ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామం

మూడ్రోజుల్లోపు సమాధానాలివ్వాలని స్పీకర్ నోటీసులు

Update: 2025-09-19 10:42 GMT

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించడానికి స్పీకర్ నోటీసులిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులివ్వడం ఇది రెండోసారి. మూడు రోజులలోపు సమాధానం ఇవ్వాలని స్పీకర్ పేర్కొన్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ( గద్వాల) , సంజయ్ ( జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి ( పటాన్ చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య( చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ ( రాజేంద్రనగర్), తెల్లం వెంకట్రావ్

( భధ్రాచలం)కు తాజాగా నోటీసులు జారి అయ్యాయి.

గతంలో నోటీసులు స్వీకరించిన కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్ ) , దానం నాగేందర్ ( ఖైరతాబాద్ ) ఇంతవరకు అధికారికంగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కల్సి పని చేస్తున్నట్టు కడియం తనను కల్సిన విలేకరులకు చెప్పారు.

స్పీకర్ ఇచ్చిన నోటీసులకు పది మంది ఎమ్మెల్యేలలో ఈ ఎనిమిది మంది లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాము బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నట్లు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ జెండా కప్పు కోలేదని , అది మూడు రంగుల కండువా అని ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే అడగవచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా స్పీకర్ కార్యాలయం లేఖలు పంపింది. ఈ లేఖలకు సమాధానాలు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు గురువారం నోటీసులిచ్చారు. లీగల్ ఫార్మట్ లో అభ్యంతరాలు తెలపాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిర్యాదుదారులకు , ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ వేర్వేరుగా నోటీసులిచ్చారు. మరిన్ని ఆధారాలు సమర్పించాలని అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశంతో స్పీకర్ కార్యాలయం వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని బిఆర్ఎస్ సుప్రీం కోర్టు తలుపుతట్టిన సంగతి తెలిసిందే. వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ సుప్రీం కోర్టును కోరింది. బిఆర్ఎస్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అనర్హత వేటువేయడం తమ పని కాదని స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. మూడునెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News