‘అమెరికన్ జాత్యాహంకారం’ కు తెలంగాణ టెకీ బలి?

పోలీసు కాల్పుల్లో మరణించిన నిజాముద్దీన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు

Update: 2025-09-19 06:45 GMT
తెలంగాణకు చెందిన టెకీ ముహమ్మద్ నిజాముద్దీన్

అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో సెప్టెంబరు 3వతేదీన తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముహమ్మద్ నిజాముద్దీన్ (29) మరణించారు.తన రూమ్ మేట్ ను నిజాముద్దీన్ కత్తితో పొడిచినందుకే తాము అతన్ని కాల్చి చంపామని అమెరికా పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ హత్యోదంతంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య జాత్యాహంకారంతోనే జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అమెరికా పోలీసులు ఏం చెబుతున్నారంటే...
శాంటాక్లారాలోని నిజాముద్దీన్ నివాసంలోనే అతన్ని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. ఇంట్లోనే నిజాముద్దీన్, అతని రూమ్ మేట్ లకు మధ్య ఘర్షణ జరిగిందని, అతని రూమ్ మేట్ ను నిజాముద్దీన్ కత్తితో పొడిచాడని, ఈ ఘటనపై 911 కు ఫోన్ కాల్ రావడంతో తాము వచ్చి చూడగా కత్తితో నిజాముద్దీన్ కనిపించడంతో కాల్పులు జరిపామని అమెరికా పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత నిజాముద్దీన్ ను స్తానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

అమెరికా పోలీసుల దర్యాప్తు
నిజాముద్దీన్ హత్యోదంతంపై శాంటాక్లారా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం, శాంటా క్లారా పోలీసు విభాగం సంయుక్తంగా దర్యాప్తు చేస్తుంది. కాగా పోలీసుల సాయం కోసం నిజాముద్దీన్ పిలిచాడని, కానీ పోలీసులు బాధితుడైన తన కుమారుడిపైనే కాల్పులు జరిపి హతమార్చారని మృతుడి తండ్రి ముహమ్మద్ హస్నుద్దీన్ ఆరోపించారు.

ఫ్లోరిడాలో మాస్టర్స్ డిగ్రీ చదివి...
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముహమ్మద్ నిజాముద్దీన్ ఫ్లోరిడా కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు.చదువు తర్వాత కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఒక టెక్ సంస్థలో పనిచేస్తున్నాడు. జాతి వేధింపులు, వేతన మోసం, ఉద్యోగం నుంచి తప్పుగా తొలగింపు గురించి నిజాముద్దీన్ బహిరంగంగా ఫిర్యాదులు కూడా చేశాడని మృతుడి కుటుంబం తెలిపింది.‘‘నేను జాతి ద్వేషం, జాతి వివక్ష, జాతి వేధింపులు, హింస, వేతన మోసం, తప్పుడు తొలగింపు, న్యాయాన్ని అడ్డుకోవడం వంటి వాటికి బాధితుడిని’’అంటూ నిజాముద్దీన్ లింక్డ్ఇన్ పోస్ట్‌ చేశారు.

అమెరికన్ మనస్తత్వం అంతం కావాలి
‘‘చాలు చాలు, తెల్ల ఆధిపత్యం/జాత్యాహంకార తెల్ల అమెరికన్ మనస్తత్వం అంతం కావాలి’’ అంటూ నిజాముద్దీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. నిజాముద్దీన్ జాతి వివక్ష, అతని ఆహారంలో విషప్రయోగం, బహిష్కరణ, ఉద్దేశపూర్వక డిటెక్టివ్ ద్వారా నిరంతర నిఘా, బెదిరింపుల ఆరోపణలు చేశాడు.ఉద్యోగం కోల్పోయిన తర్వాత తనకు జాత్యాహంకార డిటెక్టివ్ బృందం ద్వారా వేధింపులు కొనసాగాయని నిజాముద్దీన్ సోషల్ మీడియాలో ఆరోపించారు.



 నా కుమారుడి మృతిపై విచారణ జరపండి : తండ్రి మహమ్మద్ హస్నుద్దీన్

కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో తన కుమారుడు ముహమ్మద్ నిజాముద్దీన్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతుడి తండ్రి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ముహమ్మద్ హస్నుద్దీన్ డిమాండ్ చేశారు.జాతి వివక్షతో అమెరికన్లు తన కుమారుడిని కాల్చి చంపారని ఈ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

మృతదేహాన్ని పంపించండి : ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లాఖాన్

శాంటా క్లారాలోని ఆసుపత్రిలో ఉంచిన ముహ్మద్ నిజాముద్దీన్ భౌతికకాయాన్ని భారతదేశానికి రప్పించాలని ఎంబీటీ నాయకుడు అంజద్ ఉల్లాఖాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కు విన్నవించారు. నిజాముద్దీన్ తండ్రి మహమ్మద్ హస్నుద్దీన్‌ను మజ్లిస్ బచావో తెహ్రీక్ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ కలిసి పరామర్శించారు. వాషింగ్టన్ డి.సి.లోని భారత రాయబార కార్యాలయం ,శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్‌లు ఈ హత్య ఉదంతంపై వివరణాత్మక నివేదికను అందించాలని ఖాన్ డిమాండ్ చేశారు. స్వదేశానికి నిజాముద్దీన్ మృతదేహాన్ని తిరిగి పంపించేందుకు సహాయం చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు తాను లేఖ రాశానని అంజద్ ఉల్లాఖాన్ చెప్పారు.


Tags:    

Similar News