మాల్దాలో వెస్ట్ బెంగాల్ గవర్నర్..

సీఎం మమత బెనర్జీ చెప్పినా వినకుండా ముర్షిదాబాద్ అల్లర్ల బాధితులను పరామర్శించిన ఆనంద బోస్;

Update: 2025-04-19 08:04 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్ సివి ఆనంద బోస్ (Ananda Bose) శుక్రవారం మాల్డా (Malda) చేరుకున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో హింసాకాండ ప్రభావిత ప్రాంతాల నుంచి పారిపోయి మాల్దాలోని బైష్ణబ్ నగర్‌లోని ఓ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిభిరంలో ఉంటున్న పిల్లలు, మహిళలతో ఆయన మాట్లాడారు. తన పర్యటనను వాయిదా వేసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banarjee) కోరినా గవర్నర్ వినిపించుకోలేదు.

పర్యటన తర్వాతే కేంద్రానికి నివేదిక..

"తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న వారిని కలిశాను. వారి మనోవేదనలను విన్నాను. వారు పడ్డ ఇబ్బందులను నాకు వివరంగా వివరించారు. వారు ఏమి కోరుకుంటున్నారో కూడా నాకు చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం’’ అని శిబిరం నుంచి బయటకు వచ్చాక బోస్ మీడియాతో చెప్పారు.

కోల్‌కతా నుంచి మాల్డాకు రైలులో బయలుదేరే ముందు బోస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ఆసుపత్రులు, సహాయ శిబిరాలను సందర్శిస్తానని చెప్పారు. ‘‘అల్లర్లను అదుపులో ఉంచేందుకు కేంద్ర దళాలు, రాష్ట్ర పోలీసులు కలిసి పనిచేస్తున్నారు. త్వరలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. పర్యటన తర్వాత నేను నా సిఫార్సులను కేంద్రానికి పంపుతాను." అని చెప్పారు. గవర్నర్ శనివారం ముర్షిదాబాద్‌ను కూడా సందర్శించవచ్చని రాజ్ భవన్ వర్గాల సమాచారం.

హింసాకాండలో ముగ్గురి మృతి..

ఏప్రిల్ 11, 12 తేదీలలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్‌గంజ్, సుతి, ధులియన్, జంగీపూర్‌లలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసకాండలో ముగ్గురు మృతి చెందారు. అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడిన 274 మందిని అరెస్టు చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పారామిలిటరీ, రాష్ట్ర పోలీసు దళాలను ఇప్పటికే మోహరించారు. 

Tags:    

Similar News