యూపీ యోగి, మోదీపై అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు..
‘‘కుంభమేళా తొక్కిసలాటలో మృతుల కచ్చిత సంఖ్యను ఎందుకు ప్రకటించడం లేదు. ధనికుల కోసమే నిర్మలమ్మ బడ్జెట్. అక్రమ వలసదారులను మోదీనే తీసుకురావొచ్చుగా’’ - SP అఖిలేష్.;
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) మరోసారి ఉత్తర్ ప్రదేశ్ సర్కారుపై విరుచుకుపడ్డారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మహా కుంభమేళా(Maha Kumbh)లో భక్తులకు ఏర్పాట్లు చేయడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi) ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఖచ్చితమైన మృతుల సంఖ్యను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. "డబుల్ ఇంజిన్ సర్కారు..డబుల్ తప్పిదాలు చేస్తోంది, " అని యోగీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వికసిత్ భారత్ ఇదేనా?
"కుంభమేళాలో భక్తులు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి. బోర్డర్లు మూసివేశారు. ఒక చిన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేకపోతే, చంద్రుని మీద వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటి? 'వికసిత్ భారత్' అంటే ఇదేనా?, "అని అఖిలేశ్ ప్రశ్నించారు.
‘‘కుంభమేళాలో భారీగా డ్రోన్లను వినియోగించడం, డిజిటలైజేషన్ గురించి భారీ ప్రచారం చేశారు. కాని కుంభమేళాలో మరణించినవారి లేదా అదృశ్యమైన వారి గణాంకాలను చెప్పలేకపోతున్నారు.’’ అని విమర్శించారు.
30 మంది మృతి.. 60 మందికి గాయాలు
ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా ఈసారి జనవరి 13న ప్రారంభమై 45 రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి 9 వరకు 44 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, మౌని అమావాస్య రోజున భారీ రద్దీ కారణంగా తొపులాట జరిగి 30 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు.
ధనికుల కోసమే ఆ బడ్జెట్..
ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా విమర్శలు చేశారు అఖిలేష్. ధనికులకు, పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని..దేశ సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందన్నారు. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందుతోందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది," అని విమర్శించారు.
మోదీనే తీసుకురావొచ్చుగా..
"అమెరికా నుంచి అక్రమ వలసదారుల (Illegal immigrants) పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై కూడా అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. 104 మంది చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేసి యుద్ధవిమానంలో టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్ సర్ విమానాశ్రయానికి తెచ్చిన విషయం తెలిసిందే. "ప్రధాని మోదీ (PM Modi) అమెరికా (America) వెళ్లినప్పుడు మహిళలు, పిల్లలను కూడా ప్రత్యేక విమానంలో తీసుకురావాలి. కనీసం మనవారికి కొంత గౌరవమైనా దక్కుతుంది?", అని ప్రశ్నించారు.