అసద్ శకం ముగియడంలో ఇజ్రాయెల్, అమెరికా తెరవెనక కథ నడిపాయా?
కష్టకాలంలో అసద్ కు అండగా నిలబడలేకపోయిన ఇరాన్, రష్యా
By : KS Dakshina Murthy
Update: 2024-12-09 05:56 GMT
ఏడాది క్రితం ఉగ్రవాద సంస్థ హమాస్ జరిపిన పాశవిక దాడి యూదు దేశంతో పాటు, అమెరికాను షాక్ కు గురి చేసింది. ఇది ఇజ్రాయెల్ ను దిగ్బ్రాంతికి గురి చేసినప్పటికీ యూదులందరిని రాజకీయంగా, సామాజికంగా ఏకం చేయగలిగింది. దాని వ్యతిరేకులందరిని విజయవంతంగా తటస్థీకరించడానికి ఈ దాడి ఉపయోగించుకుంది. తాజాగా సిరియాలో జరిగిన పరిణామాలు కూడా సరిగ్గా ఇలాంటివే.
సిరియాలో దశాబ్ధం కింద ప్రారంభమైన ప్రజా విప్లవం అనంతరం సాయుధ పోరుకు దారి తీసింది. మధ్యలో కొన్ని రోజులకే తిరుగుబాటుదారులకు అసద్ చెక్ పెట్టినప్పటికీ 2020 నుంచి తిరిగి పోరు ప్రారంభం అయింది. ఫ్రీ సిరియన్ ఆర్మీ, అల్-నుస్రా ఫ్రంట్, అనేక ఇతర చిన్న సమూహాలతో సహా తిరుగుబాటుదారులు సిరియన్ భూభాగాన్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు.
అల్-అస్సాద్‌కు ఊపిరి
ఏది ఏమైనప్పటికీ, అల్-అస్సాద్ చెందిన షియా అలవైట్ అధ్యక్ష పదవికి వ్యతిరేకంగా జరిగిన ఐక్య పోరాటం గందరగోళంగా మారింది, ఇస్లామిక్, లౌకిక విభాగాలు ఒకదానికొకటి విడిపోయాయి. ఇది అధ్యక్షుడికి ఊపిరి పీల్చుకోవడానికి, మరింత శక్తితో ప్రతీకారం తీర్చుకోవడానికి సాయపడింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆవిర్భావం, విస్తరణ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇది సిరియాతో పాటు ఇరాక్ లోని కొన్ని భూభాగాలతో పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది.
ఈ పరిణామం కూడా అసద్ కు లాభం చేకూర్చింది. అప్పుడు అతని పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన యూఎస్ దాని మిత్రదేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. తనను అధికారం నుంచి గద్దె దింపితే ఐఎస్ ఉగ్రవాదులు తన స్థానంలోకి వస్తారని అల్-అస్సాద్ పేర్కొన్నాడు. దీనితో తిరుగుబాటుదారులలో పెద్ద భాగం వారి తిరుగుబాటు నుంచి వెనక్కి తగ్గింది.
రష్యా ప్రవేశం..
రష్యా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. బషర్ అల్-అస్సాద్ వైపు పోరాటంలోకి దిగింది. ఇరాన్, తోటి షియా దేశం, దాని సాయుధ మిత్రుడు, షియా-గ్రూప్ హిజ్బుల్లా ఆల్-అస్సాద్‌ను రక్షించడానికి సిరియాలో అప్పటికే పోరాడుతున్నారు. రష్యా ప్రవేశం అల్-అస్సాద్ అనుకూల కూటమి బలాన్ని పెంచింది.
ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడంపై అందరి దృష్టి కేంద్రీకృతం కావడంతో అల్-అస్సాద్‌కు ఉపశమనం లభించింది. రష్యా, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ పై దాడి చేస్తూ పనిలో పనిగా తిరుగుబాటుదారులపై కూడా దాడి చేసింది. 204-16 కాలంలో సిరియన్ సాయుధ తిరుగుబాటు పూర్తిగా నిలిచిపోయింది.
సిరియాలోని అల్ అస్సాద్ కు వ్యతిరేకంగా కుర్థులను ప్రోత్సహించిన యూఎస్ పై నాటో మిత్రుడు తుర్కియేకు కోపం తెప్పించింది. కుర్థులు కోరుతున్న ప్రత్యేక దేశంలో మెజారిటీ భూభాగం అంకారాలో ఉంది. దీనికి ఆ దేశం ససేమిరా అంటోంది. అందుకే ఎర్డోగాన్ కుర్థు పోరాట యోధులందరిని తీవ్రవాదులుగా పరిగణిస్తోంది.
దేశాన్ని పునర్నిర్మించడంలో వైఫల్యం
అంతర్యుద్ధం దేశంలో ఓ ముగింపుకు రాకపోవడం, బతుకు దుర్భరం కావడంతో వేలాది మంది సిరియన్లు టర్కీ లోకి అక్కడి నుంచి యూరప్ లోకి ప్రవేశించారు. ఈ అంతర్యుద్దంలో దాదాపు 5 లక్షల మంది సిరియన్లు మరణించారు.
2020 నాటికి, సిరియాలో అంతర్గత పోరు పూర్తిగా ఆగిపోయింది. ఐఎస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ ఏడాది క్రితం అమెరికా జరిపిన వైమానిక దాడిలో హతమయ్యాడు. అయితే, బషర్ అల్-అస్సాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అలాగే దేశాన్ని పునర్నిర్మించలేకపోయాడు.
సిరియా ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం, అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలతో, అల్-అస్సాద్ కార్యాలయంలో మనుగడ సాగించలేకపోయాడు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అతని ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. దేశం విడిచిపెట్టి పోయిన వేలాది మంది సిరియన్లను తిరిగి రాకుండా ఆయన ఆపాడు. వాళ్లు తిరిగి వస్తే ఎక్కడా మళ్లీ తిరుగుబాటు వస్తుందో అని భయపడ్డారు. అయినప్పటికీ తను పీఠం నుంచి పారిపోవాల్సి వచ్చింది.
సాయుధ ప్రతిఘటన పుట్టుక
ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, వారి యూరోపియన్ మిత్రదేశాలకు, అల్-అస్సాద్ ఎల్లప్పుడూ అస్తిత్వ ముప్పుగా ఉండేవాడు. ఇరాక్‌కు చెందిన సద్దాం హుస్సేన్, లిబియా మహ్మాద్ గడ్డాఫీతో సమానంగా అతను ఇజ్రాయెల్ వ్యతిరేకి. సహజంగానే, అల్-అస్సాద్ US మరియు ఇజ్రాయెల్ కు దీర్ఘకాల లక్ష్యంగా మారాడు.
2011లో అరబ్ వసంత తిరుగుబాటు సిరియాకు చేరుకున్నప్పుడు, శాంతియుత ప్రదర్శనలను అణిచివేసేందుకు బషర్ అల్-అస్సాద్ సైన్యాన్ని ప్రయోగించారు. ఇదే సమయంలో పశ్చిమ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చాయి.
US నేతృత్వంలోని పశ్చిమ దేశాలు తిరుగుబాటుదారులను సంఘటితం చేయడం, ఆర్థిక సాయం అందించడం, ఆయుధాలు సమకూర్చుకోవడంలో సాయమందించాయి. ఇది శాంతియుత నిరసనగా ప్రారంభమైన దానిని అల్-అస్సాద్‌కు వ్యతిరేకంగా జ్వలించే సాయుధ ప్రతిఘటనగా మార్చడంలో సఫలం అయ్యాయి.
రెండు యుద్ధాలు
ఒప్పందాలకు విరుద్దంగా ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోవాలని భావించడంతో కీవ్ పై మాస్కో 2022, ఫిబ్రవరి 24 న దాడులు ప్రారంభించింది. ఒక సంవత్సరం తరువాత అక్టోబర్ 7, 2023న హమాస్ కూడా ఇజ్రాయెల్ పై పాశవికంగా దాడుల జరిపింది. ఇది ప్రభుత్వంలో ఉన్న రైట్ వింగ్ యూదులకు దిగ్బ్రాంతికి గురి చేసింది. తరువాత హమాస్ మూకలను వెతికి వెతికి అంతం చేయడంలో ఇజ్రాయెల్ నిమగ్నమైంది. ఐడీఎఫ్ గాజాను అగ్ని గుండంగా మార్చింది. ఈ దాడుల్లో దాదాపు 43 వేలమంది పాలస్తీనా వాసులు మరణించారు. టెల్ అవీవ్ ఇప్పటికి దాడులు చేస్తూనే ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇరాన్ ప్రభుత్వం, వ్లాదిమిర్ పుతిన్ హమాస్‌కు మద్దతు ఇచ్చాయి. గాజాపై హద్దులేని దాడికి ప్రతిగా హమాస్ తో పాటు హిజ్బుల్లా, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది.
ఇజ్రాయెల్ సైనిక శక్తి
గాజాపై దాడిని ఎదుర్కోవడానికి టెహ్రాన్ ప్రయత్నాలకు సిరియా పాలకుడు బషర్ అల్-అస్సాద్ రవాణా మద్దతును అందించాడు. ఇరాన్ నుంచి వస్తున్న ఆయుధాలను తన దేశం గుండా వెళ్లేందుకు అంగీకరించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐడీఎఫ్ సిరియాలోని అనేక లక్ష్యాలపై దాడులు చేసింది. ఇందులో ఇరాన్ ఖుద్ ఫోర్స్ కు చెందిన కీలక నేతలను హతం చేసింది. అలగే లెబనాన్ పై సైనిక చర్యకు దిగింది.
చివరికి, టెహ్రాన్‌ను సందర్శించిన మాజీ పాలస్తీనా ప్రధాని ఇస్మాయిల్ హనియే హత్యతో సహా హమాస్ నాయకత్వాన్ని అంతమొందించడంతో ఇజ్రాయెల్ తన సైనిక శక్తిని ప్రదర్శించింది. పేజర్, వాకీటాకీలతో పేలుళ్లు సృష్టించి హిజ్బుల్లా కీలక నేతలను తటస్థీకరించింది. అమెరికాలో ఉండి వైమానిక దాడులతో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతం చేయడంలో నెతన్యాహు వ్యూహత్మకంగా వ్యవహరించారు.
సిరియాలో ఎజెండా మార్పు
అదే సమయంలో, సిరియాలో ఉన్న ఇస్లామిస్ట్ హెచ్‌టిఎస్ (హయత్ తహ్రీర్ అల్ షామ్) చీఫ్ అబూ మొహమ్మద్ అల్-జులానీ, అకా అహ్మద్ అల్-షారాతో ట్రాక్-టూ డైలాగ్ జరిగినట్లు కనిపిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీకి ఒకప్పటి సహాయకుడు అల్-జులానీ ఇజ్రాయెల్, యుఎస్‌కు అనుకూలంగా తన ఎజెండాను మార్చుకున్నందున ఇది మంచి అవకాశం. తనకు అమెరికా, ఇజ్రాయెల్ పై ఎలాంటి వ్యతిరేకత లేదని ప్రకటించి వారి దృష్టి తనపై కేంద్రీకరించకుండా చూసుకున్నాడు.
HTS చేసిన ఆకస్మిక దాడిని అడ్డుకోలేని స్థితిలో అల్-అస్సాద్ లేడు. నివేదికలు అతని మిలిటరీ నిరుత్సాహానికి గురైందని, సైన్యంలోని చాలా భాగం బలవంతపు సైనికులే అని పలు నివేదికలు పేర్కొన్నాయి. వారికి జీతాలు సరిగా అందక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా, HTS ఫైటర్లు, ఇడ్లిబ్‌లోని తమ స్థావరం నుంచి దేశంలోని ఈశాన్య దిశలో, డమాస్కస్‌కు వెళ్లే మార్గంలో అలెప్పోపై దాడి చేసినప్పుడు, ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. సిరియన్ సైన్యం స్పష్టంగా లొంగిపోయింది. అల్-అస్సాద్‌కు దేశం నుంచి పారిపోవడం తప్ప వేరే మార్గం కనపడలేదు.
ఇజ్రాయెల్‌కు విజయం
సాధారణంగా చాలా కాలంగా అసద్ ను కాపాడుకుంటూ వస్తున్న రష్యా .. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో మునిగిపోవడంతో అసద్ కు ఎలాంటి సాయం అందిచలేకపోయింది. ఇరాన్ ను సైతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సిరియా విషయంలో విజయం సాధించినట్లే. అల్-జులానీ నేతృత్వంలోని HTS సిరియాను పునర్నిర్మించడానికి, దేశం నుంచి పారిపోయిన వారికి తలుపులు తెరవడానికి, సమగ్ర ప్రభుత్వాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా, ఇజ్రాయెల్‌పై అల్-జులానీ అభిప్రాయాలు, గాజాపై దాని దాడి అతను అధికారికంగా అధికారాన్ని చేజిక్కించుకుంటే HTS ఎంచుకునే మార్గం ఏంటో సూచిస్తాయి.