తెలంగాణను మూడు భాగాలుగా విభజన.. అసలు ప్లాన్ అదేనన్న రేవంత్

రాత్రికి వచ్చిన ఆలోచనను తెల్లవారు అమలు చేయడం సాధ్యం కాదు.

Update: 2025-09-19 10:33 GMT

దేశంలో యంగెస్ట్ రాష్ట్రం తెలంగాణ అని, కానీ అభివృద్ధిలో మాత్రం అన్ని రాష్ట్రాలకన్నా మెరుగ్గా దూసుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తోందని, అనేక విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ‘తెలంగాణ రైజింగ్ 2047’ను రూపొందించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు చాలా ముఖ్యమని తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను కూడా నిర్మిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు. అదే విధంగా ప్రజల కోసం మెట్రోను మరింత విస్తీరించనున్నట్లు చెప్పారు.

నగరం బయటకు పరిశ్రమలు

‘‘ప‌రిపాల‌న చేసేందుకు రాజ‌కీయ సంక‌ల్పం  ఎంతో అవ‌స‌రం. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాల‌నేది మా ఆలోచ‌న‌. దేశంలో యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం) తెలంగాణ. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ‌కు, హైద‌రాబాద్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి  తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించాం. తెలంగాణ‌ను కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా విభ‌జించాం. కోర్ అర్బ‌న్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారు... ఇక్క‌డ కాలుష్య‌కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌గ‌రం వెలుప‌లికి త‌ర‌లిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను త‌యారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం’’ అని వెల్లడించారు.

 

150 కిలోమీటర్లకు మెట్రో

‘‘తెలంగాణ‌లో అభివృద్ధికి త‌గిన‌ట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీట‌ర్లు పొడిగించాల‌ని నిర్ణ‌యించాం. ప్ర‌స్తుతం అయిదు ల‌క్ష‌ల మంది మెట్రోలో ప‌య‌నిస్తున్నారు.. దానిని 15 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. స‌బ‌ర్మ‌తీ తీరంలా మూసీని మారుస్తాం.. అందుకు మూసీ పున‌రుజ్జీవంపై దృష్టి సారించాం. హైద‌రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేప‌డుతున్నాం. 2027 నాటికి హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలే ఎక్కువ‌గా ఉండ‌నున్నాయి.. అందుకే ఈవీల‌కు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాం’’ అని తెలిపారు.

పెట్టుబడులకు భద్రత

‘‘విమానాశ్ర‌యం నుంచి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ అనుసంధాన‌త క‌ల్పిస్తాం. తెలంగాణ‌లో సేంద్రియ పంట‌లు పండుతున్నాయి. తెలంగాణలో  పెట్టుబడులకు ఆహ్వానం ప‌లుకుతున్నాం. పెట్టుబ‌డిదారుల‌కు మ‌ద్దతుగా నిలుస్తాం. తెలంగాణ‌లో పెట్టే పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ స‌మ‌స్య ఉంది.. మేం తెలంగాణ‌లో డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేశాం. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో  ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. జ్ఞానంతో పాటు నైపుణ్యం అవ‌స‌రం. యువ‌తలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’’ అని వివరించారు.

 

పతకాల సాధనే లక్ష్యం

‘‘మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుస‌రిస్తున్నాను. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. స్పోర్ట్స్‌లో ద‌క్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వ‌చ్చే మెడ‌ల్స్ చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఒలింపిక్స్ ప‌త‌కాల సాధ‌నే ల‌క్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. తెలంగాణ‌కు భూప‌రివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ ల‌క్డ్‌) కావ‌డంతో ఓడ రేవు లేదు. మ‌చిలీప‌ట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచ‌ర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. దానికి స‌మాంత‌రంగా రైల్వే లైన్ మంజూరు చేయాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం’’ అని అన్నారు.

‘‘2025, డిసెంబర్ 9  న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుద‌ల చేస్తాం. బ‌ల్క్ డ్ర‌గ్స్ ఉత్ప‌త్తిలో 40 శాతం తెలంగాణ‌నే చేస్తోంది... వ్యాక్సిన్ల త‌యారీలో హైద‌రాబ‌ద్ ముందు వ‌రుస‌లో ఉంది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యాల‌తో అమెరికాకే ఎక్కువ‌గా న‌ష్టం. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు.. ఆయ‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ప‌క్క‌న‌పెట్టారు. రాత్రి వ‌చ్చిన ఆలోచ‌న‌ను తెల్లారే అమ‌లు చేయ‌డం సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు రేవంత్.

Tags:    

Similar News