మహిళా ఉద్యోగులకు పెన్షన్ శుభవార్త

మహిళా ఉద్యోగులకు శుభవార్త. ఇక నుంచి తమ పెన్షన్ ను జీవిత భాగస్వాములకు కాకుండా పిల్లలకు వచ్చేలా చట్టంలో మార్పులు చేశారు.

Update: 2024-01-04 08:10 GMT

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ తదనంతరం ప్రభుత్వం అందించే పెన్షన్ విషయంలో నిబంధనలు సడలించింది. ఇంతకుముందు నిబంధనల ప్రకారం పెన్షన్ కేవలం జీవిత భాగస్వాములకు మాత్రమే అందించే వీలుండేది. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం జీవిత భాగస్వాములకు కాకుండా పిల్లలకు పెన్షన్ వచ్చేలా రూల్స్ సడలించారు. సెంట్రల్ సివిల్ సర్వీస్(పెన్షన్) రూల్స్ 2021ను మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ సంక్షేమ శాఖ సవరించింది. దీంతో ఈ సౌలభ్యం ఏర్పడనుంది.

ప్రగతిశీల మార్పు

దేశంలో వివాహాల రేట్లు ఏవిధంగా ఉన్నాయో.. విడాకులు, గృహహింస, వరకట్నం కేసులు సైతం అలానే ఉన్నాయి. అయితే  ఇవేం పట్టించుకోకుండా మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ తదనంతరం వచ్చే పెన్షన్ కోసం కచ్చితంగా తమ జీవిత భాగస్వామి పేరు నమోదు చేసుకోవాల్సి ఉండేది. జీవిత భాగస్వామి మరణం లేదా పెన్షన్ తీసుకోవడానికి అనర్హత ఉంటేనే ఇతరులకు ఈ మొత్తం వచ్చేది, దీనినే ప్రస్తుతం సవరించారు.

ఇక ఉద్యోగిని మరణాంతరం పిల్లలు పెన్షన్  తీసుకునే వీలుంటుంది. దీనికోసం వారు ప్రత్యేకంగా సంబంధిత కాలమ్ లో పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ పిల్లలకు అందజేయాలంటే ముందుగా సంబంధిత అధికారికి పెన్షన్ కార్యాలయంలో రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తరువాత చట్టపరమైన ప్రక్రియలో ఉండి మరణించినట్లయితే నిబంధనల ప్రకారం పెన్షన్ అందించబడుతుంది.

మానసిక సమస్యలు

వితంతువు, మైనర్ పిల్లలకు లేదా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పిల్లలకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తులకు ఈ పెన్షన్ చెల్లించబడుతుంది. అలా సంరక్షణ బాధ్యతలు తీసుకున్నంత కాలం కూడా పెన్షన్ తీసుకోవడానికి అర్హులు. పిల్లవాడు మేజర్ అయితే అతనికే పింఛన్ తీసుకునే అర్హత వస్తుంది. అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్ దారుకు మేజర్ అయిన పిల్లలు ఉంటే వారికి కూడా తమ కుటుంబ పింఛన్ పొందే హక్కు ఉంటుంది. ఈ సవరణను ఓ ఉన్నతాధికారి ప్రగతిశీలమైనది అభివర్ణించారు. పెన్షనర్ల శక్తిని గణనీయంగా పెరగడంలో ఎంతో సాయకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News