ఏపీ కాంగ్రెస్‌తో ఏఐసీసీ కీలక సమావేశం
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం
Byline : The Federal
Update: 2023-12-27 18:11 GMT
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్‌ను ఢిల్లీలో సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులంతా కలిసి పనిచేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుండాలని అధిష్టానం రాష్ట్ర నాయకులకు హితబోధ చేసింది.
బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలతో ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాకూర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీలోని అన్ని అనుబంధ విభాగాలను సమాయత్తం చేయటం, వాటిని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా కీలక చర్చలు జరిగాయి.
కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయంపై సమగ్ర చర్చ జరిగింది. ఆ పరిస్థితు లను ఏపీ రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఏఐసీసీ ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసారు. దీంతో ఎన్నికలకు సంబంధించి పక్క రాష్ట్రాల సహకారం, దానికి చేపట్టాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చ సాగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టార్గెట్ వైసిపి లక్ష్యంగా ఎన్నికల బరిలో దూకాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేసింది. ఏపీలో వైఎస్సార్‌సీపీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిన అంశాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఏఐసీసీ ముఖ్యులు రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్ర విభజన జరిగి సుమారు పదేళ్లు పూర్తి కావస్తున్నా అమలకు నోచుకోకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక విభజన చట్టం చేసినా ప్రాంతీయ పార్టీల పాలనలో ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటివి అంశాలు దశాబ్ద కాలంగా అందకుండా పోయిన విషయాన్ని ప్రజల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్‌పై ఉంది. యువత, విద్యార్థులకు ఈ అంశాలు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరాన్ని సమావేశంలో చర్చించారు. విభజన హామీలన్నీ సక్రమంగా అమలు కావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై చర్చ సాగింది. దీనికి ఎన్‌ఎస్‌యుఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ లాంటి విభాగాలు కీలక భూమిక పోషించాలని ఏఐసీసీ ముఖ్య నేతలు రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మయప్పన్, క్రిస్టోఫర్ తిలక్, సి డబ్ల్యూ సి సభ్యులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి, పళ్ళం రాజు, కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, చింత మోహన్, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మ శ్రీ, రాకేష్ రెడ్డి, సీనియర్ నేతలు తులసి రెడ్డి, హర్ష కుమార్ తో పాటు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.