CIC మాజీ కమిషనర్ బిమల్ జుల్కాపై అత్యాచార యత్నం కేసు..
‘ఆయన్ను నేను గార్డియన్‌గా భావించా. కాని ఆయన అనుచిత మెసేజ్‌లు పంపాడు. హోటల్ గదిలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు..’- బాధితురాలు..;
గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో చీఫ్ మాజీ సమాచార కమిషనర్ బిమల్ జుల్కాపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 1979 బ్యాచ్ IAS మధ్యప్రదేశ్ కేడర్ అధికారి అయిన జుల్కా.. ఏప్రిల్ 2013 - ఆగస్టు 2015 మధ్యకాలంలో సమాచార, ప్రసార కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత 2016లో సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. నాలుగేళ్ల తర్వాత కేంద్రంలో ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. జుల్కా ప్రస్తుతం పేటీఎం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు గుజరాత్ పోలీసు అధికారి ఒకరి చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం ఆధారంగా గాంధీనగర్‌లోని రైల్వే పోలీసులు బాధితురాలి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం..
‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 10న గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో మొదటిసారి జుల్కాను కలిశారు. ఆయన్ను చూసిన వెంటనే పెద్దమనిషిగా కనిపించారు. మొదట నాతో హోటల్ లాబీలో మాట్లాడారు. తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. నా సోదరుడు సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని, మీ గైడెన్స్ కోసం వచ్చానని చెప్పా. అందుకు జుల్కా అలాగే అన్నాడు. నేను అతన్ని కలవడానికి అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు కారులో వెళ్లడంతో తిరుగు ప్రయాణంలో అహ్మదాబాద్‌కు నేను మీతో పాటు రావచ్చా? అని జుల్కా అడిగాడు. కారెక్కిన జుల్కా నాతో అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నువ్వు ఏదైనా కొనుక్కో డబ్బు పంపుతా. నీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పు అని అడిగాడు.
‘‘మొదట నేను బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ పట్టుబట్టడంతో వాటిని షేర్ చేశాను. ఆ తర్వాత నా అకౌంట్‌లోకి కొంత డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. కొన్ని రోజుల పాటు మా మధ్య వాట్సప్ సంభాషణలు జరిగాయి. అయితే జుల్కా పంపిన కొన్ని సందేశాలు నన్ను ఇబ్బందిపెట్టాయి. తొలుత వాటిని నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. నేను ఆయన్ను గార్డియన్‌గా భావించా. ఆయన వృత్తిపర హోదాకు గౌరవమిచ్చా.
మార్చి 19న అహ్మదాబాద్‌లో నేను, నా సోదరుడు ఓ కాఫీ షాప్‌లో మళ్లీ జుల్కాను కలిశాం. ఆ మరుసటి రోజు జుల్కా ఓ మెసేజ్ పంపాడు. ‘మీ తమ్ముడు పక్కనే ఉండడం వల్ల నేను నీతో సరిగా మాట్లాడలేకపోయా. కెరీర్, ఇంటర్న్‌షిప్ గురించి మాట్లాడటానికి నువ్వు ఒంటరిగా రా’ అని అందులో రాసి ఉంది. మార్చి 21న నేను మళ్ళీ గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో జుల్కాను కలిశా. భోంచేద్దామని మళ్లీ తన గదికి తీసుకెళ్లాడు. భోజనానికి ముందు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు. కానీ అతని దృష్టి మరల్చి విమానాశ్రయంలో దింపేశాను. విమానాశ్రయంలో నా అకౌంట్‌కు మళ్లీ కొంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి, నచ్చినది కొనుక్కోమని చెప్పాడు.
బాధితురాలు ఆధారాలను ఎలా సేకరించింది?
‘‘మార్చి 21 నాటి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇకపై అతని కాల్స్‌కు స్పందించకూడదని నిర్ణయించుకున్నా. అయితే నా సోదరుడి సూచనతో ఏప్రిల్ 2న నేను జుల్కాకు ఫోన్ చేశా. మిమ్మల్ని పట్టించుకోనందుకు క్షమించండి అని చెప్పా. జుల్కా మళ్ళీ నాకు అనుచిత, అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. అప్పటి నుంచి నేను అతని కాల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించా. వాట్సప్ చాట్లను భద్రపరిచా. మెసేజ్‌లను సేవ్ చేశా.’’ అని చెప్పారు.
‘అందుకే ఆలస్యమైంది..’
ఏప్రిల్ 25న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుల్కాపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నం, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘‘జుల్కా వ్యవహార శైలి నన్ను తీవ్రంగా బాధించింది. మానసికంగా కృంగిపోయా. ధైర్యం కూడగట్టుకుని పోలీస్ కంప్లైట్ ఇచ్చా. కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఓ లాయర్‌ను కూడా సంప్రదించా. ఆయన నా విషయంలో సాయం చేయలేదు. అందువల్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైంది.’’ అని పేర్కొంది 21 ఏళ్ల బాధితురాలు.