రాష్ట్ర సరిహద్దుల వద్ద రైతుల నిరసన శిబిరాల తొలగింపు..
చర్చలు విఫలం..పోలీసుల అదుపులో రైతు సంఘాల నేతలు;
తమ డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో రైతులు 2024 ఫిబ్రవరి 13 నుంచి షంభూ (షంభూ-అంబాలా), ఖనౌరీ (సంగ్రూర్-జింద్) సరిహద్దు వద్ద తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
హర్యానా భద్రతా సిబ్బంది బుధవారం రాత్రి షంభూ సరిహద్దు వద్ద తాత్కాలిక శిబిరాల నుంచి రైతులను ఖాళీ చేయించిన తర్వాత వాటిని తొలగించారు. అనంతరం పంజాబ్ రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా ఉండేందుకు గతంలో రోడ్డుకు అడ్డుగా ఉంచిన సిమెంట్ బ్యారికేడ్లను జేసీబీతో తొలగించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్( Shivraj Singh Chouhan) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో రైతు సంఘాల నేతలు చండీగఢ్‌లో సమావేశమయ్యారు. ఈ కేంద్ర ప్రతినిధి బృందంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నారు. రైతుల ప్రధాన డిమాండ్లలో ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర (MSP) హామీ గురించి ఈ సమావేశంలో చర్చించారు. కొన్ని డిమాండ్లపై కేంద్రానికి, రైతు సంఘాల నేతలకు మధ్య అంగీకారం కుదరులేదు. సమావేశం అనంతరం రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ పాంధేర్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ సహా పలువురిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో పాంధేర్, దల్లేవాల్‌తో పాటు అభిమన్యు కోహార్, కాకా సింగ్ కోట్రా, మంజీత్ సింగ్ రాయ్ కూడా ఉన్నట్లు రైతు నాయకుడు గురమ్నీత్ సింగ్ మంగట్ తెలిపారు.
ఇప్పటికే చాలా నష్టం..
రైతుల తాత్కాలిక గుడారాల తొలగింపును పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా సమర్థించారు. ‘‘మీరు కేంద్రంతో పోరాడుతున్నారు. మేము మీ వెంటే ఉన్నాం. మీకు మా మద్దతు ఉంటుంది. కానీ సరిహద్దును మూసివేయడం ద్వారా పంజాబ్‌కు భారీ నష్టం వాటిల్లుతుంది. రెండు ముఖ్య రహదారుల మూసివేత వల్ల పరిశ్రమలకు, వ్యాపారాలకు చాలా నష్టం వాటిల్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉంది. పరిశ్రమలు, వ్యాపారాలు సజావుగా నడిస్తేనే ఉద్యోగాలు దొరుకుతాయి." అని చీమా వ్యాఖ్యానించారు.