తెలంగాణ-ఏపీ మధ్య ‘మద్యం’ చిచ్చు
23వ తేదీన దరఖాస్తులకు ఆఖరుతేది అయితే 27వ తేదీన షాపుల ఎలాట్మెంట్ మొదలవుతుంది.
తెలంగాణ-ఏపీ మధ్య ఏదో విషయంలో వివాదం రాజుకుంటునే ఉండాలి. తాజాగా రెండురాష్ట్రాల మధ్య మద్యం షాపుల వివాదం మొదలైంది. ఇంతకీ విషయంఏమిటంటే తెలంగాణ(Telangana)లో మద్యంషాపుల(Liquor shops) లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. నిజానికి దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 18వ తేదీనే ముగిసినా వివిధ కారణాల వల్ల చివరితేదీని 23వరకు పొడిగించింది. ఈ పొడిగింపుతోనే సమస్యంతా వచ్చిపడింది. ఎలాగంటే తెలంగాణలో మద్యం షాపులకు ఏపీ నుండి భారీఎత్తున దరఖాస్తులు వస్తున్నాయనే గోల పెరిగిపోతోంది. తెలంగాణలో 2,620 వైన్ షాపులున్నాయి. వీటిని రెండేళ్ళపాటు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. 23వ తేదీన దరఖాస్తులకు ఆఖరుతేది అయితే 27వ తేదీన షాపుల ఎలాట్మెంట్ మొదలవుతుంది. కాబట్టి అప్పుడు కాని వచ్చిన దరఖాస్తుల్లో ఏపీ వాళ్ళు వేసిన దరఖాస్తులు ఎన్ననే విషయం తేలదు.
అయితే 2023-25కి సంబంధించి 2,620 షాపుల్లో సుమారు 600 షాపులు ఏపీకి సంబంధించిన వ్యాపారులు దక్కించుకున్నట్లు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోధర్ గౌడ్ కు చెప్పారు. ‘‘తెలంగాణ ఫెడరల్’’ తో దామోదర్ మాట్లాడుతు ‘‘బార్ అండ్ రెస్టారెంట్లు 1185, వైప్ షాపులు 2620 ఉన్నాయ’’ని చెప్పారు. ‘‘2023-25లో ఏపీకి సంబంధించిన వ్యాపారులు 600 వైన్స్ షాపులను సొంతంచేసుకున్న’’ట్లు చెప్పారు. ‘‘ఏపీ వ్యాపారస్తులు షాపులను సొంతంచేసుకుని లైసెన్సులు తీసుకుని తర్వాత తెలంగాణ వాళ్ళకు అధిక ధరలకు అమ్మేసుకుని వెళిపోతున్నార’’ని మండిపడ్డారు. ‘‘రెండేళ్ళ క్రితం కూడా ఏపీ వ్యాపారులు ఇదే పద్దతిలో వైన్ షాపులను దక్కించుకుని ఇలాగే చేసి’’నట్లు ఆరోపించారు. ‘‘ఏపీలో బార్లు, వైన్ షాపులకు దరఖాస్తులు వేయకుండా వచ్చి తెలంగాణలో వేయటం ఏమిట’’ని నిలదీశారు. ఇదే విషయాన్ని అధికారులను అడిగితే సరైన సమాధానం రాలేదని అన్నారు.
‘‘ఎక్కువ ఆదాయం వస్తుందన్న కారణంతో ఉన్నతాధికారులు తెలంగాణ వాళ్ళను కాకుండా ఏపీ వ్యాపారస్తులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్న’’ట్లు ఆరోపించారు. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం అందరినీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ‘‘బెల్టుషాపులు గల్లీల్లో ఉంటున్నా ప్రభుత్వం ఏమీచేయటంలేదని, వాటిని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం చేయటంలేద’’ని మండిపోయారు.
బార్లలో నష్టాలు వస్తున్నాయి కాబట్టి షాపులకు గట్టి పోటీ ఉంటోందన్నారు. గ్రేటర్ లో 24 బార్లకు 2 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ‘‘వైన్ షాపులు, బార్లకు పెద్దగా లాభాలు రావటంలేదని, షాపులకు ఆశించినన్ని దరఖాస్తులు రాకపోతే తేదీలను పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చింద’’ని నిలదీశారు. డిమాండ్ గురించి వివరిస్తు కుకట్ పల్లిలో ఒక షాపుకు 200 దరఖాస్తులు పడ్డాయని తెలిపారు. ‘‘తెలంగాణ వాళ్ళు మాత్రమే దరఖాస్తులు వేసేట్లుగా ప్రభుత్వం నిబంధనలు మార్చాల’’ని డిమాండ్ చేశారు. లేకపోతే ఇదే విషయమై తాము కోర్టులో కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు. ‘‘ఒకవైపు షాపులు, బార్లు పెడుతు మరోవైపు మద్యం తీసుకుని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారని కస్టమర్లను పోలసులను పెట్టి అరెస్టులు చేయించటం అన్యాయ’’మన్నారు. ప్రభుత్వ చర్య ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని ఎద్దేవాచేశారు. ‘‘దరఖాస్తులకు 23వ తేదీ ఆఖరుతేదీ అని చెప్పిన గౌడ్ లైసెన్స్ ఫీజు తగ్గించటం వల్ల ఓనర్లు, తాగేవాల్లు అందరికీ ఉపయోగమ’’ని అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని రిక్వెస్ట్ చేశారు.
‘‘కల్లు దుకాణాలకు 25శాతం రిజర్వేషన్లు పెడతామని హామీఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇంకా అమలుచేయలేద’’ని గుర్తుచేశారు. ‘‘దరఖాస్తు ఫీజును రు. 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచిన విషయమై ఎక్సైజ్ శాఖ కమీషనర్ హరికిరణ్ ను అడిగితే ఫీజు పెంపు అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం’’గా చెప్పారని తెలిపారు. పెంచిన దరఖాస్తు ఫీజును తగ్గించాలని దామోధర్ గౌడ్ డిమాండ్ చేశారు.