‘దండోరా’లో కనిపించే ‘ఎల్పీజీ’ ఛాయలు…

మాదిగలు ఏదో ఒకనాడు ఇప్పుడున్న ఏ పార్టీని నమ్మకుండా సొంత దారి చూసుకునే రోజు వస్తుందా?

Update: 2024-10-31 04:00 GMT

ఎక్కడైనా ఒక ఆరంభానికి ఒక ముగింపు ఉండడం మనకు తెలుసు. కానీ ‘దండోరా’ విషయంలో అందుకు భిన్నంగా దీనికి రెండు ముగింపులు అవసరమయ్యాయి. మొదటిది ఈ ఏడాది ఆగస్టు ఒకటిన ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నాయకత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన 7/1 తీర్పు. రెండవది సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టులో అదే బెంచి 7/7 తో తమ తీర్పుపై వచ్చిన అప్పీళ్లను తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం. ఇలా రెండవ దానిపై కూడా వెనువెంటనే వచ్చిన సుప్రీం నిర్ణయంతో ఈ వివాదానికి శాశ్వతంగా తెరలు దించినట్టు అయింది.

అయితే, ఇక్కడే ‘దండోరా’ ఉద్యమం ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎంతో కొంత ‘సెన్సిబిలిటీ’ అవసరం. అందుకు, గడచిన ముప్పై ఏళ్లలో మన దేశంలోని సామాజిక ఆర్ధిక రాజకీయ పరిణామాలపై కనీసపు విహంగ వీక్షణ దృష్టి అయినా ఉండాలి. ఆ దృష్టితో చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమంటే, 2025లోకి మనం ప్రవేశించే ముందు, పరిష్కార దిశకు చేరిన ‘దండోరా ను ఎలా చూడాలి? ఏనాడో అది మొదలైన ముప్పై ఏళ్ళ నాటి 1994 దగ్గర నుంచే ఇంకా చూడాలా, లేక వివాదం ముగిసిన ఈ చివరి- ‘2024 ఎండ్’ నుంచి చూడాలా? ఇది ఒక అంశం. దాన్ని అలా ఉంచి- అసలు ఈ మూడు దశాబ్దాల కాలంలో దళిత రాజకీయ చైతన్యం పరిణామాలు సంగతి ఏమిటి అనేది క్లుప్తంగా చూద్దాం.

కారంచేడు ఉద్యమం (1985) తర్వాత ‘దళిత మహాసభ’ ద్వారా రచయిత అధ్యాపకుడు కత్తి పద్మారావు (మాల) ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆయన ‘పేద ప్రజల పార్టీ’ పేరుతో ఒక స్వంత పార్టీ పెట్టారు, ఆ తర్వాత కొన్నాళ్ళు ‘బి ఎస్ పి’ లో ఉండి, ఆ తర్వాత ‘ప్రజారాజ్యం’ పార్టీ లోకి వెళ్లి, ప్రస్తుతం అయితే రాజకీయాల్లో లేరు. మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి కొన్నాళ్ళు ‘బి ఎస్ పి’ లో ఉండి ప్రస్తుతం ‘బిఆర్ ఎస్.’పార్టీలో ఉన్నారు. పార్టీ చురుగ్గా లేకపోయినా రిటైరైన బిసి, ఎస్.సి అధికారులు కొద్దిమంది ‘బి ఎస్ పి’ రాజకీయాల్లో ఉంటున్నారు. ఇక రెండు జాతీయ రాజకీయ పార్టీలో ఉంటూ- ‘బాబా సాబ్ అంబేద్కర్’ అంటూ... వారిని ఉటంకిస్తూ మాట్లాడేవారు ఎటూ ఉన్నారు.

కాన్షీరాం జీవించి ఉన్న కాలంలోనే దక్షణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ కాలూనడానికి తగిన అనుకూలత లేకపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఏ దశలోనూ శ్రద్ద పెట్టినట్టుగా కనిపించదు. చివరికి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ‘నార్త్’ లో ఒక్క సీటు గెలవని పరాజయం దాన్ని 2% వోటింగు దాటిన పార్టీగా మార్చింది. దీనర్ధం దాని రాజకీయ సిద్దాంతానికి కాలం చెల్లింది, దానికి రాజకీయ కార్యస్థానం ఇకముందు లేదని కాదు.

అది తన రూపం మార్చుకుంది. ‘కాన్షి రామ్ జీ కే సప్నే...’ అనే నినాదంతో చంద్రశేఖర్ ఆజాద్ అనే యువకుడు ‘ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం)’ పేరుతో ఉత్తరప్రదేశ్ లోని నగీనా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. పదేళ్ళ క్రితం ‘హిందీ బెల్ట్’ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన యువకులు- కన్హయ్య లాల్, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ వంటి వారికి ఈ స్థాయి ‘ఓపెనింగ్’ దొరకలేదు. అయితే ఉత్తర భారత్ లో ‘చర్మకార’ కులస్థుడు అయిన ఆజాద్ దాన్ని సాధించాడు!

ఈ సందర్భంగా జే.ఎన్.యూ ‘సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్’ అసిస్టెంట్ ప్రొఫెసర్ హరీష్ ఎస్. వాంఖడే (Harish S. Wankhede)వ్యాఖ్యలు చూడడం వాటిని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. ‘పునర్ జీవానికి ఆస్కారమున్న వర్తమాన దళిత రాజకీయాలు’ (Possible revival of Dalit politics today) శీర్షికతో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన ఒక వ్యాసం రాశారు. అందులో- “దళిత నాయకులు తమ దళిత పార్టీలతో జాతీయ స్థాయిలో- ‘ఫెడరల్ దళిత్ ఫ్రంట్’ (Federal Dalit Front)గా కూటమిగా ఏర్పడడం అవసరం. అందుకోసం ఒక నూతన సామాజిక న్యాయ ‘మ్యానిఫెస్టో తో వాళ్ళు బయటకు రావాలి. ఉత్తరాదిలో బిఎస్ పి, మహారాష్ట్రలో విబిఏ. (‘వంచిత్ బహుజన అగాధీ’) వంటి పార్టీలు పోటీలో ఉంటూ దళిత ఓటును చీల్చి అవి ‘సెక్యులర్ ఫ్రంట్ కు నష్టం చేస్తూ, పరోక్షంగా బిజేపి కి ప్రయోజనం కలిగిస్తున్నాయి” అంటారు. “ఈ దశలో చంద్రశేఖర్ ఆజాద్ గెలుపు అతి ప్రాముఖ్యమైన పరిణామం ‘ఇండిపెండెంట్ దళిత పాలిటిక్స్ కు సమయం వచ్చేసింది” అంటారు ప్రొఫెసర్ హరీష్.

 

ప్రొఫెసర్ హరీష్ ఎస్ వాంఖడే

అది అలా ఉంచి, పైన మనం వేసుకున్న ప్రశ్న ‘దండోరా ను- ఆరంభం ముగింపు ఈ రెండింటిలో దేన్ని బట్టి అంచనా వేయాలి? అంటే, ఈ ప్రశ్న ఎంత సంక్లిష్టమో దాని జవాబు కూడా అంతే విస్తృతమైనది. కనుక, ఇప్పటికే ఇక్కడ స్థిరపడి వున్న కొన్ని పాత నమూనాలు (Time tested models)ను చూస్తే, ఇటువంటి వెతుకులాట పని తేలిక అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలలో రెడ్డి కులస్తులకు తప్ప, ‘కమ్మ’ కులానికి తగిన గుర్తింపు లేదు, అనే నిర్ధారణకు ఎనభై దశకం నాటికి కమ్మవాళ్ళు వచ్చారు. ఆ తర్వాతనే ‘తెలుగు దేశం పార్టీ’ పెట్టాలనే ఆలోచన వారికి కలిగింది. అందుకు వాళ్ళు మరికొందరిని తమతో కలుపుకున్నారు. అది ఎక్కడైనా ఎటూ ఉంటుంది.

అప్పట్లో వాళ్ళు అలా కలుపుకున్న వారిలో మాదిగలు కూడా ఉన్నారు, అని అంటారు. అదంతా ఎన్టీఆర్ ఉన్నప్పటి సంగతి. ఆ తర్వాత ఈ నలభై ఏళ్లలో జరిగింది ఏమిటో... అది మన అరిచేతిలో కనిపించే చరిత్ర. చంద్రబాబు నమ్మశక్యం కాని బుద్ధి వల్ల మాల-మాదిగల మధ్య వైరానికి అతను కారణం అని ఒక వాదన ఉంది కానీ అది నిజం కాదు. తొంభై దశకంలో వచ్చిన పలు అస్తిత్వ ఉద్యమాల లాగానే, ‘దండోరా’ వచ్చింది, ఆ కాలంలోనే మొదలైన ‘సరళీకరణ’ (Liberalization) దానికి ఆమోదాన్ని తెచ్చి ముందుకు తీసుకెళ్ళింది. ఆ మాటకొస్తే, వెతికితే ‘దండోరా లో ‘ఎల్పీజీ’ (Liberalization, Privatization, Globalization) మూడింటి ఛాయలు కనిపిస్తాయి!

నది నుంచి కాలువలు వాటి నుంచి చిన్న కాలువలు పిల్ల కాలువలు పుడతాయి. ప్రవాహానికి ఉండే లక్షణాలు ఇవన్నీ. అలాగే ప్రతి కొత్త విభజన లేదా కోత (‘కటింగ్’) తర్వాత, గతంలో మనం చూడని కొత్త పార్శ్వాలను మనకు చూపిస్తుంది. ఇదింకా స్పష్టంగా అర్థం కావడానికి రాష్ట్ర విభజన తర్వాత జరిగింది చూడండి, ‘పబ్లిక్ లైఫ్’ లో ఆధిపత్య కులీన కులాల కుటుంబాలుగా చలామణిలో ఉన్న వారి నుంచి, ఇటీవల మనం ఊహించని కొత్త పార్శ్వాలు ఎలా ‘ఓపెన్’ అవుతున్నాయో చూడండి. అలాగే ఇప్పటి రాజకీయాల్లో వాడుతున్న ‘భాష’ కూడా మారింది. ఒకప్పుడు అటువంటి భాషను ఈ వర్గాలు మాట్లాడవు, అసలు అటువంటి అనైతికత అక్కడ ఉండదు, వాళ్ళు ‘రిఫైండ్’... అవి మరెక్కడో ‘స్లమ్స్’ లో దిగువ స్థాయిలో ఉంటాయి, అనుకుంటే పరిస్థితి ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది!

దీనివల్ల ఏమవుతున్నది అని చూసినప్పుడు... ‘పెద్ద’ -‘చిన్న’ మధ్య ఒకప్పుడున్న దూరాలు, నైతిక ప్రమాణాల వ్యత్యాసాలు తగ్గడం కనిపిస్తున్నది. డబ్బు ఉందనో లేదా ‘కులం’ ఉందనో లేక అధికారానికి దగ్గరగా ఉన్నారనో, ‘ఎలివేటేడ్’గా ఉండేవాళ్ళ వద్దకు వేతన జీవులు శ్రమించి- ‘ఏదో ఒకరోజుకు అక్కడకు చేరాలి...’ అనే జీవితకాల లక్ష్యం ఇప్పుడు అక్కరలేదు. సరళీకరణ వల్ల కదలిక ఇప్పుడు రెండు వైపులా ఉంటున్నది. కొందరు పైకి ఎక్కుతున్నట్టే... ఎప్పటినుంచో పైనున్న వాళ్ళు పైనుంచి క్రిందికి దిగుతుంటారు.

అలా మనుష్యుల మానసిక స్థితిలో వైరుధ్యాలు తగ్గి వాళ్ళు కులాలు మతాలు ప్రాంతాలకు దేశాలకు అతీతంగా- ‘రీ గ్రూపింగ్’ అవుతుంటారు. ఇటువంటప్పుడు, అభివృద్ధి చెందుతున్న సమాజాలు లేదా దేశాల్లో అంతిమంగా స్థిరపడాల్సిన స్థితి అంటూ ఒకటి నిర్ధారణ అవుతుంది. ప్రపంచంలో ‘యూదు’ జాతి వలె ‘వెతుకులాట’ కై అందరికంటే ముందుగా ఇక్కణ్ణించి బయటకు బయలుదేరిన ‘భ్రాహ్మణులు’ ఇప్పటికే అటువంటి ‘స్థిరపడాల్సిన స్థితికి చేరారు. రేపది ఏదో ఒకరోజు కార్ల్ మార్క్స్ చెప్పిన- (Withering away of the State) ‘రాజ్యం లేని స్థితి’ అయితే కావొచ్చు.

అలాగే ‘ప్రపంచీకరణ’ వల్ల టెక్నాలజీ అందరికీ సమంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడది వాడుకున్నవాడికి వాడుకున్నంత. దాంతో వివేకం పెరిగే క్రమంలో డబ్బు, స్థాయి, హోదా, పలుకుబడి ఉన్నంత మాత్రాన వాళ్ళ బతుకులు మన కంటే, మెరుగ్గా ఏమీ లేవు అనే ఎరుక అన్ని కులాలకు పెరిగింది. అది కలిగినప్పుడు, దిగువన ఉన్నవాళ్ళకు- ‘మనం బాగేనే వున్నాం...’ అనే ‘మోరల్ ప్రైడ్’ మిగులుతుంది. అప్పుడు ఏమి ఉండాలి, ఏది అక్కరలేదు, ఉంటే ఎంత ఉండాలి ఎంత చాలు అనే ఇంగితం మిగులుస్తుంది.

అయినా మొదటి నుంచి మాదిగలు మాలలు వలె ‘డ్రైవింగ్ నేచర్’ ఉన్నవాళ్ళు కాదు. అది తమకు లేకపోవడాన్ని ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ అని వాళ్ళు అనుకుంటారు. మాలలు అలా కాదు, ‘బాబా సాహెబ్ చెప్పినట్టు...’ అంటూ విషయం ఏమైనాగానీ శిఖర సమానుడైన అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ పనులు కానిస్తారు. మాట్లాడుతున్న సందర్భానికి ఆయన ప్రస్తావన నప్పుతుందా లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ ధోరణి అలాగే ఉంటుంది. ఆ పేరుతో అయాచితంగా ఒక ‘సెక్యూరిటీ కవర్’ సౌకర్యం వాళ్ళు తీసుకుంటున్నారు.

గత వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్’ చైర్మన్ గా ఉన్న కొమ్మూరి కనకారావు మాదిగ “ముఖ్యమంత్రి కావడం మాలల రాజకీయ లక్ష్యం. కనుక మరే ఇతర రాజకీయ తాయిలాలతోనూ వాళ్ళను తృప్తి పరచడం కుదరదు” అంటారు. వాళ్ళ మాదిరిగా ‘పొలిటికల్ ప్రోగ్రాం’ లేని మాదిగలకు ‘దండోరా’ తర్వాత కుల స్పృహ పెరిగి అది బలపడడం అయితే నిజం. వృత్తి చదువులు, ‘ప్రైవేట్’ రంగంలో దొరుకుతున్న ఉద్యోగాలు వల్ల ఒకప్పటి దిగువ మధ్యతరగతి ఇప్పుడు ఎగువ మధ్యతరగతి గా మారింది. యాభై ఏళ్ల క్రితం మాలల నివాసాల వద్ద వాళ్ళు అంబేద్కర్ బొమ్మను పెట్టుకున్నట్టుగా, మాదిగలు తమ ఉనికిని ఇప్పుడు అదొక ‘జిఐ ట్యాగ్’ (G I Tag) అన్నట్టుగా ‘దండోరా’ తర్వాత బాబూ జగ్జీవన్ రాం విగ్రహాలు కొన్నిచోట్ల పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీం తీర్పు తర్వాత మరోసారి మంద కృష్ణ మాదిగ రెండు తెలుగు రాష్ట్రాలకు మిగిలిన ఏకైక మాదిగ నాయకుడు అయ్యారు.

అయితే, రెండు రాష్ట్రాల్లో ఉన్న వేర్వేరు పరిస్థితులు దృష్ట్యా ఇదే పరిస్థితి ఇకముందు ఉండదు. విభజనతో వచ్చిన మార్పు కు తగినట్టుగా కొత్త ఆలోచనలు కార్యాచరణ ప్రణాళికలతో కొత్త తరం సామాజిక జీవనంలోకి వస్తుంది. గత పదేళ్లుగా గ్రామాలలో మాదిగ నివాస ప్రాంతాల్లో కొంతమేర మార్పు కనిపిస్తున్నది. గడచిన ఐదేళ్ళలో ‘వార్డు వాలంటీర్’ పనులను, గ్రామ సచివాలయ వ్యవస్థను కొత్తగా మాదిగలు కూడా దగ్గరగా చూసారు. గతంలో ఈ అవగాహన మాలల్లో మాత్రమే ఉండేది. మాదిగల అవగాహనా స్థాయిలో మునుపు లేని చురుకుదనం ఇప్పుడు కనిపిస్తున్నది. ఇది వీరిని ఏదో ఒకనాడు ఇప్పుడున్న ఏ పార్టీని నమ్మకుండా తమ స్వంత మార్గాల వెంట వారిని నడిపించవచ్చు.

Tags:    

Similar News