ఆంధ్రాలో సంక్రాంతి చీకటి వెలుగులు...

సంక్రాంతి సంబరాలైనా కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి?;

Update: 2025-01-27 08:31 GMT

-వి. శంకరయ్య

రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ అసమానతలను సంక్రాంతి సంబరాలు మరో మారు తెర మీదకు తెచ్చాయి. రాష్ట్రంలో ఆ చివరి వున్న ఉత్తరాంధ్ర ఈ చివర వున్న రాయలసీమలో సంక్రాంతి పండుగ సాదా సీదాగా జరిగింది. ఒక్క మీడియాలో కూడా ఈ రెండు ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాల సంక్రాంతి సందర్భంగా కోడి పందేలకు భారీ ఎత్తున కాకున్నా సాదా సీదాగా బరులు ఏర్పాటు గురించిన వార్తలు ప్రచురించ లేదు. అయితే ఒక్క విజయవాడ నుండే ఐదు లక్షల మంది తెలంగాణ నుండి ప్రయాణం చేశారనే వార్తలు ఇచ్చాయి.

కోస్తా జిల్లాల్లో మూడు రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయల బెట్టింగుతో కోడి పందేలు జరిగినట్లు మీడియా కథనాలున్నాయి. ఇక మందు ఇతర జూదం లెక్క వేరుగా వుంది. కోడి పందేల కోసం చలువ పండిళ్లు ప్రేక్షకులకు కుర్చీలు ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎల్ఇడి స్క్రీన్ లు అంతేకాదు క్రికెట్ మాచ్ కు తీసి పోని విధంగా కామెంట్రీలతో ఏర్పాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంత వరకైతే ఫర్వాలేదు. క్యాజినోలను తలపించే విధంగా గుంజాటలు కూడా జరిగాయి. ఇంత బరి తెగించి మరీ పచ్చిగా చెప్పాలంటే జూదం కొనసాగినా ప్రభుత్వం యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం దీనికి తోడు విజయోత్సవంతో కూటమి పార్టీల నేతలు పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశం కాదు. ఏ నది పైనైనా ఆనకట్ట కడితే నిండు కుండలా రిజర్వాయర్ వున్నట్లు కోస్తా జిల్లాలుంటే ఆనకట్ట దిగువున నెర్రెలు బారిన నేల ఇసుక తిన్నెలు వున్నట్లు రాష్ట్రంలో ఉమ్మడి 14 జిల్లాలో ఏడు ఉమ్మడి జిల్లాల ప్రజల జీవితాలు మిగిలి పోయి సంక్రాంతి సంబరాలు నిస్సారంగా జరిగాయి .

రాయలసీమలో కరువు, ఉపాధి లేక వలసలు

రాయలసీమ నుండి కూడా పొట్ట చేత బట్టుకొని బతుకు జీవనం కోసం హైదరాబాద్ బెంగళూరు నగరాలకు వేలాది మంది వెళుతుంటారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు నడిపిన జాడ లేదు. విచారకరమైన అంశమేమంటే రాయలసీమ నుండి పండుగ నాలుగు రోజులు పూర్తి కాగానే కుటుంబాలతో సహా మినీ లారీల్లో వలస కూలీలు వెళ్లిన ఫోటోలు మీడియాలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోడి పందేళ్ల కోసం బరులు ఏర్పాటు చేసినట్లు గాని తుదకు పేకాట సాగినట్లు ఒక్క మీడియాలో కథనం లేదు.

స్వాతంత్య్ర వచ్చి ఇన్నేళ్లు గడచినా అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ లో ఈనాటికీ ప్రాంతీయ అసమానతలు నివారింప బడలేదనేందుకు ఇంత కన్నా నిదర్శనం అక్కర్లేదు . రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అన్ని రంగాల్లో వెనుకబడి వున్నాయి. పైగా పూర్తిగా వ్యవసాయాధారంగావున్నాయి. తుదకు రాష్ట్ర విభజన చట్టం కూడా వెనుక బాటు తనం గురించి రాజ ముద్ర వేసి వుంది. జగన్మోహన్ రెడ్డి గత అయిదేళ్ల కాలంలో ప్రాంతీయ అసమానతల నిర్మూలన పేరుతో మూడు రాజధానుల సిద్దాంతం తెర మీదకు తెచ్చి ప్రాంతీయ భావోద్వేగాలు

విద్వేషాలు మరింతగా పెంచారు - తప్ప వెనుక బడిన ప్రాంతాల్లో ఆర్థిక సామాజిక భౌతిక రంగాల్లో అభివృద్ధి ఏ మాత్రం సాధించ లేదు.

తత్ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ అనుభవం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠంగా వుండాలి.

కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించే క్రమంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా పురోగతి సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకంగా నిధులు కోరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కూడా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి చెందిన జిల్లాలతో సమంగా పురోగతి సాధించేందుకు రాష్ట్ర బడ్జెట్ తో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రత్యేక దృష్టి సారించినపుడే ప్రాంతీయ అసమానతల నిర్మూలన సాధ్యమౌతుంది.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మనో భావాలు డిమాండ్లు ఆశలు ఆకాంక్షలు తుదకు ఆహారపు అలవాట్లు ఒకటిగా లేవు. కోస్తా జిల్లాల్లో పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని పంట హాల్ డే ప్రకటించుతామని ఆక్వా రంగానికి మరిన్ని రాయితీలు కావాలని కోరుతుంటారు. కాని రాయలసీమ ఉత్తరాంధ్ర పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంటుంది . రాయలసీమలో పంట కాలువలే లేవు. క్రాప్ హాలిడే అనే మాట కొత్తగా వుంటుంది. నైరుతి సీజన్ లో 15 రోజులు డ్రై స్పెల్ ఏర్పడితే సీమలో ఆ ఏడు క్రాప్ హాలిడేనే.. తాగేందుకే నీళ్లు లేనపుడు చేపల చెరువులు రాయలసీమలో గగన కుసుమాలే. ఈ దుస్థితికి రాయలసీమ వాసులు కోస్తా జిల్లాల వాసులను చూచి ఈర్ష్య పడటం లేదు. అసూయ ఏమాత్రం లేదు. తాము కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లా ప్రజలలాగా తలెత్తుకు తిరగాలని ఆశిస్తున్నారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి విస్తారంగా వుండే బీడు పొలాలకు అవసరమైన సాగునీరు అందించితే బంగారం పండించే కండ బలం సీమ రైతులకు వుంది. వ్యవసాయం కుదట పడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభిస్తుంది. పిల్లలను పై చదువులకు పంపుతారు. విద్యా ప్రమాణాలు లేకుండా రైతు కుటుంబాల పిల్లలకు చదువు సంధ్యలు లేక పోతే కేవలం పరిశ్రమలు పెడితే రైతు కుటుంబాల పిల్లలకు వాచ్ మెన్ ఉద్యోగాలే గతి.

2024 ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు తుదకు రాజ కీయ విశ్లేషకులతో పాటు అందరికీ సరి కొత్త గుణపాఠాలను నేర్పాయి. 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత తాను విశాఖ నుండి పరిపాలన సాగిస్తానని ఊరించే ప్రకటనలు చేసినా మూడు జిల్లాల ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. అదే సమయంలో రాయలసీమలో అమరావతి రాజధాని అని అరమరికలు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రకటించినా ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించారు.

ఈ దఫా అయినా కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని బీడు బారిన భూములకు సాగునీరు అందించుతుందని ఆ దిశగా ఆలోచించారు. విమానాశ్రయాలు నౌకాశ్రయాలు తక్షణ కర్తవ్యాలు కావని తేల్చిచెప్ఫారు

వ్యవసాయం ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఎక్కువ మంది రాయలసీమ ఉత్తరాంధ్ర వాసులు

తాము పుట్టిన గడ్డలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నారు. విస్తారంగా వుండే పొలాలకు సాగునీరు అందించాలని కోరుతున్నారు . కొసమెరుపు ఏమంటే సీమ సగటు వాసులను నిద్రలో లేపినా "నీళ్లు నీళ్లు" అంటూ కలవరిస్తారు. తమ కళ్ల ముందు పోయే నీళ్లు సముద్రం పాలు చేస్తూ ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత అందే గోదావరి జలాలపై ఈ రోజుకూ సీమ వాసుల్లో నమ్మకం కుదరడం లేదు. మొన్నటి బడ్జెట్ లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకు బాగానే నిధులు కేటాయించినా విడుదల మాత్రం జరగడం లేదనే ఆవేదన వుంది. తుదకు ముఖ్యమంత్రి స్వంత జిల్లాకు చెందిన గాలేరు నగరి రెండవ దశ అలైన్ మెంట్ కూడా నిర్థారణ కాలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో సీమ వాసుల ఆకాంక్షలు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం తుది దశకు తీసుకురాగలిగితే సీమ బిడ్డగా జీవితం ధన్యమౌతుంది.

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్)

Tags:    

Similar News