‘నూతన విద్యా విధానంతో సమాన విద్యావకాశాలు దెబ్బతింటున్నాయి’
నియంతృత్వ పోకడలతో ఛిద్రమవుతున్న మధ్య తరగతి ప్రజలు: డాక్టర్ వెన్నెల గద్దర్;
-డా. జి. వెన్నెల గద్దర్
లోకం ఎట్లుంది సిద్దా అంటే ఎవడి లోకం వాడిదన్నట్లు, ఒకవైపు అమెరికా ఓపెన్ ఏఐ, గ్రోక్ ఎక్స్ పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ తయారు చేస్తే దాని తలదన్నే విధంగా చైనా డీప్ సీక్ ఆర్ పేరుతో మరో ఆవిష్కరణ చేసి కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా చేరింది. 'పెట్టుబడి' బెంగ పట్టుకుని , తన అస్థిత్వాన్ని కోల్పోకుండా చేసే యత్నంలో అమెరికా రోడ్డెక్కింది. ట్రంప్ పెంచిన సుంకం కంపుతో ప్రపంచమంతా గబ్బు పట్టింది.
ఈ వాణిజ్య యుద్ధంలో సకల దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలు. కార్పొరేట్ శక్తులు బక్కచిక్కిన వైనం, ప్రపంచంలో సామాన్య ప్రజానీకం కొనుగోలు శక్తిని పెంచకుండా కార్పొరేట్ పెట్టుబడి మనుగడ అసాధ్యం.ఏప్రిల్ 7న భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన నష్టాలను చవిచూసింది, భారత షేర్ మార్కెట్ రక్తపాతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ఏర్పడిన ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రభావం పెరుగుతున్న భయాల మధ్య ప్రధాన ప్రపంచ మార్కెట్లో కనిపించే ధోరణులను ప్రతిబింబిస్తూ, సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది.
చైనా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు మరో యాభై శాతం పెంచి చివరికి 104 శాతం మోతతో ట్రంప్ ధోరణితో విస్తుపోయిన చైనా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకం పెంచింది. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తూ ఇతర దేశాలపై పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తుంది. గత నెలలో అక్రమ వలసదారులకు కాళ్ళు చేతులు కట్టిపడేసి యుద్ధ విమానాల్లో తరలించి తన వికృత స్వభావాన్ని చాటుకున్నాడు. గ్రీన్ కార్డు ఉంటే శాశ్వత నివాసానికి యోగ్యత ఉండదని తేల్చిచెప్పారు. గోల్డ్ కార్డు ప్రవేశపెట్టాడు, అక్రమ వలసదారులు ఉంటే ప్రతిరోజూ 86 వేలు కట్టాలని హుకుం జారీ చేశారు. రాష్ డ్రైవింగ్ చేస్తే వీసా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు, అక్రమ వలసదారులు ఉంటే వారి ఆస్తులు అటాచ్ చేస్తున్నారు.
యుఎస్ లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదువుతున్న ఎంఎస్, బిఎస్ విద్యార్థులు తమ చదువులు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లాలి . ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వర్క్ ఆథరైజేషన్‌ను తొలగించడానికి కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత మూడు సంవత్సరాల వరకు యుఎస్ ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించింది. దీనివల్ల అమెరికాలో విద్య అభ్యసిస్తున్న మూడున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో ఉంది.
అమెరికా సుంకానికి ఆంధ్ర రొయ్యల ఎగుమతి కుప్పకూలింది. గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్ర రొయ్యలు 95 శాతం ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా వినియోగం అంతంత మాత్రమే. తగినన్ని స్టోరేజ్ యూనిట్లు లేక నిల్వ సౌకర్యం లేక చివరికి క్రాప్ హాలిడే ప్రకటించునేంతవరకు వెళ్లారు.
భారత్ లో సందట్లో సడేమియా అంటూ పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు, గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు బాదుడు ప్రకటించింది కేంద్రం. దీన్ని దృష్టి మరల్చేందుకు స్థానిక శిష్యగణం శ్రీరామ్ శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర పేరుతో వాహనాలకు సైలెన్సర్ తీసి కాలుష్యాన్ని వెదజల్లుతూ, డీజేలతో శబ్ద కాలుష్యాన్ని పెంచుతూ తరిస్తున్నారు. గతంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో శ్రీరాముడు ఫొటోతో ఎద్దుల బండి పై ఊరేగించి వడపప్పు పానకం ఇచ్చే వారు ఉట్ల మాను ఏర్పాటు చేసి అందరూ సందడిగా వేడుక చేసుకునే వారు. అది పోయి డిమాండ్ లేని నాయకులు తలకు కషాయం పాగా కట్టుకొని హిందూ ఐక్యత ర్యాలీ పేరుతో ఫ్లెక్సీలు కట్టి, అర్థం పర్థం లేని నినాదాలు చేస్తూ గట్టిగా అరుస్తూ చర్చి, మసీదు దగ్గర ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు.
వీళ్ళ చేష్టలతో పరమత సహనం సామాజిక సమగ్రత మంట కలిశాయి. విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తే, పరిణత మతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తే అంటారు సీనారె. చాలా పెద్ద స్కూళ్లలో ఎక్కువ డబ్బు కట్టి చేర్పిస్తే విద్య తొందరగా వంట పడుతుంది అనుకుంటే వొట్టి భ్రమే. పిల్లల అలవాట్ల స్థిరీకరణ ఐదేళ్ల వరకు ఉండదు. రెండు మూడు సంవత్సరాలు నిండని పిల్లలు, వాళ్ళు చేసే అల్లరి భరించలేక వారిని క్రెచ్, ప్లే స్కూల్, కిండర్ గార్డెన్ లో వేయడం జరుగుతుంది. అది వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకత దెబ్బతీసినట్లే. చదువు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే గా ఉండాలి. విద్య మానవ వికాసానికి మనవాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి, కానీ విద్య అంతిమ లక్ష్యం ఉపాధి కాకూడదు.
కొడంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించిన తెలంగాణ ముఖ్యమంత్రి విద్య కమిషన్ ఏర్పాటు చేసి విద్యారంగంలో నిష్ణాతులైన వారిని నియమించి స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేసి, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి 550 కోట్లు కేటాయించి తెలంగాణాలో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. బెట్టింగ్ భూతాన్ని పీచమణచడానికి ఇప్పటికే అగ్రతారలపై కేసులు బనాయించారు, పేట్రేగిపోతున్న హింస, అనైతికత అశ్లీలతకు డ్రగ్ మాదకద్రవ్యాల సంస్కృతికి కఠిన చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది, మరో వైపు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ‘రే మామ ఏక్ పెగ్ లా’ అంటూ దబిడి దిబిడే పాటల్లో నటించిన వారికి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారికి పద్మ అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారు.
డాక్టర్ వెన్నెల గద్దర్
విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది, విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి. విద్యార్థులపై తరగతి బోధన విధానం తీవ్ర ప్రభావం చూపుతుంది, అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు ఉన్నతీకరించుకోవాలి. నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్‌లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని 'నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే' పేర్కొన్నది.
నూతన విద్యా విధానంతో సమాన విద్యావకాశాలు దెబ్బతిన్నాయి. పిల్లల్లో అంతరాలు పెరిగిపోయాయి. నాణ్యమైన విద్యను అందించడంలో విద్యా ప్రణాళిక కీలకమైన భాగం. లక్ష్యాలు నిర్దేశించడం, వనరులను నిర్ణయించడం, కాలక్రమాన్ని రూపొందించడం, ప్రణాళికను అమలు చేయడం ద్వారా, విద్యార్థులు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను పొందుతారు. ఆ ప్రణాళిక రూపొందించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. గత పది సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యతో విద్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏడో తరగతి పాఠాలు ఆరో తరగతిలో బోధించడం, పదో తరగతి పాఠాలు తొమ్మిదో తరగతిలోనే బోధించడం. విద్యార్థులకు కామన్ ప్రణాళిక లేకుండా, కేవలం విద్యార్థులను పందెం కోళ్ళల్లా పెంచుతున్నారు. చదువంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ధోరణి పెరిగిపోయి సామాజిక శాస్త్రాలు పాతరేశారు.
నీట్, జేఈఈ , ఎంసెట్, ఐఐటి, ట్రిపుల్ ఐటీ కోచింగ్ ఇవ్వని స్కూల్ స్కూలే కాదు అన్న రీతిన తల్లిదండ్రులు ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు సెలవు లేకుండా బోధించే కళాశాలల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. కార్పొరేట్ విద్యను ఉక్కుపాదంతో అణచకపోతే రాబోయే అనర్థాలకు సమాజం మూల్యం చెల్లించుకోక తప్పదు.
(డా. జి. వెన్నెల గద్దర్, చైర్ పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్)