‘వాక్ స్వాతంత్య్రా‌నికి హద్దు ఉంటుంది’

హాస్యనటుడు కునాల్ కమ్రాకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కౌంటర్..;

Update: 2025-03-25 07:01 GMT
Click the Play button to listen to article

హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలపై మహారాష్ట్ర (Maharashtra)డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Deputy CM Eknath Shinde) స్పందించారు. తాను వాక్ స్వాతంత్య్రాన్ని సమర్థిస్తానని అయితే దానికి పరిమితి అంటూ ఉండాలని కమ్రాను పరోక్షంగా హెచ్చరించారు.

వివాదానికి కారణమేంటి?

ఇటీవల ముంబైలో నిర్వహించిన ఒక కామెడీ షోలో షిండేను "గద్దర్" (దేశద్రోహి) అని కామ్రా(Kunal Kamra) వ్యాఖ్యానించడంతో మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆ కార్యక్రమంలో " దిల్ తో పాగల్ హై" చిత్రంలోని హిందీ పాటను అనుకరించడంతో పాటు.. శివసేన, ఎన్‌సీపీ మధ్య చీలికలు సహా మహారాష్ట్రలోని ఇటీవలి రాజకీయ పరిణామాల గురించి కూడా ఆయన జోకులు వేశారు.

శివసేనల విధ్వంసం..

తమ నేతను విమర్శించడాన్ని జీర్ణించుకోలేని శివసేన(Shiv Sena) కార్యకర్తలు రెచ్చిపోయారు. కామ్రా కామెడీ షో నిర్వహించిన ముంబై(Mumbai)లోని ఖార్ ప్రాంతంలోని హాబిటాట్ క్లబ్‌పై ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు దాడిచేశారు.

శృతిమించితే ప్రమాదం..

"రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్య్రం ఇచ్చింది. అయితే దానికి ఒక పరిమితి ఉండాలి. ఒకరి గురించి హద్దుమీరి మాట్లాడడం 'సుపారీ' (కాంట్రాక్ట్) తీసుకోవడం లాంటిదే. ఇదే వ్యక్తి (కామ్రా) గతంలో భారత సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి, కొంతమంది పారిశ్రామికవేత్తల గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. కామ్రా ఎవరికోసమో పనిచేస్తున్నట్లుంది" అని షిండే పేర్కొన్నారు.

కామ్రాకు పోలీసుల పిలుపు..

కామ్రా వ్యాఖ్యలను మహారాష్ట్రలో కొన్ని వర్గాలు తప్పుబట్టాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా కామ్రా అందుకు నిరాకరించారు. ఇదే సమయంలో మంగళవారం కామ్రాకు పోలీసులు నోటీసు ఇచ్చారు. విచారణకు రావాలని అందులో కోరారు. 

Tags:    

Similar News