గుజరాత్‌లో బాహుబలి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం..

మనీలాండరింగ్ కేసులో గుజరాత్ సమాచార్ పత్రిక యజమానుల్లో ఒకరైన బాహుబలి షాను అరెస్టు చేసిన ఈడీ..;

Update: 2025-05-17 12:57 GMT
Click the Play button to listen to article

గుజరాత్ సమాచార్ (Gujarat Samachar) పత్రిక యజమానుల్లో ఒకరైన బాహుబలి షా(Bahubali Shah)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2016 నాటి మనీలాండరింగ్ కేసులో ఆయనను మే 15న అరెస్టు చేశారు. గతంలో అరెస్టులు, కార్యాలయ దహనాన్ని కళ్లారా చూసిన షాకు.. ప్రస్తుత పరిణామం ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు. గుజరాత్ (Gujarat) రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నందుకే ప్రతికార చర్యలో భాగంగా షాను అరెస్టు చేశారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గుజరాత్ సమాచార్ పత్రికను ఎంతో చరిత్ర ఉంది.

గుజరాత్‌లో అతిపెద్ద పత్రిక ‘గుజరాత్ సమాచార్‌’కు 92 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పత్రికను, గుజరాతీ న్యూస్ ఛానల్‌ ‘GSTV’ని నిర్వహించే లోక్ ప్రచారణ్ లిమిటెడ్‌కు బాహుబలి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం నుంచే..

1932 జనవరి 16న గుజరాత్ సమాచార్ మొదటి ఎడిషన్ వెలువడింది. బ్రిటిష్ పాలనలో స్వతంత్ర పత్రికగా సర్దార్ వల్లభభాయ్ పటేల్, మోరార్జీ దేశాయ్‌ దీన్ని స్థాపించారు. 1950లో ఈ పత్రిక నష్టాల్లోకి వెళ్లినప్పుడు బాహుబలి తండ్రి శాంతిలాల్ షా దీన్ని కొనుగోలు చేశారు. పత్రికకు వచ్చిన విశేష ఆదరణ ఫలితంగా 2024 నాటికి సంస్థ విలువ రూ. 2000 కోట్లను దాటింది. ప్రస్తుతం బాహుబలి, ఆయన అన్న శ్రేయాంశ్ షా సంస్థలో సుమారు 70 శాతం వాటా ఉంది. ఇందులో ఒక్క బాహుబలి వాటానే 22.79 శాతం. బాహుబలి పెళ్లి చేసుకోలేదు. 2012లో GSTV ఛానల్‌ ప్రారంభించినప్పటి నుంచి అందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఎమర్జెన్సీలో కార్యాలయం దగ్ధం..

“బాహుబలికి గుజరాత్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా పేరుంది. ‘‘1974 నాటి నవనిర్మాణ ఉద్యమం, ఎమర్జెన్సీ, మాధవ్‌సింగ్ సోలంకీ ప్రభుత్వ పతనం, 1960 నుంచి 2002 వరకు జరిగిన అల్లర్లు, మోదీ ఎదుగుదలకు సంబంధించిన ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన ఉంది.’’ అని గుజరాత్ సమాచార్ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు పేర్కొ్న్నారు.

అరెస్టులకు బెదరక..

పత్రికలో ప్రచురించిన విమర్శాత్మక కథనానికి 1976లో సోలంకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాహుబలిని అరెస్ట్ చేసింది. తర్వాత రెండు రోజుల్లోనే ఆయన విడుదలయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మద్దతుదారులు అహ్మదాబాద్‌లోని పత్రికా కార్యాలయాన్ని దగ్ధం చేశారు. అయినప్పటికీ బాహుబలి పత్రికను ఆపలేదు. ఆరున్నర నెలల పాటు ఖాన్‌పూర్ ప్రాంతంలోని తాత్కాలిక కార్యాలయం నుంచి పత్రికను కొనసాగించారు. అదే తర్వాత శాశ్వత కార్యాలయమైంది.

బీజేపీ ప్రభుత్వాల్లో కూడా ప్రతికూలతే..

బీజేపీ ప్రభుత్వాల్లోనూ షా సోదరుల పరిస్థితి మెరుగుగా లేదు. కేశుభాయ్ పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. తర్వాత సీఎం అయిన నరేంద్ర మోదీ గుజరాత్ సమాచార్‌కు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేశారు. భూపేంద్ర పటేల్ ప్రభుత్వం పత్రిక రిపోర్టర్లను ప్రభుత్వ కార్యక్రమాల కవరేజీ నుంచి బహిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈడీ కేసు, దాడులు..

2016 మనీలాండరింగ్ కేసులో భాగంగా బాహుబలి మే 15న అరెస్ట్ అయ్యారు. మే 16న బెయిల్ దక్కింది. అహ్మదాబాద్‌లోని పత్రిక కార్యాలయం సహా షా కుటుంబ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. మొదట 24 ఆస్తులపై వారంట్లు జారీ అయ్యాయి. ఆపై మరిన్ని వచ్చాయి.

మోసపూరిత ట్రేడ్‌కు పాల్పడ్డారని..

2003-2005 మధ్య జరిగిన IPO స్కామ్‌లో IDFC, IL&FS లాంటి కంపెనీల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మోసపూరితంగా ట్రేడ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బాహుబలి, శ్రేయాంశ్, శ్రేయాంశ్ భార్య స్మృతి‌బెన్ షా (ప్రముఖ జర్నలిస్ట్) ఈ ట్రేడర్లకు నిధులు అందించారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో SEBI షా కుటుంబానికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఆపై షేర్ల ట్రేడింగ్‌ను కొంత కాలం నిషేధించింది. తమ దాడుల్లో సంస్థ పనితీరులో అనేక అక్రమాలు బయటపడ్డాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులంటున్నారు.

‘ఇది రాజకీయ ప్రతీకార చర్చే..’

400 మంది అధికారులతో కూడిన స్పెషల్ టీమ్ మే 14వ తేదీ 36 గంటల పాటు దాడులు జరిపినట్టు శ్రేయాంశ్ చెప్పారు. “నా తమ్ముడి అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది,” అని శ్రేయాంశ్ వ్యాఖ్యానించారు. “మే 15 రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈడీ బాహుబలిని అరెస్ట్ చేసింది.

వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్..

ఆరోగ్య కారణాలపై బాహుబలికి అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు మే 16న15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే జైడస్ హాస్పిటల్‌లో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. రూ. 10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. బాహుబలి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ అధికారులకు తెలియజేయాలని, ఆయన దర్యాప్తు సంస్థతో సహకరించాలని ఆదేశించింది. శనివారం కూడా ముంబయిలోని పత్రికా కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. 

Tags:    

Similar News