కర్ణాటకలో కుల గణనకు బ్రేక్.. ఏం జరిగిందంటే..

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించాకే తేదీ ఖరారుచేస్తామన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..

Update: 2025-09-19 08:17 GMT
Click the Play button to listen to article

కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddraramaiah) రాష్ట్రంలో కులగణన(Caste Census) సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జరుగుతుందని కొన్ని రోజుల క్రితం చెప్పారు. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్ మధుసూధన్ ఆర్ నాయక్ నేతృత్వంలో జరిగే ఈ సర్వేకు రూ. 420 కోట్లు ఖర్చవుతుందని కూడా తెలిపారు. కాని కుల గణన చుట్టూ పెరుగుతోన్న ఆందోళనల నేపథ్యంలో సర్వే ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. సెప్టెంబర్ 18న జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. సర్వే కోసం తయారుచేసిన కుల జాబితాపై పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యాత్మక ద్వంద్వ-గుర్తింపు ఉన్న కులాల ప్రస్తావనను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

వారి మాటలను పరిగణనలోకి తీసుకున్న సీఎం.. సర్వే కమిషన్‌తో చర్చలు జరిపి తర్వాత తనను సంప్రదించమని మంత్రులను కోరారు. దాంతో ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం శివకుమార్, తన మంత్రివర్గ సహచరులు హెచ్‌కె పాటిల్, శివరాజ్ తంగడగి, బైరతి సురేష్, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్, సభ్యులను గురువారం కలిశారు.

అనంతరం డీకే శివకుమార్(DK Shivakumar) విలేఖరులతో మాట్లాడారు..కొంతమంది వ్యక్తులు, బీజేపీ కులగణనపై అనవసర రాద్దాతం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని, గత సర్వేలను పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధంగా వెనుకబడిన తరగతుల కమిషన్ జాబితాను రూపొందించింది. మేం ఆ కమిషన్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏ సమాజాన్ని విభజించాలని కోరుకోదు. అందరికీ న్యాయం జరగడానికి ఈ సర్వే జరుగుతోంది.’’ అని వివరించారు.

సర్వేను వాయిదా వేస్తారా? అని అడిగినపుడు.. "నేను దాని గురించి ఇప్పుడు ఏమీ చెప్పను. సీఎంతో చర్చించిన తర్వాత, నేను మీతో మాట్లాడతాను. చివరికి అందరికీ న్యాయం అందిస్తాం" అని చెప్పారు డీకే.


‘తొందరపడి సర్వేకు వెళ్లొద్దు..’

ఇటు ప్రతిపక్ష బీజేపీ..కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను, వీరశైవ-లింగాయత్ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ఆరోపించింది. జాబితాలో ఆధిపత్య వీరశైవ - లింగాయత్‌లను హిందువులుగా కాకుండా ప్రత్యేక మతంగా వర్గీకరించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ద్వంద్వ గుర్తింపు ఉన్న 'కురుబ క్రిస్టియన్', 'బ్రాహ్మణ క్రిస్టియన్', 'వొక్కలిగ క్రిస్టియన్'లపై ఉన్న గందరగోళాన్ని పరిష్కరించాకే కులగణన చేపట్టాలని బీజేపీతో పాటు కొంతమంది మంత్రులు సూచించారు. ఆనాలోచిత చర్యతో వర్గాల మధ్య విభజనను దారి తీయవచ్చన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ సర్వేను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని, కమిషన్‌ను కోరారు.   

Tags:    

Similar News