'ఓట్ల దొంగతనం'పై కాంగ్రెస్ ప్రచారం..
ఓటరు జాబితాలో అవకతవకలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. అధికార ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.;
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం కుమ్మకై ఓటరు జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నాయని విపక్ష కాంగ్రెస్(Congress) పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మహదేవపురం సెగ్మెంట్‌లో ఓటరు జాబితాలో తప్పుల తడకలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన ప్రెసెంటేషన్ ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది.
బీహార్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(SIR) చేపట్టిన తర్వాత కూడా లోపాలు బయటపడడం కాంగ్రెస్‌కు ప్లసైంది. బీహార్ ఓటరు మింటాదేవి అనే మహిళ వయసు 35 ఏళ్లు కాగా.. ఓటరు కార్డులో ఆమె వయసు 124 సంవత్సరాలుగా కనపర్చడంపై హస్తం పార్టీ ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టింది. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశాయి కూడా.
ఆఫీస్ బేరర్లతో భేటీ..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టడానికి ఇదే సరైన సమయమని భావించిన కాంగ్రెస్ పార్టీ..‘‘ఓట్ల దొంగతనం’’ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ అధ్యక్షతన మంగళవారం (ఆగస్టు 12) పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ‘‘ఓట్ చోరీ’’ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణకు ప్రణాళిక రూపొందించారు. రెండు మాసాల పాటు చేపట్టే ఈ కార్యక్రమం ఈ నెల 21న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
"అభి బాకీ హై"..
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటరు జాబితాలో అవకతకవలు చోటుచేసుకున్నట్లే.. ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని సమావేశంలో రాహుల్ తన సహచర ఎంపీలతో వ్యక్తం చేసినట్లు సమాచారం. మహదేవపుర ఓటర్ల జాబితాపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా.. ఇతర నియోజకవర్గాల ఓటరు జాబితాలను కూడా విశ్లేషిస్తారా? అని అడిగినప్పుడు..రాహుల్ "అభి బాకీ హై" (ఇంకా రాబోతోంది) అని పేర్చొన్నారు.
నిరసనలతో దద్దరిల్లిన ఉభయసభలు..
పార్లమెంటులో SIRపై చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరించడంపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న వర్షాకాల సమావేశాలను కూడా చాలా వరకు అడ్డుకున్నారు. సోమవారం 300 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టాలని ప్రయత్నించారు. కానీ ఢిల్లీ పోలీసులు వారిని మధ్యలో అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
‘‘లోక్‌తంత్ర బచావో’’ కార్యక్రమం..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో "లోక్‌తంత్ర బచావో మషాల్ జూలూస్" నిర్వహించాలని నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీని తరువాత ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య అన్ని రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని, వీటిల్లో ఆయా రాష్ట్రాల్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని చెప్పారు. ప్రధాని మోదీ మోసపూరిత ఎన్నికల విధానాన్ని తిప్పికొట్టడమే ఈ ర్యాలీల వెనక ప్రధాన అజెండా. " ఓటు చోర్, గడ్డి చోడ్ " (ఓటు దొంగ, అధికారాన్ని వదులుకోండి) నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
సంతకాల సేకరణ..
దీంతో పాటుగా నెల రోజుల పాటు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదు కోట్ల సంతకాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేణుగోపాల్ చెప్పారు. సేకరించిన ఈ సంతకాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించనున్నారు. ప్రజలు మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనానికి సంబంధించి ఇప్పటికే ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
బీహార్‌లో రాహుల్ పర్యటన..
ఆగస్టు 17 లేదా ఆ తర్వాత త్వరలో రాహుల్ బీహార్‌లో పర్యటించే అవకాశం ఉంది. అక్కడ చేపట్టే ‘ఓటరు అధికార్ యాత్ర’లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి పర్యటించనున్నారు. 25 జిల్లాలను కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. యాత్ర పర్యవేక్షణ ఏర్పాట్లను చూసుకునేందుకు 27 మంది జిల్లా కోఆర్డినేటర్లు, ఇద్దరు యాత్ర కోఆర్డినేటర్లను నియమించారు. బీహార్‌లో SIR ద్వారా బీజేపీ ఎలా ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందో చెప్పడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశం. తేజస్వి, రాహుల్ ఇప్పటికే సీనియర్ ఇండియా బ్లాక్ నాయకులను సంప్రదించడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 1న పాట్నాలోని గాంధీ మైదానంలో ముగిసే ఓటరు అధికార్ యాత్రకు తప్పనిసరిగా హాజరు కావాలని వారిని అభ్యర్థించినట్లు సమాచారం.