ఉస్మానియా యూనివర్శిటీ గొంతు పిసికేస్తున్నారు!

కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకిపోతున్న ప్రజాస్వామ్యం.;

Update: 2025-03-17 07:23 GMT

-రమణాచారి

ధర్నాలు, నిరసన ర్యాలీలు ప్రజల ప్రజాస్వామిక హక్కు. వాటిని కాలరాసే ప్రయత్నం చేయడం అంటే నియంతృత్వానికి దారులు వేయడమే. ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నించడమే. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజల కలల కాణాచి ఉస్మానియా. ఉద్యమాలకు కేంద్ర బిందువు. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ విద్యార్థులదే కీలక పాత్ర. ఉస్మానియా విద్యార్థులు లేకుండా అసెంబ్లీ ముట్టడి, సాగరహారం, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి ఊహించలేం. తెలంగాణ అంతటా చైతన్య యాత్రల ను నిర్వహించి, ప్రజలకు అండగా నిలబడింది ఈ విద్యార్థులే. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని యూనివర్సిటీలోకి అడుగుపెట్టనీయలేదు. అనేక సభలు సమావేశాలు, ఆటపాటలు ధూంధాములు నిర్వహించారు. అక్రమ అరెస్టులు, కేసులు ఎదుర్కొన్నారు. లాఠీ చార్జీలు, భాష్పవాయువు గుండ్ల కు ఎదురోడ్డి నిలిచి పోరాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మా నీళ్లు, మా నిధులు మాకేనని గర్జించారు. మా భూములు, వనరులు మాకే అన్నారు. స్వపరిపాలన కోసం గొంతెత్తి నినదించారు. ఈరోజు ఆ విద్యార్థుల పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ సర్క్యులర్ జారీ చేయడం శోచనీయం.


విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు. వాటి అభివృద్ధికి, భావి తరాలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాల్సిన పాలకులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఉన్న దిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన విద్యాలయాల్లో ఉస్మానియాది అగ్రస్థానం. ఇప్పుడు ఉస్మానియాలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేని పరిస్థితికి నెత్తివేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ లో భావప్రకటన స్వేచ్ఛ పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు. కొత్త ప్రభుత్వం హామీ పడిన ఏడవ హామీ పై నీలి నీడలు. అధికారం సాధించాక అన్ని రాజకీయ పార్టీల విధానాలు ఒక్కటే అని రుజువయ్యింది. ఉస్మానియా భూములు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించారు. కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన వందల ఎకరాల భూములు అదానీ కి అప్పగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విద్యార్థుల నిరసనలు వెలువెత్తుతున్నందుకే వారిపై ఆంక్షలు పెడుతున్నారు. అనేక విద్యాలయాల్లో, కళాశాలలో నీళ్ల ట్యాంకులు వివిధ కార్యాలయాలు నిర్మిస్తూ ఆక్రమిస్తున్నాను. ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు కనిపించని ప్రణాళిక. తీవ్రమవుతున్న బోధన బోధనేతర సిబ్బంది కొరత పరిష్కారానికై సారించని దృష్టి. ప్రైవేటు విద్యాలయాల ఏర్పాటుకు విచ్చలవిడిగా అనుమతులివ్వడంతో ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన చైతన్య, నారాయణ సంస్థలు మరింతగా విస్తరిస్తున్నాయి. ప్రైవేట్ విద్యా రంగంపై అజమాయిషి కరువైంది. వీటిలో వనరులు, వసతి సౌకర్యాలపై సరైన పర్యవేక్షణ లేదు. ఫీజులపై నియంత్రణ లేదు. ఇవేవీ పట్టింపు లేకుండా ఇంటెగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కోసం కోట్లాది రూపాయల వెచ్చింపుకై తొందరపాటు. మెడికల్ కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుదలకు చేపడుతున్న చర్యలు నామ మాత్రమే. పాలన ఇలా ఉంటే ప్రజలకు ఉచిత విద్యా, వైద్యం అందించడం ఎలా?

కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలలో,విద్యాలయాల్లో,విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్లు వర్తించవు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ లు అమలు చేయనంత కాలం దళిత, గిరిజన, బహుజనులకు రిజర్వేషన్ల పెంపుతో ఒనగూరేది శూన్యం. జనాభా దామాషా ప్రకారం దళిత, బహుజన ఆదివాసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఈ జిమ్మిక్కులు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ, వనరుల దోపిడి యదేచ్ఛగా సాగుతూనే ఉన్నది. అన్ని వర్గాలలో అభద్రత, భయాందోళనలు నెలకొన్నాయి. అధికారంలో పాలకులు, పార్టీలు మారినంత మాత్రాన రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలగడం లేదు. ప్రజల జీవితాలలో మౌలిక మార్పుల సాధన కోసం తీసుకున్న చర్యలు కానరావు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక వహించిన ఉద్యమకారులకు, అసువులు బాసిన వారికి గుర్తింపు లేదు. ఎన్నికల వాగ్దానాలు ఎండమావులు అయ్యాయి.

అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులను హెచ్చరించడం సహేతుకం కాదు. తప్పుగా భావిస్తే సూచనలు చేయాలే తప్ప బెదిరించడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో నాలుగవ స్తంభంగా ప్రచారంలో ఉన్న మీడియాపై దాడి అప్రజాస్వామికం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకారులకు పౌర సమాజం అండగా కదిలి నిలవాల్సి ఉన్నది.

ఈ తరుణంలో ప్రభుత్వ ప్రకటించిన ఏడవ హామీ అమలు కోసం ఉద్యమించాల్సి ఉన్నది. అధికార అందలం దక్కించుకోవడం కోసమే రాజకీయ పార్టీలు వాగ్దానాల వరద పారిస్తాయన్నది ఆచరణలో రుజువు అవుతున్నది. పాలకుల హామీలు అమలుకు నోచుకోకపోతే , పౌర ప్రజాస్వామిక హక్కులు హరించే ప్రయత్నాలు చేస్తే పోరాటాల పురిటి గడ్డ తెలంగాణలో ఉద్యమాలుమళ్ళీ పురుడు పోసుకుంటాయి. తెలంగాణలో తిరిగి ప్రజాస్వామిక ఆకాంక్షల ఉద్యమ సెగరగిలితే పాలకులకు తిప్పలు తప్పవు.

Tags:    

Similar News