ఓల్డ్ సిటీ కరెంటు బిల్లుల్ని అదానీ వసూలు చేస్తారా, ఇది సబబేనా?

హైదరాబాద్ ఓల్డ్ సిటిలో ప్రజలు విద్యుత్ బకాయిలు చెల్లించరనీ, వసూలుకు వెళ్ళిన అధికారులపై దాడులు చేస్తారనీ అంటారు. ఇది నిజమా. దీని మీద ముందు శ్వేత పత్రం తేవాలి

Update: 2024-07-12 05:59 GMT

తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ జూన్ 29 న డిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లులను వసూలు చేసే బాధ్యత ఆదానీ కంపెనీకి ఇస్తామని ప్రకటించారు. వసూలయ్యే బిల్లులలో ప్రతి 100 రూపాయలలో 25 శాతం ఆదానీ కంపెనీకి, మిగిలిన 75 శాతం డబ్బు రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందుతాయని కూడా చెప్పారు. ఈ ప్రకటన తరువాత బహిరంగంగా ఈ విషయంలో మరింత ముందుకు ఆడుగులు పడినట్లు వార్తలు రాలేదు, జీవో కూడా విడుదల కాలేదు. ఈ వార్తలు నిజమే అయితే, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో తొలుత పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి వేస్తున్న తొలి అడుగుగా దీనిని చూడాలి. ఇది ఆచారం రూపం ధరిస్తే, ఆ తరువాత రాష్ట్ర విద్యుత్ సరఫరా,పంపిణీ రంగాలు మొత్తం ప్రైవేట్ కంపనీల పరమవుతాయి. అందుకే ఈ ప్రకటన అత్యంత ప్రమాదకరమైనది కూడా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990 దశకంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచబ్యాంకు ఆదేశాలను వేగంగా అమలు చేస్తున్న కాలంలో , తొలుత విద్యుత్ చార్జీలను పెంచే రూపంలో, ఆ తరువాత డిస్కం లను ప్రైవేట్ పరమ చేసే రూపంలో విద్యుత్ రంగ పైవేటీకరణ వైపు అడుగులు వేశారు.
ప్రపంచబ్యాంకు విధానాలను లోతుగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ముందుకు తెచ్చిన ఈ ప్రక్రియను పూర్తిగా వెనక్కు తిప్పి కొట్టారు. 2000 ఆగస్ట్ 28 న ఈ విధానలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నేతృత్వంలో ప్రజలు ఛలో అసెంబ్లీ కి పిలుపు ఇచ్చి హైదరాబాద్ నగరానికి వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం కూడా డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిరాహార దీక్షలకు దిగింది. ఆ రోజు ఉన్న  చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శకులపై బషీర్ బాగ్ ప్రాంతంలో కాల్పులు జరిపి, ముగ్గురు యువకులను పొట్టన బెట్టుకుంది.
చంద్రబాబు అనుసరించిన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలను కూడా ప్రజలు తిప్పికొట్టారు. అనేక ఉద్యమాలు సాగించారు. ఈ పోరాటాల ఫలితంగానే, 2004 లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయి , కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 2004 నుండీ రాష్ట్ర ప్రజలపై ఉన్న విద్యుత్ బకాయిలను ఆనాటి ప్రభుత్వం రద్ధు చేసింది. 2004 నుండీ రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా మొదలు పెట్టింది.
గత 20 ఏళ్లుగా రాష్ట్ర రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందంటే, ప్రజలు రక్తతర్పణ చేసి సాగించిన ఆనాటి ఉద్యమమే ప్రధాన కారణం. 2000 దశకంలో దేశ వ్యాపితంగా విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కొన్ని ప్రయత్నాలు జరిగినా, వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించాలనే ప్రయత్నాలు కొన్ని ప్రభుత్వాలు చేసినా తెలంగాణ లో మాత్రం అటువైపు అడుగులు పడలేదు. ఇప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి. దేశంలో అనేక అక్రమాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన ఆదానీ తెలంగాణ విద్యుత్ రంగంలో వేలుపెట్టడానికి అవకాశం ఇవ్వడం ఒక సమస్య అయితే, డిస్కం ల ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం మరో ముఖ్య సమస్య. గత అనుభవాలతో ఈ ప్రభుత్వ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు తిరస్కరించాలి.
ప్రజల నుండీ తమ పార్టీకి ఓట్లు పొందడానికి రాజకీయ పార్టీలు ఎన్నికలలో హామీలు ఇస్తాయి. అధికారం చేపట్టిన పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి పథకానికీ రాష్ట్ర బడ్జెట్ నుండీ నగదు బదిలీ చేయలేదు. అందుకే అప్పటికే ఉనికిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ లను ఇందుకు వాహకాలుగా ఉపయోగించుకుంటుంది. ఇందులో తప్పేమీ లేదు. తప్పేటనటే, ఆయా పథకాలను, ఆయా కార్పొరేషన్ లు అమలు చేసినప్పుడు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఉచిత సేవలు అందించినప్పుడు ఆయా సంస్థలకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండీ కేటాయించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కార్పొరేషన్ లు ప్రజలకు సేవలు అందిస్తాయి. ఋణాల ఊబిలో కూరుకు పోకుండా ఉంటాయి.
కానీ ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం లేదు. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ లను ప్రజలకు తాము ఇచ్చిన హామీ మేరకు సేవలు, ఉత్పత్తులు సరఫరా చేయమంటాయి. కానీ ఎప్పటికప్పుడు బకాయిలు ఆయా సంస్థలకు చెల్లించవు. సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో ఆయా సంస్థలు బయట ఆర్ధిక సంస్థల నుండీ, లేదా బ్యాంకుల నుండీ రుణాలు తెచ్చి, ఈ పథకాలను అమలు చేస్తుంటాయి. ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులను ఇందుకోసం తాకట్టు పెడుతుంటాయి. ఇప్పటి వరకూ జరుగుతున్న తతంగం ఇదే.
హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న పాత నగరంలో ప్రజలు విద్యుత్ బకాయిలు చెల్లించరనీ, బకాయిల వసూలుకు వెళ్ళిన అధికారులపై దాడులు చేస్తారనీ, దశాబ్ధాలుగా ఇదే జరుగుతుందనీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ విషయం లో ఏమీ పట్టించుకొదనీ, కాబట్టి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసి నష్ట పోతున్నాయనీ ఆరోపణలు ఉన్నాయి. విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవాలు బయట ప్రాంతాల ప్రజలకు తెలియదు. మొదట చేయవలసిన పని అక్కడి వాస్తవ పరిస్థితిపై , విద్యుత్ శాఖ ఒక శ్వేత పత్రాన్ని బయటకు విడుదల చేయడం.
ఆ ప్రాంతంలో మొత్తం కనెక్షన్లు ఎన్ని? రావలసిన విద్యుత్ బకాయిలు ఎన్ని? విద్యుత్ బకాయిలు వసూలు కాకపోవడానికి కారణాలు ఏమిటి? బిల్లులు వసూలు కాకుండా అడ్డు పడుతున్న శక్తులు ఎవరు ? ఇంతకాలం ప్రభుత్వాలు చేసిన ప్రత్యేక ప్రయత్నాలు ఏమిటి? అవి ఏ మేరకు ఫలితాలు ఇచ్చాయి ? అనేది శ్వేత పత్రంలో బయట పెట్టాలి. అసెంబ్లీలో దీనిపై చర్చించాలి. అక్కడి రాజకీయ పార్టీలను, సామాజిక సంస్థలను ఈ చర్చలో భాగస్వాములను చేయాలి. నిజంగానే ప్రజల వైపు నుండీ తప్పు ఉంటే, ఆయా ప్రత్యేక సందర్భాలలో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం గృహ లక్ష్మి పథకం క్రింద నెలకు 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు కనుక, విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన మిగిలిన కుటుంబాలు ఎన్ని ఉంటాయి ?
ఇవన్నీ చేయకుండా, పాత నగరంలో విద్యుత్ పంపిణీ , విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ పరం చేస్తాం అనడం అన్యాయం. ప్రైవేట్ సంస్థలు మాత్రం ఎలా వసూలు చేస్తాయి? వాళ్ళు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని విద్యుత్ బిల్లులు కట్టని ప్రజలపై దాడులు చేసి,వసూలు చేస్తారా? ఇలాంటి సందర్భాలలో, అక్కడ తలెత్తే శాంతి బద్రతల సమస్యకు ఎవరు బాధ్యత వహిస్తారు? కలగలసి పోయిన ఉన్న, ఒక జిల్లాలో, ఒక నగరంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలను ఎలా నిర్వహిస్తారు?
ఒకవేళ పాతనగరం లో మొత్తం కుటుంబాలు బిల్లులు కట్టకుండా ఉంటే, దానికి కారణాలను అన్వేషించాలి. అంతే కానీ, ఆ ప్రాంత ముస్లిం ప్రజల పై పని గట్టుకుని కొన్ని పార్టీలు దుష్ప్రచారం, ఆరోపణలు చేస్తుంటే, ఆ ట్రాప్ లో రాష్ట్ర ప్రభుత్వం పడితే మరింత ప్రమాదకరం. మోడీకి ధగ్గర వాడైన ఆదానీ కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా, బీజేపీ నోరు మూయించాలనే రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉంటే, అది కూడా ఆరోగ్య కరమైన ఆలోచన కాదు. పాత నగరంలో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీ కంపెనీకి విద్యుత్ పంపిణీ, బిల్లులు వసూలు చేసే బాధ్యత ఇచ్చే ప్రతిపాదనపై తన వైఖరి స్పష్టంగా ప్రకటించాలి.
2004 నుండీ 2014 వరకూ ఒక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కాకపోయినా, రెండేళ్ల కొకసారి అయినా ఆయా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ లకు బకాయిలు చెల్లించేవి. కానీ 2014 నుండీ 2023 డిసెంబర్ వరకూ తొమ్మిదిన్నరేళ్లు అధికారం చలయించిన KCR ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్థలకు ప్రభుత్వం వైపు నుండీ చెల్లించాల్సిన బకాయిలను వేల కోట్లు చెల్లించలేదు.
విచిత్రమేమిటంటే, ఇప్పుడు పాత నగరం విద్యుత్ పంపిణీ విషయంలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను మొదట తీవ్రంగా వ్యతిరేకించి ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. నిజం చెప్పాలంటే, మేడి పండులా కనబడుతున్న తెలంగాణ విద్యుత్ రంగం రాష్ట్రం ఏర్పడ్డ గత పదేళ్ళలో పూర్తి విధ్వంసానికి గురయ్యింది. పీకలలోతు అప్పులు, కనీస ప్రణాళిక, అవగాహన లేకుండా కట్టిన ప్రాజెక్టులు , ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని జాప్యాలు, ప్రభుత్వం నుండి రావాల్సిన భారీ బకాయిలతో తెలంగాణ విద్యుత్ రంగం కునారిల్లుతున్నది. అప్పుచేయకుంటే రోజు గడవని పరిస్థితి లోకి విద్యుత్ రంగాన్ని నెట్టివేశారు. బి‌ఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ రంగం ఏ విధంగా విధ్వంసానికి గురయ్యిందో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ప్రభుత్వం డబ్బులు చెల్లించకుంటే మరి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏం చేశాయి? తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థల నుండి అధిక వడ్డీలకు వేలకోట్ల రూపాయల అప్పులు చేసి విద్యుత్తును కొనుగోలు చేశాయి. దీనికోసం ఆరు దశాబ్దాలుగా పోగు చేసుకున్న తమ మొత్తం ఆస్తులను గజం భూమి వదలకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టాయి.
బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు:
* బ్యాంకుల నుండి తెచ్చిన దీర్ఘకాలిక రుణాలు : రూ 78,553 కోట్లు.
* వివిధ సంస్థలకు చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిలు : రూ 85,030 కోట్లు
* మొత్తం అప్పులు : రూ 1,63,583 కోట్లు
మొత్తం విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ రూ 82,408 కోట్లు మాత్రమే. విద్యుత్ సంస్థల మొత్తం అప్పులు రూ 1,63,583 కోట్లు. అంటే మొత్తం ఆస్తులను అమ్మినా ఇంకా 81,175కోట్ల అప్పులు మిగులుతాయి (1,63,583-82,408).
తొమ్మిదేళ్ల బి‌ఆర్‌ఎస్ పాలన తెలంగాణ విద్యుత్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కోతలు లేకుండా ప్రజలకు, ముఖ్యంగా 24 గంటల విద్యుత్ పేరుతో సరఫరా చేసిన విద్యుత్తు ఖర్చులను భరించకుండా విద్యుత్ సంస్థలను నట్టేట ముంచింది.
తెలంగాణ ప్రజలకు పై వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. బి‌ఆర్‌ఎస్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను కాపాడుకోవడం, రైతులకు, ఇతర వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందజేయడం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను ప్రజలకు వాస్తవాలు వివరించడం ద్వారా నెరవేర్చాలి.
అంతే కానీ, ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించలేదు అనే నిస్సహాయతకు గురవడం, లేదా ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం అని భ్రమించడం సరైన ధోరణి కాదు. పాత నగరం విద్యుత్ పంపిణీ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన పూర్తిగా మానుకోవాలి. ప్రస్తుత స్థితి నుండీ బయట పడడానికి , ప్రభుత్వం చర్చలు కొనసాగించాలి.


Tags:    

Similar News