తెలంగాణ ‘అభివృద్ధి’ కి దళిత భూములే కావాలా?
దళితుల చేతుల్లో ఉన్నదంతా ఆ అసైన్డ్ భూములే. ఏ పార్టీ ప్రభుత్వమున్నా ‘అభివృద్ధి’ అంటూ ఆ భూముల మీద కన్నేస్తున్నది;
తెలంగాణ అభివృద్ధి రథం వేగంగా పరుగెత్తుతోంది. కాకపోతే అది వంకర టింకరగా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల భూములు వెతుక్కుంటూ సాగుతోంది. ఆధిపత్య కులాలకు, వారి చేతుల్లోని ప్రభుత్వాలకు, దళితులు మనుషులుగా అంటరాని వాళ్ళు కానీ, వారి చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములు మాత్రం ప్రాణప్రదం. దశాబ్ధాలుగా ఇదే జరుగుతుంది. ఏ పార్టీ ప్రభుత్వమున్నా ఇదే జరుగుతుంది.
కొన్ని సార్లు కొన్ని ప్రభుత్వాలు కొంచెం భూమి ఈ కుటుంబాలకు పంచుతాయి. ఎక్కువ భూమి వీళ్ళ చేతుల్లోంచి లాక్కుంటాయి.BRS ప్రభుత్వ పాలనా కాలం చూడండి. భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున సుమారు ఐదు వేల కుటుంబాలకు 16,000 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చింది. మరో వైపు నీటి పారుదల ప్రాజెక్టులు, NIMZ, ఆహార శుద్ధి పార్కులు, రింగ్ రోడ్లు, ఫార్మా సిటీ లాంటి ఇతర పారిశ్రామిక ప్రాంతాల ప్రాజెక్టుల పేరుతో, వేలాది మంది దళిత, ఆదివాసీ కుటుంబాల చేతుల్లోంచి లక్షకు పైగా ఎకరాలను గుంజుకున్నది.
పేదలకు భూములు పంచిన ఇందిరమ్మ పార్టీ తమదని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. కానీ ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, అభివృద్ధి పేరుతో, అసైన్డ్ భూములను గుంజుకుంటూనే ఉంది. తాజాగా రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఈ ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఫార్మా సిటీ కోసం, ఫార్మా విలేజెస్ కోసం, NIMZ ప్రాంతంలో పరిశ్రమల కోసం, ఫ్యూచర్ సిటీ రోడ్లు, నగర నిర్మాణం పేరుతో, ఈ ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. వీటి కోసం మొదట అసైన్డ్ భూముల మీదికే ఈ ప్రభుత్వం కూడా వెళుతోంది. అవి సరిపోవు అనుకున్న చోట సన్న, చిన్నకారు రైతుల నుండి పట్టా భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కానీ, ఈ ప్రభుత్వ హయాంలో కానీ, ఒక్క పెద్ద రైతు కూడా ఈ సోకాల్డ్ అభివృద్ధి కోసం తన మొత్తం భూమిని భూ సేకరణలో కోల్పోలేదు. విషయం స్పష్టమే. పెద్ద వాళ్ళ అభివృద్ధి కోసం పేద వాళ్ళు చేయాల్సిన త్యాగం చేయాలన్న మాట.
2014 నుండీ 2023 వరకూ గత ప్రభుత్వ భూసేకరణ విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. భూసేకరణ బాధితులకు అండగా నిలబడి పోరాడింది. కోర్టులో బాధితుల పక్షాన కేసులు వేసింది. వేయించింది. తాము అధికారంలోకి వస్తే, UPA ప్రభుత్వం తెచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని యధావిధిగా అమలు చేస్తాం ( పేజీ 19). BRS ప్రభుత్వం సేకరించిన అసైన్డ్ మరియు పోడు భూములకు పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం పై పునః పరిశీలించి చెల్లిస్తాం (పేజీ 20). భూ సంస్కరణల ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను లబ్ధిదారులకు కల్పిస్తాం(పేజీ 24), నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో తొలగిస్తాం (పేజీ 25) అని 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయహస్తం మేనిఫెస్టో లో స్పష్టమైన హామీ ఇచ్చింది.
ఇవన్నీ చదివి అందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ, ప్రస్తుత ప్రభుత్వ పాలన తాను ఇచ్చిన హామీలకు పూర్తి భిన్నంగా ఉంది. ఫార్మా సిటీ ఏరియాలో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములపై ఉన్న నిషేధం తొలగించలేదు. గత ప్రభుత్వ కాలంలో అతి తక్కువ నష్ట పరిహారం పొందిన బాధితులకు ఎవరికీ, ఈ ప్రభుత్వం కొత్తగా పరిహారం ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదు. అసైన్డ్ భూములను పూర్తి స్థాయిలో గుంజు కోవడమే తప్ప, ఆయా భూములకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా శాశ్వత పట్టా హక్కులు కల్పించడానికి చర్యలు చేపట్టలేదు. ఇక చివరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, 2016 లో KCR తెచ్చిన దుర్మార్గమైన భూసేకరణ చట్టం ప్రకారమే రేవంత్ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.
ఫ్యూచర్ సిటీ పరిధిలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లి లో 366.04 ఎకరాలు, కొంగర కుర్ధులో 277 ఎకరాలు కలిపి మొత్తం మొత్తం 643 ఎకరాల భూ సేకరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మార్చి 12 న నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 16 న తాజాగా యాచారం మండలం మొండి గౌరెల్లి లో పారిశ్రామిక పార్క్ కోసం 821.11 ఎకరాలకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో అధిక శాతం అసైన్డ్ భూములే ఉన్నాయి. మరికొన్ని గ్రామాలలో కూడా భూసేకరణకు నోటిఫికేషన్ లు త్వరలో వెలువడతాయని వార్తలు వస్తున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్డు లోపల, గ్రామాలు, వ్యవసాయ భూములు మిగిలే అవకాశం కనిపించడం లేదు. దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను పూర్తి స్థాయిలో గుంజేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు దాని దూకుడు చూస్తే అనిపిస్తోంది.
తాజా కుల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 61,84,319 (17.43 శాతం). 2021-2022 భూ గణాంకాల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల కుటుంబాల చేతుల్లో 9,79,000 భూ కమతాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 70,60,000 భూ కమతాలలో ఇది 13.9 శాతం మాత్రమే. ఈ కమతాల పరిధిలో ఉన్న సాగు భూమి విస్తీర్ణం 15,10,000 ఎకరాలు. అంటే మొత్తం రాష్ట్ర సాగు భూమి 1,55,97,000 ఎకరాలలో ఇది 9.7 శాతం మాత్రమే. తాజా కుల గణన ప్రకారం 37,05,929 (10.45 శాతం) జనాభా ఉన్న షెడ్యూల్డ్ తెగల కుటుంబాల చేతుల్లో ఉన్న భూ కమతాల సంఖ్య 8,34,000 ( మొత్తం కమతాల సంఖ్యలో ఇది 11.8 శాతం). వీటి పరిధిలో ఉన్న సాగు భూమి 18,61,000 ఎకరాలు ( ఇది మొత్తం సాగు భూమిలో 11.9 శాతం).
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనాభాలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఎక్కువమంది నిరుపేదలుగా, వ్యవసాయ కూలీలుగా, కౌలు , సన్న, చిన్నకారు రైతులుగా, పోడు రైతులుగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నారు. పట్టణాలలో రోజువారీ కూలీలుగా శ్రమ చేసుకుని బతుకుతున్నారు. దళితుల చేతుల్లో భూమి లాంటి సహజ వనరు ఉన్న కుటుంబాలు అతి తక్కువ. ఈ కటుంబాల చేతుల్లో ఉన్న కమతాల కూడా చాలా చిన్నవి.
1973 నుండీ అమలులో ఉన్న భూసంస్కరణల చట్టాలను ప్రభుత్వాలు అమలు చేసి ఈ కుటుంబాలకు సాగు భూములను ఇప్పటికే హక్కుగా అందించాల్సి ఉంటుంది. కానీ ఆ పని జరగలేదు. అరకొరగా మాత్రమే ఈ కుటుంబాలకు సాగు భూమి దక్కింది. అది కూడా అసైన్డ్ భూమిగా దక్కింది. అంటే అసైన్డ్ భూమి పొందిన రైతులు దానిని అనుభవించవచ్చు. లేదా వారసత్వంగా తన కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు,కానీ అమ్ముకోవడానికి వీలు లేదు.
ఈ అసైన్డ్ భూమిని, ప్రభుత్వం ఎప్పుడైనా, ప్రజా ప్రయోజనం పేరుతో వెనక్కి తీసుకోవచ్చని అసైన్డ్ రైతులకు ఇచ్చిన డి. ఫారం పట్టాలో ప్రభుత్వం పేర్కొంటుంది. నిజానికి ప్రభుత్వం భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఈ అసైన్డ్ భూమిని కూడా నోటిఫికేషన్ లో చూపించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఆ పని కూడా చేయడం లేదు. అసైన్డ్ భూమిపై హక్కులను కలిగిన కుటుంబాలకు కూడా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా నష్ట పరిహారం, ఇతర పునరావాస ప్యాకేజీ అమలు చేయాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం గా తీర్పులు ఇచ్చి ఉన్నాయి. భూమిపై పట్టా హక్కులు కలిగిన భూ యాజమనులకే కాకుండా ఆ భూమిపై జీవనోపాధి కోసం ఆధారపడిన వ్యవసాయ కూలీలకు, పశు పోషకులకు కూడా భూ సేకరణ చట్టం క్రింద పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశంలో కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే కొన్ని తీర్పులు ఇచ్చి ఉంది. 2013 భూ సేకరణ చట్టంలో కూడా ఈ అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు.
కానీ 2014 లో రాష్ట్రం ఏర్పడిన తరువాత BRS ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా పక్కకు పెట్టింది. 2013 చట్టానికి తూట్లు పొడుస్తూ స్వయంగా ఒక కొత్త చట్టాన్ని 2016 లో ఆమోదించింది. ఆ చట్టం 2014 జూన్ 2 నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ ప్రకటించింది. భూసేకరణకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా ముందుకు పోవడమే ఈ కొత్త చట్టం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తాను చేపట్టబోయే భూసేకరణ ప్రజా ప్రయోజనాల కోసమే అని ప్రకటిస్తే చాలని, ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వీటిపై రైతులు కోర్టుకు వెళ్ళినప్పుడు, కోర్టులు ప్రభుత్వ వాదనను కొట్టేసి, రైతులకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. తాజాగా లగ చర్ల భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో ఆ నోటిఫికేషన్ ను కొట్టి వేస్తూ, ఇచ్చున రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇందుకు అనుగుణంగా వచ్చిందే.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాదనను, కోర్టు తీర్పులను పట్టించుకోకుండా, 2013 చట్టం ప్రకారం కాకుండా, 2016 చట్టం ప్రకారమే రాష్ట్రంలో అప్పుడూ, ఇప్పుడూ భూసేకరణకు నోటిఫికేషన్ లు ఇస్తున్నాయి.
TGIIC వెబ్ సైట్ పై ఉన్న సమాచారం ప్రకారం, పరిశ్రమల శాఖ వివిధ జిల్లాలలో 9 జోనల్ కార్యాలయాల ద్వారా 156 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసింది. 28,458 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లలో ఇంకా 5,730 ఎకరాల భూమి పరిశ్రమలకు కేటాయించడానికి సిద్దంగా ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్ , నిజామాబాద్,పటాన్ చెరు, శంషాబాద్,యాదాద్రి, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఈ పారిశ్రామిక పార్కులు ఉన్నాయి.
గత పదేళ్ళలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రావిర్యాల,మహేశ్వరం,ఇబ్రహీం పట్నం ,శేరి లింగంపల్లి,షామీర్ పేట ప్రాంతాలలో పరిశ్రమల శాఖ , 2000 ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించింది. 10 నుంచి 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాట్లు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని పరిశ్రమలు తమ కార్యకలాపాలను ఆపేశాయి. కొన్ని పరిశ్రమలు తమకు కేటాయించిన భూమిలో కొద్ది భాగాన్ని మాత్రమే ఉపయోగించుకున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటూ , పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ భూమిని సేకరించి పరిశ్రమలకు కేటాయిస్తే, ఆయా పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా ఉంటున్నారని, అలాగే కొద్ది భూమిని మాత్రమే వాడుకుంటున్నారని అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2021 లోనే 65 సంస్థల నుండి 1960 ఎకరాల భూమిని పరిశ్రమలు ఏర్పాటు చేయలేదనే కారణంగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
15-20 సంవత్సరాల క్రితం పరిశ్రమల కోసం కేవలం 3000 ఎకరాలు సేకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి 9 సంవత్సరాలలో 28,500 ఎకరాల భూమి సేకరించారు. ఈ భూమిలో రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో 2,980 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించారు. 2014-2022 మధ్య కాలంలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన 22,100 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించామని TGIIC అధికారులు వార్తా పత్రికలతో చెప్పారు ఇప్పటికే TGIIC దగ్గర లక్షన్నర ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ( TOI news report ). గతంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో కూడా భూములను సేకరించారు. ఈ భూములన్నీ ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం వివరమైన శ్వేతపత్రం ప్రకటించాలి. ఇప్పటికీ ఆయా పారిశ్రామిక వాడలలో ఖాళీగా ఉన్న భూములను వాడకుండా , ప్రభుత్వం ఎందుకు ప్రతి సారీ కొత్తగా భూసేకరణ పూనుకుంటుందో ప్రజలకు వివరణ ఇవ్వాలి.
రాష్ట్ర పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2014-2015 నుంచి 2023-2024 వరకు రాష్ట్రంలో 25,224 సంస్థలు పరిశ్రమల/సంస్థల ఏర్పాటుకు అనుమతులు పొందాయి. ఈ సంస్థలన్నీ కలిపి 2,85,572.83 కోట్లు పెట్టుబడులు తెచ్చాయి. ఈ సంస్థలలో 18,31,305 మందికి ఉపాధి దొరికింది. నిజంగా ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికాయని భావించాలి. కానీ రాష్ట్రప్రభుత్వం స్పష్టంగా ప్రజల ముందు,చెప్పాల్సింది ఏమంటే, ఈ ఉద్యోగాలన్నీ, లేదా కనీసం వీటిలో 75 శాతం మన రాష్ట్ర యువతకు దక్కాయా లేదా అని.
అభయ హస్తం మేనిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ప్రోత్సాహం పొందిన సంస్థలు 75 శాతం ఉపాధి స్థానికులకు కల్పించేలా చూస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇప్పటికైతే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అటువంటి డేటా లేదని, సంబంధిత శాఖల అధికారులు చెప్పారు. ఇక్కడి యువతకే ఉద్యోగాలు దొరుకుతాయని గ్యారంటీ లేనప్పుడు, వేరే రాష్ట్రాల యువత ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలు పొందడానికి, పారిశ్రామికీకరణ పేరుతో స్థానిక రైతులు ఎందుకు భూములు కోల్పోవాలన్నది ప్రశ్న.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం మీద ప్రేమతోనో, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే, యజమానులు పరిగెత్తుకు వచ్చి పరిశ్రమలు పెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం T-IDEA మరియు IIPP పేరుతో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది కనుక వస్తున్నారు. 2014-2015 నుంచి 2023-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో 25,654 సంస్థలకు 3,661.79 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. ప్రైడ్ పథకం క్రింద ఎస్.సి (29,458) , ఎస్. టి (35,725), PHC ( 2,272) పెట్టుబడిదారులకు మరో 3,167.25 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించారు. నిజంగా పరిశ్రమల యజమానులకు అందినంత మొత్తంలో అసైన్డ్ భూములు కోల్పోయిన దళితులకు పరిహారం అందిందా అన్నది మాత్రం అనుమానమే.
మరో వైపు చేనేత లాంటి అతి పేద కార్మికులు పని చేసే పరిశ్రమలో నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల క్రింద 77,171 మంది లబ్ధిదారులకు 31.03.2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం 252.40 కోట్లు మాత్రమే.
కేవలం 25,654 మంది పారిశ్రామిక వేత్తలకు 3,661.79 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించిన రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే 12,93,285 మందికి భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు క్రింద అందించిన సహాయం కేవలం 2005.39 కోట్లు మాత్రమే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి.
విషాదం ఏమంటే, తెలంగాణ రాష్ట్రంలో దళితుల, ఆదివాసీల, సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న భూమిని, ప్రభుత్వాలు దౌర్జన్యంగా గుంజుకుంటుంటే, చాలా సందర్భాలలో దానికి వ్యతిరేకంగా పోరాడటానికి లెఫ్ట్, విప్లవ, దళిత సంఘాలు ( మాల, మాదిగ) , బీసీ సంఘాలు ముందుకు రాక పోవడం. “దళితుల అసైన్డ్ భూములను గుంజుకోవడానికి వీల్లేదు, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్థానిక ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్నపట్టా భూములను తీసుకోవడానికి వీలు లేదు” అని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడానికి ఈ సంఘాలు పూనుకోవడం లేదు. భూ సేకరణకు వ్యతిరేకంగా స్థానికంగా ప్రజలు పోరాటాలకు దిగినప్పుడు, లేదా ప్రభుత్వ పోకడలను ప్రతిఘటించినప్పుడు మాత్రం ఈ సంఘాలు ఆ పోరాటాలకు సంఘీభావం తెలియ చేయడం జరుగుతున్నది. కానీ, ఇదే అంశంపై ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరంఉంది. అప్పుడే రాష్ట్రంలో వ్యవసాయ భూములు మిగులుతాయి. దళిత కుటుంబాల చేతుల్లో కొంత భూమయినా మిగులుతుంది. .