ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిచ్చారు సరే, పేదలకు పెన్షన్ లేవీ ?

పన్నుల ఆదాయం తగ్గినప్పుడు ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టేవన్నీ అత్యంత పేదలకు సంబంధించిన పథకాలనే: తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేత కన్నెగంటి రవి;

Update: 2025-02-13 14:44 GMT

ప్రకృతి సహజ వనరులకు కొన్ని పరిమితులు ఉన్నట్లే, రాష్ట్ర ప్రభుత్వాల ధగ్గర బడ్జెట్ పరమైన పరిమితులు ఉంటాయి. ఇప్పటికే మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ లను వాస్తవాలతో సంబంధం లేకుండా రూపొందిస్తున్నారు. రాష్ట్ర స్వంత పన్నుల, పన్నేతర ఆదాయ అంచనాలనూ , కేంద్రం నుండీ వచ్చే నిధుల అంచనాలనూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసే అప్పుల అంచనాలనూ ఎక్కువగా చేసి చూపిస్తారు. అన్ని పథకాలకూ భారీగా నిధులు కేటాయిస్తూ ఖర్చులు కూడా చేస్తామనీ చెబుతారు.

కానీ రెండేళ్ల తరువాత బడ్జెట్ వాస్తవ లెక్కలు చూస్తే, అసలు విషయం బోధ పడుతుంది. చాలా సందర్భాలలో ఆయా పద్దుల క్రింద ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉండదు. ఉదాహరణకు 2018-2019 లో రాష్ట్ర పన్నేతర ఆదాయం 10,007 కోట్లు మాత్రమే. కానీ దీనిని 2019-2020 లో 15,875 కోట్లుగా అంచనా వేస్తే ఆ సంవత్సరం వసూలయింది కేవలం 7,360 కోట్లు మాత్రమే. 2021-2022 లో పన్నేతర ఆదాయం 30,557 కోట్లుగా అంచనా వేశారు. కానీ ఆ సంవత్సరంలో కేవలం 8857 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. 2022-2023 లో దీనిని 25,422 కోట్లుగా అంచనా వేస్తే ,కేవలం 19, 554 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్కువ సందర్భాలలో కేంద్రం నుండీ ఆశించిన సహాయం విషయంలో కూడా ఇదే జరుగుతున్నది.
2024-2025 సంవత్సర రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం 1, 38, 228 కోట్లు వస్తుందని చూపించారు. నిజానికి 2022-2023 లో రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం 1,06,949 కోట్లు మాత్రమే. గతంతో పోల్చినప్పుడు, ఈ సంవత్సరం ఒకేసారి 32,000 కోట్ల స్వంత పన్నుల ఆదాయం పెరుగుతుందా అన్నది అనుమానమే. ఈ సంవత్సరం కేంద్ర పన్నులలో వాటా గా 25,640 కోట్లు వస్తుందని అంచనా వేశారు. 2022-2023 లో ఈ ఆదాయం కేవలం 19,668 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం కేంద్రం నుండీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గా 21,073 కోట్లు అంచనా వేశారు. 2022-2023 లో ఈ పద్దు క్రింద వాస్తవ ఆదాయం 13,179 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం పన్నులు, ఇతర ఆదాయాలకు సంబంధించి ప్రభుత్వ గణాంకాలు బయటకు వస్తే కానీ , మనకు వాస్తవ ఆదాయం తెలియదు.
ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడు చాలా పథకాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల నుండీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయరు. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లను పరిశీలించే వారికి, ఇది చాలా రొటీన్ వ్యవహారంగా కనిపిస్తుంది. కానీ, బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న పేదలు , సంవత్సరాలు గడుస్తున్నా, తమకు ఉద్దేశించిన పథకాలు అమలు కాక నిరాశకు గురవుతారు. గ్రామ, మండల స్థాయి అధికారులు కలిసినప్పుడల్లా, తమకు రావలసిన పథకాల గురించి ప్రశ్నిస్తుంటారు. కానీ ఈ అధికారుల దగ్గర కూడా ప్రజలకు ఇవ్వడానికేమీ సమాధానముండదు. ఎందుకంటే, ఒక పథకం ఎప్పుడు అమలవుతుంది, ఎన్ని సంవత్సరాలకు అమలవుతుంది, లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు అనే విషయాలు, ప్రభుత్వ పెద్దల నిర్ణయాల మీద మాత్రమే ఆధార పడి ఉంటాయి.
నిర్ధిష్ట చట్టాలున్నా, అప్పటికే విడుదలైన జీవోలున్నా, ఈ పథకాల అమలు అధికారుల మీద కాకుండా, ప్రభుత్వ పెద్దల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఆధార పడి ఉంటున్నది.
ప్రభుత్వానికి వేతనాలు, పెన్షన్ లు, రుణాలపై వడ్డీల చెల్లింపు లాంటి కొన్ని తప్పని ఖర్చులు ఉంటాయి. వాటికి ఖర్చు చేశాక, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుండి ప్రభుత్వ పెద్దలతో లాబీయింగ్ చేసుకుని, తమ డబ్బులు తాము వసూలు చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఉదాహరణకు కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులు, ప్రభుత్వానికి సేవలు అందించే కొన్ని బడా సంస్థలు. ఏదో ఒక రూపంలో తమకు ప్రభుత్వం నుండీ రావలసిన వాటిని వీళ్ళు వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్టర్ ల మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఈ కోవ లోకి వస్తాయి. ఈ బిల్లులను శాంక్షన్ చేస్తే, ప్రజా ప్రతినిధులు, అధికారులకు కూడా లాభం. ఎంతో కొంత కమిషన్ వారికి కూడా ముడుతుంది కాబట్టి.
రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా, పాత, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయ అంచనాలు భారీగా పెంచేసి, క్యాబినెట్ లో వేగంగా ఆమోదించేసి, కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్లు కూడా పిలిచి, పనులను శాంక్షన్ చేసేసి వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తే కాంట్రాక్టర్ లూ, అధికారంలో ఉన్న పెద్దలూ హ్యాపీ. ఈ ప్రాజెక్టులు ఇప్పుడు అవసరమా అని అడిగేవారెవరు ? ఆపేవారెవరు ?
ఆర్ధిక వనరులు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ లో నిధుల విడుదలకు ప్రాధాన్యతలు నిర్ణయించుకునేటప్పుడు, ప్రభుత్వ పెద్దలు తమ స్వంత పేరు, ప్రఖ్యాతులు, స్వంత సంస్థల ప్రయోజనాలు, తమ డ్రీమ్ ప్రాజెక్టులు కొన్ని ఎజెండా లో పెట్టుకుని నిధులను శాంక్షన్ చేస్తారు. బడా విగ్రహావిష్కరణలు, క్రీడాకారులకు, కళాకారులకు, కవులకు రివార్డులు, తమ దృష్టిలో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా, కొత్త కొత్త సంస్థలు, వాటికి సిబ్బంది, కార్యాలయాలు ఏర్పాటు – వీటన్నిటికీ నిధులు శాంక్షన్ అయిపోతుంటాయి. జాతరలకు,దేవాలయాలకు నిధుల నజరానా అందించడానికి కూడా మన వాళ్ళ చేతికి ఎముక ఉండదు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు, ఉన్నత స్థాయి అధికార గణానికి వేతనాలు కూడా ఆగవు.
కానీ రాష్ట్రానికి పన్నుల ఆదాయం తగ్గినప్పుడు ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టే హామీలు, పథకాలు అత్యంత పేదలకు సంబంధించినవి. ఎన్నికల సమయంలో ఓట్లు కురిపించడానికి పేదలకు ఇచ్చే హామీలు పనికి వస్తాయన్నది రాజకీయ పార్టీల నిశ్చితాభిప్రాయం. ఎన్నికలు అయిపోయాక, అధికారం చేతికి చిక్కాక , వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసినా, పూర్తిగా పక్కన పెట్టినా అడిగే వారెవరూ ఉండరని ప్రభుత్వాలకు ఒక భరోసా.. ఏ రాజకీయ పార్టీ అధికారం లోకి వచ్చినా , ఈ మోసం లో తేడా ఉండడం లేదు.
గత BRS ప్రభుత్వం ముందుకు తెచ్చిన దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, దళిత బంధు, ఆదివాసీ బంధు, కేజీ నుండీ పీజీ వరకూ ఉచిత విద్య పథకాలు ఈ కోవలోకి వస్తాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీల పేరుతో ఇలాంటి కొన్ని హామీలు ఇచ్చింది. అర్హులైన మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్ధిక సహాయం, తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, విద్యార్ధులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పేరుతో అర్హులైన వారికి ప్రతి నెలా 4000 రూపాయల పెన్షన్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఈ కోవ లోకి వస్తాయి.

కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మానిఫెస్టో పేరుతో ఇంకా అనేక హామీలు పేదలకు ఇచ్చింది. ఈ మానిఫెస్టో లో గ్రామీణ రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన కొన్ని హామీల గురించి ఇదే వెబ్ మాగజైన్ లో ఇంతకు ముందటి వ్యాసంలో ప్రస్తావించాను. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లోనూ, చేవెళ్ళ ఎస్. సి, ఎస్. టి. డిక్లరేషన్ లోనూ, మైనారిటీ డిక్లరేషన్ లోనూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లోనూ, వివిధ రంగాలకు ప్రత్యేక హామీల రూపం లోనూ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్ధానాలు చేసింది. వీటిలో అనేక హామీలు తక్షణం అమలు లోకి వస్తే మాత్రమే, ఆయా సమూహాలలోని పేదలకు మేలు జరుగుతుంది. వీటి అమలు కోసం బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కొన్నిటికి ప్రత్యేక మార్గదర్శకాలు రాయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎస్. సి. ఎస్. టి సబ్ ప్లాన్ ల అమలు కోసం నిధులు కేటాయించి అమలు చేయకపోతే ఒక్క పని కూడా ముందుకు పోదు.
సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా అత్యంత వివక్షకు గురయ్యే ఈ సమూహాలకు , మరి కొన్ని బీసీ కులాలు, ముస్లిం మైనారిటీలు, మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఎన్నికల హామీలను అమలు చేయకపోతే, ప్రాధాన్యతగా ఎంచుకుని బడ్జెట్ కేటాయింపులు చేసి నిధులు విడుదల చేయక పోతే, ఆకలి నుండీ, అవమానాల నుండీ, అప్పుల నుండీ, పేదరికం నుండీ ఎప్పటికీ బయట పడలేరు. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు, బాలలు, దీర్ఘ రోగగ్రస్తులు కూడా ఇలాంటి సహాయం కోసం చూస్తుంటారు. కానీ విచిత్రంగా, ఈ అన్ని అంశాలకు సంబంధించి పథకాల అమలు, నిధుల విడుదలలో గత BRS ప్రభుత్వ తరహాలోనే, ఈ ప్రభుత్వం కూడా ఈ సంవత్సర కాలమంతా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పేదలకు సంబంధించిన ఈ అంశాలను పట్టించుకుని, చర్చించి, పరిష్కారం కోసం నిర్ధిష్ట సమయం లోపు నిధులు విడుదల చేయాలనే స్పృహ కూడా ఎవరికీ లేదు.
2018 లో అధికారంలోకి వచ్చిన BRS ప్రభుత్వం అప్పటికే అమలులో ఉన్న ఆసరా పెన్షన్ మొత్తాలను పెంచుతూ జీవో అయితే విడుదల చేసింది కానీ, అర్హులైన వారికి పెన్షన్ అందించేలా దరఖాస్తులు తీసుకుని, వాటికి వెంటనే ఆసరా పెన్షన్ శాంక్షన్ చేయలేదు. ప్రజా సంఘాల అనేక ఆందోళనల తరువాత, 2022 జూన్ లో మాత్రమే అప్పటికి పెండింగ్ లో ఉన్న కొన్ని దరఖాస్తులను పరిశీలించి , వారికి పెన్షన్ శాంక్షన్ చేసింది. కానీ అప్పటికే పెన్షన్ కు అర్హులైన పేద కుటుంబాల సభ్యులు నాలుగేళ్ల పాటు పెన్షన్ అందక నష్టపోయారు. దీనివల్ల ఒక్కో పేద వ్యక్తికీ జరిగిన నష్టం 48 నెలలు X 2000 రూపాయలు = మొత్తం 96,000 రూపాయలు. ఒక పేద కుటుంబానికి ఇది ఎంత పెద్ద మొత్తమో మనకు తెలియంది కాదు.
ఆ సమయంలో కూడా కొన్ని పేద కుటుంబాల సభ్యులు వివిధ కారణాల వల్ల పెన్షన్ శాంక్షన్ కాక నష్టపోయారు. ఇప్పటి వరకూ వారికి ఆ నష్టం కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, 2022 జులై నుండీ ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను తీసుకోవడం మానేసింది. అంటే మొత్తం 31 నెలలన్న మాట. దీనితో పెన్షన్ కు అర్హులైన పేద కుటుంబాల సభ్యులు పాత ప్రభుత్వ కాలంలో 18 నెలల పాటు నెలకు 2,016 రూపాయల చొప్పున 36,000 రూపాయలు నష్టపోయారు. 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 13 నెలలుగా ఇందిరమ్మ చేయూత పథకాన్ని అమలు చేయక పోవడం వల్ల, అర్హులైన పేద కుటుంబాల సభ్యులు, నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున మొత్తం 52,000 రూపాయలు నష్టపోయారు. ఇప్పటికే ఆసరా పెన్షన్ పొందుతున్న కుటుంబాల సభ్యులు గత 13 నెలలుగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ మేరకు తమకు పాత పెన్షన్ మొత్తానికి అదనంగా రావలసిన 2000 రూపాయల చొప్పున మొత్తం 26,000 రూపాయలు నష్టపోయారు.
అసంఘటితంగా ,నిస్సహాయులుగా, పేదరికంతో మగ్గే ఈ ప్రజల పట్ల ప్రభుత్వాల ఈ వ్యవహార శైలి అత్యంత అభ్యంతరకరమైనది. అన్యాయమైనది.
ఆసరా పెన్షన్ లాంటి సాంఘిక బధ్రత పథకం సరిగా అమలు కాకపోతే, పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడడమే కాదు, ఆత్మ గౌరవంతో కూడా బతకలేవు. ప్రభుత్వాల మార్పుతో, సంబంధం లేకుండా, అర్హులైన వారికి పెన్షన్ అందడం అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఇది చట్టబద్ధంగా జరగడానికి రాజస్థాన్ తరహాలో చట్టం కూడా చేయాల్సిన అవసరముంటుంది. కానీ ఇప్పటిలా దానిని ప్రభుత్వ పెద్దల దయా దాక్షిణ్యాల మీదకు వదిలేస్తే పేదలకు అన్యాయమే జరుగుతుంది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతే, పన్నుల ఆదాయలు పడిపోతే, సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేయాలి ? వాయిదా వేయగలిగిన పనులను , ప్రాజెక్టులను వాయిదా వేయాలి. పేదలకు, నిస్సహాయులకు ఉపయోగపడే పనులను ముందు చేపట్టాలి. అప్పుడే అది ప్రజాస్వామిక ప్రభుత్వం అవుతుంది. దానిది ప్రజా పాలన అవుతుంది. కాంగ్రెస్ పాలన అలా లేదు మరి !


Tags:    

Similar News