తెలుగు సామాజిక న్యాయ చరిత్రలో ‘ఆగస్టు 6’ ప్రాముఖ్యం

రెండు ఆగస్టు ఆర్లు చెప్పే సామాజిక న్యాయం కథ

Update: 2024-07-31 07:40 GMT

-బి ప్రభాకర్ రావు


ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల నుండే చరిత్ర నిర్మాతలుగా ఎదుగుతారు. కాలం తన చారిత్రక ప్రతినిధులను తయారు చేస్తుంది. చరిత్ర కొందరిని తన కాలానికి ప్రతీకలుగా నిలుపుతుంది. ప్రజా గాయకుడు గద్దర్ తన కాలానికి , తన కాలపు చరిత్రకు ప్రతినిధి , ప్రతీక. ఆగస్టు ఆరున గద్దర్ తుది శ్వాస వదిలి యశోకాయంతో జీవించడం మొదలై యేడాది అవుతున్నది. యాలరో ఈ మాదిగ బతుకు ఎంత మొత్తుకున్న దొరుకది మెతుకు. అని గొంతెత్తిన గద్దర్ దళిత పులులమ్మ కారంచేడులో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అంటూ లక్షలాది ప్రజల గుండెల్లో నిరాశ విదిలించి పెనుగర్జనతో ఉర్రూతలూగించాడు.




 మరొక  ఆగస్టు 6  న చుండూరు హత్యాకాండ సాగింది. కారంచేడు నుండి చుండూరు దాకా రక్తం చిందిన ప్రజలకు మద్దతుగా ఒకరిది మాటగా , మరొకరిది పాటగా కలిసి ముందుకు సాగిన చరిత్ర గద్దర్ , కత్తి పద్మారావుది. కాలం గాయాలు మాన్పుతుంది. చరిత్ర ఆ గాయాలను కెలుకుతుంది. గతం మరలిరాదు. దాని గుణపాఠాలు అనుభవాలు , మచ్చలు చరిత్ర దేహం పై దేశం పై నిలిచి పోతాయి. యుద్ధం వీరుల చరిత్రగా ప్రజల చరిత్ర సంకేతించబడుతుంది. 


కత్తి పద్మారావు

 గద్దర్ , కత్తి పద్మారావు దశాబ్దాల చరిత్ర పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులు. చరిత్రను మలిచిన యోధులు. వీరిద్దరిది అస్పృశ్యుల యుద్ధగాధ. చరిత్రకు చైతన్యం అందించిన అనితర సాధ్యమైన వ్యక్తులు. వ్యక్తిత్వాలు. గద్దర్ రచనలు కోకొల్లలు. ఆశు కవిగా ఎన్ని నుడులను నుండి వాడో ! కత్తి పద్మారావు ఆశు వక్తగా అనర్గళ వక్త. ఈ ఇద్దరూ కలిస్తే ఫూలే , అంబేద్కర్ , కలిసి యుద్ధం చేసినట్టుగా వుంటుంది. వీరిద్దరు కలిస్తే అంబేద్కర్ , పెరియార్ , లోహియా కలిసి ముందుకు సాగినట్టుంటుంది. ఒకరిది తెలంగాణ. మరొకరిది ఆంధ్ర. ఇద్దరూ సామాజిక మార్పుకోసం కదిలి , కదిలించినవారే. శివసాగర్ అనే సత్యమూర్తి తను నమ్మిన వారిచే గాయపడి మలుపు తిరిగి కొత్త చరిత్రలో భాగమయ్యాడు. 


శివసాగర్


 ఈ ముగ్గురు నడిపిన చరిత్ర లేదా ఈ ముగ్గురిని చరిత్ర తనకు ప్రతినిధులుగా చేసుకుంది. వీరిని ఉత్తరాది నుండి ప్రళయ ఝంకారావంతో ఒక్కటిగా కలిపిన సిద్దాంత దార్శనికుడు , ఉద్యమకారుడు కాశ్మీరాం. ఈ నలుగురివీ నాలుగు రకాల ప్రయాణాలు. నలుదిశలా అంబేద్కర్ భావజాలాన్ని , భారత ప్రజాస్వామ్యం పట్ల , ఓటు హక్కు పట్ల , రాజ్యాంగం పట్ల విశ్వాసం పెంచినవాడు కాన్సీరాం. అంబేద్కర్ కాన్సీరాం రూపంలో ఈ సమాజం వైతాళికులు ను ఒకే మార్గంలోకి మలిచిన చారిత్రక శక్తి కాన్సీరాం. బి ఎస్ రాములు ఈ నలుగురిలోని ఏక సూత్రతను వెలికి తీసాడు. సూత్రీకరించాడు. సిద్ధాంతీకరించాడు. తాత్వీకరించాడు. సామాజిక తాత్విక , సాహిత్య ఉద్యమంగా ఒకే బాటగా సమన్వయం సాధించాడు. చరిత్రను , సామాజిక సాహిత్య చరిత్రను మలుపు తిప్పాడు.


బిఎస్ రాములు


 అలా వీరి నినాదాలు , పాటలు , మాటలు , తాత్విక సూత్రాలు జలపాత సదృశ వేగం నుండి విస్తరించి తథాగతుడు బుద్దుడి బోధనలతో బుద్ధుని బాటలో , ఆధునిక బోధిసత్వుడు అంబేద్కర్ తీర్చిదిద్దిన భారత రాజ్యాంగం వెలుగులో ప్రజల చరిత్రను మలుపు తిప్పారు. అదంతా కాలం మహిమ. కాలం కడుపుతో వుండి వీరిని కన్నది. కాలం తనకు తాను వారిని సృష్టించుకున్నది. కంచ ఐలయ్య , ఉ. సాంబశివరావు , మారోజు వీరన్న , ఒక మహా ప్రవాహంగా ముందుకు సాగడం ఈ యుగధర్మం కాక మరేమిటి ? అందుకే ఈ యుగం మాది అన్నాడు కత్తి పద్మారావు. గద్దర్ , కత్తి పద్మారావు , బి ఎస్ రాములు , కంచ ఐలయ్య ,  కె.ఎస్. చలం సమకాలీన అంశాలపై వెంటది వెంట సంశ్లేషిస్తూ తాత్వీకరిస్తూ కవిత్వీకరిస్తూ దారి చూపుతున్న , దారి వేస్తున్న మహా మేధావులు. 


ప్రొఫెసర్ కెఎస్ చలం


దార్శనికుడు. ఆధునిక సమస్యలకు భారత రాజ్యాంగం , బౌద్ధం , అంబేద్కరిజం ఎలా పరిష్కారం చూపుతుందో అన్వయించి విశ్లేషిస్తున్న భాష్యకారులు వీరు. వీరు సంఘసంస్కర్తలు. సామాజిక విప్లవకారులు. వీరి అధ్యయనం అపారం. వీరు అనితర సాధ్యులు. వీరు బాట వేస్తారు. అది రాజమార్గమౌతుంది. కత్తి పద్మారావు సాంస్కృతిక విప్లవం ప్రత్యేకమైనది. కుల నిర్మూలన సాంస్కృతిక ఉద్యమానికి ప్రతీకగా వందలాది కులాంతర వివాహాలు జరిపించాడు కత్తి పద్మారావు. తన కుటుంబాన్ని అలా కులాంతర వివాహాలతో ఆదర్శంగా నిలిపాడు.


ప్రొఫెసర్ కంచ ఐలయ్య


జ్కకాన్షీరాంగారు 23 సార్లు తెలుగునాట పర్యటిస్తే 17 సార్లు వెంట నడిచి బహుజన భావధారను ప్రవాహశీలంగా ప్రసంగించాడు కత్తి పద్మారావు. భారతీయ చారిత్రక , తాత్విక , సాంస్కృతిక మూలాలు ఎరిగిన కత్తి పద్మారావు ఆచరణ. అధ్యయనంతో అంతశ్చేతనలో సైతం అవే నిండి ఏది మాట్లాడినా తత్వం , సంస్కృతి , చరిత్ర ఫ్రత్యామ్నాయ రాజకీయాలు నూతన సమాజ నిర్మాణమే సాక్షాత్కార వుతుంది. కాశ్మీరాం , కంచ ఐలయ్య , కత్తి పద్మారావు , శివసాగర్ , బి ఎస్ రాములు , బైరి నరేశ్ , కె.ఎస్. చలం వైదిక ఆర్యులను నిలదీసినా చార్వాకులు , లోకాయతులు , బుద్ధుడు , బౌద్ధం పంచశీల , కులాతీత సమాజ పునర్నిర్మాణం చేపట్టినా అవన్నీ భావి సమాజ దర్శనంలోభాగమే


కాన్సీరాం రాజకీయంగా పార్టీ పెట్టి శాసన సభ్యులను గెలిపించారు. రామ్మనోహర్ లోహియాతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదిగి అధికారంలోకి వచ్చింది. పెరియార్ స్పూర్తినందుకొని డియంకే అన్నాదురై , కరుణానిధి అధికారంలోకి వచ్చారు. బహుజన బాటలో ఉత్తర ప్రదేశ్లో బీయస్పీని కాన్షీరాం గారు అధికారం లోకి తెచ్చారు. తెలుగునాట ఇవేవీ సాధ్యం కాలేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ అధికారం కొన్ని కులాలకు పరిమితమైపోయింది. అని గమనించిన వీరంతా తమ శక్తియుక్తుల్ని , సామర్థ్యాలను సామాజిక చైతన్యం వైసు మలుపు తిప్పారు. ప్రసంగాలు , పాటలు , ప్రదర్శనలు , పాద యాత్రలు , శాంతి యాత్రలు , వ్యాసాలు , కవితలు , చరిత్ర పునరధ్యయనం బృహత్తర కృషి సమాజానికి అందించారు. వీరిది విశ్వ వ్యాప్త మహనీయుల చరిత్రలో భాగం. వారి వ్యక్తిత్వాలు , సిద్ధాంతాలు ఆచరణ రూపుదిద్దుకున్న తీరును వ్యక్తిత్వ నిర్మాణ శైలి జీవితాలు ఆదర్శాలు ప్రజలకు అందించారు. వీరు తాము పుట్టి పెరిగి సాగిన చరిత్రను , తన వెంట నడిచిన , తన వెంట నడిపిన సామాజిక చరిత్రను కంచ ఐలయ్య " నేను హిందువు నెట్లయిత ” , బి.ఎస్. రాములు “ ఒక సామాన్యుని జీవన గమనం ” , గద్దర్ పాటకు జీవకణం , కత్తి పద్మారావు “ ఒక అస్పృశ్యుని యుద్దగాథ " రచనలతో స్వీయ చరిత్ర రూపంలో సామాజిక చరిత్రను , పరిణామాలను యువతరాలకు భావితరాలకు నిక్షిప్తం చేస్తున్న నూతన వైతాళికులు వీరు. అట్టడుగు సామాన్య ప్రజలనుండి ఎదిగిన అసమాన్యులు.


Tags:    

Similar News