బడ్జెట్ లో నిధులు చూపినా హామీలు ఏమయ్యాయి?
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలపై సామాజిక కార్యకర్త కన్నెగంటి రవి విశ్లేషణ;
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలలో అనేకం ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా అధికారం చేపట్టిన మొదటి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు కూడా పాలన పూర్తయి సంవత్సరం గడిచిన తరువాత కూడా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ఇందుకు గత ప్రభుత్వ దశాబ్ధ కాల పాలనా తీరు వల్ల, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దిగ జారడమే ప్రధాన కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది కానీ, నిజమైన పేదల సమస్యల గుర్తింపుకు, వారి డిమాండ్ల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కూడా చిత్త శుద్ధితో కృషి చేయలేదనేది అసలు వాస్తవం.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో 42,25,000 కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ జీరో బిల్లుతో గృహ జ్యోతి పథకం క్రింద ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఆర్టీసీ సంస్థకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఖజానా నుండీ నిధులు చెల్లిస్తూ రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. 40,00,000 కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తున్నది. ఇవి తప్పకుండా పేద కుటుంబాలకు ఉపయోగపడే పథకాలే. ఆయా కుటుంబాలకు ఆర్ధికంగా మేలు చేసే పథకాలే. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, నిత్యం జీవనోపాధి కోసం పరుగులెత్తే మహిళలు ఉన్న ఆయా కుటుంబాలకు అత్యంత వెసులుబాటు ఇచ్చే పథకమే.
మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలలోనే మార్పు వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి నమూనా దారి తప్పింది. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న రాష్ట్ర పేదల సంక్షేమానికి కాకుండా, క్రమంగా దావోస్ కేంద్రంగా జరుగుతున్న ఒప్పందాలకు పెద్ద పేట వేస్తున్నది. కొత్త మెట్రో లైన్లు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ,ఫార్మా విలేజెస్, పారిశ్రామికాభివృద్ధి పేరుతో, దళితులనుండీ, పేద రైతులనుండీ భూమిని గుంజుకోవడానికి, పదుల కొద్దీ నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ గురించి అట్టహాసంగా ప్రకటించినా, లక్షలాది రాష్ట్ర యువతకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి గురించి పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. రాష్ట్ర యువతను ఉత్సాహ పరిచి, వివిధ రంగాలలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేలా, వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఏవీ లేకుండా పోయాయి. వివిధ రాష్ట్రాల నుండీ అన్ని పనులలోకీ, అన్ని రంగాలలోకీ, , చవక కూలీలు చొచ్చుకు రావడం, మన రాష్ట్ర యువత పని లేకుండా కాలం గడపడం, అత్యంత ఆందోళనకు గురి చేసే అంశం. ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి, తగిన చర్యలు చేపట్టకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజూ అట్టహాసం గా ప్రకటించే “రాష్ట్రంలోకి పెట్టుబడుల వెల్లువ” కు అర్థం లేకుండా పోతుంది.
గత సంవత్సర పాలనను మొత్తంగా చూస్తే, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల పరంగా సాధారణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విజయవంతం కాలేదు. అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోక పోవడం వల్ల రాష్ట్రమంతా ప్రజలలో ప్రభుత్వ పని తీరు పట్ల అసంతృప్తి, వ్యతిరేకత నెలకొని ఉంది. అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకూ అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
ప్రకటించిన పథకాలకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం , అనర్హులను తొలగించడం, గత ప్రభుత్వానికి భిన్నంగా నిధుల దుర్వినియోగం ఆపడం అనే ప్రక్రియలో రొటీన్ కు భిన్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా గత ప్రభుత్వం లాగే వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది.
ఉదాహరణకు 2024-2025 బడ్జెట్ లో తెలంగాణ వ్యవసాయ రంగానికి 20.2 శాతం( 51,463 కోట్లు) కేటాయించారు. ఈ రంగంలో వివిధ రాష్ట్రాల జాతీయ సగటు 5.9 శాతం మాత్రమే. బడ్జెట్ లో నిధుల కేటాయిం;పు రీత్యా చూసినప్పుడు, ఇది మంచి పరిణామమే అయినప్పటికీ, ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తే సంతోషించవచ్చు. వేల కోట్లు దుర్వినియోగం అయితే బాధ పడాల్సి ఉంటుంది.
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్లు ఖర్చు చేసి 22,20,000 మంది రైతులకు రెండు లక్షల వరకూ రైతు ఋణ మాఫీ అమలు చేసింది. ఈ ఋణ మాఫీ కూడా మూడు విడతలుగా ఒకే సంవత్సరంలో పూర్తి చేసినందుకు సంతోషించవచ్చు కానీ, రేషన్ కార్డు లేని కారణంగా అర్హులైన రైతు కుటుంబాలు కూడా సకాలంలో ఋణ మాఫీని పొందలేకపోయాయి. 2 లక్షల పైన రుణం ఉన్న అర్హులైన రైతులు అనేకమంది ఇంకా ఋణ మాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రేషన్ కార్డు లేదనే పేరుతో, 2 లక్షల పైన రుణాలను ఎప్పుడు మాఫీ చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే పేరుతో సకాలంలో ఋణ మాఫీ కాక, ఈ రైతులకు అదనపు వడ్డీలతో ఋణ భారం మరింత పెరిగిపోయింది.
ఈ ఋణ మాఫీ లో ఉన్న మరో పెద్ద లోపం ఏమిటంటే, అనేకమంది రైతులు, వ్యవసాయం చేయకుండానే, భూమి తమ పేరున ఉందనే పేరున బ్యాంకుల నుండీ పంట రుణాలు పొంది, ప్రస్తుతం ఋణమాఫీకి అర్హత సాధించడం. స్వంత భూమి లేక, లేదా కొద్ది భూమి మాత్రమే ఉండి, ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని ఎక్కువ వడ్డీలతో కూడిన ప్రైవేట్ ఋణాలతో వ్యవసాయం చేసే కౌలు రైతులు , అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇంకా పట్టా హక్కులు రాని పోడు రైతులు, ఋణ మాఫీ ప్రయోజనాలను అసలు పొందలేకపోయారు. వారు వ్యవసాయం గిట్టుబాటు కాక, ప్రైవేట్ రుణాల భారాన్ని ఇప్పటికీ మోస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.
ఋణ మాఫీ కోసం బడ్జెట్ నుండీ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు, ఆ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే ఉంటుంది. గుండు గుత్తగా, భూమి పై పట్టా హక్కులు కలిగి ఉన్నారనే పేరుతో, అనర్హులకు ఋణమాఫీ చేయడం వల్ల, వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లే భావించాలి. గతంలో KCR ప్రభుత్వం చేసిన ఈ తప్పును, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించినట్లు భావించాలి.
2024 ఖరీఫ్ లో 8,84,000 మంది రైతుల నుండీ 10,903 కోట్ల విలువైన 47,01,000 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 28,23,000 టన్నులు సాధారణ ధాన్యం కాగా, 3,36,000 మంది రైతుల నుండీ 939 కోట్ల విలువైన 18,78,000 టన్నుల సన్న ధాన్యాన్ని క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తో సేకరించింది.
నిజానికి 66 లక్షల 77 వేల ఎకరాలలో వరి సాగయి, రాష్ట్రంలో 2024 ఖరీఫ్ లో 1,53,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి నవంబర్ 19 న అట్టహాసంగా ప్రకటించారు. కానీ ఈ మొత్తం ధాన్యం నుండీ ప్రభుత్వం సేకరించింది కేవలం 47 లక్షల టన్నులు మాత్రమే ( మూడవ వంతు కూడా కాదు) అందులో క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన సన్న ధాన్యం 18,78, 000 టన్నులు మాత్రమే.
సన్న ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వానికి సరఫరా చేస్తే, క్వింటాలుకు 2800 రూపాయల ధర రావాల్సి ఉంటుంది. కానీ ఈ సారి చాలా మంది రైతులు బోనస్ కోసం ఎదురు చూడకుండానే, క్వింటాలు ధాన్యాన్ని కేవలం 2400-2600 రూపాయలకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేసుకున్నారు. సన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బోనస్ ఇచ్చి కొంటుందన్న గ్యారంటీ లేకపోవడం, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేమ శాతాన్ని తగ్గించడానికి అవసరమైన ఏర్పాట్లు గ్రామ స్థాయిలో లేకపోవడం, కొన్ని రోజుల పాటయినా గ్రామ స్థాయిలో ధాన్యం నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు లేకపోవడం లాంటి కారణాల వల్ల రైతులు పూర్తి ధర పొందకుండానే తమ ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. ముఖ్యంగా కౌలు రైతులు చాలా మంది 500 రూపాయల బోనస్ అందుకోకుండానే ధాన్యం అమ్ముకున్నారు. భూమి యాజమనులు సహకరించిన చోట కొద్ది మంది కౌలు రైతులకు మాత్రమే వరి బోనస్ దక్కింది.
6 గ్యారంటీలలో రైతులకు, కూలీలకు ఇచ్చిన మరి కొన్ని హామీలు సకాలంలో అమలుకు నోచుకోలేదు. 2024-2025 బడ్జెట్ లో నిధులు కేటాయించినా, ముఖ్యంగా రైతు భరోసా హామీ 2024 ఖరీఫ్ లో అమలు కాలేదు. రైతు భరోసా విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో 2024 ఖరీఫ్ లో ఒక కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఉమ్మడి జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరైన ఈ సమావేశాలలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పారు. రైతు భరోసా చెల్లింపుకు 10 ఎకరాలను పరిమితిగా పెట్టుకోవాలని , కౌలు రైతులను కూడా గుర్తించి, వారికి రైతు భరోసా సహాయం అందించాలని స్పష్టంగా చెప్పారు. సమావేశాలకు హాజరైన వారి అభిప్రాయాలతో కూడిన మినిట్స్ కూడా సమాచార హక్కు చట్టం క్రింద రైతు స్వరాజ్య వేదిక సేకరించింది. రాష్ట్ర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు కూడా రైతు భరోసా, కౌలు రైతుల విషయంలో తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి విడివిడిగా, ఉమ్మడిగా కూడా తీసుకు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా గతంలో KCR హయాంలో రైతు బంధు అమలయిన పద్ధతిని తీవ్రంగా విమర్శించారు. పెద్ద భూస్వాముల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాలకు రైతుబంధు పేరుతో డబ్బులు పంచి కనీసం 2018 నుండీ 2023 వరకూ 25,000 కోట్లు దుర్వినియోగం చేశారని, రైతు బంధు సహాయం పొందిన సాగుకు పనికి రాని భూములు కనీసం 25-30 లక్షల ఎకరాలు ఉంటాయని కూడా మంత్రులు పదే పదే ప్రకటించారు. తమ ప్రభుత్వం ఈ తప్పులను సరి చేస్తుందని కూడా చెప్పారు. అర్హులకు మాత్రమే రైతు భరోసా సహాయం చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 సహాయం అందిస్తామని 6 గ్యారంటీలలో భాగంగా ప్రకటించారు.
కానీ చివరికి ఏమి జరిగింది ? ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సర కాలంగా తాను మాట్లాడిన అన్ని మాటలను మర్చిపోయి KCR అడుగు జాడలలోనే నడవడానికి సిద్దమైంది. 1,52,00,000 ఎకరాల సాగు భూమిలో కేవలం 3,00,000 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కాని భూములని తేల్చేసింది. రైతు భరోసా సహాయానికి ఎకరాల పరిమితి పెట్టబోవడం లేదని ప్రకటించింది. స్వయంగా సాగు చేస్తున్నారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా భూమిపై పట్టా హక్కులు కలిగిన వారికే సహాయం చేస్తామనీ కూడా ప్రకటించింది. కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా తన ప్రకటన ముగించింది. అంటే ఒక్క మాటలో లక్షలాది మంది కౌలు రైతులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. .
అంటే బడ్జెట్ లో రైతు భరోసా పేరుతో కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులను ఈ సంవత్సరంలో రేవంత్ ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి సిద్దమైంది. ఈ యాసంగి సీజన్ నుండీ రైతు భరోసా పంపిణీ ప్రకటించి, ఎకరానికి మొదటి విడతగా 6,000 రూపాయలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది ? ఎన్నికల హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు కూడా వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోతే, రాష్ట్ర ప్రజలకు దిక్కేముంటుంది. ?
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇచ్చే పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ లో ప్రారంభించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జాబ్ కార్డులు కలిగిన అసలు భూమి లేని కుటుంబాలలో ఈ సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలకు మొదటి విడతగా 6,000 రూపాయలు చెల్లిస్తున్నది. ఇది కూడా అన్యాయంగానే ఉంది.
ఎకరం లోపు స్వంత భూమి కలిగిన కుటుంబాలకు మామూలు రైతు భరోసా పథకం తప్ప ఈ పథకం వర్తించడం లేదు. ఉదాహరణకు ఏదైనా ఒక కుటుంబానికి 10 గుంటల భూమి ఉంటే ఆ కుటుంబానికి రైతు భరోసా సహాయం 3,000 మాత్రమే అందుతుంది. అది కూడా రెండు సీజన్ లలో రెండు విడతలుగా చెల్లిస్తారు. అదే సందర్భంలో ఒక కుటుంబానికి అసలు భూమి లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద సంవత్సరానికి 12, 000 సహాయం అందుతుంది. ఈ అన్యాయాన్ని సరి చేయాలంటే, ఎకరం లోపు భూమి కలిగిన కుటుంబాలన్నిటికీ, కనీస రైతు భరోసా సహాయంగా 12,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి, సరైన మార్గదర్శకాలు రూపొందించకుండా,పేద కుటుంబాల పట్ల ఏ మాత్రం చిత్త శుద్ది లేకుండా అమలు చేస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న కుటుంబాలన్నిటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకు వస్తే, ప్రభుత్వం మరో 25 లక్షల పేద కుటుంబాలకు పథకాన్ని విస్తరించాల్సి ఉంటుంది. అలా చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. KCR లాగే వేల కోట్ల రూపాయలను వ్యవసాయం చేయని ధనిక రైతులకు దోచి పెట్టేందుకు సిద్దపడిన ఈ ప్రభుత్వం, పేదలకు మాత్రం అనవసరపు కండిషన్ లు పెట్టి, అర్హులకు న్యాయం జరగకుండా చేస్తున్నది.
వ్యవసాయ రంగంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఈ సంవత్సరంలో పంట నష్ట పరిహారం పేరుతో రెండు సార్లు రైతులకు పరిహారం పేరుతో కనీసం 220 కోట్లు పంపిణీ చేసినా, అందులో ఒక్క రూపాయి కూడా నష్టపోయిన కౌలు రైతులకు అందలేదు. వివిధ జిల్లాలలో పంటలు సాగు చేయని అనేకమంది భూ యజమానులకు ఈ పరిహారం డబ్బులు దక్కాయి. అంటే బడ్జెట్ నిధులను ఇది మరో రూపంలో దుర్వినియోగం చేయడమే.
వ్యవసాయ కూలీలకు, భూమి లేని కౌలు రైతులకు కూడా రైతు భీమా పథకాన్ని అమలు చేస్తామనీ ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ హామీని ఈ ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇది కూడా పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగానే మిగిలిపోతుంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ లో రాష్ట్రంలో అన్ని పంటలను మెరుగైన మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చింది. కానీ అందుకు అనుగుణంగా ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. 2024 ఖరీఫ్ సీజన్ లో చాలా పంటలకు కనీస మద్ధతు ధరలు కూడా అందడం లేదని రైతులు రాష్ట్ర వ్యాపితంగా గగ్గోలు పెట్టారు. అనేక సార్లు మార్కెట్ యార్డులలో వ్యాపారులు కూటమిగా ఏర్పడి, రైతులకు ధరలు దక్కకుండా ధరలను పడేశారు. ఈ మంత్రులు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, అన్ని సందర్భాలలో ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోలేదు. రైతులకు కనీస మద్ధతు ధరలు దక్కేలా చూడలేదు. తాను స్వయంగా ఆయా పంటలను కొనుగోలు చేయలేదు. రాష్ట్ర అవసరాల కోసం అన్ని పంటలనూ ప్రోత్సహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం వరి ధాన్యానికి మాత్రమే బోనస్ ప్రకటించడం ఒక తప్పయితే, మిగిలిన పంటలకు ధరలు పడిపోయి రైతులు నష్టపోయిన సందర్భాలలో అయినా, ఆయా పంటలను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం అన్యాయం.