ట్రైనీ డాక్టర్ మరణం గురించి ఘోష్‌ పరిచయస్థులకు ఎలా తెలిసింది?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన రోజున ఆసుపత్రితో సంబంధం లేని వ్యక్తులు క్రైం స్పాట్‌కు ఎలా చేరుకున్నారన్న దానిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు.

Update: 2024-08-31 13:07 GMT

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను లోతుగా దర్యాప్తు చేస్తోన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. RG కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను గత 14 రోజుల నుంచి ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఆయనను 140 గంటలకు పైగా విచారించినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజున ఆయన ఆలస్యంగా స్పందించడం, పోలీసులు చేరుకున్న తర్వాత ఘటనా స్థలానికి రావడంపై అనుమానాలకు తావిస్తోంది. అయితే వాస్తవాలను తెలుసుకునేందుకు ఇప్పటికే సందీప్ ఘోష్‌కు రెండు సార్లు లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు.

తొలుత కాల్ లిఫ్ట్ చేయని ఘోష్.

ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన గురించి ఆగష్టు 9 ఉదయం 10.20 గంటలకు సమాచారం అందిందని ఘోష్‌ చెబుతున్నారు. తనకు ఆసుపత్రి ఛాతీ ఔషధం విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సుమిత్ రాయ్ తపదార్ నుంచి ఉదయం 10 గంటలకు కాల్ వచ్చిందని, ఆ సమయంలో స్నానం చేస్తుండడం వల్ల ఆయన కాల్ లిప్ట్ చేయలేదని, తిరిగి 10.20 గంటల సమయంలో తపదార్‌కు తిరిగి తానే ఫోన్ చేయడంతో ట్రైనీ డాక్టర్ మరణం గురించి తెలిసిందని చెప్పారు. అయితే ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పీజీటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సెమినార్ హాల్‌లో డాక్టర్ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. ఘటన గురించి ఆసుపత్రి అవుట్‌పోస్ట్‌ పోలీసులు ఉదయం 10.10 గంటలకు తాలా స్టేషన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

11 గంటలకు ఆసుపత్రి చేరుకున్న ఘోష్..

తనకు వార్త తెలియగానే వెంటనే ఆసుపత్రికి బయలుదేరానని, దారిలో ఉన్న సమయంలో తనకు చాలా కాల్స్ వచ్చాయని, అయితే లిప్ట్ చేయలేదని ఘోష్ చెప్పారు. ఘోష్ ఉదయం 10.30 గంటలకు తాలా పోలీసులకు ఫోన్ చేసి క్రైమ్ సీన్‌ను చుట్టు పోలీసులను భద్రతగా ఉంచాలని కోరాడు.

ఘోష్‌కు ఛాతీ ఔషధ విభాగం అధిపతి అరుణాభా దత్తా చౌదరి, మెడికల్ సూపరింటెండెంట్ కమ్-వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ వశిష్ట్ మరియు రోగి కళ్యాణ్ సమితి ఛైర్మన్ సుదీప్తో రాయ్ కూడా ఫోన్ చేశారు. అయితే వాళ్ల కాల్స్‌కు హోష్ స్పందించలేదు.

క్రైం స్పాట్‌లో ఎందుకు లేడు..

పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నప్పుడు.. ఘోష్ ఎందుకు అక్కడ లేడన్న విషయంపై సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. ఘోష్ కాల్ హిస్టరీని కూడా అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులు..ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారితో మాట్లాడుతున్నారు. ఆగస్టు 9 ఉదయం కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులను కూడా సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరికి ఇప్పటికే లై డెటెక్టర్ పరీక్షలు జరిగాయి. అనుమానాల నేపథ్యంలో ఘోష్‌కు మరోసారి లై డెటెక్టర్ పరీక్ష చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ముందుగా వారికెలా తెలిసింది?

దుర్ఘటన జరిగిన రోజున ఆసుపత్రితో సంబంధం లేని చాలా మంది క్రైం స్పాట్‌కు చేరుకోవడంపై దృష్టి సారించారు. వారంతా డాక్టర్ ఘోష్‌కు తెలిసిన వాళ్లు కావడం గమనార్హం. మృతురాలి తల్లిదండ్రులకు తమ కూతురి మరణం గురించి తెలిసేలోపు వారంతా ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ట్రైనీ డాక్టర్ మరణం గురించి వారికి ఎవరు సమాచారం ఇచ్చారు? మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు “ఆత్మహత్య” చేసుకుందని చెప్పిన వ్యక్తిని కూడా సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News