మణిపూర్ లో మళ్లీ హింస, కర్ప్యూ

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. కొంతమంది సాయుధ దుండగులు కాల్పులు జరపడంతో ఈ హింస చోటు చేసుకుంది.

Update: 2024-01-02 04:57 GMT
మణిపూర్ హింసలో కాలిపోతున్న వాహనాలు

జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రక్తసిక్తమైంది. సోమవారం సాయంత్రం తౌబల్ జిల్లాలో నలుగురు సామాన్య ప్రజలను సాయుధ దండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు వెల్లడించారు. నలుగురు సాధారణ ప్రజలు మరణించడంతో అల్లర్లు చెలరేగడంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాలో ప్రభుత్వం తిరిగి కర్ఫ్యూను విధించింది.

తౌబాల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయుధులు ప్రజలు నమ్మే దుస్తులు ధరించి వచ్చి, ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు పౌరులు మరణించగా,మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

దాడి తరువాత కోపోదిక్త్రులైన ప్రజలు వాహనాలకు నిప్పు పెట్టారు. దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉండడంతో తౌబాల్, ఇంఫాల్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. సాధారణ ప్రజలను సాయుధమూక కాల్చి చంపడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను ఖండించారు. శాంతిని కాపాడాలని లిలాంగ్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. దుండగులను పట్టుకుంటామని చెప్పారు. ముష్కరమూకలను రాష్ట్రం నుంచి ఏరేస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు. పోలీసులను నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు.

మణిపూర్ లో గత ఏడాది మే నుంచి జాతుల ఘర్షణ ప్రారంభం అయింది. మణిపూర్ జనాభాలో 53 శాతంగా ఉన్నమెయితీ వర్గానికి కూడా షెడ్యూల్డ్ హోదా ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో 40 శాతంకి పైగా ఉన్న కుకీ, నాగా ప్రజలు దీనిని వ్యతిరేకిస్తూ సంఘీభావ యాత్ర జరిపారు.

దీంతో మణిపూర్ లో జాతుల ఘర్షణ ప్రారంభం అయింది. మణిపూర్ లో గిరిజన జాతులు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండగా, మొయితీలు మైదాన ప్రాంతాలలో జీవిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన జాతుల దాడుల్లో 180 కి పైగా సాధారణ ప్రజలు మరణించారు. అనేక వందల మంది ప్రజలు గాయపడ్డారు.  

Tags:    

Similar News