ఆదాయం 2,823 కోట్ల రూపాయలు మాత్రమే. మొదటి నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ముగిసిన 2018 నవంబర్ నాటికి ఎక్సైజ్ పన్ను ఆదాయం రూ.9000 కోట్లకు పెరిగింది. KCR రెండవ విడత పాలనలో ఎక్సైజ్ ఆదాయం మరింత పెరిగిపోయింది. 2018-2019 లో రూ.10,637 కోట్లు, 2019-2020 లో రూ.11,992 కోట్లు, 2020-2021 లో రూ.14,370 కోట్లు, 2021-2022 లో రూ.17,482 కోట్లు, 2022-2023 లో రూ.18,470 కోట్లు, 2023-2024 లో రూ.19,885 కోట్లకు ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను రూపంలో అందింది. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఈ పన్ను ఆదాయాన్ని 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.25,617 కోట్లకు తీసుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో మద్యం విషయంలో కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చింది. ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని పునః పరిశీలించి పాలసీలో అవసరమైన సవరణలు చేస్తామని, రాష్ట్రంలో బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేస్తామని, నీరా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల ఉపాధిని పరిరక్షిస్తామనీ, గుడుంబా, కల్తీకల్లు, డ్రగ్స్ సరఫరా పై కఠిన చర్యలు తీసుకుని నియంత్రిస్తామనీ, మత్తు బానిసలకు పునరావాస కేంద్రాలు (రిహాబిలిటేషన్ సెంటర్స్ ) ప్రతి జిల్లా ఆసుపత్రి లోనూ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చింది. ఇవి మంచి హామీలు.

కానీ ఈ హామీల ప్రకారం ఒక్క డ్రగ్స్ విషయంలో సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నా, మిగిలిన విషయాలలో కార్యాచరణ ప్రారంభించలేదు. ముఖ్యంగా బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించినా ఆచరణలో జరగలేదు. విచిత్రమేమిటంటే, బెల్టు షాపులను రద్దు చేస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని తెలసినా, 2024-2025 బడ్జెట్ లో మద్యం పై ఎక్సైజ్ పన్ను ఆదాయ అంచనాలను మాత్రం 25,000 కోట్లకు పెంచడం. ఈ ఆదాయ అంచనాలు చూస్తుంటే, ప్రభుత్వానికి బెల్టు షాపులు రద్దు చేయాలనే ఆలోచన లేనట్లే కనిపిస్తుంది. ఈ ఆలోచనను సవరించుకోవాలి.

సాధారణంగా మద్యంపై సమాజంలో చర్చ జరుగుతున్నప్పుడు , కొన్ని తప్పుడు వాదనలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మద్యం వినియోగించడం వ్యక్తిగత హక్కు కాబట్టి , దానిని నియంత్రించడం, నిషేధించడం వ్యక్తిగత హక్కుకు భంగకరమని వాదించే వాళ్ళున్నారు. నిజానికి శారీరకంగా, మానసికంగా బలహీన పరిచే ఒక దుర్వ్యసనం వ్యక్తిగత హక్కు నిర్వచనం క్రిందికి ఎంత మాత్రమూ రాదు. పైగా ఈ అలవాటు ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తి కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయా కుటుంబాల మహిళల , పిల్లల భవిష్యత్తు చుట్టూ సామాజిక , రాజకీయ వాతావరణాన్ని విధ్వంసం చేస్తున్నది. రాష్ట్రంలో 14 లక్షల మంది వితంతు మహిళలు ఉండడానికి ఈ మద్యం తనదైన పాత్ర పోషించింది. సమాజంలో మగవాళ్ళను కాకుండా మహిళలను , ఆయా కుటుంబాలలో ఆడ పిల్లలను కలిపి చూస్తే , మద్యం తమ కుటుంబాలకు ఎంతగా హాని చేస్తున్నదో స్పష్టంగా చెబుతారు.

తెలంగాణ ప్రజల సంస్కృతిలో మద్యం ఒక భాగమనీ , దానిని నియంత్రించడం , నిషేధించడం ఆ సంస్కృతిపై దాడి అని వాదించే వాళ్ళున్నారు .తొలి నుంచి తెలంగాణ కుటుంబాలలో ( అన్ని కులాలలో కాదు) కల్లు తాగడం ఒక అలవాటుగా ఉన్న మాట వాస్తవం. కల్లు అంటే చెట్టు క్రింద కూర్చుని, కల్తీ లేకుండా తాగే నీరా పానీయం ఎంత మాత్రమూ కాదు. అది చాలా కాలం క్రితమే కల్తీ అయి , విషంగా మారింది. కల్లు పేరుతో ఇప్పుడు వ్యాపారులు అమ్ముతున్నది ఎంత మాత్రమూ కల్లు కాదు . అత్యంత ప్రమాద కరమైన మత్తు కలిగించే, ఆరోగ్యాన్ని పాడు చేసే పానీయం మాత్రమే. ఇప్పుడు వైన్స్‌లో అమ్ముతున్నది , మొదటి నుండీ ప్రజల సాంస్కృతిక జీవనంలో ఉన్న కల్లు కాదు. మత్తు కలిగించే ప్రమాదకరమైన పానీయం మాత్రమే. వీటిని ప్రజల మీద రుద్దింది కేవలం వ్యాపారుల లాభాల కోసమూ, ప్రభుత్వాల పన్నుల ఆదాయం కోసమూ తప్ప, తెలంగాణ సంస్కృతిని కాపాడడానికి కాదన్నది గుర్తించాలి.

చదువుకున్న వాళ్ళు , మద్యంతో వచ్చే ప్రమాదాలపై జ్ఞానం పొందిన వాళ్ళు ప్రజలను దేనికీ పనికి రాని ఈ దురలవాట్ల నుంచి బయట పడేయటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప, తప్పుడు వాదనలతో, మద్యం అలవాటును తాము కూడా కొనసాగించకూడదు. పైగా దానికి ఒక విలువను ఆపాదించకూడదు. కొందరు కవులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు , పార్టీల నాయకులు ఈ విషయంలో తమ బాధ్యత మర్చిపోయి భిన్నంగా వ్యవహరించడం మనం చూస్తున్నాం.

సమాజంలో ఎప్పుడైనా, ఎవరైనా మద్య నిషేధ అవసరం గురించి చర్చ ప్రారంభించగానే, దానిని వ్యతిరేకిస్తూ మొదట వాదనలు చేస్తున్నది ప్రభుత్వాలో, వ్యాపారులో కాదు , కొంతమంది సోకాల్డ్ బుద్ధి జీవులే . ఈ పరిస్థితి మారాలి . “మా ఆరోగ్యాలను మేం పాడు చేసుకుంటాం, మా డబ్బులతో మేము తాగుతాం, అది మా హక్కు” అనే వాళ్ళ వాదనలను పక్కకు పెట్టి, సమాజంలో అట్టడుగున ఉన్న పేదల , బలహీన వర్గాల, శ్రమ జీవుల కుటుంబాల, ముఖ్యంగా మహిళల, పిల్లల భవిష్యత్తు కోణం నుండి ఈ చర్చ ఎక్కువ జరగాలి .

తమ తప్పుడు విధానాలనూ, అవినీతినీ ప్రజలు ఎప్పుడూ ప్రశ్నించకుండా ఉండాలని సాధారణంగా ప్రభుత్వాలు కోరుకుంటాయి. మనం అర్థం చేసుకోవచ్చు . అది వాళ్ళకు ప్రయోజనం. కానీ మద్యం మత్తు నుంచి బయట పడి ప్రజలు చైతన్య వంతులు కావాలి, ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రం రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం వ్యసనం పై తప్పకుండా చర్చ కొనసాగించాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో మద్యం నిషేధించారు. అందులో కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లు కొనసాగుతున్నాయి. సాధించిన సానుకూల ఫలితాలను ప్రచారం చేస్తూనే, ఆయా ప్రభుత్వాలు మద్య నిషేధానికి తూట్లు పొడవడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా పౌర సమాజం ఎండగట్టాలి.

మద్యం పూర్తిగా నిషేధించకుండా, దానిని ప్రజలకు అందుబాటు నుండీ తొలగించకుండా, కేవలం కొద్దిపాటి నియంత్రణతోనో, లేదా ప్రచారంతోనో ప్రజలలో ఉన్న ఈ అలవాటును మాన్పించగలుగుతామని అనుకోవడానికి వీలు లేదు. కనీసం మద్య నియంత్రణతో ప్రారంభించి , నిషేధం వైపు ప్రయాణం ప్రారంభించాలనే నినాదం రాష్ట్రమంతా మారుమోగాలి. కేవలం ప్రచారానికి, నియంత్రణకు పరిమితం కాకుండా, ప్రభుత్వాలు మద్య నిషేధం తప్పకుండా అమలు చేయాలని మహాత్మాగాంధీ 1930 లోనే స్పష్టంగా ప్రకటించారు.

కల్తీ మద్యం ప్రవహిస్తుంది కనుక, నిషేధం అనవసరం అనే వాళ్ళు ఉన్నారు . ప్రభుత్వానికి మద్య నిషేధం అమలు పట్ల రాజకీయ చిత్తశుద్ధి ఉంటే , రాజకీయ పార్టీలకూ, సామాజిక సంస్థలకూ నిజంగా దీనిని అమలు చేయించుకోవాలనే పట్టుదల ఉంటే, ఇది ఎంత మాత్రమూ అసాధ్యం కాదు .

రాష్ట్రం మొత్తంలో ఒకేసారి కాకుండా, మద్యం ఉత్పత్తినీ, అమ్మకాలనూ నిషేధించుకునే అధికారం స్థానికంగా గ్రామ పంచాయితీలకు కట్టబెడుతూ, హర్యానా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక చట్టం చేసింది . ఈ చట్టం ప్రకారం గ్రామ సభలో 10 శాతం జనాభా మద్యం అమ్మకాలు వద్దని తీర్మానం చేస్తే సరిపోతుంది. తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నంతో ఒక మార్గం వేయవచ్చు, అనుభవాల నుండీ నేర్చుకుని ముందుకు పోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుండయినా రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా రద్ధు చేయాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మద్య నిషేధ అధికారం గ్రామ పంచాయితీలకు ఇస్తూ చట్ట సవరణ చేయాలి. ఈ చట్టం అమలు కోసం గ్రామ స్థాయిలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువతతో కమిటీలను వేయాలి. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను భాగస్వాములను చేయాలి.

Tags:    

Similar News