రాముని విష్ణువు అవతారంగా మార్చినదెవరు?
ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణ విశేషాలు: రామాయణంలో నిరుత్తరకాండ-41;
సూర్యసంబంధంలోనూ; దేవుడిగా, లేదా దేవుడి అవతారంగా గుర్తించడంలోనూ పర్షియా, మెసపొటేమియా రాజులకూ, రాముడికీ ఉన్న పోలిక చెప్పుకున్నాం. ఇప్పుడు అంతకన్నా ఆసక్తికరమైన మరో విశేషాన్ని చూద్దాం:
రాముని విష్ణువు దశావతారాలలో ఒకడిగా చెప్పడం పౌరాణికసంప్రదాయంగా స్థిరపడిన సంగతి మనకు తెలుసు. కానీ, రామాయణం మొత్తం మీద విష్ణువు ప్రస్తావనా, రాముని విష్ణువుతో పోల్చి చెప్పడం ఎన్నిచోట్ల, ఎన్నిసార్లు వస్తుందనుకుంటున్నారు?! ఆ వివరంలోకి వెడితే ఆశ్చర్యం కలుగుతుంది.
రామాయణం అసలు కథ బాలకాండ 5వ సర్గలో ప్రారంభమైతే; రాముని విష్ణువు అవతారంగా చెప్పడం బాలకాండ 15 నుంచి 18 వరకూ ఉన్న నాలుగు సర్గలలోనే కనిపిస్తుంది. దేవతలందరూ సమావేశమై రావణవధ గురించి చర్చించుకోవడం, అందుకోసం దశరథుని కుమారుడిగా పుట్టడానికి విష్ణువు అంగీకరించడం, దశరథుడు పుత్రకామేష్టి జరపడం, రామభరతలక్ష్మణశత్రుఘ్నులు విష్ణువు అంశతో జన్మించినట్టు చెప్పడం మొదలైన ఘట్టాలు ఈ నాలుగు సర్గలలోకీ వస్తాయి.
బాలకాండ తర్వాత వచ్చే అయోధ్య, అరణ్య, సుందరకాండలలో ఎక్కడా రామునితో ముడిపెట్టి విష్ణువు ప్రస్తావన రాదు; యుద్ధకాండలో, అందులోనూ రావణసంహారం జరిగి, సీత అగ్నిప్రవేశం చేసిన తర్వాతే ఆ ప్రస్తావన వస్తుంది. రాముడు మానవమాత్రుడు కాదనీ, సకలదేవతాస్వరూపుడనే సంగతిని యుద్ధకాండ, 117వ సర్గలోని 33 శ్లోకాలు నొక్కి చెబుతాయి.
బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై, “సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే ఎందుకు ఉదాసీనంగా ఉన్నావు, దేవతాగణాలలో శ్రేష్ఠుడివై ఉండి కూడా ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఒక సామాన్యమానవుడిలా సీతను ఎందుకు ఉపేక్షిస్తున్నా”వని రాముని అడుగుతారు. పూర్వకల్పాల్లో నువ్వే వసువువనీ, రుద్రుల్లో ఎనిమిదవ వాడివనీ, సాధ్యుల్లో అయిదవ వాడివనీ, ముల్లోకాలనూ నువ్వే సృష్టించావనీ అంటూ- ఇంకా ఇలా అంటారు:
భవాన్నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధః ప్రభుః
ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్యసపత్నజిత్- యుద్ధకాండ, స. 117, శ్లో. 13
స్వయంప్రకాశరూపుడు, లక్ష్మీసమేతుడు, చక్రమే ఆయుధంగా ఉన్నవాడు, సర్వసమర్థుడు అయిన నారాయణుడివి నువ్వే, ఒంటి కొమ్ము కలిగిన వరాహమూర్తివీ నువ్వే, భూతభవిష్యత్కాలాలకు చెందిన శత్రువులను జయించగలిగినవాడివీ నువ్వే నని ఈ శ్లోకభావం.
ఆపైన, సేనానాయకుడివీ, గ్రామాధిపతివీ, ఉపేంద్రుడివీ, మధుసూదనుడివీ, ఇంద్రుడు చేసే పనులన్నీ చేయగలిగినవాడివీ నువ్వే నంటూ; చివరిగా-
సీతా లక్ష్మీ ర్భవాన్ విష్ణుర్దేవః కృష్ణః ప్రజాపతిః
వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్- యుద్ధకాండ, స.117, శ్లో.28
సీతే లక్ష్మీదేవి; ప్రకాశరూపుడు, కృష్ణవర్ణుడు, ప్రజాపతి అయిన విష్ణువే నువ్వు; రావణసంహారం కోసమే మానవశరీరాన్ని ధరించావని ఈ శ్లోకభావం.
ఇక్కడే ఇంకో విశేషం చెప్పుకోవాలి! పైన చెప్పిన బాలకాండలోని నాలుగు సర్గలనూ, యుద్ధకాండలోని పై ఘట్టాన్ని మినహాయిస్తే, మిగతా కాండలలో ఎక్కడా రాముని విష్ణువుతో ముడిపెట్టి చెప్పలేదు; చెప్పకపోగా, మరో దేవుడితో పదే పదే పోల్చి చెప్పడం కనిపిస్తుంది; ఆ దేవుడు మరెవరో కాదు; ఋగ్వేదంలో ప్రధానదైవమైనా; ఇతిహాస, పురాణకాలానికి వచ్చేసరికి ఆ ప్రాధాన్యం కోల్పోయి నవ్వులపాలైన ఇంద్రుడు!
ఉదాహరణకు చూడండి; రాముడు అరణ్యవాసానికి బయలుదేరాకా, అరణ్యవాససమయంలోనూ ఎందరినో కలసుకుంటాడు. వారిలో గుహుడనే నిషాదరాజు; భరద్వాజుడు, అత్రి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు మొదలైన ఋషులు; విరాధుడు, ఖరుడు, దూషణుడు, శూర్పణఖ, కబంధుడు, మారీచుడు మొదలైన రాక్షసులు; జటాయువు అనే పక్షీ; శబరి అనే వృద్ధగిరిజనస్త్రీ ఉంటారు. ఋషులతో సహా వీరిలో అనేకమంది రాముని ఇక్ష్వాకువంశానికి, లేదా రఘువంశానికి చెందిన రాజుగానే సంబోధిస్తారు; ఇంద్రుడిలాంటివాడివనీ, గొప్ప పరాక్రమంవంతుడివనీ ప్రశంసిస్తారు; సీతారామలక్ష్మణులు ముగ్గురినీ దేవతలతో సమానమైన కాంతి కలిగినవారుగానే గుర్తిస్తారు; అంతేతప్ప, రాముని విష్ణువుగానో, సీతను లక్ష్మీగానో గుర్తించరు; వారి ప్రస్తావనే తీసుకురారు.
చివరికి హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి; రాముడి ప్రధానప్రత్యర్థి అయిన రావణుడు, అతని సోదరులైన విభీషణ, కుంభకర్ణులూ కూడా రాముని విష్ణువు అవతారంగా గుర్తించడం కానీ; విష్ణువుతో పోల్చడం కానీ చేయరు. సీత కూడా తనను అపహరించుకు వెడుతున్న సమయంలోనూ; లంకలో అశోకవనంలో ఉన్నప్పుడూ రావణుడితో మాట్లాడుతూ, తన భర్త ఇక్ష్వాకువంశానికి చెందిన మహావీరుడనీ, అతని చేతిలో నీకు చావు తప్పదనీ హెచ్చరిస్తుంది తప్ప రాముని విష్ణువు అవతారంగా చెప్పదు.
కొసమెరుపు ఏమిటంటే, దేవతలు వచ్చి చెప్పేవరకూ తను విష్ణువు అవతారమన్న సంగతి రాముడికి కూడా తెలియదు; బ్రహ్మతో ఇలా అంటాడు:
ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం
సోzహం యస్య యతస్యాహం భగవన్ స్తద్బ్రవీతు మే- యుద్ధకాండ, స. 117, శ్లో. 11
నేను దశరథుడి కుమారుడైన రాముడనే మానవుడిననే అనుకుంటున్నాను. నేను ఎవరికి చెందినవాడినో, ఎందువల్ల ఇలా ఉన్నానో, భగవంతుడివైన నువ్వే చెప్పు- అని ఈ శ్లోకభావం.
రాముడు తనను మానవుడిగానే భావించుకోడానికీ; అతడు అవతారపురుషుడన్న సంగతిని కథ పొడవునా కథకుడు నొక్కి చెప్పకపోవడానికీ కారణం ఏమిటన్నది ప్రశ్న. దీనికి రెండు రకాల సమాధానాలు చెప్పుకోవడానికి అవకాశముంది. రాముని కేవలం దేవుడిగా కాకుండా, మానవులలోనే అత్యుత్తముడిగా, లేదా పురుషోత్తముడిగా చిత్రించడం ద్వారా మానవులందరిముందూ ఒక ఉత్తమాదర్శాన్ని నెలకొల్పాలన్నది వాటిలో మొదటిది. సాంప్రదాయికంగా ఇలాంటి సమర్థన ప్రాచుర్యంలో ఉంది కూడా. అలా ఒక ఆదర్శాన్ని నెలకొల్పడానికి వీలుగా కథను కూర్చుకునే స్వాతంత్ర్యం కథకునికి ఎలాగూ ఉంటుంది; పైగా అది కథానిర్మాణాన్ని ఏవిధంగానూ బలహీనపరచడంలేదు కూడా. కనుక ఆ మేరకు పై సమర్థన అర్థవంతంగానే ఉంది.
ఇక రెండవ సమాధానానికి వస్తే, అది కూడా కథానిర్మాణంతో ముడిపెట్టి చెప్పుకోదగినదే. ఎలాగంటే, దశరథుడనే రాజుకు నలుగురు కుమారులు ఉండడం, రాజ్యం ఎవరికి దక్కాలనే విషయంలో ఇద్దరు కుమారుల మధ్య వివాదం తలెత్తడం, దరిమిలా పెద్దకొడుకైన రాముడు భార్యనూ, తమ్ముడినీ వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళడం, రావణుడనే రాక్షసుడు రాముడి భార్యను అపహరించడం, దాంతో రాముడు సేనను సమకూర్చుకుని అతని మీదికి యుద్ధానికి వెళ్ళి అతణ్ణి చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం- అన్న మూలకథను చెప్పడమే కథకుని ప్రాథమిక ఉద్దేశమనుకుందాం; రాముని విష్ణువనే దేవుడి అవతారంగా చెప్పడం అతని కథానిర్మాణంలో మొదట భాగం కాదని అనుకుందాం; అప్పుడు, పైన పేర్కొన్న బాలకాండ, యుద్ధకాండలలోని ఘట్టాలలో మినహా ఇంకెక్కడా రాముని విష్ణువుతో ముడిపెట్టి చెప్పకపోవడం అర్థవంతంగానే కనిపిస్తుంది.
అంటే ఏమిటన్నమాట... రాముని విష్ణువు అవతారంగా చెప్పే ఘట్టాలను ఆ తర్వాత ఎవరో చేర్చి ఉండాలి!
కథానిర్మాణం దృష్ట్యా చూసినప్పుడు పైన చెప్పుకున్న మొదట సమాధానం ఎంత సమర్థనీయంగా కనిపిస్తుందో; అదే దృష్టితో చూసినప్పుడు రెండవ సమాధానం కూడా అంతే సమర్థనీయంగా కనిపిస్తుంది. రెండింటిలోనూ కథానిర్మాణంనుంచి చూడడమే కీలకం. బాలకాండ 5వ సర్గలో అయోధ్యానగరవర్ణనతో అసలు కథ ప్రారంభమైందని గుర్తిస్తే, దానికి ముందున్న నాలుగు సర్గలూ ఉపోద్ఘాతంలా ఉండి, ఆ తర్వాత ఎవరో చేర్చి ఉంటారన్న భావన కలిగిస్తాయి. నారదుడు వాల్మీకికి సంక్షిప్తంగా రామాయణకథ చెప్పడం, తమసానదీతీరంలో ఒక బోయవాడు ఒక క్రౌంచపక్షిని చంపినప్పుడు వాల్మీకిలో కలిగిన శోకం శ్లోకరూపంలో వ్యక్తమవడం, రాముడి చరిత్రను కావ్యంగా రచించమని బ్రహ్మ అతనికి చెప్పడం, వాల్మీకి దివ్యదృష్టితో దర్శించాడని చెప్పి రామాయణకథను మరోసారి సంక్షిప్తంగా బోధించడం, వాల్మీకి రామాయణాన్ని కూర్చి కుశలవులకు నేర్పడం, రాముడు వారిని తన వద్దకు రప్పించుకుని వారి గానాన్ని వినడం- బాలకాండలోని తొలి నాలుగు సర్గలలోని విషయాలు.
విశేషమేమిటంటే, ఈ నాలుగు సర్గలలోని మూలశ్లోకాలలో కూడా ఎక్కడా రాముని విష్ణువు అవతారంగా చెప్పలేదు! మొదటి సర్గలోని ఒకే ఒక్క శ్లోకంలో విష్ణువు పేరు కనిపిస్తుంది; అది కూడా రాముని విష్ణువుతో సమానుడైన వీరుడిగా(విష్ణునా సదృశో వీర్యే- శ్లో.18)చెబుతుంది తప్ప విష్ణువు అవతారంగా చెప్పదు. చెప్పకపోగా, మొదటి సర్గలోనే ఇంకొక శ్లోకం రాముని బ్రహ్మతో సమానుడిగా(ప్రజాపతిసమః- శ్లో. 13)చెబుతుంది.
ఇంకో విశేషాన్ని గమనించండి; మొదటిసారి నారదుని ముఖంగా; రెండవసారి, వాల్మీకి దివ్యదృష్టితో దర్శించాడని చెప్పీ రామాయణకథాఘట్టాల సంక్షిప్తపరిచయం తొలి నాలుగు సర్గలలో రెండుసార్లు వస్తుంది కానీ; దశరథుని కుమారునిగా జన్మించాలని విష్ణువు అనుకున్నట్టు కానీ, దశరథుని పుత్రకామేష్టి గురించి కానీ, పాయసం గురించి కానీ వాటిలో లేదు!
కనుక, ఉపోద్ఘాతంలా కనిపించే బాలకాండలోని ఈ నాలుగు సర్గలనూ ఆ తర్వాత ఎవరో చేర్చారనే అనుకుంటే, వాటిని చేర్చే నాటికి కూడా రాముని విష్ణువు అవతారంగా చెప్పడం అంత ప్రసిద్ధం కాలేదనుకోవాలి. అలా చూసినప్పుడు, రాముని విష్ణువు అవతారంగా చెప్పే బాలకాండలోని 15, 16, 17. 18 సర్గలూ; రాముని విష్ణువు అవతారంగానే కాక సకలదేవతాస్వరూపునిగా చెప్పే యుద్ధకాండలోని 117వ సర్గా -బాలకాండలోని తొలి నాలుగు సర్గలనూ చేర్చిన తర్వాతే చేర్చి ఉండాలి!
ఎవరు, ఎందుకు చేర్చి ఉంటారు???
ఇదీ, పై పరిశీలన మొత్తంనుంచి తలెత్తుతున్న ప్రశ్న!
మళ్ళీ ఈ ప్రశ్నకు కూడా రెండు వైపులనుంచి సమాధానం చెప్పుకోవడానికి అవకాశముంది. మొదటిది, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, మెసపొటేమియా, పర్షియా రాజులతో రాముడికి ఉన్న పోలిక. సూర్యసంబంధంలోనూ, ధార్మికపాలనలోనూ, గుణగణాలలోనే కాక; ప్రత్యేకించి మెసపొటేమియా రాజులు సారగాన్, హమ్మురాబీలు తమను దేవుడి ప్రతినిధులుగానో, దైవసమానులుగానో చెప్పుకోవడంతో కూడా రాముడికి పోలిక కుదురుతోందనుకున్నాం. పర్షియా(నేటి ఇరాన్), మెసపొటేమియా(నేటి ఇరాక్)లతో మనకు అతిప్రాచీనకాలంనుంచీ సాంస్కృతికంగా, వర్తకపరంగా, ఇతరత్రా సంబంధాలున్నాయి కనుక, క్రీస్తుపూర్వకాలానికి చెందిన ఈ రాజుల గురించిన సమాచారం మన దృష్టికి రావడంలో ఆశ్చర్యంలేదు. ఆ తెలివిడితో, ఆ రాజుల వరవడిలో రాముని విష్ణువు అవతారంగా చెప్పే భాగాలను చేర్చి ఉండవచ్చా?!
అలాగే ఎందుకనుకోవాలి, రామాయణం ప్రభావమే మెసపొటేమియా, పర్షియా రాజులపై పడి ఉండవచ్చు కదా అన్న వాదననూ ఎవరైనా ముందుకు తేవచ్చు. ఆ రాజుల కాలాన్ని తెలిపే శాసనాలు సహా లిఖిత ఆధారాలను, చారిత్రకమైన ఇతర సాక్ష్యాలను; రామాయణకథావ్యాప్తి, అది గ్రంథరూపం ధరించిన కాలం, అందులోని భాష, అందులో ప్రస్తావనకు వచ్చిన వివిధ అంశాలకూ, వ్యక్తులకూ సంబంధించిన చారిత్రకత వగైరాలను పోల్చి చూసుకుని ఎవరి ప్రభావం ఎవరి మీద పడిందో ఒక నిర్ధారణకు రావచ్చు.
మొత్తంమీద దీనినొక పరిశోధనార్హమైన విషయంగా గుర్తించడానికి మాత్రమే ప్రస్తుతానికి పరిమితమవుదాం.
ఇక రాముని విష్ణువు అవతారంగా చెప్పే ఘట్టాలను రామాయణంలో ఎవరు, ఎందుకు చేర్చి ఉండవచ్చునన్న ప్రశ్నకు రెండో సమాధానం ఎలా ఉండగలదో చూద్దాం. పైన చెప్పిన బాలకాండ, యుద్ధకాండలలోని ఘట్టాలను మినహాయిస్తే రామాయణం మొత్తం మీద రాముడితో ముడిపెట్టి విష్ణువు ప్రస్తావన మరెక్కడా లేనప్పుడు, రాముని విష్ణువు అవతారమని చెప్పే ఆ ఘట్టాలను చేర్చే అవసరం కానీ, అవకాశం కానీ ఎవరికి ఉండవచ్చునంటే; సహజంగానే అనుమానసూచి చటుక్కున తిరిగేది వైష్ణవం వైపు!
మళ్ళీ దీనిని కూడా పరిశోధనార్హమైన విషయంగా గుర్తించడానికి మాత్రమే ప్రస్తుతానికి పరిమితమవుదాం.
దానినలా ఉంచితే, రాముని విష్ణువు అవతారంగా చెప్పే భాగాలను ఎవరు చేర్చి ఉంటారనే ప్రశ్న వేసుకోవడంతోపాటు, దానికి ప్రాచుర్యాన్ని కల్పించడంలో రామాయణభాష్యకారులు, లేదా వ్యాఖ్యాతలు, వివరణకర్తలు, అర్థతాత్పర్యకారుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ప్రాచీనుల సంగతలా ఉంచి, ఆధునికమైన విద్యావిషయిక శిక్షణ(అకడమిక్)లో చదువుకుని, పరిశోధన చేసి, విశ్వవిద్యాలయాలలో, కళాశాలలలో ఆచార్యపదవిని నిర్వహించినవారు కూడా రామాయణం వంటి సాంప్రదాయిక వాఙ్మయానికి వచ్చేసరికి ఆ అకడమిక్ శిక్షణను ఎలా పక్కన పెడతారో గతంలో ఆయా సందర్భాలలో సోదాహరణంగా చెప్పుకున్నాం. మూలపాఠం పట్ల కనీసమైన విధేయతను కూడా పాటించకపోవడం, మూలంలో లేని పదాన్ని, అర్థాన్ని, భావాన్ని చొప్పిస్తూ యథేచ్ఛగా మూలాతిక్రమణకు పాల్పడడం, ఒక్కోసారి మూలాన్నే సవరించడానికి ప్రయత్నించడం వగైరాల రూపంలో వీరు క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించని తమదైన ఒక వ్యాఖ్యానసంప్రదాయాన్ని అభివృద్ధి చేసిన తీరు అడుగడుగునా ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా అనుకున్నాం.
ప్రస్తుతసందర్భంలోనే ఒక ఉదాహరణ చూడండి:
బాలకాండ, యుద్ధకాండలలో రాముని విష్ణువు అవతారంగా చెప్పే సందర్భంలోనే ‘నారాయణ’ శబ్దం రెండుసార్లు వస్తుంది; మొదటిసారి బాలకాండ, 16వ సర్గలోని 1వ శ్లోకంలో. ఆ శ్లోకం ఇలా ఉంటుంది:
తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః
జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్
ఈవిధంగా దేవతలతో నియుక్తుడైన నారాయణుడు(లేదా విష్ణువు) తెలిసినవాడే అయినా తెలియనట్లు దేవతలతో మృదువుగా ఇలా అన్నాడని- ఈ శ్లోకభావం.
దీనికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాస్తూ రెండు చోట్లా నారాయణ శబ్దానికి విష్ణువనే అర్థం చెప్పి ఊరుకున్నారు తప్ప, ఆ శబ్ద వ్యుత్పత్తి ఏమిటో, విష్ణువుకు అది మరో పేరు ఎలా అయిందో చెప్పలేదు. కనీసం నారాయణ శబ్దాన్నే ఉపయోగించినా అది మూల విధేయంగా ఉండేది; కానీ విష్ణువుగా మార్చి చెప్పారు.
రెండోసారి నారాయణశబ్దాన్ని ఉపయోగించిన యుద్ధకాండ, 117వ సర్గలోని 13వ శ్లోకాన్ని పైన ఉదహరించుకున్నాం. మళ్ళీ అదే సర్గలో రాముని విష్ణువుగానూ, కృష్ణవర్ణుని గానూ చెప్పే 28వ శ్లోకాన్ని కూడా ఉదహరించుకున్నాం. ఈ రెండు శ్లోకాలను బట్టి నారాయణుడివీ నువ్వే, విష్ణువువీ నువ్వే నంటూ ఆ రెండు పేర్లనూ విడదీసి చెప్పడం కనిపిస్తుంది. అయినాసరే, అక్కడ కూడా నారాయణ శబ్దం గురించిన వివరణ లేదు.
విష్ణువుకు నారాయణుడనే పేరు జనసామాన్యంలో ప్రసిద్ధమే కావచ్చు; కానీ ఆ రెండు శబ్దాలకూ వ్యుత్పత్తిలోనూ, ప్రయోగంలోనూ కూడా వాటివైన చరిత్ర ఉంటుంది; విష్ణువుకు నారాయణుడనే పేరు ప్రసిద్ధిలోకి రావడం వెనుక కూడా తనదైన చరిత్ర ఉంటుంది. వాటిని వివరించాల్సిన బాధ్యత వ్యాఖ్యాతలపైనా, లేదా వివరణకర్తలపైనా ఉంటుంది. పోనీ అంత బాధ్యతను నిర్వర్తించాలని వారు అనుకోకపోయినా, కనీసంగానైనా మూలవిధేయతను పాటించవలసిన ధర్మం వారికి ఉంటుంది.
నారాయణశబ్దం గురించిన కొన్ని విశేషాలతోపాటు, వ్యాఖ్యాతల తీరుతెన్నుల గురించి మరిన్ని ముచ్చట్లు వచ్చేసారి...