కోల్‌కతాలో వైద్యురాలి హత్య - దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓపీ సేవలు..

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌పై అత్యాచారం.. హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యుల ఆందోళనలతో ఓపీ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి.

Update: 2024-08-13 07:04 GMT

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం.. హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత పాశవిక ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఔట్-పేషెంట్ సేవలు, నాన్-ఎమర్జెన్సీ సర్జరీలు స్తంభించాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) స్పష్టం చేసింది.

‘అత్యవసర సేవలు కొనసాగుతాయి’

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో జరిపిన సమావేశంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సోమవారం నిరవధిక సమ్మెను పొడిగిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం కూడా సమ్మె కొనసాగుతుందని ఫోర్డా అధ్యక్షుడు అవిరల్ మాథుర్ ప్రకటించారు. రోగులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

తగ్గిన అడ్మిషన్లు..

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యులు నిరవధిక సమ్మె ప్రారంభించిన తర్వాత రోజువారీ శస్త్రచికిత్సల సంఖ్య 80 శాతం తగ్గిందని, అడ్మిషన్లు 35 శాతం తగ్గాయని పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. కోల్‌కతాలోని చాలా ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు స్తంభించాయని రోగుల బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో నిరసన తెలుపుతున్న వైద్యులు ఓపీ సేవలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు మంగళవారం ఓపీడీ సేవలను బహిష్కరిస్తూ 'పెన్ డౌన్' చేపట్టారు.

‘సీబీఐతో విచారణ జరిపించాలి’

మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విధుల నిర్వహిస్తున్న చోట తమకు భద్రత కూడా కల్పించాలని కోరుతున్నారు. రోగులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలకు వైద్యులు హాజరవుతున్నారని అని RIMS వద్ద జూనియర్ డాక్టర్ల సంఘం (JDA) అధ్యక్షుడు అంకిత్ కుమార్ PTI కి చెప్పారు.

FORDA డిమాండ్లు..

ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డాకు FORDA లేఖ రాసింది. అందులో పలు డిమాండ్లను కేంద్రం ముందుంచింది. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలి పరువు, ప్రాణాలను కాపాడలేని అధికారులంతా రాజీనామా చేయాలని, వైద్యులకు కేంద్రం నిర్దేశించిన భద్రతాపర ప్రోటోకాల్ అమలు చేయాలని కోరింది.

చట్టాన్ని రూపొందించాలన్న ఐఎంఏ..

నడ్డాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఓ లేఖ రాసింది. వైద్యులపై దాడులు, హింసను అరికట్టేందుకు కేంద్ర చట్టాన్ని రూపొందించాలని, ఆసుపత్రులను సేఫ్ జోన్‌లుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో వైద్యులపై హింసను నిరోధించేందుకు చట్టాలు ఉన్నాయని, అయితే అవి పెద్దగా ప్రభావవంతంగా లేవని IMA అభిప్రాయపడింది. కేంద్రం చట్టం చేయకపోవడమే అందుకు కారణమని వైద్యుల సంఘం పేర్కొంది.

ఆ రోజు సెమినార్ గదిలో ఏం జరిగింది?

ఘటన జరిగిన రోజు.. సెమినార్ గదిలో వైద్యురాలు, ఆమె మరో నలుగురి సహచరులు కలిసి భోంచేశారు. తర్వాత వారంతా తమ గదులకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకుంటూ వైద్యురాలు సెమినార్ రూంలో ఉండిపోయింది. ఆమె నిద్రపోవడం గమనించిన నిందితుడు.. 4 గంటల ప్రాంతంలో సెమినార్ రూంలో ప్రవేశించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

‘ఉరి తీయాలనుకుంటే.. తీయండి’..

పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లుచేతులు, గోళ్లకు గాయాలున్నట్టు నివేదికలో వెల్లడించారు. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని నిందితుడు..తనను ఉరితీయాలనుకుంటే.. తీయండి.. అంటూ ఎదురుచెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు.

ఎవరీ సంజయ్ రాయ్..

కోల్‌కతాలోని శంభునాథ్‌ పండిట్‌ వీధిలో ఉండే సంజయ్‌.. స్థానిక పోలీస్‌ విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వలంటీర్‌గా చేరాడు. కొందరికి మాత్రం హోంగార్డుగా పరిచయం చేసుకునేవాడు. నగరంలోని ఓ పోలీసు బెటాలియన్‌ వద్ద ఎక్కువగా కనిపించేవాడు. ఈ క్రమంలోనే ఆర్జీ కర్‌ ఆసుపత్రి చెక్‌పోస్టు వద్ద బాధ్యతలు అప్పగించారు.

డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యురాలి దారుణ హత్యతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు.

Tags:    

Similar News