బీహార్‌లో SIR పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ
ఆగస్టు 8లోగా లిఖిత పూర్వక వాదనలను దాఖలు చేయాలన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి;
ఎన్నికల సంఘం (EC) బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై స్టే విధించాలని ఇప్పటికే పదుల సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై వెంటనే విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ చేపట్టనుంది. ఇటు ఆగస్టు 8లోగా తమ లిఖిత పూర్వక వాదనలను దాఖలు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్లను కోరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ బీహార్ SIRపై ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. సరైన ధృవీకరణ పత్రాలు లేవని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తే కీలకమైన ఓటు హక్కును కోల్పోయ్యే అవకాశం ఉందని కోర్టుకు విన్నివించారు.
కోర్టు స్పందిస్తూ..ఈసీ ఒక రాజ్యాంగ సంస్థ అని, అది చట్టానికి కట్టుబడి ఉండాలని, ఏదైనా తప్పు జరిగితే పిటిషనర్లు దానిని కోర్టు దృష్టికి తీసుకురావచ్చని ధర్మాసనం పేర్కొంది. "చనిపోయిన వారు ఇంకా బతికే ఉన్నారని చెప్పేందుకు 15 మందిని మీరు తీసుకురండి, మేం దాన్ని డీల్ చేస్తాం," అని సిబల్ భూషణ్‌లను ధర్మాసనం ప్రశ్నించింది. లిఖిత పూర్వక ఫిర్యాదుల దాఖలుకు పిటిషనర్ల వైపు నుంచి, ఎన్నికల కమిషన్ వైపు నుంచి నోడల్ అధికారులను నియమించింది ధర్మాసనం.
స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఎస్సీ..
ఓటర్ల జాబితా ప్రచురణను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బీహార్‌లో SIR ప్రక్రియ కోసం ఆధార్, ఓటరు IDని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. రేషన్ కార్డు నకిలీవి పుట్టించొచ్చు. కానీ ఆధార్, ఓటర్ కార్డు అలా కాదుగా అని ధర్మాసనం పేర్కొంది.