అయోధ్య : రామాలయం కోసం మూడు విగ్రహాల పోటీ

అయోధ్య రామమందిరంలో కొలువదీరే బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహల తయారీకి ఎంతమంది శిల్పులు పోటీపడ్డారు? గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహాన్ని ఏ రోజున ప్రకటిస్తారు?

Translated by :  M Venkata Sivaiah
Update: 2024-01-03 02:40 GMT

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో.. అందరి దృష్టి ఒక్కసారిగా మైసూరుకు మళ్లింది. అక్కడి గన్‌హౌస్‌ ‌సమీపంలోని చామరాజా డబుల్‌ ‌రోడ్డులో బ్రహ్మర్షి కాశ్యప శిల్ప కళా కేంద్రం అందరిని ఆకర్షిస్తోంది. ఈ శిల్ప కళా కేంద్రానికి చెందిన అరుణ్‌ ‌యోగిరాజ్‌ అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్న బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహాన్ని సుందరంగా చెక్కడంతో హెరిటేజ్‌ ‌సిటీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

తొలగిన గందరగోళం..

రామ మందిరానికి ఒక్కొక్కరు ఒక విగ్రహాన్ని తయారుచేయాలని ముగ్గురు శిల్పులను కోరారు. అరుణ్‌ ‌తయారుచేసిన విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని భావించి, కర్ణాటక మాజీ  సీఎం యెడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర అరుణ్‌కు అభినందిస్తూ తమ సంతోషాన్ని సోమవారం (జనవరి 1) ఎక్స్(‌ట్విట్టర్‌)‌లో పంచుకున్నారు. అయితే అరుణ్‌కు అయోధ్య ఆలయ ట్రస్టు నుంచి అధికారికంగా సమాచారం రాకపోవడంతో కాస్త గందరగోళానికి గురిచేసింది.

తండ్రీకొడుకులే కాకుండా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి కూడా అరుణ్‌ను ట్విటర్‌లో ప్రశంసించారు. ఎంపీ పీసీ మోహన్‌, ‌మాజీ మంత్రి శ్రీరాములు సహా ఇతర బీజేపీ నేతలు కూడా అరుణ్‌కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

ఎలాంటి పోటీ లేదు..

అయితే, రామమందిర్‌ ‌ట్రస్ట్ ‌సభ్యుడు కమలేశ్వర్‌ ‌చౌపాల్‌ ‌ముగ్గురు శిల్పలు తయారుచేసిన మూడింటిని ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టిస్తామని క్లారిటీ ఇచ్చారు. రామ్‌లల్లా విగ్రహ తయారీకి ఎలాంటి ‘‘పోటీ’’ లేదని స్పష్టం చేశారు. అయితే గర్భగుడిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలనేది జనవరి 17న నిర్వహించే ‘నగర యాత్ర’లో తెలిసే అవకాశం ఉంది.

అరుణ్‌తో పాటు మరో ఇద్దరు శిల్పులు..

అరుణ్‌తో పాటు మరో ఇద్దరు రాముడి విగ్రహాలను రూపొందించారు. బెంగళూరుకు చెందిన జిఎల్‌ ‌భట్‌, ‌రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే చెక్కిన విగ్రహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆలయ కమిటీ స్క్రూటినీ అనంతరం గర్భగుడిలో ముగ్గురిలో ఒకరి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టిస్తారు. 

గర్వించదగిన కుటుంబం..

అరుణ్‌ను చూసి అతని కుటుంబం ఎంతో గర్వపడుతుంది. ‘‘అరుణ్‌ ‌సాధించిన ఘనతను అర్థం చేసుకోలేక, కుటుంబాన్ని అభినందించడానికి వచ్చిన వారిని చూసి మా పిల్లలు నవ్వుతున్నారు.’’ అని అరుణ్‌ ‌భార్య విజేత ది ఫెడరల్‌తో అంది.

‘‘అరుణ్‌ ‌మా కుటుంబానికే కాకుండా మైసూరు, కర్ణాటక ప్రజలకు కూడా గర్వకారణంగా నిలిచారు. అరుణ్‌ ‌కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు.

‘‘అరుణ్‌ ‌మా కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఆరు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించాడు. అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు పూర్తిగా అంకితమయ్యాడు.’’ అని తెలిపారు. 

కర సేవ..

అంతకుముందు అరుణ్‌ ‌మీడియాతో మాట్లాడారు. ‘‘విగ్రహం పని ప్రారంభించే ముందు శ్రీరాముడిని ప్రార్థించేవాడిని. విగ్రహం చెక్కుతునంత కాలం అయోధ్యలోనే ఉన్నా. కుటుంబంతో సహా మొత్తం ప్రపంచం నుంచి డిస్‌కనెక్ట్ అయ్యా.’’నని చెప్పారు.

‘‘అరుణ్‌ ‌చెక్కిన రామ్‌లల్లా విగ్రహం పిల్లాడి రూపంలో ఉంది. అందులో దైవత్వం ఉట్టిపడుతుంది. విగ్రహం పీఠంతో సహా 8 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పులో ఉంది. రామ్‌లల్లా చేతిలో ఉన్న బాణం, వీలు బాగా చూడముచ్చటగా ఉన్నాయి’’అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

‘‘తనకు ఇచ్చిన డిజైన్‌ ఆధారంగా అరుణ్‌ ఒట్టి చేతులతో విగ్రహాన్ని చెక్కాడు. ఎటువంటి యంత్రాలు ఉపయోగించలేదు. ‘‘ఇది ఒక రకంగా కర్‌-‌సేవ (రామునికి చేసే సేవ)’’ అని కుటుంబ సభ్యుడు చెప్పారు.

భారతదేశపు అత్యున్నత శిల్పి..

న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ ‌వెనుక ఉన్న అమర్‌ ‌జవాన్‌ ‌జ్యోతి వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌విగ్రహాన్ని చెక్కిన ఘనత అరుణ్‌కే దక్కుతుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూరు సమీపంలోని 21 అడుగుల హనుమంతుని విగ్రహం ఆయన తయారుచేసినవే. అరుణ్‌ ‌కుటుంబసభ్యులు ఐదు తరాలుగా శిల్పాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఎ పట్టా పుచ్చుకున్న అరుణ్‌.. ‌శిల్పాలు చెక్కాలన్న అభిరుచి కోసం 2008లో తన కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు. అప్పటి నుంచి అరుణ్‌ ‌సుమారు వెయ్యి విగ్రహాలను చెక్కాడు.

Tags:    

Similar News