పట్టువదలని కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్(BRS) తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలచుకోలేదన్న విషయం అర్ధమైపోతోంది
కల్వకుంట్ల కవిత పట్టినపట్టు వదలటంలేదు. ఎంఎల్సీ పదవికి తానుచేసిన రాజీనామాను ఆమోదించాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవిలో కవిత(MLC Kavitha) ఉండదలచుకోలేదు. బీఆర్ఎస్(BRS) తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలచుకోలేదన్న విషయం అర్ధమైపోతోంది. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయగానే ఎంఎల్సీ పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీసభ్యత్వానికి రాజీనామా చేయటంతోనే కవిత తనఆలోచనలు ఏమిటో పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్(KTR) కు స్పష్టంగా చెప్పేశారు. రాజీనామా చేసిన దగ్గరనుండి పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
ఇపుడు విషయానికి వస్తే కవితచేసిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించేందుకు ఇష్టపడటంలేదు. ఈవిషయం ఛైర్మన్ మాటల్లోనే అర్ధమవుతోంది. మీడియాతో ఛైర్మన్ మాట్లాడుతు ‘‘రాజీనామా విషయాన్ని పునరాలోచించుకో’’మని తాను కవితకు చెప్పినట్లు తెలిపారు. ‘‘ఆవేశంలో రాజీనామాలు చేయకూడదని ఒకసారి ప్రశాంతంగా రాజీనామ విషయాన్ని ఆలోచించుకో’’మని తాను సూచించినట్లు చెప్పారు. ‘‘తాను కవితకు ఫోన్ చేసి మాట్లాడానని, తనను నేరుగా వచ్చి కలిసినపుడు అన్నీ విషయాలు మాట్లాడుతా’’నని కవిత చెప్పినట్లుగా గుత్తా తెలిపారు.
ఇదే విషయమై కవిత మీడియాతో మాట్లాడుతు ‘‘తనరాజీనామాను ఆమోదించాల్సింది’’గా ఛైర్మన్ను కోరినట్లు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ఛైర్మన్ తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. ‘‘నేరుగావచ్చి కలిసేందుకు టైం ఇవ్వమని అడిగితే ఇస్తాన’’ని మాత్రమే ఛైర్మన్ చెప్పారని అన్నారు.
అపాయింట్మెంట్ కావాలని కవిత అడిగినపుడు ఇస్తానని ఛైర్మన్ చెప్పారు. రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని ఛైర్మన్ అడిగినపుడు పునరాలోచన అవసరంలేదని కవిత చెప్పారు. ఇద్దరు కూడా ఫోన్లోనే మాట్లాడుకున్నారు. కాబట్టి ఛైర్మన్ ను కవిత నేరుగా కలిసి మాట్లాడేంతవరకు రాజీనామా ఆమోదం కుదరదు అని అర్ధమైపోతోంది. మరోవిషయం ఏమిటంటే అర్జంటుగా కవిత రాజీనామాను ఆమోదించాల్సినంత అవసరం కూడా ఏమీలేదు. ఎందుకంటే కవిత రాజీనామాను ఛైర్మన్ ఆమోదించినా ఇప్పటికిప్పుడు ఉపయెన్నికలు జరిగే అవకాశంలేదు.
నిజామాబాద్ స్ధానికసంస్ధలకోటా ఎన్నికలో కవిత గెలిచారు. మరో మూడున్నర సంవత్సరాలు ఎంఎల్సీగా కాలపరిమితి ఉంది. ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే కవిత రాజీనామాను ఆమోదించి వెంటనే ఎన్నికలు పెట్టే అవకాశంలేదు. ఎందుకంటే రాష్ట్రంలో స్ధానికసంస్ధలు మనుగడలో లేవు. స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికకు మున్సిపల్ కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఓట్లేయాలి. మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం అయిపోయి చాలాకాలమైంది. ఎన్నికలు జరిగి అన్నీ భర్తీ అయితేనే స్ధానికసంస్ధల్లో ఓటర్లు రెడీ అవుతారు. అప్పుడుకాని స్ధానికసంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికను నిర్వహించేందుకు లేదు. నిజామాబాద్ స్ధానంలో సుమారు 750 ఓటర్లున్నారు.
బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కవిత రాజీనామాను ఆమోదించటంలో ఛైర్మన్ జాప్యంచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదితప్ప రాజీనామా ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి మరోకారణం కనిపించటంలేదు. మరి స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, కవిత రాజీనామా ఎప్పుడు ఆమోదంపొందుతుందో ? తర్వాత నోటిఫికేషన్ విడుదలై, ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.